బెలూన్ ఫెస్టివల్
ఆకాశంలో రంగు రంగుల బెలూన్లు గుంపులు గుంపులుగా, జట్టు కట్టుకుని మరీ ఎగురుతుంటే చూడటానికి ఎంత బాగుంటుందో కదా! ఏదైనా సమావేశం ప్రారంభంలో అలా ఆకాశంలోకి ఎగర వేయబడ్డ బెలూన్లను, మెడలు నొప్పులు పెడుతున్నా, అలాగే చూస్తూ వుంటాము కదా. ఇక్కడ మనం చూసేవి చిన్న చిన్న బెలూన్లు. ఆ బెలూన్లు చాలా పెద్దవిగా, అనేక రంగులతో, వింత వింత ఆకారాలతో ఆకాశంలో పయనిస్తుంటే, వాటినుంచి కిందకి జారిన బుట్టలలాంటి వాటిలో మనుషులు ప్రయాణిస్తుంటే .. పిరికి వాళ్ళు హమ్మో! అనుకుని గుండె మీద చెయ్యి వేసుకుంటారు,
ధైర్య వంతులు మనంకూడా అలా ఎగరగలిగితే బాగుండుననుకుంటారు, నాలాంటివారు ఎన్ని ఫోటోలు తీయాలా, ఎంత తొందరగా మీకందరికీ ఈ సంగతి చెప్పాలా అని చూస్తారు ... కదా?
అందుకే మిచిగాన్ లోని హోవెల్ లో జరిగిన బెలూన్ ఫెస్టివల్ కబుర్లు మీకోసం. సాయంకాలం 6 గంటలనుంచీ హోవెల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో బెలూన్ ఫెస్టివల్ జరుగుతోంది అన్నారు పిల్లలు. ఇవి ప్రతి ఏడాదీ జరుగుతూ వుంటాయి. మేమున్నప్పుడు జరుగుతోంది కనుక, మాకు చూసే అవకాశం భగవంతుడు ఇచ్చాడు కనుక, మేము వెళ్ళి తీరాలిగా మరి.
మేము వెళ్ళేసరికి సాయంకాలం 7-30 గంటలయింది. అది ఇండియా కాదుకదండీ 6 గంటలకన్నది 7 గంటలకి మొదలు పెట్టటానికి. పైగా, బెలూన్లు! ఆకాశంలో ఎంతసేపు ఎగురుతాయి పాపం!?... నేను కొంచెం నిరాశ చెందాను, మేమేమీ చూడలేమేమోనని. పిల్లలు ధైర్యం చెప్పారు...అవి బుల్లి బుల్లి బెలూన్లు కాదు, చాలా పెద్దగా వుంటాయి, పైగా గంటా, గంటన్నరసేపు ఆకాశంలో ఎగురుతాయి. అందుకని చూడగలవులే అని వాళ్ళు పెద్దలై నన్ను బుజ్జగించారు.
సరే చేరామా. నా సంతోషానికి అంతులేదు. 6 గం. లకి ఎగరాల్సిన బెలూన్లన్నీ వాతావరణం సరిగ్గాలేక 7-30కి మేము వెళ్ళేదాకా ఎగరటం మొదలు పెట్టలేదు, మాకోసమే ఆగాయా అన్నట్లు.
అప్పటికి కొంచెం స్ధిమిత పడ్డ నేను చుట్టూ చూశాను. అమెరికాలో అంతమంది జనాన్ని ఒకచోట అక్కడే చూశాను. లక్షల్లో వున్నారు. అంతమంది జనం వున్నా ఎక్కడా తొక్కిడిగానీ, తోపులాటగానీ లేదు. పైగా గంటన్నర పైనుంచీ వైట్ చేస్తున్నారు. అంత నిశ్శబ్దంగా అసలు ఎలా వుండగలుగుతారు? ఎవరికివారు చక్కగా కింద కూర్చుని తింటూ, కూల్ డ్రింక్స్ తాగుతూ, నిశ్శబ్దంగా చూస్తున్నారు. కార్లయితే వేలల్లోనే వున్నాయి పార్కింగులో. అంత పెద్ద పార్కింగు. అన్ని వేల కార్లు పార్కయినా ఎక్కడా ఏ ఇబ్బందీ లేనంత విశాల ప్రదేశం, హారన్ మోతలు లేని నిశ్శబ్ద వాతావరణం.
ఒక్క క్షణం వెధవ మనస్సు .. ఇండియాతో పోల్చుకోకుండా వుండలేక పోయింది. మనవాళ్ళు ఇందులో వందో వంతుమంది వున్నా ఆ ప్రదేశంలో ఎంత గోలగా వుంటుందా అని. మంచి ఎక్కడున్నా నేర్చుకోమంటారు. మనవాళ్ళెప్పుడూ.... సరేలెండి.. వచ్చింది బెలూన్లు చూడటానికి కదా...
నాకంతకు ముందు ఈ ఉత్సవం గురించి సరిగ్గా తెలియదు. అక్కడకి వెళ్ళాక చూశాను. 50 బెలూన్లు ఎగురవేస్తారని. ఇంతేనా అని నిరుత్సాహపడ్డాను, అప్పటికింకా బెలూన్ల సైజు నాకు తెలియక పోవటంతో. సరే వచ్చాంకదా చూద్దామని వెళ్ళి ఆ జనాన్ని చూసి ఆశ్చర్యపడ్డాను.
అంతేకాదు మైదానంలో పెద్ద పెద్ద టెంట్ల కుప్పలు. జనమంతా ఆరుబయట కూర్చున్నారు కదా. ఏమిటి తీరిగ్గా ఇప్పుడు టెంట్లు వేస్తున్నారా అని ఒకింత ఆశ్చర్యపోయాను సుమండీ. ఆ మాట పైకనేసినట్లున్నాను .. మా అమ్మాయి అవి టెంట్లు కాదు సరిగ్గా చూడమ్మా .. బెలూన్లు అన్నది. అమ్మో ఇంత పెద్ద బెలూన్లా అని మళ్ళీ ఆశ్చర్యపోయాను.
7-30కి ఒక్కొక్క బెలూన్ లో గాలినింపటం ప్రారంభమయింది. అక్కడ సూర్యారావు కొంచెం డ్యూటీ మైండెడ్. ఇంటికెళ్ళే వుద్దేశ్యం వుండదు. అందుకే రాత్రి 7-30 దాటినా బోలెడు వెలుతురు. అందుకే మేమా దృశ్యాలన్నీ చక్కగా చూడగలిగాము.
కిందపడున్న గుడారాలు ఒక్కొక్కటీ రంగు రంగుల పెద్ద పెద్ద ఆకారాలని సంతరించుకుని నెమ్మదిగా గాలిలోకి ఎగురుతుంటే... ఓహ్...ఆ దృశ్యం అద్భుతం. ఒక్కొక్క బెలూన్ లో ఒకరినుంచి నలుగురుదాకా మనుషులు కింద వేళ్ళాడుతున్న బుట్టలలాంటి వాటిలో వున్నారు.
ఏభై బెలూన్లు ఒకటి తర్వాత ఒకటి గాలిలోకి ఎగిరి ఆకాశంలో గుంపుగా ప్రయాణించాయి. ఒక గంట తర్వాత తిరిగి అక్కడికే వస్తాయిట. అప్పుడు స్కై డైవింగ్ వగైరా విన్యాసాలో పోటీలు కూడా వున్నాయిట. అంత సమయం లేక, కొంత దూరం ఆకాశంలో ప్రయాణిస్తున్న బెలూన్లను కారులో వెంబడిస్తూ, ఇంటికి చేరాం. ఆ అద్భుత దృశ్యాలు మీకోసం మా కెమేరాలో బంధించి తెచ్చాం చూడండి మరి.