ట్రావెలాగ్ ఈస్ట్రన్ యూరప్: పుస్తక సమీక్ష - సిరాశ్రీ

travelogue eastren europe book review
రచన: మల్లది వెంకట కృష్ణమూర్తి
వెల: 150/-
ప్రతులకు: 040-27612244, 9849022344

ఇంగ్లీషు టైటిల్ తో ఉన్న ఈ తెలుగు పుస్తకం ఈ మధ్య విశాలాంధ్రలో నా కంట పడింది. సాధారణంగా విదేశ యాత్రల్లో తూర్పు యూరప్ దేశాలు చుట్టి వచ్చే మనవాళ్ళ గురించి పెద్దగా వినలేదు. ఆసక్తిగా అనిపించింది. రచయిత మల్లాది కనుక ఇక మారు ఆలోచించకుండా కొనేసాను. కారణం- ఇటువంటి రచనల్లో మల్లాది అనేక ఉపయోగకరమైన అంశాలు రాశిగా పోసేస్తారు. అమెరికా యాత్ర గురించి ఆయన రాసిన ఒక పుస్తకం గతంలో చదివినప్పుడు నాకా విషయం తెలిసింది.

తూర్పు యూరప్ దేశాలైన చెక్ రిపబ్లిక్, జర్మని, ఆస్ట్రియా, స్లోవేకియా, హంగరీ, పోలాండ్ ఈ పుస్తకంలో రచయిత దృక్పథం నుంచి మనకు దర్శనమిస్తాయి. ఆయా దేశాల్లో ఉండే వింతలు, విశేషాలు చదివి తెలుసుకోవడం ఒక అనుభూతి అయితే, ఏ విదేశీ యత్రకు వెళ్ళేటప్పుడైనా తీసుకోవాల్సిన అనేక జాగ్రత్తలు, గమనించాల్సిన అంశాలు ఎన్నో ఇందులో ప్రస్తావించారు.

కొత్తగా తెలుసుకునే జాగ్రత్తలు ఏముంటాయ్? పాస్ పోర్ట్ ని, పర్సుని, సెల్ ఫోన్ ని జాగ్రత్తగా చూసుకుంటే చాలు అని చాల మంది అభిప్రాయం. కానీ ఇమిగ్రేషన్ కౌంటర్ లో కొందరు పాస్ పోర్ట్ లోని ఒక పేజీని చింపేసి తిరిగి వచ్చేటప్పుడు ఇబ్బంది పెట్టి లంచాలు గుంజేవారు ఉంటారని .... ఊహకు అందని విషయాలు చెప్పి మరింత జాగ్రత్తని పెంచుతుంది ఈ పుస్తకం.

ఈ పుస్తకం చదువుతుంటే ఆపాలనిపించదు. నవలలు రాయడంలో బాగా కలం తిరిగిన మల్లాది తన శైలితో పుస్తకాన్ని మూయనీయకుండా, మడత పెట్టి పక్కన పెట్టనీయకుండా చేసారు. మొత్తం చదివాక ఒక్కసారైన తూర్పు యూరప్ దేశాలకు వెళ్ళాలనే ఉత్సాహం కలుగుతుంది. పలు పరిస్థితుల రీత్యా వెళ్ళలేకపోయినా చూసి వచ్చిన భ్రమ కలిగి సంతృప్తి కఛ్చితంగా మిగులుతుంది ఇది చదివితే.

ఒక్క యూరప్పే కాదు.. ఏ దేశానికి వెళ్ళాలనుకునే వారైనా చదవాల్సిన పుస్తకం. మరీ ముఖ్యంగా విద్యార్థులు, పిల్లలు లోకజ్ఞానం కోసం చదివి తీరాల్సిన పుస్తకం.

మరిన్ని వ్యాసాలు