వీక్షణం - పి.ఎస్.ఎం. లక్ష్మి

 

తులిప్ గార్డెన్స్ 
 

 

అందమైన పూలు, రంగు రంగుల పూలు, ఒక దానిని మించి ఇంకొకటి .. ప్రతి ఒక్కటీ ఒక అబ్బురమే.  అలాంటి పూలనీ, పూల తోటలనీ చూడాలనే కోరిక ఎవరికుండదండీ!?  అందులోనూ నా కాళ్ళకి చక్రాలున్నాయని అందరూ అంటారాయె!  అనే వాళ్ళు ఎటూ అంటారుగానీ, మనం ఏదన్నా కొత్త ప్రదేశానికి వెళ్ళినప్పుడు అక్కడి వింతలూ విశేషాలూ చూడద్దూ!?

యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో, మిచిగాన్ రాష్ట్రంలో మా అబ్బాయి తేజస్వి, అమ్మాయి దీప్తి కొంతకాలం వున్నారు.  పిల్లలక్కడ వుంటే తల్లిదండ్రులకు అమెరికా ప్రయాణాలు తప్పవాయే.  మేము వాళ్ళ దగ్గరకెళ్ళినప్పుడు వాళ్ళూ అమ్మా నాన్నలకు అమెరికా చూపించాలని ఉబలాట పడ్డారు.  ఈ మధ్య మా అల్లుడు పవన్ కూడా వాళ్ళ పార్టీలో చేరిపోయాడు.  ఇంకేం అక్కడ కూడా బోలెడు ప్రదేశాలు చూశాం.  ఎన్నంటే, ఏళ్ళతరబడి అక్కడ వున్న వాళ్ళు కూడా చూడనన్ని.  ఈ మాట నాదికాదండీ.  అక్కడున్న చాలామందిది. 

మరి ఆ ప్రదేశాల కబుర్లన్నీ, ఫోటోలతో సహా మీతో పంచుకోవాలనుకుంటున్నాను.  ఈ కబుర్లు కొంతకాలం సాగించమన్నారు గోతెలుగు వారు.  మీరు ఆ ప్రదేశాలకి వెళ్ళి చూసేదాకా నామాటల్లోనూ, ఫోటోలలోనూ (గూగులమ్మ దానం చేసినవి కావండీ, మేము తీసినవే) వాటిని చూడండి.

అమెరికాలో ఎక్కడికన్నా వెళ్ళాలంటే మనల్ని తీసుకెళ్ళటానికో కారూ, మనల్ని తిప్పటానికి ఇష్టపడే మనవాళ్ళూ (బయట వాళ్ళయితే ఎంత డబ్బయినా సరిపోదు), చేతినిండా డబ్బు వుంటే చాలు.  ఇంచక్కా  ఏ ఇబ్బందీ లేకుండా వెళ్ళి రావచ్చు.  దోవలు చూపించటానికి జీ.పీ.యస్.లు, దోవలో చాలా చోట్ల రెస్టు రూమ్ లూ, అక్కడ విహార ప్రదేశాలన్నింటి గురించీ ఉచితంగా దొరికే బ్రోషర్లూ,  విరివిగా దొరికే ఆహార పదార్ధాలూ (అక్కడ ఇడ్లీ, దోశ అనకూడదు. ఇంచక్కా వాళ్ళు పెట్టేవాటిలో, మీరు తినగలిగేవి, మీవాళ్ళ సాయంతో ఎంచుకోవటమే.  లేకపోతే వెజిటేరియన్లు నాన్ వెజిటేరియన్లు అయిపోయే ప్రమాదమున్నది.  తర్వాత మీ ఇష్టం.)  దేనికీ ఇబ్బంది వుండదు.

వెళ్ళిన కొత్తల్లో నేను బయటకెళ్ళినప్పుడు కారు స్పీడుగా పోతుంటే కొంచెం నెమ్మదిగా పోనియ్యరా అంత స్పీడెందుకంటే ఇక్కడ స్పీడు లిమిట్ రోడ్డు మీద బోర్డుల్లో చూపించినట్లే వెళ్ళాలమ్మా, కొంచెం అటూ ఇటూ అయితే పర్వాలేదుగానీ మరీ ఎక్కువేకాదు, తక్కువయినా కాప్ రెడీగా వస్తాడు అన్నాడు మా అబ్బాయి.  అంతకన్నా ముందే ఇంకో పిచ్చి సలహా ఇచ్చాను.  దోవ  తెలియకపోతే ఎవరినన్నా అడగవే అమ్మాయ్ అని.  మా అమ్మాయి జీ.పీ.యస్. సౌండ్ పెంచింది.  ఎంత చక్కగా చెబుతుందండీ ఆ చిన్ని ముండ దోవలని. .. ఆఫ్టర్ హన్డ్రడ్ యార్డ్స్ టేక్ రైట్ టర్న్ .. అంటూఎంత దూరం తర్వాత ఎక్జిట్ వస్తుందో (మైన్ రోడ్ మీదనుంచీ పక్కకి తిరగాల్సిన దోవ), ఎటు వైపు తిరగాలో చక్కగా చెబుతుంది.  పైగా మనమేమన్నా అది చెప్పినట్లు తిరక్కుండా రాంగ్ రూట్ లోకి వెళ్ళినా మళ్ళీ సరైన దోవ చెబుతూనే వుంటుంది.  మనం చెయ్యాల్సిన పనల్లా డ్రైవింగ్ మొదలెట్టే ముందే ఎక్కడినుంచీ, ఎక్కడికి వెళ్ళాలో దాన్లో ఫీడ్ చెయ్యటమే).  చిన్న పిల్లకిమల్లే కొన్నాళ్ళు దాన్ని విపరీతంగా ప్రేమించేశాను.  ఆ సౌండ్ నాకు వినబడేటట్లు పెట్టమనేదాన్ని.  దాన్ని ఇమిటేట్ చేసేదాన్ని.

విహార ప్రదేశాలలో నాకు బాగా నచ్చినది వాళ్ళు ఆ ప్రదేశాలకి ఇచ్చే విలువ, వాటి గురించి అందరికీ తెలిసేటట్లు పెట్టే బోర్డులు, విజిటర్స్ సెంటర్ లో ఉచితంగా ఇచ్చే మేప్ లు, కనీస అవసరాలకు వాళ్ళిచ్చే ప్రాముఖ్యత, సందర్శకులని వాళ్ళు పలకరించే తీరు, ప్రతివారినీ హేవ్ ఎ గుడ్ డే అని బై చెప్పటం, ఇవి మనవాళ్ళు ఎప్పటికైనా నేర్చుకుంటారా??  మన దేశంలో వున్న పురాతన ఆలయాలు, కోటలు, కట్టడాలు వాళ్ళ దగ్గరవుంటే వాళ్ళెంత అపురూపంగా చూసుకుంటారో!!  మన శిధిల దేవాలయాలు, కోటలు చూసి నేను ఎప్పుడూ బాధ పడుతూ వుంటాను మనవాళ్ళు వీటి విలువ ఎప్పుడు తెలుసుకుంటారా? అని.

ఇంతకీ ఈ ప్రదేశాలన్నీ మేము మూడు సార్లు వెళ్ళినప్పుడు చూశాం.  అన్నీ ఒకేసారి చూడటం కొంచెం కష్టమవుతుంది.  ముందు అందమైన పూలతో మొదలు పెడదాము.

తులిప్స్ గార్డెన్స్., హాలెండ్

చలికి తట్టుకోలేమని మేము మిచిగాన్ రెండుసార్లూ వేసవి కాలంలోనే వెళ్ళాము.  ఇండియాలో ఎండలనుంచీ ఉపశమనం, అక్కడ వాతావరణం బాగా వుంది.  అంతేకాదు, కొన్ని అద్భుత ప్రదేశాలనుకూడా చూడగలిగాము.  అలాంటివాటిలో మొదటిది తులిప్స్ గార్డెన్స్.


మొదటిసారి మేము వెళ్ళిన మూడో రోజే తులిప్స్ ఫెస్టివల్ ఆఖరి రోజని తెలిసింది.  ఆ రోజు శనివారం, పిల్లలకి సెలవు కూడా అవటంతో, మేము నలుగురం, వాళ్ళ స్నేహితులింకో నలుగురం కలిసి తులిప్స్స్ ఫెస్టివల్ కి ఉదయం 9 గం. లకి రెండు కార్లల్లో బయల్దేరాము.  మిచిగాన్ రాజధాని లేన్సింగ్ నుంచి దాదాపు రెండు గంటల ప్రయాణం.

మిచిగాన్ రాష్ట్రంలో హాలెండ్ అనే వూరిలో ప్రతి సంవత్సరం మే నెలలో తులిప్స్ ఫెస్టివల్ జరుగుతుంది.  ఆ నెలలో కొన్ని రోజులే అవి పుష్పిస్తాయి.  సాధారణంగా మే నెలలో మొదటి వారంలోనే ఈ ఫెస్పివల్ జరుగుతుంది.  ఆ సమయంలో ఆ పూల అందాలను చూడటానికి అక్కడికి చాలా ఎక్కువ సంఖ్యలో సందర్శకులు వస్తారు.  అయితే సుకుమారమైన పూలు కదండీ, ప్రకృతిమాత కరుణ కూడా కావాలి వాటికి ... పూసినవి కూడా ఎక్కువ రోజులు తాజాగా వుండకపోవచ్చు.  అలాంటి సమయాల్లో వెళ్ళినవాళ్ళకి కొంత నిరాశకూడా ఎదురవ్వవచ్చు.  కానీ మేము వెళ్ళినప్పుడు మా అదృష్టం బాగుంది.  అందమైన అనేక రకాల పుష్పాలను చూడగలిగాము.

ఇక్కడ వున్న కుటుంబాలలో చాలామంది డచ్ వారు.  తులిప్ ఉత్సవాల సమయంలో, అంటే, ఒక వారం, వారి ఆటపాటలతో ఆ ప్రాంతమంతా చాలా సందడిగా వుంటుంది.  సాయంకాలాలు రోడ్లమీద చాలామంది గ్రూప్ గా డాన్స చేస్తూ పెరేడ్ చేస్తారు.  ఇవి చూడటానికి టికెట్లు వుండవు.  వారి చెక్క బూట్లనుంచి వచ్చే సౌండ్ విన సొంపుగా వుంటుంది.

చెక్క బూట్లేమిటంటారా?  డచ్ వారి చెక్క బూట్లు చాలా ప్రసిధ్ధి చెందినవండీ.  చెక్కతో బూట్లేమిటి?  వాటిని ఎలా వేసుకుంటారు? విడ్డూరం కాకపోతేను!! అని మనం అనుకుంటాంగానీ వాళ్ళకి అవి చాలా సౌకర్యంగా వుంటాయిట. తులిప్ గార్డెన్స్ షాపులో బూట్లు కూడా అమ్ముతున్నారు.  మన సైజు దొరకకపోతే ఆర్డరు కూడా ఇవ్వచ్చు.

ఈ పూల తోట చూడటానికి మనిషికి 10 డాలర్ల టికెట్.  పూల వివరాలు తెలుపుతూ బ్రోషర్ ఇస్తారు.  మీరు వాటి బల్బ్ లు (పిలకలు) కొనుక్కుని మీ ఇంట్లో నాటుకోవాలంటే  అక్కడ వున్న షాపులో కొనుక్కోవచ్చు.  అలాగే మీ వాళ్ళకి ఇవ్వటానికి బహుమతులు కూడా. 

ఎంతో అందమైన ఈ పూల సొగసులు నా మాటల్లో చెప్పలేనుగానీ, కనుల విందుగా ఈ ఫోటోలు చూడండి. 

విండ్ మిల్ ఐలెండ్

తులిప్ గార్డెన్స్ నుంచి వస్తూ విండ్ మిల్ ఐలెండ్ కి వెళ్ళాము.  అక్కడ కూడా చాలా టులిప్స్. రంగు రంగులవి, రకరకాలవి.  అక్కడ చాలా పెద్ద విండ్ మిల్ వున్నది.  దాని పైకి ఎక్కటానికి వీలుగా వున్నది.  అక్కడ నుంచీ చుట్టూ వున్న సుందర దృశ్యాలను చూడవచ్చు.

అక్కడ డచ్ వారి చెక్క బూట్లు నాలుగు జతలు రెండు పొడుగాటి కర్రలకి బిగించారు.  వెళ్ళినవాళ్ళు సరదాగా వాటిని వేసుకుని నడవవచ్చు.  బూట్లు చాలా పెద్దగా వున్నాయి కనుక ఎవరికైనా పడతాయి.  మావాళ్ళు ఎక్కి నడిచీ, నడవలేక చాలా ఎంజాయ్ చేశాము.  మరి ఫోటోలున్నాయికదా.  మీరూ ఎంజాయ్ చెయ్యండి.

అక్కడి ఇంకో విశేషం డచ్ పెళ్ళి కొడుకునూ, పెళ్ళి కూతురునీ తీసుకు వెళ్ళే గుఱ్ఱపు బగ్గీ.  దాని ఫోటో కూడా మీకోసం. మధ్యాహ్నం భోజనం అక్కడికి దగ్గరలో వున్న ఇండియా తాజ్ లో చేశాము.  అక్కడినుంచీ మా ప్రయాణం మిచిగాన్ లేక్ కి. 

మిచిగాన్ లేక్

చాలా పెద్ద సరస్సు.  అలలు లేని నిశ్శబ్ద సముద్రంలాగా వున్నది.  దాని దగ్గరకు వెళ్ళాలంటే ఎత్తయిన బండ్ (కట్ట) లాంటిది ఎక్కి దిగి వెళ్ళాలి.  అప్పటికే చలి బాగా వున్నది.  ఇండియానుంచి వచ్చికూడా రెండు రోజులే అవటంతో నాకు అదంతా దిగి వెళ్ళే ఓపిక లేక ఆ బండ్ మీదే కూర్చున్నాను.  అన్నట్లు అలాంటి చోట్ల సందర్శకుల విశ్ర్రాంతికి, తినటానికి, బెంచీలు అనువుగా వేశారు.

నీళ్ళదాకా వెళ్ళినవాళ్ళుకూడా ఎక్కువ సేపు సరదాగా గడపలేకపోయారు.  నీళ్ళు అంత చల్లగా వున్నాయిట.  అక్కడనుంచీ ఇంటికొచ్చేశాము. 

వచ్చేవారం మరొక ప్రదేశం గురించి ఆసక్తికరమైన విశేషాలతో మళ్ళీ కలుద్దాం...
 

మరిన్ని వ్యాసాలు

Maa chardham yatra
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
సినీ అప్సరస గీతాలు .
సినీ అప్సరస గీతాలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
వివేకానంద రాక్ మెమోరియల్ స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
- కుందుర్తి నాగబ్రహ్మచార్యులు
Kanyakumarilo vunna tiruvalluvar vigraham nirmana charitra
తిరువళ్లువర్ విగ్రహం నిర్మాణ చరిత్ర
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు