అవీ - ఇవీ - భమిడిపాటి ఫణిబాబు

 

బేరాలాడ్డం ఓ కళ. అందరికీ ఉండదు. సాధారణంగా ఏ వస్తువైనా కొనాలనుకొన్నప్పుడు, మగవారు, ఏదో కొట్లోకి వెళ్ళి,  ఆ కొట్టువాడే ధర చెప్తే, ఇచ్చేసి వస్తువు తెచ్చి, ఇంట్లో పెట్టేసి చేతులు దులిపేసికుంటాము. దానికి కారణాలు ఎన్నో ఉంటాయి—ఇంకో రెండు మూడు కొట్లు తిరిగే ఓపిక లేకపోవడం, ఈమాత్రం దానికి ఇంకో కొట్టుకూడా ఎందుకూ అనే భావన, పోనిద్దూ, మనం కొనకపోతే పాపం ఆ కొట్టువాడి పొట్ట నిండొద్దూ అనో.. మొత్తానికి బేరం ఆడకుండానే, తెచ్చేయడమూ, ఇంటికొచ్చేసిన తరువాత ఇంటావిడచేత చివాట్లు తినడమూ. ఇలాటివి చూస్తూనే ఉంటాము. అదే ఆడవారిని, తీసికెళ్ళండి, ఛస్తే ముందుగా వెళ్ళిన కొట్లో కొనరు. అయినా సరే, వాడికొట్లో ఉన్న అన్ని రకాలవీ చూపించమంటారు. చిత్రం ఏమిటంటే, ఆ కొట్టువాడు చూపిస్తాడు. గొర్రె కసాయివాడినే నమ్ముతుందంటారు ఇందుకేనేమో..

కొంతమందిని చూస్తూంటాం, అమ్మేవాడు చెప్పిన ధరకి సగానికి సగం అడుగుతారు.   ఈవిడతో వెళ్ళిన మగాడికి ఒక్కోప్పుడు, భయంకూడా వేస్తుంది, ఈవిడడిగిన ధరకి ఇవ్వడం మాట దేవుడెరుగు, తిడతాడేమో అని. కానీ, ఈవిడమాత్రం, చిద్విలాసంగా నవ్వుతూ.. “ మీరూరుకోండీ, వాడే వస్తాడు.. ఏం ఫరవాలేదు, కంగారు పడకండి.. “ అంటుంది. నిజంగానే వాడు, మనవెనక్కాలే రావడమూ, మరీ ఈవిడడిగినంత కాకపోయినా, మధ్యస్థంగా ఇద్దరికీ నచ్చేటట్టు బేరం కుదుర్చుకోడమూ జరుగుతూంటుంది. మరి ఇక్కడ తేలిందేమిటయ్యా అంటే, మగాళ్ళందరూ వెర్రివెంగళప్పలనేగా!!

అందుకే అంట ఈ  ప్రక్రియంతా ఓ కళ అని. అందరికీ అబ్బదు. ఇంకొంతమందుంటారు. అవసరానికి ఖర్చుచేయడానికి వెనుకాడరు కానీ, అర్ధం కాకుండా, కొన్నివిషయాలలో ఛస్తే ఒప్పుకోరు. ఉదాహరణకి, నగరాల్లో ఆటోవాళ్ళని చూడండి, అదేం చిత్రమో కానీ, వాళ్ళ మీటర్లు ఎప్పుడూ పనిచేయవు. ప్రతీ సందుచివరా ఓ ఆటో స్టాండు తప్పకుండా ఉంటుంది. ఎక్కడకో బయలుదేరాలని,  ఆటోవాడిని అడిగితే, వాడేదో అంకె చెప్తాడు, ఫలానా అని. ఇవతల ఈయనకేమో, ఆమాత్రం దూరానికి అంతెందుకూ తో ప్రారంభం అవుతుంది గొడవ. ఈయనదో మాటా, ఆటోవాడిదో మాటా.. మధ్యలో ఆయనగారి భార్యకు కంగారూ, “ఊరికే వాడితో దెబ్బలాటెందుకండీ...” అంటూ.. అయినా సరే, తన దారి తనదే. ఇంకో కిలోమీటరు నడిచైనా సరే, తను పెడదామనుకున్న రేటుకే కుదుర్చుకుంటాడు. వెనక్కాల ఇంటావిడేమో, ఆపసోపాలు పడుతూ నడవడం. ఓ కిలోమీటరు తగ్గిన కారణంగా, మాస్టారు చెప్పిన రేటుకే వస్తారు, ఆటోవాళ్ళు.

ఇంకొందరుంటారు, ప్రతీరోజూ పేపర్లు చూడ్డం,  ఊళ్ళో ఎక్కడెక్కడ సరుకులు డిస్కౌంటులో ఇస్తున్నారో, కూలంకషంగా, ఓ కాగితం మీద నోట్ చేసికోవడం. తనుంటున్న ఇలాకాలో ఆ సరుకు దొరుకుతున్నా సరే, బస్సులో పొలోమంటూ, అంతదూరం వెళ్ళి ఆ సరుకేదో కొనుక్కొస్తేనే కానీ, నిద్రపట్టదు. పైగా అడిగినవాడికీ, అడగనివాడికీ చూపించి చెప్పుకోడమూనూ,  “బలే చవగ్గా కొట్టేశానూ  .. “ అంటూ. నానా హైరాణా పడి, రెండు బస్సులు మారి, ఎండలో అంతదూరం వెళ్ళి, ఆ పదిపెర్సెంటో, పాతిక పెర్సెంటో ఏమి కలిసొచ్చినట్టూ? అతావేతా ఆ ధరకి దగ్గరలో ఉన్న కొట్లలోనూ దొరుకుతుంది. “ పొదుపండీ.. పొదుపూ... “ అని చెప్పడం.

