అవీ - ఇవీ - భమిడిపాటి ఫణిబాబు

 ఇదివరకటి రోజుల్లో, ప్రతీ పనికీ, ఉదాహరణకి, పన్నులు కట్టాలంటే  పంచాయితీ/ మునిసిపల్ / కార్పొరేషన్ కార్యాలయాలకీ, అలాగే  ఇంకోదానికి ఇంకోచోటకీ, వెళ్ళాల్సొచ్చేది. సాంకేతిక పరిణామాల ధర్మమా అని, ఆ గొడవ వదిలిందీ అనుకుంటారు కొంతమంది.  కానీ అందరి అభిప్రాయమూ, అలాగే ఉండాలని లేదుకదా. పోనీ అలా అందామా అంటే, “ అదేమిటండీ మీరు ఇంకా ఇక్ష్వాకుల కాలంలోనే ఉన్నట్టున్నారే, ఎదగాలి మాస్టారూ.. ఎదగాలి… “ అని  జ్ఞానబోధ  చేసేవారు మాత్రం కావాల్సినంతమంది. ఇది మామూలేకదా, మనకి కాస్తో కూస్తో తెలిసి, అవతలివాడికి తెలియదంటే చాలు, పెట్రేగిపోవడం.. మానవ నైజం కదా. అందరూ “మహాత్ములు “ కాలేరుగా.

 

 ఈ రోజుల్లో ఏది చూసినా, online  లోనే.  రిజర్వేషను కోసం, స్టేషనుకి వెళ్ళి, గంటల తరబడి, నుంచోనక్కర్లేదు. పోస్టాఫీసులకి వెళ్ళి, కార్డులూ, కవర్లూ, స్టాంపులూ కొనక్కర్లేదు, అంతర్జాలంలో ఓ నాలుగు ముక్కలు రాసేసి, ఓ నొక్కునొక్కితే, ఎన్నివేల మైళ్ళ దూరంలో ఉన్నా, టుపుక్కున క్షణాల్లో వెళ్ళిపోతున్నాయి, క్షేమ సమాచారాలు. అలాగే, పాతరోజుల్లో లాగ డబ్బులు తెచ్చుకోడానికి, బ్యాంకులకి వెళ్ళక్కర్లేదు.  సందుసందుకీ  ఏటీఎం లే. వాటిల్లో డబ్బులుండవనేది వేరే విషయం. ఓ సరుకు కొనుక్కోడానికి బజారుకెళ్ళాల్సిన పనిలేదు, హాయిగా కంప్యూటర్లోనే ఆర్డరు చేసేయొచ్చు. కూరగాయలకీ అదే పధ్ధతి. ఊళ్ళో ఉన్నా, వేరే ప్రదేశాల్లో ఉన్నా, పిల్లల క్షేమసమాచారాలు, ఫోన్లద్వారానే. మనవళ్ళనీ, మనవరాళ్ళనీ పలకరింపులు  ఆన్ లైన్లోనే. ఇంకా సౌకర్యం లేదుకానీ, “ కాపరాలు” కూడా, ఆన్ లైన్లోనే చేయడానికి వెనుకాడరు. ఈమధ్యన దైవదర్శనాలుకూడా దేవాలయాలకి వెళ్ళాల్సిన అవసరం లేకుండానే జరిగిపోతున్నాయి.

