పరమ శివుని పూజలందుకున్న మహా గణపతి - -కర్రా నాగలక్ష్మి

పరమ శివుని పూజలందుకున్న మహా గణపతి

వినాయక చవితి ప్రతీ ఏటా మనం హిందూ పంచాజ్ఞం ప్రకారం భాద్రపద శుక్ల చవితి నాడు జరుపు కోడం అనాదిగా హిందువులకు వస్తున్న ఆచారం . వినాయక చవితిని భారత దేశ వాసులు జాతి మత  బేధాలు లేకుండా జరుపుకుంటారు అంటే అతిశయోక్తి కాదు . పెద్ద బొజ్జ , ఏనుగు తల , గుజ్జురూపం , ఎలుక వాహనం గా గల  వినాయకుడు భారత దేశం లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా పూజలందు కుంటున్నాడు . విదేశాలలో ఎలిఫెంట్ హెడ్ గాడ్ అని హిందూ బుద్ధ అని పిలుస్తూ వుంటారు . పరమేశ్వరుడు గణాసురుని తపస్సుకి మెచ్చి అతనికి సత్వ , తమో , రజో , గుణాల వలన జన్మించిన వారినుండి మరణము లేనట్లు వరం పొందుతాడు . గణాసురుని వధించేందుకు వినాయకుని పార్వతీ దేవి నలుగు పిండితో తయారు చెయ్యడం , తరువాత శివుని కోపానికి గురై శిరస్సు ఖండించబడి పార్వతీ దేవి అభ్యర్ధన మేరకు శివుడు గజాసురుని తలను వినాయకునికి అతికించి ప్రాణం పోయడం మనకందరికీ తెలిసినదే .

విద్యకి , విజ్ఞానానికి , వినయానికి అధిపతి వినాయకుడు . ఏ కార్యం తలపెట్టినా ముందుగా పూజ లందుకోనేది వినాయకుడే అనడంలో అతిశయోక్తి కాదు . మనస్సులో తలచుకున్నంత మాత్రాన విఘ్నాలు తొలగించి విజయాన్ని చేకూర్చే దేముడు అనడం లో తప్పులేదు . వినాయకుని పుజించేవారికి అనేక శక్తులు సిద్ధిస్తాయి .

వినాయకుని అధీనం లో తంత్ర విద్యలైన అభిసార విద్యలో ఆరు రకాల దుష్ఠ శక్తులు కుడా వున్నాయి . అందుకే వసీకరణం  , చిల్లంగి మొదలయిన దుష్ఠ శక్తుల ఉపాసకులు వినాయకుని పూజించి  యీ శక్తులను పొందుతారు  .  వినాయకునిది చిన్నపిల్లల మనస్తత్వం గా వర్ణిస్తారు .

భరత ఖండం లో శైవం , వైష్ణవం , బౌద్ధం వీటితో పాటు భ్రామ్యం ( భ్రహ్మ ని మాత్రమే పూజించేవారు ) , గణపత్యం ( గణపతి ని మాత్రమే పూజించే వారు )  కుడా ప్రాచుర్యం లో ఉండేవి . ఆరవ శతాబ్దం లో యీ గణపత్యం ప్రాచుర్యంలోకి వచ్చి తొమ్మిదవ శతాబ్దం లో రాజుల ప్రాపకం సంపాదించిందని శ్రీ ఆనందగిరి గారు తన  ' శంకర దిగ్విజయం ' లో రచించేరు . పదవ శతాబ్దంలో వినాయకుని ప్రత్యేకంగా కోవెల నిర్మాణాలు జరిగేయి . అలా నిర్మితమైన   మందిరాలలో ముఖ్యం గా చెప్పుకోతగ్గవి మహారాష్ట్ర లోని అష్ఠ గణపతుల మందిరాలు , తిరుచురాపల్లి లో వున్న ' ఉచ్చి పిళియార్  ( ఉచ్ఛ వినాయకుడు ) ' .  గణపత్యం అవలభించేవారు మహా గణపతి సృష్ఠికి ముందు నుండి ప్రళయాంతం తరవాత కుడా వుండే మహా శక్తి అని నమ్ముతారు .


యీ గణపత్యం దక్షిణ భారత దేశం నుంచి పశ్చిమ భారత దేశం వరకు ప్రాకి పేష్వాల పరిపాలనలో మరాఠా సామ్రాజ్యం వున్నప్పుడు , పెష్వాలు వినాయకుడిని యిష్ఠ దైవం , కుల దైవంగా పూజించేవారు .

మహారాష్ట్ర లో వినాయక చవితి పూజలు దేశ విదేశాలలో ప్రసిద్ది అని మనందరికీ  తెలిసినదే .  అలాంటి మహారాష్ట్ర లో అష్ఠ గణపతులు కొలువై వున్నారు .  యీ అష్ఠ గణపతులు స్వయంభూగా వలిసినవే . ద్వాదశ జ్యోతిర్లింగాలు , అష్ఠాదశ శక్తి పీఠాలు లాగే  అష్ఠ గణపతులు కుడా  . యివాళ మనం పూణే నగరానికి దగ్గరగా వున్న అష్ఠ గణపతులు లలో రెండింటి గురించి తెలుసుకుందాం .

1) మహా గణపతి 

2) చింతామణి గణపతి 

1) మహా గణపతి 

పూణే అహ్మద్ నగర్ రొద్దుమీద పూణే నగరానికి సుమారు 50 కిమీ. దూరం లో రంజణ్ గావ్ లో వుంది యీ మహా గణపతి ఆలయం . రంజణ్ గావ్ మహా గణపతి అష్ఠ గణపతులలొ ఆఖరుది  .

మహా గణపతి అంటే అన్ని దేవీ దేవతల శక్తిని పొంది మహా శక్తివంతునిగా మారిన వినాయకుడు అని అంటారు . ఉషః కాలానికి ప్రతీక అయిన సింధూర వర్ణము వాడు . నుదుటన అర్ధ చంద్రుని ధరించి శివుని వలే మూడు కన్నులు గలిగి , దశ తొండములు , ఇరవై భుజములు కలిగి నటవంటి మహా ఆకారుడు యీ మహాగణపతి .విష్ణు మూర్తి ఆయుధ మైన చక్రం , వరాహ అవతారం లో ఆయుధమైన గద , లక్షీ దేవికి ప్రతీక అయిన తెల్ల తామర , పాశం , శృష్ఠి స్థితి లయలకి ప్రతీక అయిన దానిమ్మ పండు , మన్మధుని చెరుకు విల్లు , పృద్వికి పరతీకగా ధాన్యం కంకు , సంపదకు ప్రతీకగా బంగారు కలశం , నీలి కలువ మొదలయినవి చేతులలో ధరించి అష్ఠ ఐశ్వర్య ప్రదాత అనేదానికి ప్రతీకగా తామర పువ్వుపై కూర్చొని సిద్ధి ని తొడపై కూర్చో పెట్టుకుని ఉంటుందిట యీ మహా గణపతి విగ్రహం . యీ విగ్రహాన్ని పేష్వా మాధవరావు కాలంలో కోవెల లోని నెల మాళిగలో దాచినట్లు చరిత్రలో వుండగా యిక్కడి పూజారులు అలాంటివేమీ లేవని అంటున్నారు . యిప్పుడు మనం దర్శించుకోనేది మూలవిరాట్టునే .

యీ కోవెల తొమ్మిది లేక పదవ శతాబ్దానికి చెందిన కోవెల . యీ కోవెల తూర్పు ముఖం గా వుంటుంది . ప్రతీ రోజు ఉదయిస్తున్న సూర్యుని కిరణాలు మహా గణపతి విగ్రహం మీద పడేటట్టుగా నిర్మాణం చేసేరు . సభా మండపం లో శివవుని మందిరం వుంది . లోపలి కోవెల పేష్వా కాలం నాటి మందిరాలను  గుర్తు చేస్తూ వుంటుంది . యిక్కడ నిత్యాన్న దానం జరుగుతూ వుంటుంది . యీ మధ్య కాలంలో కట్టిన సంతోషి మాత మందిరం కుడా చూడొచ్చు . నాలుగు సంవత్సరాల క్రిందట చేపట్టిన కోవెల పునః నిర్మాణపు పనులు యింకా కొనసాగుతున్నాయి . యిందులో భాగం గా పూణే అహ్మద్ నగర్ రోడ్డు పైకి వో పెద్ద ద్వారం కళాత్మకంగా నిర్మించేరు . ద్వారానికి రెండు వైపులా పెద్ద ఏనుగులు  భక్తులను స్వాగతిస్తున్నట్లుగా నిర్మించేరు . ద్వారం పై అష్ఠ గణపతుల పేర్లు , కోవెల వున్న ప్రదేశం పేరు ఆయా గణపతుల బొమ్మల క్రింద రాసేరు .

యిక్కడి స్థల పురాణం గురించి తెలుసుకుందాం . త్రిపురాసురుడు ముల్లోకాలను తన ఉత్పాతం తో భయ భ్రాంతులను చేస్తూ లోకకంటకుడిగా పరిపాలిస్తూ వుంటాడు . త్రిలోక వాసులు శివుని త్రిపురాసుని  సంహరించి తమని రక్షింప మని వేడుకొనగా శివుడు త్రిపురాసురిని పైకి యుధ్ధానికి బయలుదేరుతాడు . యుద్ధం మధ్యలో శివుని రధచక్రం విరిగిపోతుంది . శివుడు వోడపోయే పరిస్థితి రాగా నారద ముని శివునికి ముద్దానికి బయలు దేరినప్పుడు వినాయకుని పూజించని విషయం గుర్తు చేస్తాడు . శివుడు తన పొరపాటు తెలుసుకొని గణేషునికి మనస్సులోనే నమస్కరించి తిరిగి త్రిపురాసురుని తో యుధ్ధం చేస్తాడు , ఆయుద్ధం లో శివుడు  త్రిపురాసురుని సంరిస్తాడు . త్రిపురాసురుని సంహరించిన ప్రదేశమే భీమాశంకర్ . శివుడు విజయుడైన పిదప రంజణ్ గావ్ మహా గణపతిని  దర్శించుకొని  పూజించు కొన్నాడనేది యిక్కడి స్థల పురాణం .

2 )  చింతామణి  గణపతి

పూణే నగరానికి సుమారు 20 కిమి ..పూణే షోలాపూర్ రోడ్డు పైన ప్రయాణించిన తరువాత ఎడమ వైపుకి మరో రెండు కిలొమీటర్లు చిన్న రొడ్దు మీద ప్రయాణం చేసిన తరువాత ' థెవుర్ ' అనే పట్నం లో వుంది చింతామణి గణపతి కోవెల . యీ ఊరిని కదంబ నగరం అనికూడా అంటారు . మహాగణపతిని దర్శించుకొని తిరిగి పూణే వచ్చేదారిలో కోరేగావ్ భీమా అనే పట్నం నుంచి పంట చేల మధ్య నుంచి  9 కిలొమీటర్లు ప్రయాణం చేసి యీ థెవుర్ చేరుకోవచ్చు .

ఉత్తరాభి ముఖంగా వున్న చిన్న ద్వారం లోంచి లోపలి వెళితే సభా మండపం వుంటుంది అక్కడ నుంచి తిన్నగా లోపలి వెళితే మధ్య మండపం లో వినాయకుని స్వయంభూ విగ్రహం వుంటుంది . మధ్య మండపం చుట్టూ చిన్న చిన్న మందిరాలలో మహాదేవుడు , విష్ణు లక్ష్మి , ఆర్క వృక్షాలు , దీప స్తంభం  , ఆంజనేయుడి మందిరం వుంటాయి వెనుక వైపున ' పేష్వా వాడా ' వుంటుంది . 16వ శతాబ్దం లో పూణే నగరానికి దగ్గరా నున్న చించువాడ్ గ్రామం లో జన్మించిన శ్రీమౌర్య గోసాయి అనే గణపతి భక్తుడు ,  అష్ఠ గణపతులలొ మొదటి గణపతిగా చెప్పబడే ' మోర్ గావ్ మయూర గణపతి ' ని ఆరాధిస్తూ వినాయకుడు ప్రత్యక్షం గా అక్కడ సంచరిస్తూ వుండడం అనుభవించేడుట . శ్రీ మౌర్య గోసాయి చింతామణి గణపతిని తరచూ దర్శించుకొనేవాడుట . పేష్వా రాజులలో మాధవరావు వినాయకునికి పరమభక్తుడు . పేష్వా మాధవరావు యుద్ధానికి వెళ్ళేటప్పుడు చింతామణి గణపతి దగ్గర అనుజ్ఞ తీసుకొని వెళ్ళేవాడు . యుద్ధం జయించిన తరువాత తిరిగి దేవుని దర్శించుకొనేవాడు . యీ కోవేలకు పేష్వా మాధవరావు తరచూ వచ్చేవాడని అంటారు . అతను అక్కడ వుండే సమయం లో పెష్వావాడా లో నివశించేవాడు . పేష్వా మాధవరావు చాలా జబ్బు చేసి తుది శ్వాశ చింతామణి గణపతి సన్నిధి లోనే విడిచేడుట . పేష్వా వాడాని ప్రస్తుతం ట్రస్టు వారు వారి దినవారీ అవుసరాలకి గాను వాడు కుంటున్నారు . మధ్య మండపంలో పెద్ద గంట కనిపిస్తుంది . దీన్ని పేష్వా బాజీరావు --1 పోర్చుగీస్ వారిని జయంచిన తరువాత విజయ చిహ్నంగా తనతో తీసుకొని వచ్చి యీ కోవెలలో వుంచేడని ప్రతీతి .యిది యీ కోవేలకి సంబందించిన చరిత్ర .

యీ కోవేలకి సంబందించిన పురాణ కధ  యిలా వుంది .

ముద్గల పురాణమ్ ప్రకారం , మహారాజు అభిజిత్ రాణి గుణవతి ల పుత్రుడు రాజకుమారుడు గణ . పూర్వ జన్మ  పుణ్యం వలన అతను శివుని వద్ద అజేయుడుగను  , మూడు గుణములు ( సత్వ , రజో , తామస ) ద్వారా జన్మించిన వారినుండి మరణము లేకుండు నట్లుగను వరములు పొందుతాడు . మిక్కిలి అసూయా పరుడు , మిక్కిలి దురాశను కలిగి ఉంటాడు . తన సైన్యముతో , శివుని వరప్రభావం తో ముల్లోకాలను జయించి ముల్లోకాలను పరిపాలిస్తూ ఉంటాడు . గర్వముతో మునులను , ఋషులను బాధిస్తూ ఉంటాడు . అతని బాధలు తట్టుకోలేని ప్రజలు అతనినిగణాసురుడు అని పిలువ సాగేరు . కపిల మహర్షి వద్ద అన్ని కోర్కెలు తీర్చే అద్భుతమైన మణి గలదని ఆమణిని చింతామణి అని అంటారని తెలుసుకున్న గణాసురుడు కపిల మహర్షి ఆశ్రమానికి వెళ్లి ఆ మణిని తనకు యివ్వమని కోరుతాడు . కపిల మహర్షి చింతామణిని యివ్వ నిరాకరిస్తాడు . గణాసురుదు పెద్దల మాట పెడ చెవిని పెట్టి  కపిల మహర్షి ఆశ్రమానికి తన సైన్యముతో దండెత్తి వస్తాడు .  కపిల మహర్షి వినాయకుని గణాసురుని బారి నుంచి రక్షింప మని వేడుకుంటాడు . అప్పుడు వినాయకుడు తనలోని శక్తి తో '  సిధ్దిని ' సృష్టిస్తాడు . సిధ్ది వేయిచేతులుగల ' లక్షుడు ' అనే యోధుని సృష్ఠించి అతనిని గణాసురుని సైన్యం పైకి పంపుతుంది ' లక్షుడు ' గణాసురుని సైన్యాన్ని అంతమొందిస్తాడు . వినాయకుడు గణాసురుని వధించి ముల్లోకాలకు ముక్తి కలిగిస్తాడు .

కపిల మహర్షి కోరిక మేరకు వినాయకుడు ఆ ప్రదేశం లో  స్వయంభూ గా వెలసి చింతామణి గణపతిగా భక్తుల పూజలందుకుంటున్నాడు .     భ్రహ్మ దేవుడు విచలిత మనస్కుడై యిక్కడకు వచ్చి తపస్సు చేసుకొని స్థిర చిత్తుడైనాడనేది మరోకధ , స్థిర అనే మాట కాలాంతరాన ' థె వూర్ ' గా మారిందని అంటారు . బ్రహ్మ దేవుడు తనలోని చింతలను యిక్కడ పోగొట్టుకున్నాడు కాబట్టి చింతామణి గణపతి అని పేరు వచ్చిందని అంటారు .

దేవతల రాజైన  ఇంద్రుడు గౌతమ మహర్షి యిచ్చిన శాప విముక్తి కొరకు యీ వినాయకుని ఎదురుగా కదంబ వృక్షం కింద కూర్చొని తపస్సు చేసుకొని శాప విముక్తుడైనాడు అందుకే యీ ఊరుని కదంబ నగరి అనికూడా అంటారు .యిక్కడ ముఖ్యంగా భాద్రపద మాసం లో అమావాస్య మొదలుకొని ఏడురోజులు ఉత్సవాలు నిర్వహిస్తారు అందులో నాలుగో దినం వినాయక చవితిగా జరుపుకుంటారు .

మాఘ శుక్ల చవితినాడు గణేశజయంతి ఉత్సవాలు జరుపు కుంటారు .

యిక మూడవది రమా మాధవ పుణ్యోత్సవం . చింతామణి గణపతి కి పరమ భక్తుడైన మాధవరావు మరణించిన పిమ్మట పరమ సాధ్వి రమాబాయి సతీ సహగమనం చేసి, భర్త తో పుణ్య లోకాలకు చేరుకుంది . ఆ పుణ్య దంపతుల జ్ఞాపకార్ధం వారి పుణ్య తిథిని యిక్కడ పండగలా జరపడం ఆనవాయితీ .

పేష్వాలు మరాఠా సామ్రాజ్యాన్ని పరిపాలించేటప్పుడు పుణె వారి రాజధాని . పూణే కోట ప్రాంతం లో లెఖ్ఖకు మించి గణేష్ మందిరాలు వున్నాయి .

పూణే లో దాగుడు శేట్ గణపతి కోవెల ముఖ్యమయినది . యిక్కడ సుమారు 25 అడుగుల వినాయకుని ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహానికి పూజ జరుగుతూ వుంటుంది . వినాయక చవితికి యీ విగ్రహాన్ని కోవెల లోంచి బయట పండాల్ లో పెట్టి తొమ్మిది రోజులు పూజించి పదవరోజు తిరిగి కోవెలలో ప్రతిషిస్తారు . యిలాగే పుణె నగరం లో వందల సంఖ్యలో వున్న వినాయకుని మందిరాలలో యిలాగే చేస్తున్నారు . మూడు నాలుగు అడుగులకి మించని విగ్రహాలను మాత్రమే  నిమజ్జనం చేస్తారు . యిది పర్యావరణం దృష్ఠ్య కుడా మెచ్చుకోతగ్గ విషయం .  మట్టి వినాయకుని పూజిస్తే దేశం పాడి  పంటలతో సస్య శ్యామలం అవుతుందిట . మనం కూడా మట్టి వినాయకుని పూజించి పర్యావరణాన్ని రక్షిద్దాం .

మరిన్ని వ్యాసాలు

Maa chardham yatra
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
సినీ అప్సరస గీతాలు .
సినీ అప్సరస గీతాలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
వివేకానంద రాక్ మెమోరియల్ స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
- కుందుర్తి నాగబ్రహ్మచార్యులు
Kanyakumarilo vunna tiruvalluvar vigraham nirmana charitra
తిరువళ్లువర్ విగ్రహం నిర్మాణ చరిత్ర
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు