ఆముక్తమాల్యద
(గతసంచిక తరువాయి)
గోదాదేవికి ఆమె పూర్వజన్మలో సత్యభామయై శ్రీకృష్ణుని పతిగా పొందిన సంగతిని ఆమెకు ఈ జన్మలో చెలికత్తెలుగా జన్మించిన నాగకన్యలు తెలియజేశారు. మరాళిక, ఏకావళి, స్రగ్విణి, హరిణి, మనోజ్ఞ అనే ఆ చెలికత్తెలు తన పూర్వ జన్మ వివరాలను తెలియజేయగానే మూర్ఛపోయి, తేరుకున్న గోదాదేవి విలపించడం ప్రారంభించింది.
అట్టి మురారి కప్పు డనుఁగై మరి యీకలివేళఁ గ్రమ్మరం
బుట్టి వియోగ వేదనలఁ బొక్కెడు నీ తను వేల తండ్రి తా
నిట్టగు నన్ను నింకొకని కియ్యక తొల్తన యోగశక్తిఁ బోఁ
బెట్టెద దీని వెండియు నుపేంద్ర పదాంబురుహంబు పట్టెదన్
'అటువంటి' మురారికి ఆ జన్మలో ప్రియురాలనై, ఈ కలికాలంలో యిలా మరలా జన్మించి, యిలా వియోగ వేదనలో కుమిలిపోయే ఈ జన్మ ఎందుకు? ఇలాంటి నన్ను నా తండ్రి ఇంకొకరికి ఇచ్చి పెండ్లి చేయకముందే యోగమార్గంలో ఈ శరీరాన్ని త్యజిస్తాను. మరలా ఉపేంద్రుని పదకమలములనే పట్టుకుంటాను అని శరీరాన్ని త్యజించడానికి సిద్ధపడింది గోదాదేవి. 'అటువంటి మురారి' అనడంలో ముద్దులభార్య కోసం కేవలం పూవునే గాక చెట్టుకు చెట్టునే తెచ్చి పెరటిలో పాతిన శ్రీకృష్ణుడు అన్న మురిపెం ఉంది. అంతకుముందు పై పై కోపంతో తను నిందించిన అవతారాల ప్రసక్తి ఉంది. ఆదివరాహుడై భూదేవిని మన్నించి ఏలుకున్నవాడు, శ్రీరాముడై పత్నికోసం పరితపించి పదితలల పురుగును ఏరిపారేసినవాడు, శ్రీకృష్ణుడై పదహారువేల కన్యలను, ఎనిమిదిమంది పట్టమహిషులను అలరించిన శ్రీకృష్ణుడు, అందరికన్నా గారాబంగా 'తనను' చూసుకున్న నాథుడు అన్న బెంగ ఉన్నది.
అనిన వారలు పల్కి రా యదువతంస
మెందు జన్నాడు విను రంగమంద నిల్చె
వేగపా టేల యతడ నీ విభుడగుటకు
నర్చనాదుల నివ్వీటి హరి భజింపు
నా శరీరాన్ని త్యాగం చేస్తాను అన్న గోదాదేవితో ' ఆ యదుభూషణుడు ఎక్కడికి పోయాడని? శ్రీరంగము లోనే రంగనాథుడై నిలిచాడు. తొందరపాటు ఎందుకు? ఆ స్వామియే, ఆ రంగనాథుడే నీ భర్త కావడం కోసం అర్చనాదులతో ఈ పట్టణంలోని హరిని, విల్లిపుత్తూరులోని 'మన్నారు' స్వామిని సేవ చేయవమ్మా' అని సలహాను ఇచ్చారు, ఉపదేశమును చేశారు చెలికత్తెలు. ఆమెను ఆత్మత్యాగపు ఆలోచనలనుండి తప్పించారు. గోదాదేవికి విరహతాపము ఇంకా ఎక్కువైంది, తను ఎవరో తెలిసి, ఏం పోగొట్టుకున్నదో తెలిసి. ఇక్కడ కొన్ని అద్భుతమైన వర్ణనలు చేశారు రాయలవారు. యివి విచిత్రములైన ప్రయోగాలు, వినూత్నములైన ప్రయోగాలు, కొద్దిగా క్లిష్టత ఉన్నప్పటికీ రసాశ్లిష్టములైన ప్రయోగాలు, మచ్చుకు
ఒకటి రెండు చూద్దాం.
అలుకకు మన్నఁ దేరి మరి యంతటనుండియు వేళవేళ నె
చ్చెలు లిడు తెల్వులన్మగుడఁ జింతల సంతమసంబుల న్సమా
కలితత మించె సొమ్మిడని కార్శ్యమునన్ హృదయంబున న్సదా
పలపలగాక నీలముల బన్నసరంబయి నిర్మలాంగికిన్
'అలుకకు' అంటే భయపడకు అని చెలికత్తెలు ఊరడించడం వలన కొద్దిగా తేరుకున్నది. అలా ప్రతిసారీ వారు ఊరడించినప్పుడు ఊరట పొంది, వారి జ్ఞాన బోధలు, సూచనలు అనే తెల్లని వెలుగులు కలుగుతాయి. మరలా అంతలోనే చింతలు అనే నల్లని కాంతులు అలుముకుంటాయి. యిలా మనోవేదనతో కృశించిపోయి, ఆభరణాల, అలంకరణాల కోరిక నశించిపోయిన గోదాదేవికి, ఏ ఆభరణాల లోటూ లేకుండా, ఆ ఆనందము అనే తెల్లనికాంతుల మంచి ముత్యాలు, నల్లనయ్యమీది దిగులు అనే నల్లని కాంతుల నీలమణులు ఆభరణాలుగా ఉన్నాయి. ఒకసారి ఆశల మెరుపులు, మరొకసారి నిరాశల నీలిమలు ఆమెను కమ్ముకుంటాయి. ఆ జాడలు పైకే తెలుస్తాయి, ఎందుకంటే ఆమె నిర్మలాంగి కనుక, అంటే స్వచ్ఛమైన దేహమును కలిగినది కనుక. స్వచ్ఛమైన దేహము కనుక పారదర్శకంగా లోపలి హృదయాన్ని, దాని ఆనందాన్ని, ఆవేదనను పైకే వ్యక్తం చేస్తుంది. స్వచ్ఛమైనది అంటే నిర్మలమైనది, అంటే కల్లా కపటము తెలియనిది కూడా, కనుక తన భావాలను దాచిపెట్టుకోవడం చేతగాక, పైకే వ్యక్తం చేయడం వలన, ఆ ఆనందము, ఆ ఆవేదన యివే ఆమెకు ఆభరణాలుగా కనిపిస్తాయి, వేరే ఆభరణాల అవసరము లేకుండా, యిదీ రాయల ప్రయోగ వైచిత్రి,
వర్ణనా చమత్కృతి.
ఎలసి యేప్రొద్దుఁ గనువొందనీక మరుఁడు
కలహమున కంక కాఁడయి కాలు ద్రవ్వఁ
బాండుబహుళక్షపాపరంపరలు వెడల
కింటిలో నేదుముల్లయ్యె నిందుముఖికి
ఏ పొద్దూ వదలకుండా కాచుకుని మన్మథుడు కలహానికి పంతంపట్టి (అంకకాడు అయి) కాలు దువ్వుతున్నాడు ఆమె మీదికి. పాండుపక్షము అంటే పున్నమి రోజుల పదిహేను రోజులు. బహుళపక్షము అంటే అమావాశ్యరోజుల పదిహేను రోజులు. నిజానికి ఈ రెండిటికీ తేడా ఉండాలి. పున్నమి రోజులలో పోనుపోనూ కాంతి పెరుగుతుంది, అమావాశ్య రోజుల్లో పోనుపోనూ చీకటి పెరుగుతుంది. గోదాదేవికి మాత్రం అలా 'వెడలక' అలా జరుగక, అన్ని రోజులూ ఒక్కతీరుగానే జరుగుతున్నాయి, ఏ మార్పూ లేదు, అంటే ఆమెకు బాహ్యప్రపంచాపు ధ్యాసే లేదు. 'ఏదు' అంటే ముళ్ళపంది. ముళ్ళపంది ముల్లు యింట్లో వుంటే జగడాలు ఉంటాయి అని గ్రామీణుల విశ్వాసం. యింటిలో ముళ్ళపంది ముళ్ళు ఉన్నట్టుగా నిరంతరమూ కలహమే అయింది ఆమెకు, మన్మథునితో. యింకా లోతుగా పరిశీలిస్తే ముండ్లపంది ముళ్ళు కొన్ని తెల్లతెల్లగా ఉంటాయి, పండు ముళ్ళు అన్నమాట, రాలిపోయేవి, కనుక తెల్లగా ఉంటాయి, కొన్ని నల్లగా ఉంటాయి, ముళ్ళు అని మనము అంటాము కానీ అవి దాని రోమాలే. రాలిన రోమాలు, కేశాలు జంతువులవైనా, మనుషులవైనా యింట్లో ఉండడం అశుభం అని పెద్దల విశ్వాసం, కనుకనే యింట్లో, గృహమధ్యంలో, గడ్డాలు గీసుకోవడం, మీసాలు కత్తిరించుకోవడం చేయవద్దు అని మన సంప్రదాయము. ముళ్ళపంది తెల్లని ముళ్ళలా, తెల్లని రోమాలలాగా తెల్లని వెన్నెలరోజుల కిరణాలు ఉన్నాయి. ముళ్ళపంది నల్లని ముళ్ళలాగా, నల్లని రోమాలలాగా నల్లని అమావాశ్యరోజులు ఉన్నాయి. నల్లనివైనా, తెల్లనా ముళ్ళపంది ముళ్ళు కనుక, నిరంతరమూ మన్మథుడు కయ్యానికి కాలుదువ్వుతూనే ఉన్నాడు, కనుక కూడా గోదాదేవికి పున్నమి రోజులకూ, అమావాశ్య రోజులకూ తేడా లేకుండా కాలం జరుగుతున్నది. అదీ రాయలవారి ఊహాశక్తి.
(కొనసాగింపు తరువాయి సంచికలో)
***వనం 'వేంకట' వరప్రసాదరావు