  ఇలా చెప్పుకుంటూపోతే , దేనికీ భౌతికంగా వెళ్ళాల్సిన అవసరం లేకుండా పని జరిగిపోతోంది. ఇదంతా శుభపరిణామం అనుకుందామా, లేక  ప్రతీదీ “యాంత్రీకం” అయిపోయిందే అని బాధపడదామా?  ఎవరి దృష్టికోణాన్ని బట్టి, సమర్ధించేవారూ, వ్యతిరేకించేవారూ కూడా ఉంటారు. ఎవరిదీ తప్పుకాదు. సౌకర్యాలు పెరిగాయి కాబట్టి ఉపయోగించుకుంటున్నారు. తప్పులేదు, కానీ ఈ సందర్భంలో, మనిషికీ, మనిషికీ ఉండే సంబంధ బాంధవ్యాలు కొండెక్కేశాయి.  So what ?  అనే రోజులాయె. ప్రస్తుత జీవనవిధానాన్ని బట్టే, మోసాలూ పెరిగిపోయాయి. ఇదివరకటిరోజుల్లో లాగ, ఓ వ్యాపారం , ఎటువంటిదైనా సరే, దానికో ఆఫీసూ, పనిచేయడానికి మనుషులూ అవసరం లేదు. ఏ మూల కూర్చున్నా, చేతిలో ఓ  లాప్ టాప్పూ, దానికో ప్రింటరూ ఉంటే చాలు.. ఏదో పేరుచెప్పి, ఫలానా రొక్కం పెట్టుబడిపెడితే, రాత్రికి రాత్రి కోటేశ్వరులైపోవచ్చని, ఓ ప్రకటన పెడితే చాలు, గొర్రెల మందలాగ , దాచుకున్న డబ్బులు, ఫలానా ఎకౌంటులో జమచేయడానికి వెనుకాడరు. ఆ వ్యాపారం మొదలెట్టినవాడు, సంపాదించవలసినంతా,  కాలు కదపకుండా, సంపాదించి, రాత్రికి రాత్రి బిచాణా ఎత్తేస్తాడు. జనాలందరూ అలోలక్ష్మణా అంటూ, టివీల్లో ఏడుస్తారు. వార్తల్లో చూస్తూంటాము, దేశంలో ఎక్కడ చూసినా ఈ  online fraud  లే. ఆధార్ కార్డుల దగ్గరనుండి, పెద్ద పెద్ద డిగ్రీల  దాకా , ఏదైనా క్షణాల్లో తయారైపోతున్నాయి. ఎవడిని నమ్మాలో, ఎవడిని నమ్మకూడదో తెలియని రోజులు.  పట్టుకుంటే దొంగా, లేకపోతే దొరా అనే రోజులు. ఎవడి కర్మని బట్టి వాడనుభవిస్తాడు పోన్లెండి.

  ఒంటరిగా ఉండే తల్లితండ్రులకి, శ్రమ కలగకూడదని, ఊళ్ళో ఉండే సకల సౌకర్యాలూ ఏర్పాటు చేసి, ఏదో వారిని ఉధ్ధరించేద్దామనుకుని, విదేశాల్లో స్థిరపడ్డ సంతానం కొందరూ.  వెళ్తూ, వెళ్తూ ఫలానా దానికి, ఫలానాది నొక్కూ.. అంటూ ఓ పెద్ద చిఠ్ఠా తయారుచేసి, “ నువ్వు అడుగు బయట పెట్టక్కర్లేదు, హాయిగా ఇంట్లోనే కూర్చుని మహరాజభోగంగా అనుభవించి, నువ్వు సుఖపడూ… మమ్మల్ని ఇబ్బంది పెట్టకూ…” అని చెప్పి, ఎగిరిపోతారు… ఏదో పిల్లలు ఎంతో అభిమానంగా ఇచ్చారూ, అనుకుని , ముందర ఓ నెలరోజులు ఉపయోగించడం బాగానే ఉంటుంది.  కానీ, ఎంతటివారికైనా, కొన్నాళ్ళు వాడేసరికి, మొహం మొత్తుతుంది. ఇదేమి గొడవో..మాట్టాడడానికి ఒక్క మానవమాత్రుడుకూడా,  కనిపించడూ, రేపు మనకేదైనా జరిగితే అసలు ఎవరికైనా తెలుస్తుందంటావా , ఉంటే గింటే, భార్యతో చెప్పుకోవడం.  ప్రతీదీ, గుమ్మంలోకే వచ్చేస్తోంది, అంతవరకూ బాగానే ఉంది, కానీ  ఈ సౌకర్యాలవలన తాను ముఖ్యంగా కోల్పోయిందేమిటో, తెలియడం ప్రారంభం అవుతుంది. ఇదివరకే బాగుండేదేమో, ఏ పోస్టాఫీసుకో , బ్యాంకుకో, చివరాఖరకి  ఆసుపత్రికి వెళ్ళినా, పాత స్నేహితులెవరో ఒకరు కలిసేవారు. ఈమధ్యన, ప్రతీదానికీ, బయటకు వెళ్ళాల్సిన అవసరం తగ్గేకొద్దీ, వాళ్ళూ, కలవడం తగ్గించేశారు. ఏ బంధమైనా రాకపోకలూ, కలవడాలూ ఉంటేనే కదా, గట్టిగా ఉండేవి. ఇక్కడ ఈ పెద్దాయన, అసలు బయటకే రావడం లేదు, పిల్లల దగ్గరకి కానీ వెళ్ళాడేమో అనుకోవడం మొదలెట్టారు.

 ఇంక ఇలా కాదనుకుని, ఓరోజు బ్యాంకుకి వెళ్ళి, చెక్ ఇచ్చి డబ్బుతీసికుందామనుకుని , క్యూలో నుంచునేసరికి, ఓ తెలిసినాయన, అదేమిటి మాస్టారూ, హాయిగా నెట్ బ్యాంకింగు తీసికోవచ్చుగా, ఎందుకండీ ఈ హైరాణ, అదీ ఈవయసులోనూ, అనేటప్పటికి  మాస్టారికి చిర్రెత్తిపోయింది, నెలరోజులుగా ఉగ్గపెట్టుకునున్న ఉక్రోషం అంతా బయటకి వచ్చేసింది. “ ఓహో అలాగా, మరి నెట్ బ్యాంకింగులోనూ, మిగిలిన ఆన్ లైన్ లావాదేవీల్లోనూ, మనకి  మానవ స్పర్శ ఉంటుందా? ఈ వయసులో కావాల్సింది, యంత్రాలూ అవీ కావు… ఓ మానవ పలకరింపు , మీరు చెప్పినవన్నీ, ఇంట్లో  పిల్లలు పెట్టేవెళ్ళారు. ఛస్తే ఇంక వాటిని ఉపయోగించేదిమాత్రం లేదు. ఎందుకొచ్చిన బతుకండీ, ఓ మాటా మంతీ లేదూ, మన సంతోషాలు పంచుకోడానికి, మానవమాత్రుడు కనిపించడూ… “ అని చడామడా కోప్పడ్డారు.

 పైన చెప్పినది ఏదో  one off  instance అనుకోకండి. ప్రస్తుత యాంత్రీకరణం మీద నియంత్రణ లేకపోతే, భవిష్యత్తులో జరిగేది ఇదే. సౌకర్యాలు ఉన్నాయి, కానీ ప్రతీదానికీ అవసరం లేదేమో..  విదేశాలలో ఎలా ఉన్నా, వారందరూ అలవాటుపడిపోయారు, కానీ మనదేశంలో, ప్రస్తుతానికి “ పాత తరం “ వారే , వారిదారిన వాళ్ళనుండనీయండి. ఊరికే లేనిపోని వాటిని  వారి నెత్తిన రుద్దకుండా ఉంటేనే, వాళ్ళూ హాయిగా, ఆడుతూ పాడుతూ ఉంటారేమో….

 

సర్వేజనా సుఖినోభవంతూ…

మరిన్ని వ్యాసాలు

Maa chardham yatra
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
సినీ అప్సరస గీతాలు .
సినీ అప్సరస గీతాలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
వివేకానంద రాక్ మెమోరియల్ స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
- కుందుర్తి నాగబ్రహ్మచార్యులు
Kanyakumarilo vunna tiruvalluvar vigraham nirmana charitra
తిరువళ్లువర్ విగ్రహం నిర్మాణ చరిత్ర
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు