అవీ - ఇవీ - భమిడిపాటి ఫణిబాబు


 

మా చిన్నతనంలో ఇప్పుడున్నన్ని ప్రసార సాధనాలూ, మాధ్యమాలూ ఉండేవి కావు. మహా అయితే, వార్తాపత్రికలూ, రేడియోనూ. దేశంలో జరిగిన సంఘటనల గురించీ, మిగిలిన వార్తల గురించీ తెలిసికోవాలంటే , ఈ రెండే దిక్కు. పోనీ అవైనా అందరికీ అందుబాటులో ఉండేవా అంటే, ఏదో ఆర్ధిక స్థోమత ఉన్నవారిళ్ళల్లోనే ఉండేవి. మిగిలిన వారందరికీ, ఊళ్ళో ఉండే గ్రంధాలయాలూ, పంచాయితీ బోర్డు వారు, లౌడ్ స్పీకర్లతో, పార్కుల్లో ఉండే రేడియోల ద్వారానే తెలిసేవి. పైగా ఆ పత్రికలు కూడా, నగరాల్లో తప్పించి, మిగిలిన ప్రదేశాలకి, మర్నాటి సాయంత్రాలకే వచ్చేవి. ఈ మాధ్యమాల ద్వారా తెలిసికున్న విషయాల ప్రభావంతోనే, జనాలు కూడా, వారి వారి అభిప్రాయాలు ఏర్పరుచుకునేవారు.. సినిమాల్లో చూపించే  వార్తా చిత్రాలు  (  News Reel )  చూసి, దేశంలో జరిగే, మిగిలిన విశేషాలు  తెలిసికునేవారు.

ఎప్పుడైనా, స్కూల్లోనో, ఆటల సమయంలోనో, స్నేహితుల ద్వారా కొన్ని విషయాలు తెలిసేవి. వాటిల్లో, ఏదైనా మంచి విషయం లాటిదాన్నిగురించి, ఇంట్లో ఎప్పుడైనా చెప్పినా, ఏమీ గొడవ ఉండేది కాదు. కానీ, కర్మకాలి, ఎటువంటి అశుభవార్త చెప్పేమా, చివాట్లు పడేవి.  “ ఎందుకురా ఊళ్ళో గొడవలన్నీనూ… పైన తదాస్థు దేవతలుంటారు…” అని , కోప్పడేవారు.  పైగా అర్ధం పర్ధంలేని విషయాలగురించి, మాట్టాడే వయసు లేదని కూడా అనుకునేవారు. దానితో, అలాటి విషయాల గురించి మళ్ళీ మాట్టాడితే ఒట్టు. అక్కడికేదో, ప్రాపంచిక విషయాలు తెలిసికోకూడదని కాదు, ఏదైనా మంచి విషయం గురించి మాట్టాడితే, ఇంటి వాతావరణం కూడా  ప్రశాంతంగా ఉంటుందని, ఆరోజుల్లో పెద్దల అభిప్రాయం.  అలాగే పెరిగి పెద్దయ్యాము,

ఆ రోజుల్లో వచ్చే సినిమాలు కూడా, అలాగే ఉండేవి. వినోదానికి వినోదమూ, నీతిబోధలకి నీతి బోధలూ, పురాణాలూ, దేశభక్తి విషయాలూ… వీటి గురించే వచ్చేవి.. ఆసక్తీ, ఓపికా ఉంటే నేర్చుకోవడమూ, లేకపోతే ఒదిలేయడమూ. సినిమాల వల్ల పాడైపోయిన వారి గురించి మాత్రం ఎప్పుడూ విన్నట్టు గుర్తులేదు. మహా అయితే, ఏదో సినిమా చూసి, తనూ, ఓ గొప్ప హీరో అయిపోదామని, చెప్పకుండా, ఇళ్ళనుంచి పారిపోయిన కేసులే ఉండేవి.. వారివారి అదృష్టాల బట్టి, పైకి వచ్చేవారూ, లేదా అధోగతికి వెళ్ళేవారు. ఎవరి గొడవ వారిదీ…

కాలక్రమేణా, ప్రసార మాధ్యమాలూ పెరిగేయి. శాటిలైట్  టీవీ ల ధర్మమా అని, ఇప్పుడు, ప్రతీ ఇంట్లోనూ వందలాది దేశ, విదేశాల చానెళ్ళు.  ఇంగ్లీషు, హిందీకీ సాయం, ప్రతీ ప్రాంతీయభాషకీ  వేరు వేరు చానెళ్ళు. ఒక్కో భాషకీ, కనీసం ఓ డజను చానెళ్ళు. ఒకరితో ఒకరికి పోటీ. వీటిలో కొన్ని, సినిమాలకి, కొన్ని వార్తలకీ ప్రత్యేకం. వచ్చిన గొడవల్లా, వినోదం పేరుతో, మన ఇళ్ళల్లోకి వచ్చేసిన   Entertainment Channels.   వీటిల్లో so called  Family Serials  అనేవున్నాయే, మొదలెడితే, కనీసం ఓ రెండుమూడు వందల వారాల దాకా మన ప్రాణం తీస్తూనే ఉంటాయి.  సినిమాలే నయం- ఓ రెండు మూడు గంటల్లో “ శుభం “ చెప్పేస్తారు. అక్కడికేదో, మన భాషలో తక్కువయినట్టు, హిందీ సీరియళ్ళని “తెలిగించి”  మనల్ని హింసించడమే వారి ఉద్దేశ్యం లా కనిపిస్తోంది.. పోనీ, బయటకెళ్ళి సినిమాలు చూడక్కర్లేకుండా, ఇంట్లోనే వినోదం అందిస్తున్నారాని సంతోషిద్దామా అంటే, వాళ్ళు చూపించేది చూసి, ఇళ్ళల్లో ఈ సీరియల్స్ కి  addict  అయిపోయిన, మన బాల, యువ, వృధ్ధ  ప్రేక్షకుల కి ఎక్కడలేని ఆలోచనలూ పుట్టుకొచ్చేస్తున్నాయి.

దీనికి సాయం, పట్టణాల్లోనూ, పల్లెల్లోనూ జనాల వేషధారణ, మాట తీరూకూడా మారిపోయింది. ఏదైనా సంఘటన జరిగినప్పుడు, మన వార్తా చానెళ్ళవాళ్ళు, చేతిలో ఓ మైక్కు పట్టుకుని ఇంటర్వ్యూ చేస్తూంటారు—వాళ్ళ మాటలు వింటోంటే, అక్కడ ఏదో విషాద సంఘటన జరిగినట్టు ఛస్తే అనిపించదు, ఏదో  సినిమాకి షూటింగు జరుగుతున్నట్టే కనిపిస్తుంది. ఇంక రాజకీయ నాయకుల విషయం అడగక్కర్లేదు. ప్రతీ అల్లాటప్పాగాడూ, ఓ కండువా వేసేసికోవడం, నోటికొచ్చినట్టు మాట్టాడ్డం. ఈ నాయకులు శాసనసభల్లో చేసే నిర్వాకం,ప్రత్యక్ష ప్రసారాలు కూడానూ. ఈ దౌర్భాగ్యపు సీరియళ్ళూ, నాయకుల నిర్వాకాలూ చూసి, నేటి యువత , ఏదో పాడైపోతున్నారని ఏడిస్తే ఉపయోగమేమిటీ?

ఈ రోజుల్లో వచ్చే పత్రికలు చూడాలంటే భయం. ఏ పేజీలో చూసినా, ఏదో ఒక దుర్వార్తే.   దేశవిదేశాల్లో జరిగే ప్రతీ సంఘటనా, అందరికీ, నిముషాల్లో తెలుస్తోంది, టెక్నాలజీ ధర్మమా అని.  మంచికంటే, చెడుకే ప్రాధాన్యం ఇస్తున్నారు. కానీ అదే టెక్నాలజీ ఉపయోగించి,  యువత ని మంచిమార్గంలో కూడా పెట్టొచ్చని, మన ప్రసార మాధ్యమ యాజమాన్యానికి ఎప్పుడు తెలుస్తుందో ఆ భగవంతుడికే తెలియాలి.

సర్వేజనా సుఖినోభవంతూ…

 

మరిన్ని వ్యాసాలు

సినీ అప్సరస గీతాలు .
సినీ అప్సరస గీతాలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
వివేకానంద రాక్ మెమోరియల్ స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
- కుందుర్తి నాగబ్రహ్మచార్యులు
Kanyakumarilo vunna tiruvalluvar vigraham nirmana charitra
తిరువళ్లువర్ విగ్రహం నిర్మాణ చరిత్ర
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు