మనదేశంలో, చాలామంది పెద్దగా పట్టించుకోని విషయం ఏమైనా ఉందా అంటే, ప్రభుత్వాలు చేసిన చట్టాలూ, సాంప్రదాయాలూనూ అనడంలో సందేహం లేదు. పట్టించుకోకపోవడం మాట అటుంచి, ఎవరైనా పెద్దమనుషులు, వాటిని పట్టించుకోవడం చూస్తే, వారిని వేళాకోళం చేయడమోటీ. దానితో ఎవరికివారే, “ మనకెందుకొచ్చిన గొడవా…” అనుకోడం.. దీనితోనే, సమాజంలో జరిగే , నేరాలు కూడా పెరిగిపోతున్నాయి. పోనీ, చట్టాలు కాపాడాల్సినవారు, ఏమైనా తమ విధులు సరీగ్గా నిర్వర్తిస్తున్నారా అంటే, అదీ తక్కువే. ఎక్కడో, నూటికీ, కోటికీ ఒకరో, ఇద్దరో నిజాయితీ మనుషులు కనిపిస్తారు. పోనీ, వాళ్ళైనా క్షేమంగా ఉంటారా అంటే, అదీ లేదూ.. ఏరంగం తీసికున్నా, ఇదే రంధి. సునితంగా పరిశీలిస్తే, మనకే తెలుస్తాయి.
దేశంలో జరిగే ప్రతీ విషయానికీ, ఓ చట్టం చేసేశారు, మనరాజ్యాంగ కర్తలు. వచ్చిన గొడవేమిటంటే, ఆ చట్టంలో, వాటిని ఎలా, చట్టబధ్ధంగా అతిక్రమించొచ్చో, వెసులుబాట్లు కూడా చెప్పేశారు. ఏమాత్రం బుర్రలో “గుజ్జు” ఉన్నవాడైనా, వీటిని హాయిగా ఉపయోగించేసి, బలాదూర్ గా తిరిగేస్తున్నాడు. పైగా, ఏమైనా అంటే, “చట్టప్రకారమే కదా చేశానూ” అంటాడు. కావాల్సిందల్లా, అధికారమూ, లేదా కనీసం, అధికారం లో ఉన్నవాడితో పరిచయం..
ఉదాహరణకి, 18 సంవత్సరాల వయసు వచ్చేవరకూ, పిల్లలకి డ్రైవింగు లైసెన్సు ఇవ్వకూడదూ అని ఓ చట్టం ఉంది. కానీ, ప్రతీరోజూ మనం చూసేదేమిటీ? స్కూలుకో, ట్యూషనుకో , ఒ పిల్లో, పిల్లాడో జుయ్యిమంటూ స్కూటీ మీదో, బైక్కుమీదో వెళ్ళడం. పైగా ఒక్కరే కాదు, మొగపిల్లలు ఓ ముగ్గురూ, ఆడపిల్లలైతే ఇద్దరూ, హెల్మెట్ అనేది ఉండాలి అని ఓ చట్టం ఉంది. కానీ, చాలా నగరాల్లో, వీటిని పట్టించుకునే వాళ్ళే లేరాయె. అటు తల్లితండ్రులూ, అలాగే ఉన్నారు, పిల్లల సంగతి సరే సరి. మన మనస్థత్వం ఏమిటంటే, ప్రభుత్వం చట్టం చేసింది కాబట్టి, దాన్ని ఉల్లంఘించడం మన జన్మహక్కు. బస్…
ఏడాదికోసారి, అవేవో పాన్ మసాలాలూ, ఘుట్కాలూ, నిషేధించామంటారు. అయినా సరే, తినేవాళ్ళకి దొరుకుతూనే ఉంటాయి.. ఇంక టీవీల్లో యాడ్లు కూడా, ఆ కంపెనీ తయారు చేస్తూన్న ఇంకో పదార్ధం పేరుతో చూపించేస్తూంటారు.
ఇంక ట్రాఫిక్కు సంగతి అడగొద్దు. ఎర్ర దీపం ఉన్నాసరే, దూసుకుపోయేవారు కొందరైతే, పోనీ అని ఓ క్షణం ఆగి వెళ్ళేవారుకొందరూ, కొంతమంది బుధ్ధిమంతులు, పూర్తి ఆకుపచ్చ లైటొచ్చేదాకా, కదలరు, అలాటివాళ్ళని, వెనకాలున్నవారు, హారన్ కొట్టి,కొట్టి భయపెట్టేవారుకొంతమంది.
ప్రభుత్వానికి కట్టాల్సిన పన్నుల విషయానికొస్తే, చట్టాలలో ఉండే లొసుగులు తెలియచెప్పే , టాక్స్ కనసల్టెంట్ల విషయం ఎవరికి తెలియదూ? మరి నల్లధనం పేరుకుపోతోందంటే పెరగదు మరీ ? ఇంక మన రాజకీయనాయకుల విషయమైతే, less said the better… వారెప్పుడూ, దివినుండి, భువికి దిగొచ్చిన దైవదూతలనుకుంటారు. పైగా అధికారంలో ఉన్నప్పుడే కాదు, “ మాజీ “ లూ , వారి “ అనునాయులూ”, ఓ “ పార్టీ కండువా” వేసికున్న ప్రతీ గల్లీ నాయకులు కూడా, ఈ చట్టాలకి అతీతులే. వాళ్ళేం చెప్తే అదే చట్టం. ఇవన్నీ చట్టానికి బంధించినంతవరకూ.
కొన్ని చోట్ల, ఫొటోగ్రఫీ నిషిధ్ధం అని పెద్ద పెద్ద బోర్డులమీద రాసుంటుంది. అయినా సరే, ఎవరికీ కనిపించకుండా, రహస్యంగా ఫొటోలు తీయడం, కొందరికి ఆనందం. పైగా ఇంకోరితో గొప్పలు కూడా చెప్పుకోవచ్చుగా, మేము ఫలానా చోట ఫొటోలు తీసికున్నామూ అని. కానీ, వారు ఎంత హీనస్థితికి దిగజారిపోయారో వారికే తెలియని పరిస్థితి. ఆ దేవాలయం అధికారులెవరైనా, ఈ విషయం గమనించి, వారి కెమేరాని, లాక్కుంటే తెలుస్తుంది, … మళ్ళీ దానికీ ఓ “ విరుగుడు “ ఉందండోయ్… భక్తులమీద దేవాలయ అధికారుల ధాష్టీకం అంటూ, మీడియా ముందర హడావిడి చేయొచ్చు. లేదా కులంపేరుతో, ధర్నాలు చేయొచ్చు. కాదూ కూడదంటే, కెమేరా ఉపయోగించింది, ఓ స్త్రీ అయితే, కావాల్సినంత కాలక్షేపం… మహిళా సంఘాలన్నీ ఊరేగింపుగా వచ్చి, స్త్రీల హక్కులమీద పేద్ద గొడవ చేయొచ్చు. ఇంతహడావిడిలోనూ, అసలు కారణం తెరవెనక్కు వెళ్ళిపోతుంది.
ఏడాదికోసారి, విద్యాసంస్థలు వసూలుచేసే ఫీజులగురించి, ఓ విధానమో, చట్టమో వస్తూనే ఉంటుంది. అయినా, వాళ్ళు వసూలుచేసే , “ మామూళ్ళ “ గురించి, చెప్పే ధైర్యం ఎవడికైనా ఉందా? కారణం, మన ప్రెవేటు విద్యాసంస్థలన్నీ, ఏదో ఒక రాజకీయనాయకుడికి సంబంధించినదే. అలాగే ప్రెవేటు ట్రావెల్స్ కూడా. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే, ఏ పండగైనా వచ్చినప్పుడు, ఎడా పెడా ఛార్జీలు పెంచేస్తోంటే, వీళ్ళనడిగేదెవడూ?
సమాజంలో ఏ “ పెద్దమనిషి” ని అయినా అరెస్టు చేస్తే, వెంటనే ఓ ప్రకటన వింటూంటాము… “ చట్టం తన పని చేసుకుంటూ పోతుంది “ అంటూ. అలాగే, చట్టం దారి చట్టానిదీ, మన దారి మనదీనూ…
సర్వేజనా సుఖినోభవంతూ…