అవీ - ఇవీ - భమిడిపాటి ఫణిబాబు

 

 

సాధారణంగా, ఒంట్లో బాగుండనప్పుడు, అంటే చిన్న చిన్న అస్వస్థలకి, ఏ మందుల షాపుకి వెళ్ళి అడిగినా, ఏదో మందిస్తారు.అలాటి పధ్ధతి తప్పని, తెలిసినా, ఒక్కొక్కప్పుడు , మరీ ఈమాత్రం దానికి డాక్టరుదాకా ఎందుకులే అని అభిప్రాయం. ఇదివరకటి రొజుల్లో అయితే, తలనొప్పి వస్తే, ఏ అమృతాంజనమో, కాలినొప్పి వస్తే, ఏ బెల్లం, సున్నం కట్టో, పిప్పిపన్ను నొప్పెడితే, ఏ లవంగమొగ్గో వాడితే, పనైపోయేది.”  సర్వరోగ నివారిణి”—కస్తూరి మాత్రలూ, అగ్నితుండు మాత్రలూ అయితే ఉండేవే. ఏ దగ్గులాటిది వచ్చినా, ఓ కరక్కాయ పెట్టుకోమనేవారు. మరీ చిన్నపిల్లలైతె, ఏ పటికబెల్లం ముక్కో, బుగ్గన పెట్టుకుంటే ఆ దగ్గుకాస్తా, తగ్గేది.ఇవే కాకుండా, అవేవో కొప్పి అరగదీసి, తేనెతో నాకించినా సరిపోయేది. రోగాలు కూడా సహకరించేవి. మరీ, ఏ పెద్ద అనారోగ్యమో అయితె తప్ప డాక్టర్లదగ్గరకి వెళ్ళేవారుకాదు.

కానీ, ఈ రోజుల్లో రోగాలూ ఖరీదువే, డాక్టర్లైతే అంతకంటే ఖరీదైపోయారు. ఇదివరకటిరోజుల్లో, నాడి పట్టుకుంటే తెలిసే రోగాలుకూడా, ఈరోజుల్లో సవాలక్ష టెస్టులు చేస్తేనే కానీ, బయట పడ్డంలేదు. ప్రతీదానికీ ఓ పరీక్ష. పోనీ అవేమైనా చవకలో తేలుతాయా అంటే, అదీకాదు, ఒక్కో పరీక్ష చేసేటప్పటికి వేలకివేలు ఖర్చూ. ఓ విషయం అర్ధం కాదు- ఇదివరకటిరోజుల్లో, ఏ పరీక్షలూ లేకుండా తెలిసే రోగాలు, మరీ ఇంత ఖరీదయిపోయాయీ అన్నది. డాక్టరీ చదువుల స్థాయి పడిపోయినట్టా? లేదా, కొత్తకొత్తగా వస్తూన్న విభాగాలకి కూడా, కిట్టుబాటవాలనా? లేదా జరుగుబాటా? పోనిద్దూ, మనం శ్రమపడేదేమిటీ, మన ఫ్రెండు, టెస్టు చేసి రిపోర్టు ఇస్తే, దాన్నిబట్టి వైద్యం చేయొచ్చులే, వాడూ బాగుపడతాడు, మనమూ బాగుపడొచ్చూ అనే తత్త్వమా ? అయినా ఈరోజుల్లోకూడా, కొంతమంది వైద్యులని చూస్తూంటాము, తమ పేషెంట్ల చేత, అనవసరపు ఖర్చు పెట్టించడం ఇష్టం లేనివారిని.పాపం ఇలాటివారికి, ప్రాక్టీసూ ఉండదు, గుర్తింపూ ఉండదు. వచ్చిన గొడవల్లా మనతోనే, ఎంత డబ్బు ఖర్చయితే అంత మంచి వైద్యమని భావించేవారు చాలామందే ఉంటారు.

దానికి సాయం ఈరోజుల్లో, ప్రతీ సంస్థలోనూ, అవేవో  Annual Check up  అని ఒకటి మొదలెట్టారు. ఉద్యోగికీ, తన కుటుంబానికీ, అయితే గియితే ఉన్న తల్ల్లితండ్రులకీ కలిపి. పొలో మంటూ, వెళ్ళడం, రకరకాల పరీక్షలు చేయించేసికుని, ఏమీ రోగం లేదంటే, హాయిగా ఉండడం, కాదూ అదేదో stress, లాటిదుందంటే, వైద్యం చేయించుకోడం. ఎలాగూ కంపెనీయే కదా, ఖర్చులు భరించేదీ... ఇవి కాకుండా, ఆరోగ్యభీమా పథకాలైతే ఉండనే ఉన్నాయి. పైగా ఈభీమాలలాటివిఉంటే, వైద్యుల ప్రవర్తన ఇంకోలా ఉంటుంది. ఎలాగూ కలిసొచ్చే బేరమే అనుకుని, ఓ నాలుగైదు టెస్టులు ఎక్కువ చేయించుకోమంటారు.

అన్నిటిలోకి చిత్రం ఏమిటంటే, ఓ డాక్టరు తీయించిన, xray లు, ఇంకో డాక్టరుకి కుదరకపోవడం. రాత్రికి రాత్రి ఏదైనా విరిగిన ఎముక కలిసిపోతుందా ఏమిటీ? అయినా సరే, ఆ xray angle   సరీగ్గా లేదండీ, ఈసారి ఇంకో angle  లో తీయాలి అంటారు. వీళ్ళ యాంగిళ్ళ మాట దేవుడెరుగు, వీటికయ్యే ఖర్చుచూసి, విరిగిన ఎముకతోనే లాగించేయడం చవకేమో అనే అభిప్రాయం రావడం తథ్యం.

ఇదివరకటి రోజుల్లో , ప్రయాణాలు చేసినప్పుడో, ఇంకో ఊరికి వెళ్ళినప్పుడో, దంతధావన సామగ్రీ, దేవతార్చన సామగ్రీ ఉండేవి. కానీ ఈరోజుల్లో, ఎవరిని చూసినా, ఓ ప్లాస్టిక్కు డబ్బా, దాన్నిండా రంగురంగుల మాత్రలూ, క్యాప్సూల్సూ, ఒకటేమిటి, ఓ “కదిలే మందుల షాప్పు” లా కనిపిస్తున్నారు. ఒక్కో రొగానికి, ఒక్కో టైముకి, ఒక్కో రంగు మాత్ర. ఇందులో ఏ మాత్ర  వేసికోవడం మర్చిపోయినా “ వైకుంఠ యాత్ర” తప్పదనే స్థితిలో ఉన్నారు. అన్నేసి రంగులూ, అన్నేసి మాత్రలూ ఎలా గుర్తుంటాయో పాపం ! ఈ మాత్రలతోనే కడుపు నింపుకుంటున్నారా అనిపిస్తుంది. ఇదేదో, ఇన్నేసి మందులతో జీవితాలు గడుపున్నవారిని, చులకన చేయాలనీ, హేళన చేయాలని మాత్రంకాదు, బాధపడుతూ మాత్రమే వ్రాస్తూంట. కొంతమందికి, ఏదో ఒక మందు వేసికుంటేనే కానీ తోచదు. చాన్సొస్తే వేసేసికుంటూంటారు. ఉదాహరణకి, ఏ దగ్గులాటిదానికైనా, మార్కెట్ లో ఓ మందు తీసికున్నారనుకోండి, అందులో ఉండే ఆల్కహాలు కి అలవాటు పడిపోయి, దగ్గొచ్చినా రాకపోయినా సరే, ఓ గుక్కెడు మింగేయడం. ప్రాణానికి హాయిగా ఉందండీ అంటూ సమర్ధింపోటీ.

మన జీవనవిధానంలో, ఓ క్రమశిక్షణ లాటిది పాటిస్తే, అసలు గొడవే ఉండదుగా.  ఏమైనా అంటే, టైమే ఉండడంలేదండీ అంటూ ఓ “వంక” చెప్పేస్తారు. నిజమే కాబోసనుకుంటాము. ఇదివరకటిరొజుల్లో, సుగరూ, బీపీ లాటివి ఓ వయసొచ్చిన తరువాత వచ్చేవి. ఈరోజుల్లో ఇదో status symbol అయిపోయింది. వయసుతో సంబంధం లేదు. కొందరు అవేవీ రాకుండా జాగ్రత్తలు తీసికునే వారైతే, కొంతమంది జాగ్రత్తలు పాటించాల్సినవారు. కారణం ఏదైతేనె, ఉప్పుకీ, పంచదారకీ వాడకం మాత్రం తగ్గింది.

సర్వేజనా సుఖినోభవంతూ...

మరిన్ని వ్యాసాలు

Maa chardham yatra
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
సినీ అప్సరస గీతాలు .
సినీ అప్సరస గీతాలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
వివేకానంద రాక్ మెమోరియల్ స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
- కుందుర్తి నాగబ్రహ్మచార్యులు
Kanyakumarilo vunna tiruvalluvar vigraham nirmana charitra
తిరువళ్లువర్ విగ్రహం నిర్మాణ చరిత్ర
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు