'ఆముక్తమాల్యద'
(గత సంచిక తరువాయి)
గోదాదేవి విరహము అహరహము కొనసాగుతున్నది. వేదన పెరిగిపోతున్నది. ఆమెను చెలికత్తెలు ఆటపట్టిస్తున్నారు. ఒక చెలికత్తె యిలా అంటున్నది. అద్భుతమైన సుకుమారమైన భావనల మేళవింపు, శబ్ద సౌందర్యము, వర్ణనా చమత్కృతులను రాశులుగా పోశాడు యలవారు ఈ పద్యంలో.
నఖముఖోఝ్జిత పరాఙ్ముఖ ముక్త బాష్పాంబు
పటిమ దీపపు జిటచిటలు దెలుప
పొరినుపాంశూత్సృష్ట ఫూత్కృతుల్కృశమధ్య
పార్శ్వముహుః ప్రకంపనలు తెలుప
నొదవెడుగాద్గద్య మదరిపాటునఁ బల్క
రింపఁ బుట్టెడు కేకరింత తెలుప
వలవంత విసువు కాంతల పుట్టు దూషించు
కారణంబుల తొంటి కథలు తెలుప
నలఁతఁ బానుపుపైఁ బొరలాట తెలుపఁ
దెగువ లోలోననే నవ్వు నగవు తెలుపఁ
గలఁక మామీఁదిపనిలేని కసరు తెలుపఁ
బొలఁతి రేలు నీయున్కియే పులుగుగాదె
ప్రక్కకు తిప్పుకున్న ముఖము నుండి కారుతున్న కన్నీటిని కొనగోటితో విదిలిస్తున్నపుడు ఆ కన్నీటి బిందువులు దీపజ్యోతిమీద పడి చిటచిటలాడుతుంటే కన్నీటి పటిమ తెలుస్తున్నది, చిటచిటలు తెలుస్తున్నాయి. ఏకాంతములో విడుస్తున్న నిట్టూర్పుల ఫూత్కారములు కృశించిన నడుము అదిరిపడుతుండడంవలన తెలుస్తున్నాయి. ఎవరైనా పిలిచినప్పుడు ఉలికిపాటుతో గొంతును సవరించుకుని జవాబివ్వడం గద్గదికమును దాచిపెట్టడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలుపుతున్నది. స్త్రీ జన్మను నిందిస్తూ అంతకుముందు చెప్పిన కథలు విరహతాపముతో వచ్చిన విసుగును తెలుపుతున్నాయి. పానుపుమీద పొర్లడం వలన లోలోపలి నలత, కలత తెలుస్తున్నది. విరక్తిగా లోలోన నవ్వుతున్న నవ్వు మొండితనాన్ని తెలుపుతున్నది. విసుగును చిరాకును ఉత్తుత్తిగా మామీద కసురుకోవడమే తెలియజేస్తున్నది. ఓ మగువా! గోదా! రాత్రులలో నీ ప్రవర్తనయే గుర్తు గదా (నువ్వు శ్రీహరి వలపులోపడ్డావు అని) అని ఆ చెలికత్తె ముగించగానే మరొక చెలికత్తె అందుకున్నది.
ఎరుగరుగా యొకద్భుతము నీ చెలి దీర్ఘికఁ దీర్థమాడ నా
యరుతఁ దగిల్చి పోవుఁ దన హారము వోయిన నేను బోవుదున్
మరువక వెంటఁ బోవ జలమగ్నత నౌ నది సున్నమైనఁ దాఁ
గరకరిపెట్టి సొమ్మడుగు గాని నిజార్తి యెరుంగ దేమియున్
మీకొక విచిత్రము తెలియదుగా! చెబుతాను వినండి. ఈ చెలియ (గోదాదేవి) పెద్ద దిగుడుబావిలో స్నానం చేయడానికి వెళ్తూ ఆమె కంఠహారాన్ని నా మెడలో ( నా అరుతన్) వేసి వెళ్ళింది. నేనూ స్నానం చేయడానికి వెళ్లాను. వెళ్లి నీళ్ళలోకి దిగగానే ఆ హారం పెట్లిపోయి పొడుము పొడుము అయ్యింది, అంతవరకూ ఆమె శరీర తాపానికి ఎండిపోయి ఫెళుసుగా ఉన్నది మరి. విరహముతో అంతగా కాగిపోతున్నది ఆమె! సరే, తన హారము తన తాపంచేత పొడి పొడి అయితే, 'నా హారాన్ని ఎలా నీకిచ్చానో అలానే నాకివ్వు' అని నన్ను బాధిస్తుంది కానీ, విరహముతో తను ఎంత బాధపడుతున్నదో తెలుసుకోదు ఎంత చోద్యమో! అన్నది ఈ చెలికత్తె. మరొక చెలికత్తె అందుకున్నది.
అనిన మరాళి పల్కు వినవా హరిణీ యొకనాడు కస్తురిం
గొని యిడు బొట్టు నా కనుచుఁ గూర్మి నొసంగినఁ బెట్టుచుండఁ జు
ర్రనుచు మొగంబు వ్రేసినటు లౌ తనయూర్పుల నింకి యింకి పో
యిన పలుబేంట్లు గోరఁ గొని యెత్తనె పట్టెను మాటిమాటికిన్
మరాళి అనే ఈ చెలికత్తె యిలా అంటున్నది. 'హరిణీ! యిది వినవే. ఒకరోజు కస్తూరి తీసుకుని నాకు బొట్టుపెట్టుమని చనువుగా అడిగింది. రేనని బొట్టు పెట్టడం ప్రారంభించానా, ముఖం మీద కస్తూరి బొట్టు పడ్డది పడ్డట్టు చుర్రుమని ఇంకిపోతూనే ఉన్నది, వేడి పెనం మీద పడ్డట్టు, న ట్టూర్పుల వేడికి. ఇంకిపోయి బీటలు బారిన ఆ కస్తూరి బొట్ల పెచ్చులను మాటిమాటికి గోటితో లేపి తొలిగించడమే పట్టింది, యింక బొట్టు ట్టడమా ఏమన్నానా? యిలా చెలికత్తెలు ఒకరితర్వాత మరొకరు గోదమ్మను గోలపెడుతున్నారు.
(కొనసాగింపు వచ్చే సంచికలో)
***వనం వేంకట వరప్రసాదరావు