వర్కింగ్ మామ్స్ కి చిట్కాలు - లలిత లాస్య

ప్రస్తుత పోటీ ప్రపంచంలో పిల్లలు పుట్టిన మూడు నెలలలోపే మహిళలు విధుల్లోకి చేరాల్సి వస్తోంది. కొన్ని సంస్థలు వర్క్ ఫ్రమ్ హోమ్ సౌకర్యాన్ని ఇచ్చినా మరికొన్ని సంస్థలలో ఇంట్లోంచి పనిచేసే సౌలభ్యం లేకపోవడం వల్ల మహిళలు అవసరం వల్లనైనా లేక ఉద్యోగాన్ని వదిలేస్తే మళ్ళీ దొరకకపోవచ్చు అనే ఆలోచనవల్లనైనా ఉద్యోగ విధుల్లోకి వెంటనే చేరాల్సి వస్తోంది.

అటువంటి వర్కింగ్ మామ్స్ కొన్ని విషయాలపై ప్రత్యేకమైన శ్రద్ధ వహిస్తే అటు కుటుంబానికి ఇటు తనకు ఎటువంటి సమస్య ఉండదు. పిల్లల్ని డే కేర్ కి పంపించాలని అనుకున్నా లేదా ఇంట్లోనే నానీని అప్పాయింట్  చేసినా వర్కింగ్ మామ్ కొన్ని జాగ్రత్తలు తప్పక తీసుకోవాలి. ప్రొఫెషనల్ లైఫ్ ని పెర్సనల్ లైఫ్ తో బ్యాలన్స్ చేసుకుంటే తనతో పాటు తన కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకునే అవకాశం కలుగుతుంది.

కొన్ని చిట్కాలు

ప్రణాళిక : ప్రణాళికతో విజయాన్ని అందుకోవచ్చు. రోజువారి కార్యక్రమాల లిస్టును సిద్ధం చేసుకోవడం ద్వారా ఎంతో సమయాన్ని ఆదా చేయడం కుదురుతుంది. మీటింగ్స్, టాస్క్స్ కి సంబంధించిన లిస్టులతో పాటు భర్తకి, పిల్లలకి సంబంధించిన లిస్టులను ప్రిపేర్ చేయడం వల్ల ప్రొఫెషనల్ లైఫ్ ను పెర్సనల్ లైఫ్ ను బ్యాలన్స్ చేయడం సులభతరమవుతుంది. లిస్టును ప్రిపేర్ చేయడం వల్ల మీకు రోజు వారి కార్యక్రమాలపై అవగాహనా రావడంతో పాటు కొన్ని టాస్క్స్ ను అవసరమైతే మీ ఇంట్లో వారితో షేర్ చేసుకునే అవకాశం లభిస్తుంది.

పిల్లలతో టచ్ లో ఉండండి : చిన్నపిల్లలైనా, పెద్దపిల్లలైనా వారితో తల్లి తరచూ మాట్లాడుతూ ఉండాలి. నానీని అపాయింట్ చేస్తే ఫోన్ చేసి ఎప్పటికప్పుడు అప్డేట్స్ తెలుసుకోవాలి. ఒకవేళ ఇంట్లో పెద్దవాళ్ళు పిల్లల్ని చూసుకుంటుంటే వారితో కూడా మాట్లాడుతూ వారికవసరమైనవి ఉన్నాయో లేదో అరా తీసి ఎరేంజ్ చేయాలి. స్కూల్ కెళ్ళే పిల్లలున్నట్లయితే ఆఫీస్ కి వెళ్ళినా పిల్లలతో టచ్ లో ఉండాలి. ఫోన్ చేసి మాట్లాడండి. టెక్స్ట్ చేయండి. హోం వర్క్ గురించి ఆరా తీయండి. అవసరమైన అడ్వైజ్ ఇవ్వండి. ఇంట్లో ఎంతమంది ఉన్నా ఇంటికి రాగానే అమ్మ కనిపించకపొతే పిల్లలు బెంగపెట్టుకుంటారు. 'అమ్మ ఇంట్లో లేదు' అని వారికి బెంగ కలగకుండా ఉండేందుకు సమయం దొరికినప్పుడల్లా వారితో మాట్లాడండి.

కుటుంబసభ్యుల సహాయాన్ని స్వీకరించండి : చాలా మంది మహిళలు సంసారాన్ని ముందుకు నడపడం తమదే భాద్యతగా భావించి తమ భుజస్కంధాలపైనే భారాన్ని వేసుకుంటారు. ప్రొఫెషనల్ లైఫ్ ని పెర్సనల్ లైఫ్ ని బ్యాలన్స్ చేయడంలో కుటుంబసభ్యులందరి ప్రోత్సాహం తప్పనిసరి. ఈ విషయాన్ని గుర్తించి అవసరమైతే పనులను కుటుంబసభ్యులతో షేర్ చేయడానికి సంశయించకండి.

సలహాలు స్వీకరించండి : మీకు తెలిసిన వర్కింగ్ మామ్స్ నుండి సలహాలు స్వీకరించండి. వారే విధమైన ప్రణాలికలను పాటిస్తున్నారో అడిగి తెలుసుకోండి.

నిరుత్సాహపడకండి  : ఎంత ప్రణాళికలు రచించినా కొన్ని సార్లు పనులు అనుకున్నట్టుగా ముందుకు సాగవు. అనుకోని విధంగా పనులు ముందుకు సాగకపొతే నిరుత్సాహపడి మిగిలిన విలువైన సమయాన్ని వృధా చేయకుండా కాసేపు రిలాక్స్ అయ్యి చల్లటి మంచినీళ్ళు తాగి మళ్ళీ వర్క్ లో నిమగ్నమవ్వండి.   

సర్ప్రైజ్ నివ్వండి : ఆఫీస్ వర్క్ తో హడావిడిగా గడిచిపోతున్న రోజులకి కొంచెం ఫ్లేవర్ ని అద్దండి. మీ కుటుంబసభ్యులతో సడెన్ వెకేషన్ ని ప్లాన్ చేయండి. కనీసం వన్ డే ట్రిప్స్ నైనా ప్లాన్ చేయండి. ఈ సడెన్ వెకేషన్ మీకు మాత్రమే కాదు మీ కుటుంబసభ్యులకి కూడా అద్భుతమైన మెమరీగా మిగిలిపోతుంది. మీకు అటు పెర్సనల్ లైఫ్ ని ఇటు ప్రొఫెషనల్ లైఫ్ ని సక్సెస్ ఫుల్ గా బ్యాలన్స్ చేసుకునేంత ఉత్సాహం లభిస్తుంది.

మరిన్ని వ్యాసాలు