కార్న్ పేలెస్
పుస్తకాలకెక్కినవే ప్రపంచ వింతలు కావండీ..చరిత్రకెక్కని అద్భుతాలెన్నో ప్రపంచంలో వున్నాయని నిరూపిస్తుంది అమెరికాలోని సౌత్ డకోటాలోని మిఛెల్ నగరం లో వున్న ప్రపంచంలోని ఏకైక కార్న్ పేలెస్. అవునండీ..కార్న్ పేలెసే.
అసలిదెలా మొదలయిందంటే 1880లో ఇక్కడికి వలస వచ్చిన ప్రజలు ఈ ప్రాంతంలో పంటలు బాగా పండటంతో ఇక్కడ నివాసాలేర్పారు చుకున్నారు . పంటలు బాగా పండటంతో ఇంకా వలస వచ్చే రైతులనాకర్షించాలనే ఆలోచన
1892లో లూయిస్ బెక్ లిత్, యల్.ఓ. గేల్ లకు వచ్చింది. అక్కడి భూసారం అందరికీ తెలియటానికి తమ పంటలను ప్రదర్శించాలనుకున్నారు. ఆ ఆలోచననుంచి రూపుదిద్దుకున్నదే ఈ కార్న్ పేలెస్.
మనిషికి ఆహారం ముఖ్యంకదండీ. ఇప్పుడయితే నాగరికత ఇంత ప్రబలిందిగానీ పూర్వం నదీ తీరాలలో ఆహారం దొరికేచోట నివాసాలేర్పరుచుకునేవాళ్ళుకదా.
ఇక్కడ ఆహారం సమృధ్ధిగా దొరుకుతుంది అని తెలియజేయటానికి కార్న్ పేలెస్ ని రకరకాల పంటలతో అలంకరించటమేగాక, ప్రతి ఏడూ తమ పంటల ప్రదర్శనలు కూడా ఏర్పాటు చేసేవారు. ఇది మొదలై వంద ఏళ్ళు దాటిపోయినా ఇప్పటికీ కొనసాగుతోంది.
ఇంక ఈ కార్న్ పేలెస్ విశేషాలకొస్తే ... మొక్కజొన్నలు, ఓట్స్ మొదలయిన పంట ధాన్యాలతో భవనమంతా అలంకరింపబడుతుంది. ఒక్క మొక్కజొన్నలలోనే అనేక రంగులవి పండిస్తారు ఇక్కడ. ఈ పేలెస్ అలంకరణకు ఉపయోగించే ధాన్యమంతా ఆ చుట్టుపక్కల పండేదే. ఈ పేలెస్ లోపల, బయట అంతా ఇలాంటి డిజైన్లు ఎన్నో ఏర్పాటు చేశారు.
బయట వున్న డిజైన్లు ప్రతి ఏడాదీ వేసవికాలంలో మారుస్తూ వుంటారు. లోపల కొన్ని డిజైన్లు శాశ్వతంగా వుండేవి వున్నాయి. అంతేకాక 1892 నుంచీ ఇప్పటిదాకా ప్రతి ఏడాదీ కార్న్ పేలెస్ కి చేసిన డెకరేషన్స్ ఫోటోలు కూడా ఈ భవనంలో చూడవచ్చు.
ఆ డిజైన్లు, వాటికి అలంకరించిన ధాన్యాలు చూస్తే ఇవి తయారుచెయ్యటానికి ఎంత మంది ఎంత శ్రమ పడ్డారో అనిపిస్తుంది. ఈ పేలెస్ డిజైన్ చేసే అవకాశం రావటం చాలా గొప్పగా భావిస్తారు ఆర్టిస్ట్స్.
దీనికోసం ప్రతి సంవత్సరం కార్న్ పేలెస్ కమిటీ కొత్త ధీమ్ ని ఎంచుకుని దాని ప్రకారం డిజైన్ల తయారు చేయిస్తారు. ఇవి ఎంత వివరంగా వుంటాయంటే, ఎక్కడ ఏ రంగు, ఏ ధాన్యం అంటించాలో వుంటాయి.
మొక్కజొన్న కండెలను నిలువుగా సగానికి చీల్చి, ఇంకా వివిధ ధాన్యాలని, గడ్డిని గోడలకి అంటించిన డిజైన్లమీద మేకులు. స్టేపులర్స్ సహాయంతో అంటిస్తారు. ఈ పని జరిగేటప్పుడు కూడా సందర్శకులని అనుమతిస్తారు.
ప్రతి సంవత్సరం డిజైన్లు మార్చటానికయ్యే ఖర్చు 1,30,000 డాలర్లు. ఏటా 5,00.000 మంది పైన దర్శించే ఈ పేలెస్ కి టికెట్ ఏమీ లేదు. మరి ఇలాంటి అద్భుతాన్ని అవకాశం వున్నవారు తప్పక చూడాలికదా.