అవీ - ఇవీ - భమిడిపాటి ఫణిబాబు

 చిన్నప్పుడు , అంటే  ఓ  పెంకుటిల్లూ, పెరడూ, ముందు వాకిలీ, పెరట్లో ఓ పశువులపాకా, ఓ గడ్డిమేటూ  ,  నీళ్ళకి ఓ నుయ్యీ లాటివి ఉన్నరోజుల్లో అన్నమాట, ఇంటికి ఎవరైనా చుట్టాలో, స్నేహితులో చెప్పాపెట్టకుండా  వచ్చినా, సంతోషించే రోజులు. వచ్చీ రాగానే, కాళ్ళు కడుక్కోడానికి నీళ్ళూ , తుడుచుకోడానికి ఓ తువ్వాలూ ఇచ్చి, త్రాగడానికి ఓ మరచెంబులో మంచినీళ్ళూ, ఓ స్థోమతని బట్టి, కంచుగ్లాసో, ఇత్తడి గ్లాసో  ఇచ్చేవారు. భోజనాల వేళ అయితే, భోజనానికి లేవమనేవారు. ఇంత తక్కువ టైములో, ఆ వచ్చినవారికి, భోజనంలోకి ఏదో, ఓ కూరా, పచ్చడీ లేకుండా భోజనం ఎలా పెడతారూ? ఆ ఇంటి ఇల్లాలుకి ఏవిధమైన  కంగారూ ఉండేది కాదు. ఈరోజుల్లోలాగ , అతిథులు రాగానే, బజారుకి వెళ్ళి కూరా, నారా తెచ్చుకోడం కాదుకదా, హాయిగా పెరట్లో కి వెళ్ళి, సరిపడే వంకాయలో, పొట్లకాయలో, బీరకాయలో కోయడం, పప్పులోకి ఏ  నవనవలాడే ఏ బచ్చలాకులో, గోంగూరాకులో, తుంపడం. పోపులోకి మిరపకాయలూ, కొత్తిమీర కి  ఆలోచించాల్సిన పనే ఉండేది కాదు.ఊరగాయలైతే చెప్పఖర్లేదు. చిత్రం ఏమిటంటే, పుష్కలంగా అన్నీ దొరుకుతూన్న రోజుల్లో, మనం, వాటిని అనుభవించడానికి , ప్రతీ రోజూ చిరాకు పడేవాళ్ళం. “ అబ్బ ప్రతీ రోజూ ఇవేనా.. “ అని. ఆరోజుల్లో ఉండీ అనుభవించలేదు, ఇప్పుడు అనుభవించాలన్న కోరిక ఉన్నా వీలు పడడం లేదు. అందుకేనేమో “ చేసికున్నవాడికి చేసుకున్నంతా.. “ అంటారు.

ఈ రోజుల్లోలాగ ఇళ్ళల్లో  ఫ్రిజ్జిలూ, డీప్ ఫ్రిజ్జిలూ, మైక్రో వేవ్ లూ ఉండేవి కావు. గ్యాస్ పొయ్యి అంటే ఏమిటో తెలియని రోజులు. అయినా షడ్రసోపేతంగా భోజనం పెట్టేవారు. “ అన్నదాతా సుఖీభవా..” అని నోరారా, మనసారా దీవించే రోజులు. పెరట్లో ఉండే ఆ మొక్కలు పెంచడం కూడా ఓపధ్ధతిలో ఉండేది.  స్నానాలు చేసేటప్పుడు వచ్చే నీళ్ళకి, ఓ బుల్లి కాలవలాటిదిచేసి, ఆ మొక్కలకి వెళ్ళేటట్టు చేసేవారు. ఆనపకాయ, గుమ్మడికాయలకైతే, ఏ పశువులపాక మీదకో పాకించేవారు. ఎరువులూ, పురుగుమందులూ అంటే ఏమిటో కూడా తెలియని రోజులు. ఓ దొండపాదో, బీరపాదో ఉందంటే , నాలుగు కర్రలతో, చక్కగా ఓ పందిరిలాటిది వేయడమూ, ఆ పాదుని దానిమీదకు పాకించడమూ. ఉదయానే లేచి, పళ్ళు తోముకోడానికి , బ్రష్షులూ, పేస్టులూ ఎక్కడ చూశామూ? మహా అయితే, నంజన్ గూడు వారి ఎర్ర పళ్ళపొడీ, లేకపోతే హాయిగా “కచిక”. ప్రయాణాల్లో అయితే ఓ వేప్పుల్లా. ఎప్పటికప్పుడు కల్తీలేని పాలూ, తాజా కూరగాయలూ, వీటితోనే రోగాలూ, రొచ్చులూ లేకుండా హాయిగా బతికేవారు. వీటికి సాయం, పచ్చదనంతో ఉండే చెట్ల గాలికూడా, ఆరోజుల్లో ఆరోగ్యానికి దోహదపడేది.. వర్షాలూ, టైముకే వచ్చేవి.

వేసవి కాలం వచ్చిందంటే, ఇంటి ముందర, కొబ్బరాకులతో ఓ పందిరీ, ఇంట్లో , అటక కింద ఓ సరంబీ, కిటికీలకి వట్టివేళ్ళ తడకల ముందు, ఈరోజుల్లో వచ్చే  ఏసీ లు ఏ మూలకీ ? అభివృధ్ధి పేరు చెప్పి  మనం ఎన్నో, ఎన్నెన్నో పోగొట్టుకున్నాము. అలాగని అభివృధ్ధి లేకుండా, ఎక్కడి గొంగళీ అక్కడే ఉండాలని కాదు. టెక్నాలజీ తోపాటు, దాన్ని సరైన మార్గంలో ఉపయోగించాల్సిన  బాధ్యత కూడా ఉండాలి.  ఈరోజుల్లో ప్రతీదానికీ ఓ ఆటోమేటిక్ సదుపాయం ఉంది. మంచిదే, కానీ, రోజులు గడిచేకొద్దీ, జనాలు వాటిమీదే పూర్తిగా ఆధారపడే రోజులొచ్చాయి. వారానికోసారి కూరలు తెచ్చేసికుని, వాటిని ఇంట్లో ఉండే, బుల్లి, చిన్న, డబుల్ డోర్, ట్రిపుల్ డోర్ ఫ్రిజ్జిల్లో ఉంచేసికుంటే  పనైపోతుందనుకుంటారు. కానీ అవి పనిచేయడానికి  ఎలెక్ట్రిసిటీ ఉండాలిగా. ఈరోజుల్లో ఎక్కడ చూసినా, లోడ్ షెడ్డింగులూ, అవీనూ. కరెంటు ఎప్పుడు పోతుందో, ఎప్పుడు వస్తుందో తెలియని రోజులు. మరి ఇంక, ఆ ఫ్రిజ్జిల్లో పెట్టిన కూరగాయలూ, పాలూ, పెరుగూ పాడైపోకుండా ఉండమంటే, ఎలా ఉంటాయీ ? తీరా ఏ కూరో చేద్దామని చూస్తే, అవి కాస్తా కుళ్ళిపోయో, బూజుపట్టో కనిపిస్తాయి. మన ఇళ్ళల్లో వచ్చే మంచినీళ్ళు ఎలా ఉంటాయో చెప్పలేని పరిస్థితి. దానితో ఇంట్లో ఓ వాటర్ ప్యూరిఫయరు తప్పకుండా ఉండాలే.

ఈ మధ్యన ఓ కొత్తరంధి మొదలయింది. అవేవో “ ఆర్గానిక్ కూరలు “ ట. కొనేవాళ్ళున్నారు కదా అని, ప్రతీదీ—కూరగాయల దగ్గరనుండి, పప్పులూ, ఉప్పులూ, చింతపండూ, బెల్లంతో సహా ప్రతీదానికీ ఓ లేబుల్ పెట్టేసి, అయిదారింతల ఖరీదు పెంచేయడం. వాడు లేబులంటే అంటించాడు కానీ, నిజంగా ఏ ఎరువూ వాడకుండా తయారుచేశాడని  గ్యారెంటీ ఏమిటీ ? వాడు చెప్పాడు, అందరూ కార్లలో వచ్చో, ఆన్ లైన్ లోనో కొనుక్కుంటున్నారు, బస్ .  పర్యావరణమూ అలాగే తయారయింది. ఊరికే, టీవీ ల్లోనూ, Social Media  లోనూ ఊదరగొట్టడం తప్పించి, జరుగుతున్నదేమీ లేదు.  అయినా అన్నీ బాగుండి, అందరూ ఆరోగ్యంగా ఉంటే, కోట్లు ఖర్చుపెట్టి తెరిచిన కార్పొరేట్ ఆసుపత్రులు బతకొద్దూ ?

సర్వేజనా సుఖినోభవంతూ…

మరిన్ని వ్యాసాలు

Maa chardham yatra
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
సినీ అప్సరస గీతాలు .
సినీ అప్సరస గీతాలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
వివేకానంద రాక్ మెమోరియల్ స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
- కుందుర్తి నాగబ్రహ్మచార్యులు
Kanyakumarilo vunna tiruvalluvar vigraham nirmana charitra
తిరువళ్లువర్ విగ్రహం నిర్మాణ చరిత్ర
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు