యువ - రవీంద్ర




మాట్లాడడమే కాదు మెప్పించడమూ కళే

ఇతరులతో మాట్లాడడం అంత సులభం కాదు. ఎవరి వ్యక్తిత్వాలు వారికి ఉంటాయి. ఎవరి అభిప్రాయలు వారికి ఉంటాయి. ఒకరితో ఒకరు ఏకీభవించడం కష్టం. ప్రతి మనిషిలోనూ ఒక విధమైన స్వభిమానం ఉంటుంది. అదే యువతలో వారి వయసు రీత్యా స్వభావాలు రూపుదిద్దుకుంటాయి. ఆ సమయంలో జీవితాన్ని ఛాలెంజ్ గా తీసుకోడానికి, సాహసాలు చేయడానికి సిద్ధపడుతుంటారు. అంతేకానీ ఎదుటివాళ్లు చెప్పిన మాటలకు, అభిప్రాయాలకు విలువ ఇవ్వరు. అన్నీ తనకే తెలుసు అన్నట్లు వ్యవహరించే మనస్తత్వంతో ఉంటారు. అలాంటి వారికి నీతులు, వ్యక్తిత్వ వికాస పాఠాలు చెప్పడం మరీ కష్టం. కానీ ఒక్కసారి ఇటువైపుకు వచ్చారు అంటే.. జీవితాన్ని వెలుగులతో నింపుకున్నట్లే. అందుకే యువతతో మాట్లాడడం, మీరు చెప్పే అభిప్రాయలు మంచివని ఒప్పించడం గగనమే అంటారు నిపుణులు. ఒక్క యువతతోనే కాదు ఎవరితో మాట్లాడాలన్నా కొన్ని పద్ధతులు పాటిస్తే మీరే అందరూ మీ మాటే వింటారు. మీరే నాయకులు కావచ్చు.

అభిప్రాయాలు గౌరవించాలి

ప్రతి వ్యక్తికి సొంతవైన అభిప్రాయాలు ఉంటాయి. తన గురించి, తన చుట్టూ ఉన్న సమస్యలపై, సమాజంపై కొన్ని నిర్థుష్టమైన ఆలోచనలు ఉంటాయి. మీరు ఏ విషయం పై మాట్లాడుతున్నారో ఆ విషయం పై కూడా ఎదుటి వారికి సొంతవైన భావాలు ఉంటాయి. మీరు ఏ విధంగా మీ భావాలు గొప్పవి, ఉన్నతమైనవి అనుకుంటున్నారో ఎదుటి వాళ్లు కూడా అలానే అనుకుంటుంటారు. ముందు మీ అభిప్రాయాన్ని ఎదుటి వాళ్లకు చెప్పాలి అంటే వారి అభిప్రాయాన్ని అంతకన్నా ముందే తెలుసుకోవాలి. వాటిని గౌరవించాలి. ఆ ఆలోచనల నుంచే మీరు మాట్లాడడం మొదలు పెట్టాలి. అందుకే స్నేహం చేయాలన్నా, ప్రేమించాలన్నా ముందు మీ టేస్ట్ లు ఏమిటి, మీకు ఏవేవి ఇష్టం...మీకు నచ్చిన విషయాలేంటి.. ఇలా ఎన్నో ప్రశ్నలు వేసి, స్నేహితులు, లవర్స్ వాటికి అనుకూలంగా ప్రవర్తిస్తూ ఎదుటి వారి స్నేహాన్ని, ప్రేమను పొందడానికి ప్రయత్నిస్తారు. ఇదే సరైన పద్ధతి అని రుజువైంది కూడా. అందుకే యువతతో మాట్లాడే ముందే ఆ విషయంపై వారి అభిప్రాయాలను తెలుసుకొని ఆ కోణంలోంచే మీ మాటలు కొనసాగించాలి.

తప్పును తప్పనకూడదు

కొంతమందికి దుడుకు స్వభావం ఉంటుంది. నాకు నచ్చదు. నేను అలా ఉండను. మీ ఇష్టం మీది. నా ఇష్టం నాది అని మాట్లాడుతుంటారు. దీని వల్ల రిలేషన్స్ ఎక్కువకాలం కొనసాగవు. మీకు దగ్గరవ్వాలనుకున్న వ్యక్తులు కూడా ఈ ప్రవర్తన వల్ల దూరమవుతారు. ఎదుటి వాళ్లు తప్పు చేసినా దాన్ని తప్పు అని చెప్పకూడదు. మనసు నొచ్చుకుంటుంది. మిమ్మల్ని శత్రువులా చూసే అవకాశం ఉంది. ప్రతి మనిషిలో ఉన్న అహం అలా చెప్పడాన్ని జీర్ణించుకోదు. అందుకే మీ స్నేహితులు తప్పు చేసినప్పుడు, లేదా మీకు ఇష్టమైన వాళ్లు మీకు నష్టం కలిగించే పని చేసినప్పుడు... దాని వల్ల వాళ్లకు, లేదా మీకు కలుగుతున్న నష్టాన్ని, బాధను వివరించండి. అంతే తప్ప సూటిగా చెప్పేయకండి. మీకు నచ్చిన వాళ్లు హర్ట్ అవుతారు. ఆ తప్పు చేయడానికి వెనుకున్న కారణాలు అన్వేషించండి. అప్పుడు మీ ఫ్రెండ్ చేసిన తప్పు తప్పుగా కనిపించదు. అలానే మీరు మీ వాళ్లను సంపూర్ణంగా అర్థం చేసుకున్న వాళ్లు అవుతారు. దాంతే మీ రిలేషన్ మరింత బలపడుతుంది. అప్పుడు తప్పును ఎలా సరిదిద్దుకోవాలో నేర్పించండి.

ఎక్కువ మాట్లాడనివ్వండి

మీరు ఎవవరితో అయితే కొత్తగా స్నేహం చెయ్యాలని అనుకుంటున్నారో, ఎవర్ని ఇష్టపడుతున్నారో వారినే ఎక్కువ మాట్లాడనివ్వండి. మీరు మాత్రం వినండి. వారు ఒకవేళ తక్కువ మాట్లాడుతుంటే ఎక్కువ మాట్లాడేలా చేయండి. మీ మాటలు బాగుంటాయి. వినాలని పిస్తుంది... అని మెచ్చుకోండి. ఆ మాటల వల్ల వారిని బాగా అవగాహన చేసుకోగలుగుతారు. వారి మనసు, ఇష్టాలు, అభిప్రాయాలు, భావాలు... అన్నీ తెలుస్తాయి. తర్వాత తర్వాత మీరు ఎలా వారితో మాట్లాడాలో, ప్రర్తించాలో తెలిసిపోతుంది. అందుకే ఎదుటి వారి మాటలు వినాలి. వారికే ఎక్కవ అవకాశం ఇవ్వాలి. వినడం కూడా ఓ కళే. దానిని మీరు బాగా అలవాటు చేసుకోండి. కొంతమందికి తమ మనసులోని మాటలు చెప్పుకోడానికి ఎవ్వరూ ఉండరు. ఆ ప్లేసును మీరు భర్తీ చేస్తే చాలు. అట్టే మీ స్నేహితులు అయిపోతారు. స్నేహితులు కావాలనుకున్నా, ప్రేమను పొందాలనుకున్నా, పరిచయాలు పెరగాలన్నా, ఉద్యోగాలు కలకాలం నిలబడాలన్నా ఎదుటి వాళ్లకు మాట్లాడే అవకాశం ఇవ్వాలి. మాట్లాడుతుంటే మనస్ఫూర్తిగా వినడం మీరు అలవాటు చేసుకోవాలి. అబ్బా... సుత్తి చెప్తున్నాడు. అబ్బా దానితో నాలుగు రోజులు తిరిగితే.. సోది వినలేక చావాలి... అనే మాటలు అనకండి. వినడమే మీ రిలేషన్ ను ముందుకు తీసుకెళ్తుంది.

మీ తప్పును ఒప్పుకోండి

 మీరు మీ రిలేషన్ లో ఏ తప్పు చేసినా ముందుగా క్షమించండి అని అడగండి. ఏ హోదాలో ఉన్నా, ఏపదవిలో ఉన్నా తప్పును క్షమించండి అని అడగడంలో వెనకడుగు వేయొద్దు. మీ కన్నా చిన్నవాళ్లతో ఉన్నా, పెద్ద వాళ్లతో ఉన్నా, మీ వల్ల తప్పు జరిగింది అని మీరు గుర్తిస్తే మాత్రం వెంటనే ఆ మాట చెప్పండి. ఇలా క్షమించండి అని అడగడం యూత్ లో చాలా తక్కువగా ఉంటుంది. తప్పును ఒప్పుకునే స్వభావం వారిలో ఉండదు. కావాలంటే ఆ రిలేషన్ ను వదిలేస్తారు కానీ ఒప్పుకోరు. దీనికి వారిలోని అహం, నేను అనే భావనలు అడ్డు వస్తాయి. మిత్రుల దగ్గర, ప్రేమికుల దగ్గర, తల్లిదండ్రుల దగ్గర తప్పును ఒప్పుకోడానికి ఏమాత్రం వెనకాడకూడదు. అలా ఒఫ్పుకోవడమే గొప్పతనం. ఒప్పుకోవడం వల్ల మీలోని హుందతనం బయటపడుతుంది. మీ రిలేషన్ మరింత మెరుగుపడుతుంది. కేవలం ఒప్పుకోవడమే కాదు, అలా చేయడానికి గల కారణాలను వివరించి చెప్పాలి. అలా చేయడానికి ప్రోత్సహించిన పరిస్థితులను విశ్లేషించి చెప్పాలి.

మీరు మీ అభిప్రాయాలను ఎదుటి వారిపై బలవంతంగా రుద్దడం కాదు, ఓ కళాత్మకంగా ఆకర్షించాలి. ఆ ఆకర్షణలో మీపై అభిమానం ఏర్పడాలి. అలా ప్రవర్తించినప్పుడే గురువు శిష్యులు, తల్లిదండ్రులు పిల్లలు, స్నేహితులు, ప్రేమికులు, అధికారి ఉద్యోగి మధ్య బంధాలు బలపడతాయి. అంతే తప్ప ముక్కుసూటిగా వెళ్లకూడదు. మీకు మీరు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో, అతవతలి వాళ్లు వారికి అంతే ప్రాధాన్యత ఇచ్చుకుంటారు. కాబట్టి మీరు ప్రతి విషయాన్ని, ప్రతి మాటను ఎదుటి వాళ్ల దృష్టితో చూడాలి. అలా చూస్తే మీ మాటకు విలువ పెరుగుతుంది. పదిమంది మీకు దగ్గరవుతారు. మీరు చెప్పేవి వింటారు. అవసరాన్ని, అవకాశాన్ని బట్టి మీరే శ్రోత, మీరే వక్త కాగల స్వభావం ఉండాలి. మానవ సంబంధాల్లో మాటకే అత్యధిక ప్రాముఖ్యత. మీరు ఎదగాలన్నా, పతనమవ్వాలన్నా మీ మాటలే మీ ఆయుధం.

మరిన్ని వ్యాసాలు

మా చార్ధామ్ యాత్ర-4
మా చార్ధామ్ యాత్ర-4
- కర్రా నాగలక్ష్మి
Maa chardham yatra
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
సినీ అప్సరస గీతాలు .
సినీ అప్సరస గీతాలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
వివేకానంద రాక్ మెమోరియల్ స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
- కుందుర్తి నాగబ్రహ్మచార్యులు