సామాజిక సమస్యల పట్ల సామాన్యులు స్పందిస్తే, కళాకారులు ప్రతిస్పందిస్తారు. ప్రతి ఒక్కరిలో చైతన్యం కలిగిస్తారు.... తన గాన మాధుర్యంతో శ్రోతలను మంత్ర ముగ్ధుల్ని చేసే ఘజల్ శ్రీనివాస్ ఎక్కడే సమస్య తలెత్తినా పరిష్కారం దిశగా పదిమందిని కూడగట్టడంలో ముందుంటారు... అదే క్రమంలో ప్రస్తుతం సమాజాన్ని అట్టుడికిస్తోన్న, విద్యాకుసుమాల జీవితాలను అర్ధంతరంగా చిదిమేస్తోన్న రాగింగ్ రక్కసిపై తన గళాన్ని ఎక్కుపెట్టారు....పదునైన సిరాశ్రీ సాహిత్యాన్ని తోడుగా తీసుకొని ర్యాగింగ్ వ్యతిరేక ఉద్యమానికి పెద్ద ఎత్తున శ్రీకారం చుట్టారు. ఇకపై ఎవరూ ర్యాగింగ్ రక్కసికి బలైపోకుండా విశ్వప్రయత్నాలు చేస్తున్నారు...
ప్రత్యేకంగా ఒక వీడియో సీడీని రూపొందించారు. ఈ వీడియో సీడీని శ్రీ నగర్ కాలనీలో బుధవారం రాత్రి ఏపీ విద్యా శాఖ మంత్రి శ్రీ గంటా శ్రీనివాస్ రావుగారి ఆధ్యర్యంలో ఘనంగా ఆవిష్కరించారు. ఒక బాధ్యత గల పౌరులుగా సామాజిక అభివృద్ధిని కాంక్షించి చేసిన వీరి ప్రయత్నాన్ని గంటా అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ అవంతి శ్రీనివాస్, గాయకులు సతీష్ కుమార్ పాల్గొన్నారు.
3000 మంది ఉండే ప్రతి పల్లెటూరికి ఒక పోలీస్ స్టేషన్ ఉన్నప్పుడు 5000 మంది ఉండే కాలేజీకి పోలీస్ స్టేషన్ ఎందుకు ఉండ కూడదనేది ఘజల్ శ్రీనివాస్ ఆలోచన. ర్యాగింగ్ బాధితులకు అండగా నిలిచే యాప్ ను రూపొందించే ప్రయత్నంలో ఉన్నారు. ఈ విషయమై మంత్రి గంటా శ్రీనివాసరావుతో సంప్రతించగా వారు స్పందించి, తమ వంతు ప్రోత్సాహాన్ని అందిస్తామని మాటివ్వడం ముదావహం. ఆట కాదురా ఇది ఆటవికం అంటూ సిరాశ్రీ రాసిన ఈ పాట, ఘజల్ శ్రీనివాస్ గళంలో ప్రతి ఒక్కరి మనసునూ కదిలించేదిగా, ఆలోచింపజేసేట్లుగా సాగుతుంది.
ఇది గోతెలుగు......ఇదిగో.....తెలుగు అంటూ ఘజల్ శ్రీనివాస్ గోతెలుగుకి ప్రారంభ గీతాన్ని అందించిన సంగతి విదితమే....
ఘజల్ శ్రీనివాస్, సిరాశ్రీలతో తో ప్రత్యేక అనుబంధం కలిగిన గోతెలుగు ఈ ప్రయత్నాన్ని హర్షిస్తోంది..ఈ ఉద్యమం విశ్వవ్యాపితమై ర్యాగింగ్ భూతాన్ని అంతమొందించాలని కోరుకుంటోంది.