సాహితీవనం - వనం వేంకట వరప్రసాదరావు.

sahiteevanam

ఆముక్తమాల్యద

(గత సంచిక తరువాయి)

శ్రీహరిని భర్తగా పొందడం కోసం గోదాదేవి వ్రతం చేయడం ప్రారంభించింది. 

బోటి గట్టిన చెంగల్వ పూవుటెత్తుఁ  
దరు పరిణ తోరుకదళిమంజరియుఁ గొనుడుఁ  
బోయి గుడి నంబి విజనంబుఁ జేయఁ జొచ్చి 
మ్రొక్కి వేదికఁ బలువన్నె మ్రుగ్గు వెట్టి 

చెలికత్తె కట్టి ఇచ్చిన పెద్ద ఎర్రకలువల పూదండను, చెట్టుమీదే పండిన అరటిగెలను (తరు పరిణత ఊరు కదళి మంజరి)  పట్టించుకుని పోయి, గుడిలో అర్చకుడు(నంబి) జనులనందరినీ పంపివేసిన తర్వాత  ఏకాంతంగా, ప్రశాంతంగా  కోవెలలోకి ప్రవేశించి, స్వామికి నమస్కరించి, వేదిక మీద రంగు రంగుల ముగ్గులు పెడుతుంది. జనులనందరినీ  పంపించి వేయడం అంటే వెళ్ళగొట్టడం కాదు, చిరు పూజలున్నవారిని వారి వారి పూజలు చేయించి పంపించి,  విశేష పూజలు అర్చనలు చేసేవారిని తర్వాత లోపలి రప్పించి వారి పూజలు నిర్వహించడం సహజమే కదా, అదీ  విశేషం. 

కపిలగవిసర్పిఁ బృథు దీపకళికఁ దీర్చి     
ద్వయముతో వక్షమునఁ గల్వదండసేర్చి 
యగరు ధూపంబు లిడి శర్కరాజ్య యుక్త 
హృదయ కదళీఫలాళి నైవేద్యమిచ్చి 

కపిలధేనువు పాలను కాచి, వెన్నను తీసి కరిగించి చేసిన నేయితో పెద్ద దీపమును వెలిగించి, ద్వయమంత్రమును  పఠిస్తూ స్వామి వక్షస్థలము మీద ఎర్రకలువల దండను అలంకరించి, అగరు పొడితో ధూపం ఇచ్చి, చక్కర, నేయి, అరటిపండ్లను నైవేద్యం పెడుతుంది.

ఖండిత పూగీ నాగర 
ఖండంబులు ఘన శశాంక ఖండంబులచే 
హిండితములు గావించి య
ఖండస్థిరభక్తి నొసఁగి కదలి చెలులతోన్ 

కత్తిరించిన పోకచెక్కలు, సొంటిముక్కలు(నాగర) శ్రేష్ఠమైన కర్పూరపు తునుకలతో (ఘన శశాంక ఖండంబులు)  కలిపి అఖండమైన భక్తితో తాంబూలాన్ని స్వామికి సమర్పించి చెలికత్తెలతో కదలిపోతుంది.

చెలువ గర్భగృహ ప్రదక్షిణముఁ జేసి 
వినతయై మౌళి శఠకోపమును ధరించి 
చరణతీర్థముఁ గొని తత్ప్రసాద లబ్ధ 
మయినమాల్యముఁ  దాల్చి గేహమునకరుగు

ఆ సుందరి గర్భగృహానికి ప్రదక్షిణ జేసి, వినమ్రంగా శఠకోపమును తీసుకుని స్వామీ చరణతీర్థమును తీసుకుని  ఆ స్వామీ ప్రసాదముగా అర్చకస్వామి ఇచ్చిన మాలను తీసుకుని ధరించి, యింటికి వెడుతుంది.

ప్రతిదినము నిట్లు చని య
చ్యుత పూజ యొనర్చి వచ్చి సుదతి వియోగ 
చ్యుతధైర్య యగుచు నయ్యదు 
పతిగుణములు ద్రవిడభాషఁ బాడుచునుండున్
 

ప్రతిదినమూ యిలాగే కోవెలకు వెళ్లి అచ్యుతుని పూజ చేసి వచ్చి ఆమె వియోగ బాధచే సడలిన ధైర్యముతో  ఆ యాదవప్రభువు గుణములను, శ్రీకృష్ణుని గుణములను ద్రావిడ భాషలో పాడుతూ ఉంటుంది. యిలా ఆమె  ఆ ద్రావిడ భాషలో పాడిన పాటలే(పాశురములే) తిరుప్పావై. యిలా కేవలం రెండు ముక్కల్లో అమ్మవారి  దివ్యసారస్వతమైన తిరుప్పావైని లీలామాత్రంగా సూచించాడు శ్రీకృష్ణ దేవరాయలు. రాయలవారి  సర్వతంత్రస్వతంత్రసార్వభౌమ లక్షణానికి యిది ఒక ఉదాహరణ. ఎందుకంటే వేరే ఎవరైనా గోదాదేవి నాయికగా  ఉన్న కావ్యములో తిరుప్పావైని విస్తృతంగా ఉదాహరించకుండా ఉండడం అంటే భయపడేవారు, విమర్శలకు,  భక్తితో కూడా. కానీ యిది ఆధ్యాత్మిక గ్రంథం కాదు, ప్రబంధం. కనుక ప్రబంధ లక్షణాలకే ప్రాధాన్యతను ఇచ్చారు  రాయలవారు. యింతలో వసంత ఋతువు ప్రవేశించింది.

(కొనసాగింపు వచ్చేవారం)
వనం వేంకట వరప్రసాదరావు.   

మరిన్ని వ్యాసాలు

అశ్వతి
అశ్వతి
- డాక్టర్ వై వి కె రవికుమార్
పియానో పాటలు .
పియానో పాటలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పాలెగాళ్ళు.
పాలెగాళ్ళు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
సినిమా గీతాలలో  షెహనాయ్ వాద్యం.
సినిమా గీతాలలో షెహనాయ్ వాద్యం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు పలువురికి -3
పురాణాలలో ఒకే పేరు పలువురికి-3
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
108
108
- శ్రీరామ్ లక్ష్మీనారాయణ మూర్తి