పొదుపు వేరూ పిసినారితనం వేరూ. పిసినారన్నవాడు ఛస్తే డబ్బులు ఖర్చుపెట్టడు. నేను ఉద్యోగం చేసే రోజుల్లో ఓ స్నేహితుడుండేవాడు--  వాళ్ళుండే క్వార్టరులో మధ్య గదిలో ఓ లైటు వేసి, పిల్లలందరినీ అక్కడే చదువుకోమనేవాడు, మిగతా లైట్లన్నీ ఆపేసి. పాపం ఆ పిల్లలు నానా అవస్థా పడేవారు. కర్మకాలి అతనితో స్కూటరు మీద ఎవరైనా వెళ్తే, దారిలో పెట్రోలు అయిపోయిందా, ఛస్తే మధ్యలో పోయించుకునేవాడు కాదు, ఇంటిదాకా బండిని తోసుకుంటూరావడమే. కారణం, జేబులో ఓ రూపాయికంటే ఎక్కువుండేది కాదు. రోడ్లమీద లైటుంటే, తన స్కూటరు లైటు ఆపేసేవాడు. అంతదాకా ఎందుకూ, ఎత్తునుంచి పల్లంలోకి వచ్చేటప్పుడు, ఇంజను కూడా ఆపేసేవాడు. ఫాక్టరీకి తెచ్చికునే భోజనంలో రెండంటే రెండే చపాతీలు, తెచ్చికోవడం, అందరితో కలిసి భోజనం చేసేటప్పుడు, అందరి డబ్బాల్లోంచీ తలో కూరా తీసికున్నా పనైపోయేది. ఇలాటివారిని పిసినారి అన్నా తప్పులేదేమో.

ఇంక పొదుపు విషయానికొస్తే, మన ఇంటి ఇళ్ళాల్లు చేసేది , ఒకరకమైన పొదుపే. ఉదాహరణకి ఓ రోజున   భోజనం లోకి ఏ ముద్దపప్పో చేశారనుకోండి, సాయంత్రానికి మిగిలినా, మళ్ళీ ఇంకోటేదో చేసేదేమిటీ, ఇద్దరు మనుషులకోసం అనుకుని,  ఆ మిగిలిన పప్పుని, ఏ సాంబారుగానో, పప్పుచారుగానో మార్చేయడం. పైగా ఇది చాలా రుచికరంగా కూడా ఉంటుంది. పొదుపుకి పొదుపూ, రుచికి రుచీనూ.. హొటళ్ళవాళ్ళు చేయడంలేదూ.. అలాగే. పైగా వాళ్ళు మిగిలిపోయిన అన్ని పదార్ధాలూ కలిపి ఇంకో రూపం తేగానే, లొట్టలేసికుని మరీ తింటాం. పైగా కనిపించిన ప్రతీ వాడితో టముకేయడం—క్యా టేస్ట్ హై బాస్.. ఆ హొటల్లో అదేదో కొత్త రెసిపీ చేశాడూ, అదరకొట్టేశాడు... – అని.  వాడు చేసిందీ పొదుపే, మిగిలినవన్నీ కలిపేసి అదేదో “ ఫలానా స్పెషల్ “ అని పేరెట్టాడు.

అలాగే ఇదివరకటి రోజుల్లో,  పసిపిల్లల బొంతలకి, ఇంట్లో పాతపడిపోయిన చీరలన్నీ కలిపి కుట్టేసేవారు. పసిబిడ్డకి  సుఖానికి సుఖమూ, పొదుపుకి పొదుపూనూ. ఓ అరడజనుదాకా రెడీ చేసి ఉంచేవారు, బొంత తడిపినా, వెంటనే మార్చుకోడానికి. ఈరోజుల్లోలాగ డయపర్లూ అవీ వాడేవారా ఏమిటీ ?

చెప్పొచ్చేదేమిటంటే, పొదుపు మాత్రం అలవాటు చేసికోండి. పిసినారి తనం మాత్రం వద్దంటే వద్దు. ఉన్నదేదో అనుభవించాలి కానీ, వెళ్ళేటప్పుడు తీసికెళ్తామా ఏమిటీ...

సర్వే జనా సుఖినోభవంతూ...

మరిన్ని వ్యాసాలు

పాలెగాళ్ళు.
పాలెగాళ్ళు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
సినిమా గీతాలలో  షెహనాయ్ వాద్యం.
సినిమా గీతాలలో షెహనాయ్ వాద్యం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు పలువురికి -3
పురాణాలలో ఒకే పేరు పలువురికి-3
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
108
108
- శ్రీరామ్ లక్ష్మీనారాయణ మూర్తి