త్రిబాణధారి - -కర్రా నాగలక్ష్మి

 కలియుగ కృష్ణుడు గా పూజలందుకుంటున్న త్రిభాణధారి 

మరువాడీ సముదాయానికి చెందిన చిన్న దుకాణమైనా , పెద్ద వ్యాపార సంస్థ అయినా , వారి పూజా స్థలం లో బంగారు ఆభరణాలతోను , రకరకాల పువ్వులతోను అలంకరించిన నల్లరాతితో చెయ్యబడ్డ తల కనిపిస్తూ వుంటుంది . జీవం వుట్టిపడేటట్టుగా వుండే కళ్లు , పెద్ద పెద్ద మీసాలతో చూడగానే యెంత కళగా వుందో యీ విగ్రహం అని అనుకోకుండా వుండలేము .

మరువాడీ లు అంటే రాజస్థాను రాష్ట్రం లో మార్వాడ్ ప్రాంతానికి చెందినవారు , వీరు యెక్కువగా దేశ విదేశాలలో వ్యాపారాలు , వ్యాపార సంస్థలు సమర్ధ వంతంగా నడపడం చూస్తూ వుంటాం . అలాంటి వ్యాపారి దగ్గర పూజా స్థలంలో వున్న ఫోటో చూసి యీ దేవుడి పేరేంటి అని అడిగితే అతను ఖఠు శ్యాం బాబా కలియుగ కృష్ణుడు మా సముదాయానికి యిలవేల్పు , పిల్లలకి పుట్టుజుత్తులు కూడా అక్కడే తీయిస్తాం అని చెప్పేరు . బాబా అంటే సన్యాసో , ఆశ్రమం నడుపుకుంటున్న యే సాధువో అనుకున్నాం , యిక్కడ దేవుడిని బాబా అని అంటారని తరవాత తెలిసింది .  యీ దేవుడి పేరేమిటి ? ఎక్కడ కొలువై వున్నాడు ? ఎలా వెళ్ళాలి ? యీ ప్రశ్న లన్నింటికి జవాబు అక్కడకి వెళ్లి రావడమే అని నిర్ణయించుకొని ఢిల్లి నుంచి కారు లో బయలుదేరేం . డిల్లి నుంచి 266కిలొమీటర్ల దూరం . రాష్ట్రరాజధాని జైపూర్ కి 100 కిమీ దూరంలో సికర్ జిల్లాలో వుంది యీ ' ఖఠు ' వూరు . ఇక్కడకి 17 కిమీ దూరం లో వున్న పట్నం ' రింగస్ ' .

 ప్రొద్దున్న ఆరు గంటలకి బయలుదేరితే సుమారు 150 కిమీ .. NH 8 ఢిల్లి జైపూర్ హైవే మీద సాగిన ప్రయాణం స్టేట్ రోడ్డులోకి మారింది . దాంతో వేగం కాస్త తగ్గి సాయంత్రం 4 గం.. లకి యీ కోవేల చేరేం . చిన్న గుట్ట మీద మఖరానా పాలరాతి తో పూర్తిగా రజస్థానీ సాప్రదాయాన్ని అనుసరించి కట్టిన కోవెల . 

 ప్రతీ రోజు అయిదు సార్లు హారతి నిర్వహిస్తారు . పొద్దున్న మంగళా హారతి , అభిషేకానంతరం బంగారు ఆభరణాలతొను పూలతోను అలంకరించిన తరువాత శృంగారహారతి , మధ్యాహ్నం నైవేద్యం పెట్టే  సమయంలో భోగహారతి , సాయంకాలం సంధ్యాహారతి , రాత్రి శయన హారతి యిస్తారు . కార్తీక శుక్ల ఏకాదశి , జన్మాష్ఠమి , ఝూల్ ఝూలా ఏకాదశి , హోలీ , వసంత పంచమి , ఫాల్గుణ శుక్ల ద్వాదశి మంగళవారం యిక్కడ విశేష పూజలు జరుగుతాయి .

  ప్రతీనెలా శుక్ల ఏకాదశి , ద్వాదశి లకు యిక్కడ యిశేష పూజలు జరుగుతాయి .

 యీ కోవెలకు వెలుపల వొక కుండం వుంది . ఫల్గుణ శుక్ల ఏకాదశి నాడు యీకుండం లో స్నానం చేస్తే అన్ని ఋగ్మతలు నశిస్తాయన్నది స్థానికుల నమ్మకం . 

 ఇతను యెవరు ? , మొదలైన విషయాలు అడుగగా స్థానికులు ఆశ్చర్య కరమైన విషయాలు చెప్పేరు . ఆ వివరాలు విన్నతరువాత మా దృష్ఠిలో యీ కోవెల యింకా ప్రాముఖ్యతని సంపాదించు కుంది .

 అదేంటో మీరు తెలుసుకోండి .

 ఖఠు శ్యాం గా పిలువబడే యితను భీముని మనుమడు . భీమునికి హిడింభి ల పుత్రుడైన ఘటొచ్ఘచునికి , మౌరికి పుట్టినవాడు , బార్బారికుడు అని నామ కరణం చెయ్య బడ్డ వాడు , చిన్ననాటినుంచీ తల్లి దగ్గర అన్ని శస్త్ర విద్యలు నేర్చుకుని  శూరుడుగా పేరు పొందేడు . తల్లి అశీర్వచనం తో పరమ శివుని మెప్పు పొంది అద్భుత శక్తులు గల మూడు  భాణాలు పొందుతాడు , అగ్నిదేవుడు ధనుస్సు యిస్తాడు అందుకే బార్బారికుడు త్రిభాణధారిగా పిలువబడసాగేడు . చిన్ననాటినుంచి మహాభారత యుధ్ధం లో పాల్గొనాలనే కోరిక కలవాడు ,  నీలి గుర్రం వాహనంగా క లవాడు , తల్లి నుండి అద్భుతమైన వరాన్ని పొందినవాడు . భభ్రువాహనుడు అని కూడా పిలువబడేవాడు .

 అతి కుతుహులం తో కృష్ణుని మాటి మాటికి మహాభారత యుద్ధం యెప్పుడు జరుగుతుంది అని అడుగుతూ ఉంటాడు . ఒకనాడు కృష్ణుడు బర్బారికుని శక్తి ని పరీక్షింపగోరి బర్బారికునికి అతని తల్లి యిచ్చిన వరము గురించి , అతని వద్దగల మూడు భాణములతో మహాభారత యుద్దము చేయడం యెలా సంభవమో తెలియజెయ్యమని అడుగగా భభ్రువాహనుడు తన వద్ద గల భాణముల గురించి యిలా చెప్తాడు , మొదటి భాణము శత్రువులను గుర్తించి వచ్చి తిరిగి అమ్ముల పొదిలో చేరిపోతుంది . రెండవ భాణము గుర్తు బొమ్మ పెట్టి వచ్చి పొదిలో చేరుతుంది . మాడవ అమ్ము గుర్తుగల శత్రువులను వొకే మారు సంహరించి వస్తుంది . 

భభ్రువాహనుని యీ శక్తిని ప్రత్యక్షం గా పరీక్షించదలచి పక్కనే వున్న రావిచెట్టుని చూపించి యీ చెట్టు యొక్క ఎండుటాకులను తన భాణములతో రంధ్రము చేయ వలసినదిగా కోరుతాడు . అప్పుడు భభ్రు వాహనుని మొదటి భాణము ఎండుటాకులను గుర్తించి వచ్చి కృష్ణుని కాలివద్దకు వచ్చి తిరిగి వెనుకకి వెళ్లి పొదిలోకి చేరిపోతుంది . రెండవ బాణం ఆకులపై గుర్తులు పెట్టుకుంటూ కృష్ణుని కాలిపైన గుర్తు పెట్టు  కొని పోదిలోకి వెళ్ళిపోతుంది . మూడవ భాణము అన్ని గుర్తులు పెట్టబడిన అన్ని ఆకులకు రంధ్రము చేసి వేగముగా  కృష్ణుని కాలి వద్దకు రాసాగెను ఆవేగమునకు భయభ్రాంతుడైన కృష్ణుడు  తన కాలిని ప్రక్కకు తప్పించాగా అక్కడగల ఎండుటాకును కుడా రంధ్రం చేసి తిరిగి అమ్ములపొదిలో చేరిపోతుంది . కృష్ణుడు ఆ ఆకును ప్రయత్నా పూర్వకంగా దాచి భాణముల శక్తిని పరీక్షింప దలిచెను . దీని వల్ల కృష్ణునికి భభ్రువాహనుని నుండి శత్రువులు తప్పించుకోలేరని అవగతం అవుతుంది . |

అతని తల్లి వద్ద పొందిన వరప్రభావం గురించి తెలుసుకోగోరుతాడు కృష్ణుడు . దానికి భభ్రువాహనుడు తన తల్లి వోడిపోయే వారిని గెలిపించాలనే వరం యిచ్చినట్లుగా చెప్తాడు . మహాభారత యుధ్ధం లో పాండవుల సైనిక బలం తక్కువ కాబట్టి వారికి సహాయపడి వారిని గెలిపించాలనేది తన అభిమతమని చెప్తాడు .

భభ్రువాహనుని వరం తెలుసుకోగానే కృష్ణునికి ఆ వరం లో దాగివున్న ప్రమాదం అవగతం అవుతుంది . అదేమిటంటే కౌరవులది 11అక్షౌణుల సైన్యం , పాండవులది 7 అక్షౌణుల సైన్యం కాబట్టి భబ్రువాహనుడు తల్లివర ప్రభావముతో పాండవ పక్షం లో యుధ్ధం చేసి 11అక్షౌణుల సైన్యాన్ని నాశనం చేస్తాడు . తరువాత పాండవుల 7 అక్షౌణుల సైన్యం వుంటుంది కాబట్టి అతను కౌరవుల తరఫున యుద్ధం చేసి పాండవుల సైన్యాన్ని సంహరిస్తాడు , యీవిధంగా రెండు వైపులనుంచి కుడా భబ్రువాహనుడు యుద్ధం చేస్తాడు ఆ యుధ్ధం లో ఎవరూ మిగలరనేది కృష్ణునికి అవగతం అవుతుంది . మొత్తం యుధ్ధమంతా భభ్రువాహనుని పక్షం లోనే జరుగుతుంది , ముగుస్తుంది . యీ యుధ్ధం తో ముడిపడి వున్న అనేక యోధుల ప్రతిజ్ఞలు తీరవు . 

 యీ పరస్తితిని నియంత్రించాలంటే భభ్రువాహనుడు   జీవించి వుండకోడదు అని నిర్ణయించుకున్న  కృష్ణుడు భ్రాహ్మణ వేషధారి అయి ప్రొద్దున్న సూర్యభాగావానునికి అర్ఘ్యం సమర్పిస్తున్న భభ్రువాహనుని  దానం కావాలని అడుగుతాడు . తప్పక దానం చేస్తాననే వాగ్దానం తీసుకున్న పిమ్మట వృద్ద భ్రాహ్మణుడు భభ్రువాహనుని శిరస్సు కావాలని అడుగుతాడు . తన శిరస్సుని దానం గా పొందదలచిన భ్రాహ్మణ వేషధారి స్వయం భగవానుడే అని గ్రహించిన బర్బారికుడు తన శిరస్సు ఎందుకు కావాలని అడుగగా భగవానుడు నిజరూపధారుడై , మహాభారత యుద్ధానికి యెంచుకొనే యుద్దభూమి వీరుడు , శూరుడు అయిన వ్యక్తి రుధిరంతో పవిత్రం చేయ్యాలని చెప్తాడు .

భ్రువాహనుదు తన శిరస్సును ఖండించి యిచ్చుటకు అంగీకరిస్తాడు . కాని మహా భారతయుధ్ధం చూడాలనే యిఛ్ఛ వెల్లడిస్తాడు . భభ్రువాహనుని శిరస్సును అక్కడకు దగ్గరగా నున్న కొండపైన వుంచి మహా భారతయుధ్ధం వీక్షించే వీలుగా వుంచుతాడు . మహాభారత యుధ్దానంతరము కృష్ణుడు భభ్రువాహనుడు కలియుగం లో కలియుగకృష్ణుని గా పూజలందుకుంటాడని వరమిస్తాడు . కాలాంతరాన ఆ ప్రదేశం అడవిగా మారిపోయింది . భభ్రువాహనుని శిరస్సు అక్కడే ఉండిపోయింది . అప్పటినుంచి అతనికి మహాదాని శిరోదాని అనేపేరు వచ్చింది .

 పదవ శతాబ్దం లో యీ ప్రాంతాన్ని పరిపాలించిన రూపసింఘ్ చౌహాన్ భార్య నర్మద కవర్ కి ఓ రోజు కలలో కనిపించి తన శిరస్సు వున్న ప్రదేశం చెప్పి అక్కడే తనకు మందిరం నిర్మించమని చెప్పినట్లు గా ఆమె రూపుసింఘ్ కి చెప్పగా , అతను మంత్రులు సైనికాధికారులను తీసుకొని కలలో చెప్పిన ప్రదేశంలో వెతుకగా వొక నీటికొలనులొ శిరస్సు దొరికిందిట . రూపుసింఘ్ దొరికిన శిరస్సు గురించి తన పురోహితులని అడుగగా వారు పురాణాలలో గల భభ్రువాహనుని కధను వివరంగా చెప్పేరుట . రూపుసింఘ్ ఆప్రదేశం లో మందిరం నిర్మించేడు . 1720 లలో మర్వాడ్ ప్రాంతాన్ని పరిపాలించిన దివాన్ అభయసింఘ్ యీ మందిరాన్ని పునః నిర్మించేడు .

 యిక్కడ వున్న మిగిలిన దర్శనీయ స్థలాలు

  1) గౌరీ శంకర మందిరం 

 యీకోవెల యెవరిచే నిర్మించ బడిందో అన్నదానికి ప్రామాణికాలు దొరక లేదు , గాని యీ కోవెల గురించి వో చిన్న కధ తెలిసింది . ఔరంగ జేబు కాలంలో అతని సైనికులు హిందూ మందిరాలని ద్వంశం చేస్తున్న సమయంలో యీ శివలింగాన్ని కొందరు మొఘల్ సైనికులు బల్లెంతో పెకిలించడానికి ప్రయత్నించగా బల్లెం శివలింగానికి తగలగానే శివలింగం  నుంచి నెత్తురు ఆగకుండా స్రవించసాగిందట అది చూసి సైనికులు భయపడి పారిపోయేరుట . శివలింగం మీద బల్లెం దెబ్బ యీరోజుకి వుంది .

   2) శ్యాం కుండం 

  యీ కుండం లోనే భభ్రువాననుని శిరస్సు దొరికిందట . ఫాల్గుణ శుక్ల ద్వాదశి మంగళ వారం నాడు కృష్ణునికి శిరస్సును దానం గా యిచ్చిన రోజు కావున ప్రతి సంవత్సరం ఫాల్గుణ శుక్ల ద్వాదశి నాడు నిషాన్ యాత్ర యిక్కడ జరపుతారు . 

  3) శ్యాం బాఘ్ 

 యిందులో ఆలుసింఘ్ జీ సమాధి వుంది .

 రాజస్థాన్ , హర్యానా లలో ఖఠు శ్యాం భక్తులు ఎక్కువగా వున్నారు . ఇతనిని పూజించే వారికి యెప్పుడూ జీవితం లో ఓటమి యెదురవదని స్థానికుల నమ్మకం .

 యిదండీ త్రిభాణధారి కధ . రాజస్థాన్ టూరు కి వెళ్ళేవాళ్లు ఖఠుశ్యాం ని దర్శించుకొని తరించండి 

మరిన్ని వ్యాసాలు

పాలెగాళ్ళు.
పాలెగాళ్ళు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
సినిమా గీతాలలో  షెహనాయ్ వాద్యం.
సినిమా గీతాలలో షెహనాయ్ వాద్యం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు పలువురికి -3
పురాణాలలో ఒకే పేరు పలువురికి-3
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
108
108
- శ్రీరామ్ లక్ష్మీనారాయణ మూర్తి