అవీ - ఇవీ - భమిడిపాటి ఫణిబాబు


 

 ప్రపంచంలో  అస్సలు ఖర్చులేని పని ఏదైనా ఉందా అంటే, సలహాలు ఇవ్వడం. దీనిక్కావాల్సిందల్లా, చక్కగా మాట్టాడ్డం, కొద్దో గొప్పో మనం మాట్టాడింది విని, పొగిడే వందిమాగధుల్ని సంపాదించడం. ఏదో మొదట్లో , ఉచితంగా సలహాలూ, ఉపదేశాలూ చేస్తే, దాన్నే వ్యాపారంగా మార్చి,  కావాల్సినంత డబ్బు సంపాదించేయడం. ఓ రెండు మూడు తరాల వరకూ సరిపోయేటట్టు. అదృష్టం బాగుంటే, ఈ సలహాలు , ఉపదేశాలూ చెప్పి,  ఆ వృత్తినే  వంశపారంపర్యంగా చేసేసికుంటే, ఇంకో నాలుగు తరాలవరకూ ధోకా ఉండదు,  కాలక్రమంలో వీళ్ళే,  Consultants  అని ఓ బోర్డు కూడా పెట్టుకోవచ్చు. కావాల్సిందల్లా, మాటతీరు.

 రాజకీయనాయకులు , పుట్టగొడుగుల్లా పుట్టుకురావడానికి ఇదొక మూలసూత్రం. కావాల్సిన " ఒడుపు" పట్టుకోడంలోనే ఉంటుంది. ఆతెలివితేటలున్నవాడు, పట్టిందల్లా బంగారమే, కనీసం కొన్ని సంవత్సరాలవరకూ.  ఇదివరకటి రోజుల్లో, అంటే స్వాతంత్రం రాని ముందు, దేశ స్వాతంత్రం కోసం, ఆందోళనలు చేసీ, జైళ్ళకి వెళ్ళినవారంటే, ఓ విధమైన గౌరవమూ, భక్తీ ఉండేవి. దేశంకోసమే కదా, వారందరూ త్యాగాలు చేశారూ అని.  ఓ ముఫై సంవత్సరాలపాటు, వారు చేసిన త్యాగాలకి ఓ గుర్తింపు లభించింది. Freedom Fighters  అని వారికి కొన్ని రాయితీలు కూడా ఉండేవి. పాపం, వాళ్ళు కూడా  అల్పసంతోషులు కాబట్టి, ఆ రాయితీలూ, ప్రభుత్వం వారు ఇచ్చిన తామ్రపత్రాలతోనూ సంతృప్తి పడేవారు. అలాటి మహానుభావులు  చాలామంది కాలగర్భంలో కలిసిపోయారు, ఎక్కడో తప్పించి.


ఇంక మిగిలినవారెవరయ్యాఅంటే, కొత్తతరం రాజకీయనాయకులు. పైన చెప్పినట్టుగా, వీరికి ఉన్న క్వాలిఫికేషన్  మాట చాతుర్యం ఒక్కటే. చేతిలో ఓ మైక్కూ, వినడానికి లారీల్లో తెప్పించిన వేలాది “ వెర్రిమనుషులూ “ ఉంటే చాలు,  ఈ నాయకులు పేట్రేగిపోతూంటారు. అరచేతిలో స్వర్గం చూపించడం వీళ్ళకు వెన్నతో నేర్పిన విద్య.  ఒకవైపు ధరలు ఆకాశాన్నంటుతున్నా సరే, మనల్ని ఓపిక పట్టమంటారు. వాళ్ళు స్వర్గసుఖాలు అనుభవిస్తూనే. శాసనసభల్లో, కొట్టుకు ఛస్తూనే ఉంటారు, కనీసం నలుగురైదురు సెక్యూరిటీ లేకుండా, బయటకు కూడా రావడానికి ధైర్యం చేయరు.  ఏ పార్టీ  టికెట్ మీద నెగ్గినా ఫరవాలేదు, ఏదో కారణం చూపించి, పార్టీ ఫిరాయింపు చేయడం వీళ్ళకి నల్లేరుమీద నడకే. ఇదివరకటి రోజుల్లో, జైలుకెళ్ళాడంటే , స్వాతంత్రపోరాటంలో వెళ్ళీనవారైనా ఉండేవారు, లేదా ఏదో ఘోరమైన నేరమో చేసినవాడైనా ఉండేవాడు. కానీ, ఈరోజుల్లో జైలుకి వెళ్ళడం ఓ షికారుకెళ్ళినట్టు వెళ్తున్నారు. సినిమాల్లో చూసేవారం, అకారణంగా జైలుకెళ్ళి వస్తే, సిగ్గుతో ఆత్మహత్య చేసికునేవారు. కానీ, ఈరోజుల్లో ముందస్తు బైలూ అనే కొత్త పదం వాడుకలోకి వచ్చింది. చేసినది దౌర్భాగ్యపు పనీ అని తెలుసు, అరెస్టు చేస్తారనీ తెలుసు, అందుకేగా ముందస్తు బెయిల్ తీసికోడం. అధవా జైలుకెళ్ళాల్సొచ్చినా, అదేదో  Status Symbol  గా భావించే రోజులు. పైగా ఆ జైళ్ళలో కూడా, ఈ దౌర్భాగ్యులకి అన్నిరకాల సదుపాయాలూనూ. పోలీసులు వచ్చారూ అంటే చాలు, ఒకడు తల తిరుగుతోందంటాడు, ఇంకోడు గుండేనొప్పంటాడు. ఈలోపులో, వీడి వందిమాగధులందరూ, చేరి ఆందోళనలూ, ధర్నాలూ చేయడం. వీడికి లేనిపోని గొప్పతనం అంటగట్టడం. సమాజంలో ఓ హీరో అయిపోతాడు. మన ప్రసారమాధ్యమాలైతే, ఇలాటివాళ్ళ మీదే బతుకుతున్నాయి.రాజకీయం ఓ వ్యాపారంగా మార్చేశారు.

 ఇంకోరకం దోపిడీ,  Consultancy  ద్వారా జరుగుతోంది. ఈరోజుల్లో ప్రతీదానికీ, ఎవడో ఒకడు సలహాలిచ్చేవాడే. చెప్పానుగా ఖర్చులేని పని. పిల్లల్ని పెంచడానికి సలహాలు, వాళ్ళకి ఏ రకమైన చదువుచెప్పించాలో, ఏ బ్రాంచి తీసికోవాలో, ఏ కాలేజీలో చేరాలో అన్నిటికీ   Consultant లే.  వృధ్ధాప్యం లో ఉన్న తల్లితండ్రులనెలా చూసుకోవాలో చెప్పడానికి సలహా, ఈ సలహాలిచ్చేవాడు, తన తల్లితండ్రులని ఎలా చూశాడో, ఎలా చూసుకుంటున్నాడో బయటి ప్రపంచానికి తెలియకుండా , మానేజ్ చేసుకుంటాడు. పైగా, ఏ మాతృదినోత్సవాలకో సమావేశాలు జరిగినప్పుడు మాత్రం, తల్లితండ్రులనో, లేదా   బతికున్న తల్లినో, తండ్రినో, తీసికొచ్చి, ఓ దండ వేసి, ఓ దండం పెట్టి, ఫొటోలు తీయించుకోడమే  మాతృభక్తి గా టముకేసికుంటారు. మర్నాడు పేపర్లలో ఫొటోలూ, ఇంటర్వ్యూలూ—ఆదర్శ కొడుకూ, ఆదర్శ కూతురూ అంటూ.

 ఈ సలహాలరూపంలో డబ్బుసంపాదించే ఇంకో మార్గం- మనస్థత్వ సలహాలు. మనం ఏదో చెప్తాము, ఆ మహామహుడేమో ఏదో సలహా ఇచ్చి, ఫలానా .. ఫలానా .. మార్పులు సూచిస్తారు. ఓ నెల రోజులు మన ఆలోచనాక్రమం ఆయన చెప్పినట్టుగా ఉంటే, ఉన్న తలతిక్కతనం మారి , బాగుపడతాడంటాడు. ఇలాటివాటిని  Quantify  చేయడం కుదరదు. ఏ మందో మాకో అయితే,  రోగం తగ్గలేదండీ అనైనా అనొచ్చు. కానీ, ఈ ఆలోచనలని  ఎలా మార్పించాలో ఛస్తే తెలియదు. ఆ సలహాదారు దగ్గరకి వెళ్ళి, పోనీ చెప్పినా “ నేను చెప్పిన సలహా పాటించలేదూ..” అని చేతులు దులిపేసికుంటాడు. అందరూ, అలా ఉంటారని కాదూ, కనీసం ఇరవై శాతం తప్పకుండా ఉంటారు.

 అసలు మన ఆలోచనలు Positive  గా ఉంటే, ఈ సలహాలూ, సింగినాదాలూ అవసరమంటారా? ప్రతీ విషయానికీ, ఎవరో ఒకరి ఆసరా అవసరమైనన్నాళ్ళూ, ఈ సలహాదార్లూ, నాయకులూ రాజ్యమేలుతూంటారు. వాళ్ళ సొమ్మేం పోదు.  నాశనమయ్యేదల్లా సామాన్య మానవుడే…

సర్వే జనా సుఖినోభవంతూ…

మరిన్ని వ్యాసాలు

Maa chardham yatra
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
సినీ అప్సరస గీతాలు .
సినీ అప్సరస గీతాలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
వివేకానంద రాక్ మెమోరియల్ స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
- కుందుర్తి నాగబ్రహ్మచార్యులు
Kanyakumarilo vunna tiruvalluvar vigraham nirmana charitra
తిరువళ్లువర్ విగ్రహం నిర్మాణ చరిత్ర
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు