అవీ - ఇవీ - భమిడిపాటి ఫణిబాబు


 

అదేమిటో కానీ, నాకు అప్పుడప్పుడు అనిపిస్తూంటుంది, మనవాళ్ళు, జీతాలివ్వడంలో సరైన పధ్ధతి అనుసరించడంలేదేమో అని.  ఉదాహరణకి, రైళ్ళు నడిపే డ్రైవర్లకీ, విమానాలు నడిపే పైలట్లకీ అంతంత లక్షల్లో జీతాలు అవసరమంటారా? ఏమైనా అంటే , వారు నడిపే వాహనాలను బట్టి ఉంటాయీ, జీతాలూ భత్యాలూ అంటారు. నా ఉద్దేశ్యంలో, మన బస్సు డ్రైవర్లది అసలు సిసలైన చాకచక్యం. విమాన మార్గంలో ఏమైనా ట్రాఫిక్కా, పాడా, హాయిగా అంతా ఖాళీగా ఉంటుంది. మధ్యలో ఇంకో విమానమేదో వచ్చేస్తుందని  భయం లేదు, మహా అయితే ఏ కొండనో గుద్దుకోకుండా చూసుకుంటే సరిపోతుంది. పైగా  ఈ విమానాలకి అదేదో  “ ఆటో పైలట్ “ అనే సదుపాయం కూడా ఉంటుందిట. ఏ కారణం చేతైనా ఆ పైలట్ గారికి, కునుకు వచ్చినా, ఈ “ ఆటో పైలెట్ “ లో పెట్టేస్తే చాలు. మరీ ఎక్కువసేపు కాకపోయినా, ఏదో ఒకటీ, సదుపాయం ఉన్నట్టే కదా. పైగా  ఈ పైలెట్లకి దారి తెలియకపోయినా, అదేదో “ కంట్రోల్ టవర్ “ ద్వారా, వీళ్ళని  గైడ్ చేస్తూంటారు.. ఏదో వాతావరణం బాగోనప్పుడు, కొన్ని జాగ్రత్తలు తీసికుంటే చాలుట. అయినా అన్నేసి లక్షల జీతాలు తీసికుంటున్నప్పుడు, ఆమాత్రం జాగ్రత్త తీసికోవడమూ గొప్పేనా?

ఇంక రైలు ఇంజన్ల వ్యవహారానికి వస్తే, వీళ్ళకి మాత్రం ట్రాఫిక్కా ఏమిటీ? ఒకే  ట్రాక్కు మీద, ఇంకొక ట్రైను రాకుండా చూసుకుంటే పనైపోతుంది. ఒక ట్రాక్కు మీదనుండి ఇంకో ట్రాక్కుకి మారడంకూడా, ఆటోమెటిక్ గానే జరిగిపోతుంది. మరీ ఆకాశమార్గమంత ఖాళీగా ఒక్కొక్కప్పుడు ఉండకపోవచ్చు, అప్పుడప్పుడు, స్కూలు బస్సులో, గ్రానైటు లోడ్డు బళ్ళో, జంతువులో  అడ్డొస్తూంటాయి, సాధారణంగా బలైపోయేవి, అలా అడ్డంగా వచ్చినవే, ఎక్కడో తప్ప. పైగా ఈ  ట్రైన్లకి కూడా, ప్రతీ స్టేషనులోనూ, మార్గదర్శనం చేయడానికి కావాల్సినంతమంది ఉంటూనే ఉంటారు.

ఇటువంటి సాధనాలూ, సదుపాయాలూ ఏమీ లేకుండా, చాకచక్యంతో వాహనాన్ని నడపగలిగేవారు, మన బస్సు డ్రైవర్లు మాత్రమే అనడంలో సందేహం ఏమాత్రమూ లేదు. మన దేశ “ రాజమార్గాల” విషయం మళ్ళీ చెప్పాలా ఏమిటీ? నోరులేని జంతువుల దగ్గరనుండీ, నోరులాటిదున్న మనుషులవరకూ, ఎవరికి వారు ఆ రోడ్డంతా తమ స్వంతమే అనుకుంటారు. ఇంకోరితో పని లేకుండా, ఇష్టం వచ్చినట్టు వాహనాలు నడపడం మనకే చెల్లు. కర్మకాలి కరెంటు లేక, ఏ ట్రాఫిక్ సిగ్నలో పనిచేయడం మానేస్తే చాలు, ఎవరి దారిన వారు “ సందు “ చేసికుని మరీ, వాహనాలు నడపడంలో, మన వారిని మించిన వారు లేరు.. అలా కుడిఎడమలతో పని లేకుండా, “మనమే  ముందుండాలి”  అనే “యావ”. మన నగరాల్లో తిరుగుతూంటాయే సిటీ బస్సులు—వాటి గురించి అందరికీ తెలిసిందే. ఎప్పుడు చూసినా కిక్కిరిసే ఉంటాయి. ద్వారం దగ్గర వేళ్ళాడుతూ నుంచోవడం ఒక ఫాషనాయె. అకస్మాత్తుగా డ్రైవరు బ్రేక్ వేసినప్పుడు, కర్మకాలి ఎవడో కింద పడ్డాడూ, అంటే, ముందుగా డ్రైవరునే పట్టుకుంటారు పాపం. అతనికేం తెలుసూ, కొన్ని “ప్రాణులు” వేళ్ళాడుతున్నాయని? ఇవి కాకుండా, బస్సులో ఏ తెలిసినవాడో ఎక్కి, డ్రైవరుతో బాతాఖానీ పెట్టుకుంటాడు. ఒకవైపు వాడితో మాట్టాడుతూనే, వాహనాన్ని నడపాలి, లేకపోతే వాడికి కోపం వస్తుంది. ఆ హడావిళ్ళన్నీ తప్పించుకుంటూ, ఏ సడెన్ బ్రేక్కో వేస్తే,  బస్సులో ఏమీ పట్టుకోకుండా నుంచున్నవాడు ముందుకి పడ్డం. ఇంక అందరూ, ఏదో కొంపమునిగినట్టు తిట్ల పురాణం మొదలెడతారు…” అంత పొగరుగా నడిపితే, మేము క్షేమంగా కొంప చేరుకోవాలా వద్దా…” అంటూ.. స్టాప్పు తో పనిలేకుండా, ఎక్కడ పడితే అక్కడ బస్సుని ఆపాలని ఆశిస్తారు కొందరు ప్రబుధ్ధులు.

ఇంక దూరప్రయాణాలకు వెళ్ళే బస్సులతో ఇంకో గొడవ—మామూలు బస్సుల్లా కాక, వీటికి స్పీడెక్కువ. సాధారణంగా రాత్రిళ్ళే నడుస్తూంటాయి.  ఇదివరకటిరోజుల్లోలా కాక, ఈమధ్యన స్లీపరు బస్సులు వస్తున్నాయి. హాయిగా బస్సులో అందరూ సుఖంగా నిద్రపోతున్నా, ఒక్కడూ పాపం ఆ డ్రైవరు, ఝూమ్మంటూ వెళ్ళే ట్రక్కులూ, అవీ తప్పించుకుంటూ క్షేమంగా తీసికెళ్తున్నాడా లేదా? కర్మకాలి ఆ డ్రైవరుకి ఏ  నిద్రో ముంచుకొచ్చి, కొద్దిగా అయినా సరే “మాగన్ను “ పడిందా, అందరి పనీ గోవిందాయే కదా.  మనస్సు ప్రశాంతంగా ఉంటేనే కానీ, వాళ్ళు డ్రైవు చేయలేరు. కానీ, వాళ్ళూ మానవమాత్రులేగా, ఏదో ఒక చిరాకు ఉంటూనే ఉంటుంది. కానీ, వాటన్నిటినీ పక్కకు పెట్టి, ప్రయాణీకులని క్షేమంగా వారి వారి గమ్యస్థానాలకి చేర్చడమే ధ్యేయం గా పెట్టుకున్న మన బస్సు డ్రైవర్లే , నా దృష్టిలో అసలు సిసలైన హీరోలు. అయినా వారికి వచ్చే జీతాలు మాత్రం అందరికంటే హీనాతిహీనం , మిగిలిన వాహక చోదకులతో పోలిస్తే..

సర్వే జనా సుఖినోభవంతూ…

 

మరిన్ని వ్యాసాలు

మా చార్ధామ్ యాత్ర-4
మా చార్ధామ్ యాత్ర-4
- కర్రా నాగలక్ష్మి
Maa chardham yatra
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
సినీ అప్సరస గీతాలు .
సినీ అప్సరస గీతాలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
వివేకానంద రాక్ మెమోరియల్ స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
- కుందుర్తి నాగబ్రహ్మచార్యులు