అలా మొదలైంది - ..

 

ఓ పల్లెటూరునుండి 6 వ తరగతి చదవడానికి    1963 లో విశాఖపట్నం వచ్చాను. అప్పటినుండి నాకు కళా, సాహితీ రంగాలతో (ప్రేక్షకుడిగా, పాఠకుడిగా) పరిచయం మొదలయింది.

వార, మాస పత్రికలలో పాఠకులు పాల్గొనడానికి  ఆవకాశం ఉన్న అన్ని శీర్షికలలో పాల్గొని అప్పుడప్పుడు రూపాయలు పదో పాతికో మనియార్డర్లు అందుకోనేవాడిని. రచనల ద్వారా సంపాదన అలా మొదలయింది.

రంగస్థలం మీద సాంఘిక నాటకాలు వేసాను. వేయించాను. సంగీతం తప్ప అన్నిటిలో వేలు పెట్టాను.

ప్రయివేటు సంస్థలో ఉద్యోగిగా చేరిన తరువాత సాంస్కృతిక కార్యక్రమాలు చూడటానికి, గ్రంధాలయానికి వెళ్ళడానికి ఆవకాశం ఉండేది కాదు.

మా ఇంట్లో ఉదయం 6 గంటలనుండి 8 గంటల వరకు ( టీ.వీ. వచ్చిన తరువాత కూడా ) రేడియో ఆన్ చేసి వింటూ ఎవరి పనులు వాళ్ళు చేసుకోవడము అలవాటు. 

తల్లి,తండ్రి, కొడుకు, కోడలు నాలుగు ముఖ్య పాత్రలతో వారానికి ఒక రోజు "సరిగమలు" పేరుతో విశాఖ ఆకాశవాణి లో ప్రసారం జరిగేది. కొన్ని వారాలు విన్న తరువాత ఆ నాలుగు పాత్రలతో ముఖ్యంగా వారి కుటుంబంలో జరిగే సరదా సంఘటనలతో వారానికి ఒకరు వ్రాస్తున్నారని గ్రహించాను.

కొన్ని వారాలు విన్నాక ఆ పాత్రల స్వరూప స్వభావాలు అర్ధమయింది.  హాస్యభరితంగా నేను ఒకటి వ్రాసి పంపాను.(తిరుగు టపాకు స్టాంపులు అంటించిన కవరు లేకుండా.) రేపటి ప్రసారాలు ముందు రోజు చెప్పేవారు. నా పేరు వినిపిస్తుందేమోనని కొన్ని వారాలు ఎదురు చూసాను. తరువాత ఆశ వదులుకొని మర్చిపోయాను.

అప్పుడొచ్చింది ఆకాశవాణి నుండి ఒక కవరు. ప్రభుత్వ సంస్థ కదా చావు కబురు చల్లగా చెప్పినట్టుంది అని విప్పితే  "మీ రచన పలనా రోజున రికార్డవుతుంది. పలనా రోజున ప్రసారం అవుతుంది . మీ రచనకు పారితోషికం ఇంత. మీ అంగీకారం తెలియ జేస్తూ ఈ కాంట్రాక్ట్ ఫార్మ్ నింపి పంపండి."    

ఆ కాంట్రాక్ట్  భారత రాష్ట్రపతికి  నాకు మధ్య అన్నట్టుగా ఉంది. రచనలు తిరిగి వస్తే నవ్వుతారని  భయపడే నాకు ఆ కాంట్రాక్ట్  చాలా సంతోషం కలిగించింది.అది 1987 వ సంవత్సరం.  ఫోను సౌకర్యం అంతటా లేకపోవడం వల్ల పోస్టు కార్డుల ద్వారా సన్నిహితులందరికి తెలియ జేశాను.   ప్రసారమయే  ఆ రోజు ఎప్పుడు వస్తుందా అని  చాలా ఆత్రుతగా ఎదురుచూసాను.        

ప్రసారం రోజు  2 ఇన్ 1 లో రికార్డు చేసుకొని  మళ్ళీ మళ్ళీ విన్నాను. సహోద్యోగులు,ఫోన్ ద్వారా బంధు మిత్రుల అభినందనలతో     ఆపీసులో పనిమీద ఏకాగ్రత చూపించ లేకపోయాను. నేను ఆఫీసు అడ్రస్ ఇవ్వడం వల్ల  ఫోన్ డైరెక్టరీ లో నెంబర్ చూసి  ఆకాశవాణి వారు ఫోన్ చేసారు. "అవకాశం ఉన్న రోజు ఆకాశవాణికి రమ్మని"

వెంటనే వెళ్లేను. అక్కడ నాటక విభాగాదిపతి శ్రీ కే.ఆర్. భూషణ రావు గారు

"ఈ రోజు సరిగమలు వ్రాసింది" ఈయనే అని స్టేషన్ డైరెక్టర్ తో సహా అందరికి  నన్ను  పరిచయం చేసారు. (స్టేషన్ డైరెక్టర్ అత్త గారి పాత్ర ధరించారు). ఆకాశవాణి నిభందనలు తేయజేసి 15 ని.వ్యవది నాటికలు వ్రాయమన్నారు. సెంటిమెంట్ తో కూడుకున్న నా పాత కధను నాటికగా మార్చి పంపాను. ప్రసారం జరిగి పేరు వచ్చింది. ఉదయం ప్రసారమయే నాటికలు హాస్యంగా ఉండాలంటే హాస్య నాటిక పంపితే మంచి గుర్తింపు వచ్చింది.        

త్వరలో "లోకంపోకడ" పేరుతో ఒక ధారావాహిక ప్రసారం చెయ్యాలనుకుంటున్నాము.  ప్రముఖ రచయిత శ్రీ ద్విభాష్యం రాజేశ్వర రావు గారు  4 వారాలకు వ్రాసారు. దానికి కొనసాగింపుగా నన్ను 4 వారాలు వ్రాయమన్నారు. అప్పుడు నా మీద నాకు నమ్మకం పెరిగింది. అది వ్రాసి ఇచ్చి మంచి గుర్తింపు పొందాను. ఆ తరువాత కొన్ని నెలలకు "పదనిసలు"  పేరుతో ధారావాహికకు ప్రముఖ హాస్య రచయిత శ్రీ భమిడిపాటి రామగోపాలం గారు 4 వారాలకు వ్రాస్తే  దానికి కొనసాగింపుగా నన్ను మరో 4 వారాలకు వ్రాసే అవకాశం ఇచ్చారు. దానితో మంచి గుర్తింపు వచ్చింది. అలా ఓ 25 వరకూ ఆకాశవాణికి వ్రాసాను. అప్పటికి  టీ.వీ. ప్రభావం ఎక్కువగా లేకపోవడం వల్ల ఎక్కువమందికి నా రచనలు చేరాయి.  స్నేహితులు, చుట్టాలు, ఏదయినా   కార్యక్రమంలో కలిసినప్పుడు నన్ను ప్రత్యేకంగా చూసి నా రచనల గురించి చర్చించేవారు.  ఇప్పుడు  కూడా పాతమిత్రులు కలిసి ఏమీ వ్రాయడం లేదా అని అప్పటివి గుర్తు తెస్తే మళ్ళీ మొదలు పెట్టాలనిపిస్తుంది. మళ్లీ ఎప్పుడు "ఆలా  మొదలవుతుందో " అని ఎదురు చూస్తున్నాను.

- వర్మ దంతులూరి

మరిన్ని వ్యాసాలు