అలామొదలైంది - ..

ala modalindi

చందమామతో మొదలైన నా పుస్తక పఠనం..వారపత్రికలు, మాసపత్రికలతో విడదీయలేని బంధమేర్పడింది. సాహితీ పఠనం అనే మంచి వ్యసనం ఎక్కడిదాకా వెళ్లిందంటే మా నాన్నగారి ఉద్యోగరిత్యా హెచ్ ఎ ఎల్ కాలనీలో ఉండేవాళ్లం. అక్కడ లైబ్రరీలో గంటలు గంటలు గడిపేవాణ్ని. అన్ని పత్రికలనీ, నవల్లనీ కళ్లతో జుఱ్ఱుకుని మెదడులో దాచుకుని మురిసిపోయేవాడిని, వీరేశలింగంపంతులు, విశ్వనాథ సత్యనారాయణ, చలం, కొడవటిగంటి, డా"కొమ్మూరి వేణుగోపాల్రావు, రావూరి భరద్వాజ, ముప్పాల రంగనాయకమ్మ, యద్దనపూడి సులోచనారాణీ, వాసిరెడ్డి సీతాదేవి ఇలా ఒకరనేంటి అందరి రచనా సంవిధానాలనీ, కన్యాశుల్కం, అసమర్థుని జీవితయాత్ర, వేయిపడగలు, కాంతం కథలు, అమరావతి కథలు ఇలా ఒకటనేంటి అన్ని పుస్తకాలనీ మనసు లైబ్రరీలో పదిలపర్చుకున్నాను. ఒకసారి ఏమైందంటే..’నాయనా మన లైబ్రరీలో నువ్వు చదవడానికి ఇంక ఏవీ లేవు..ఒక్క డిక్షనరీలు తప్ప’ అని చేతులెత్తేశాడు రంగారావు ద లైబ్రేరియన్. పుస్తక పఠనం విపరీతంగా అలవాటైన నేను దిక్కుతోచక కొని చదవడం మొదలెట్టాను(ఇదంతా చదువుకునే రోజుల్లోనేనండోయ్..పాకెట్ మనీతో కొనుక్కునే వాణ్ని). తమ రచనలతో ప్రభావితం చేసి, నన్ను కలం పట్టేల స్ఫూర్తినిచ్చింది మాత్రం యండమూరి, మల్లాది, సూర్యదేవరగార్లు..దాంతో ’మనమెందుకు రాయకూడదు’ అని రాయడంలో అ ఆ ఇ ఈ (A B C D ల బదులు తెలుగు ప్రయోగం)లు తెలియకుండానే కాగితాల మీద అక్షర కసరత్తులు ప్రారంభించాను.

కానీ ఎలా పంపాలో తెలియదాయే! అయినా సరే పత్రికలకి పంపించి.. విడుదలైన పత్రికల్లో నా పేరు ఉందేమో చూసుకునేవాడిని(ఎంత అత్యాశో చూడండి!) రెండు వారాల్లో పోస్ట్ మేన్ రిటర్న్ కవర్లు ఇంట్లోవున్న నా ముఖం మీద విసిరికొట్టేవాడు. నిరుత్సాహం..నిలువెల్లా నిరుత్సాహం. ఇలా అలెగ్జాండరు దండయాత్రలా..రచనలతో పత్రికల మీద దాడి చేస్తూ..ఓడిపోతూ..సాగు..తుం..టే. ఒకసారి ఆంధ్రసచిత్రవారపత్రికలోని డా||కొత్త రవీంద్రబాబుగారి ముఖాముఖిలో ‘సమాజాన్ని మార్చే శక్తి సాహిత్యానికి ఉందా?’ అన్న నా ప్రశ్న ఉత్తమప్రశ్నగా ఎంపికయింది. దానికి గానూ ఆయన నవల ‘చిరు సిగ్గేసింగారం’ బహుమతిగా ఇవ్వడమే కాక ఆర్నెళ్లపాటు ఆంధ్రసచిత్రవారపత్రిక ఉచితంగా వచ్చింది. ‘ఏంటి బాబూ మీరు రచయితా..కాంప్లిమెంటరీ కాపీలు వస్తున్నాయి..మన కాలనీలో ఒక రచయిత ఉన్నందుకు ఆనందంగా ఉందండీ’ అదీ మొట్ట మొదటి ప్రశంస నేను మా పోస్ట్ మేన్ నుంచీ అందుకున్నది. దాంతో నాలోని రచయిత జూలు విదిల్చాడు. కానీ రచనలు పంపడం..తిరిగిరావడం షరామామూలే! మళ్లీ నిరాశ. ఆ తర్వాత నా మొట్ట మొదటి కథ ‘డీడీర్ ఉగాది పచ్చడి’ ఆంధ్రసచిత్రవారపత్రికలో ఎంపికవడం..ఉగాది ప్రత్యేక సంచికలో ప్రచురించబడడం ఒక గొప్ప జీవితకాల మధురానుభూతి.

ఆ తర్వాత ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రికలో నా కథ ‘మామిడి పండు’ ప్రచురితమైంది. తర్వాత్తర్వాత ఇతర పత్రికల్లో ప్రచురించబడడమూ మొదలయ్యాయి. ఇప్పుడంటే అంతర్జాల పత్రికలతో సహా రచయితల కోసం ఎన్నో వేదికలున్నాయి. అప్పుడేవి? నన్ను బాగా ప్రోత్సహించింది మాత్రం గోతెలుగు(దాదాపు యాభై కథలు ప్రచురితమయ్యాయి). కొత్తరచయితలను వెన్నుతట్టి కలం పట్టించేది గోతెలుగు మాత్రమే అన్నది నిర్వివాదాంశం. నా రచనా వ్యాసంగపు మొదట్లో గోతెలుగు ఉండుంటే రచయితగా ఈపాటికి ఉత్కృష్ట స్థాయిలో ఉండేవాణ్ని. ఎప్పటికైనా రచనలు తిరిగిరాని పరిణతి పొందిన స్థితికి చేరుకోవాలని నా ఆకాంక్ష. రచయిత అనేవాడు మనుషుల్ని, పరిసరాల్ని నిరంతరం పరిశీలిస్తూ, ‘మనం రాసిన దానికి పాఠకుడు ఎలా స్పందిస్తాడు?’ అని పాఠకుడి వైపున ఉండి ఆలోచిస్తే రచనల్లో నాణ్యత చోటుచేసుకుంటుంది. గుర్తింపు తీసుకొస్తుంది. అప్పట్నుంచీ..ఇప్పటి వరకూ ఎంతో మంది ఎడిటర్లు నా రచనలు ప్రచురించి ప్రోత్సహించారు. వాళ్లందరికీ ఈ సందర్భంగా వినయపూర్వక కృతజ్ఞతలు. మొదట్లో, పత్రికలో నా రచన పడడం కుతూహలంగా ఉండేది. రాను రాను నిబద్ధతతో, సమాజహితంగా, ప్రయోజనాత్మకంగా, నిర్మాణాత్మకంగా రచనలు చేసి సాహితీ ప్రపంచంలో నాదైన, గుర్తింపు పొందిన కొంత స్థలం సంపాదించుకునేలా ఆశీస్సులు అందించాలని అక్షరజ్ఞాన ప్రసాది సరస్వతీదేవికి నా విన్నపం. అక్షరజ్ఞానం ఉండడమూ, అది రచనల పేరుతో అందరితో పంచుకోవడమూ ఆ కళలతల్లి అయాచితవరమే, ఖచ్చితంగా నా పూర్వజన్మ సుకృతమే!

- ప్రతాపవెంకట సుబ్బారాయుడు  

 

మరిన్ని వ్యాసాలు

సినీ అప్సరస గీతాలు .
సినీ అప్సరస గీతాలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
వివేకానంద రాక్ మెమోరియల్ స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
- కుందుర్తి నాగబ్రహ్మచార్యులు
Kanyakumarilo vunna tiruvalluvar vigraham nirmana charitra
తిరువళ్లువర్ విగ్రహం నిర్మాణ చరిత్ర
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు