ఒకానొకప్పుడు, గ్రామాల్లోను, పట్టణాలలోనూ, పెంకుటిళ్ళు ఎంతో అందంగా కనిపించేవి. ఇంటి చుట్టూరా ప్రహారీ గోడ, వెనక్కాల పెరడు, పాడనేది ఉంటే, వాటికి ఓ పాక కనిపించేవి. పాలుపితకడానికీ, మేతకి తీసికెళ్ళడానికి ఓ పాలేరూ ఉండేవారు. పెరడుందంటే, కూరగాయల మొక్కలూ, ఓ పూదోటా అయితే ఉంటాయే. వీటికి సాయం, ఓ గాదె, గడ్డిమేటూ కూడా తప్పనిసరిగా ఉండేవి. ఆ ఇల్లు కూడా ఎలా ఉండేదీ, ఓ భోజనాల గది, వంట గదీ, ఇంట్లో ఉన్నవారందరికీ విడివిడిగా పడగ్గదులూ, ఆడవారు ప్రతీ నెలా విడిగా ఉండడానికి ఓ బుల్లిగదీ. ఇంక , ఇంటి యజమాని ఏ ప్లీడరో అయితే, పార్టీలని కలియడానికి, ఓ కచేరీ సావిడీ, వీటన్నిటికీ సాయం, వేసవి కాలంలో ఏ మామిడిపళ్ళో పండపెట్టడానికి ఓ గది. అన్నీ చెప్పి, ఊరగాయ జాడీలు, “ మడిగా” పెట్టుకోడానికి ఓ చేతికందొచ్చే అటకా.. వీటన్నిటికీ సాయం, ఓ నుయ్యీ, అందులో ఓ తాబేలూ. సాధారణంగా పెంకుటిళ్ళే ఉండేవి. అక్కడక్కడ డాబాలుండేవి. మరీ స్థోమత ఉన్నవారైతే రెండంతుస్థుల మేడ ఉండేది. ఇంటికి ఎంతమంది బంధువులొచ్చినా సరిపడేవారు. ఆడవారికి మాత్రమే స్నానాల గదులు. మగాళ్ళందరూ నూతి దగ్గరే స్నానాలు, మహా అయితే, ఓ పొయ్యిమీద , ఓ డేగిసాలో, వేణ్ణీళ్ళు కాగుతూ ఉండేవి. బాల్చీలో తోడుకుని పోసుకోవడం. ఏ ఇంటి అల్లుడో, అదీ కొత్తలో వస్తే మాత్రం, స్నానాల గదిలో స్నానం చేయనిచ్చేవారు, తను మరో మొహమ్మాటస్థుడైతే.
వారానికో, కనీసం నెలలో ఓ రెండు సార్లైనా “తలంట్ల “ కార్యక్రమం ఉండేది. ఇంక మొగాళ్ళకి, క్షవరకార్యక్రమానికి ఓ ఆస్థాన మంగలొచ్చేవాడు. ఎంత బధ్ధకమైనా, పిల్లలందరూ, నిక్కర్లు వేసికుని, అరుగుమీదో, ఓ స్టూల్ మీదో కూర్చుని, “ అంటకత్తెర” వేసికోవాల్సిందే. మిగిలిన సీజన్ల మాట ఎలా ఉన్నా, శీతాకాలం వస్తే మాత్రం, ఈ కార్యక్రమం చాలా కష్టంగా ఉండేది. బనీనుకూడా లేకుండా, ఓ నిక్కరూ, ఓ వైపు చలీ, దానికిసాయం, ఆ క్షవరం చేసేవాడు, జుట్టు తడపడానికి చల్లే చన్నీళ్ళూ… అడక్కండి, నరకం కనిపించేది.
ఏ పండగలకో తప్ప, అసలు కూరలకోసం సంతకి వెళ్ళడం అరుదుగా ఉండేది. స్వంత ఇళ్ళు లేక, ఏ ఉద్యోగరీత్యానో అద్దెకు ఉండేవారే ఎక్కువగా వెళ్ళేవారు.ఏదో నెలసరి పప్పులూ, ఉప్పులూ మాత్రమే బయటనుండి కొనుక్కోడం. మిగిలిన కూరగాయలన్నీ, పోపులోకి కావాల్సిన కరివేపాకూ, చారులోకి కావాల్సిన కొత్తిమిర కూడా పెరట్లోవే. అసలు సంతలూ, తీర్థాలూ అనేవి ఉండేవని, ఈ తరానికి చెందిన వారికి తెలుసూ?
ఇంక నిద్రపోడానికి, ఇంటిపెద్దకి ఓ పందిరిపెట్టె మంచం, మిగతావారికి నవారు పట్టె మంచాలు, నులకమంచాలూ, అలా..అలా సేద తీర్చుకోడానికి మడతమంచాలూ… అడక్కండి… ఆరోజుల్లో అంతగా నచ్చేవి కావు. పొద్దుటే పిల్లలకి చద్దన్నాలూ, తర్వాణీ అన్నాలూ, పదింటికి భోజనాలు చేసి, పెద్దలు ఆఫీసులకీ. మధ్యాన్నం ఏ పన్నెండున్నరకో స్కూలునుండి వచ్చి, అమ్మ చేతి కమ్మని భోజనం… శలవుల్లో అయితే, తినడానికి ఏ కారప్పూసో, చేగోణీలో బోనసూ.
ఊళ్ళో హొటళ్ళనేవి ఉన్నా సరే, ఏ రోజూ వాటి మొహం చూసిన అదృష్టం ఉండేది కాదు. నెలలో ఒకటంటే ఒకే సినిమా, మహా అయితే రెండు. అదీ విడిగా వెళ్ళేమాటైతే బెంచి టిక్కెట్టే. అమ్మానాన్నలతో వెళ్తే మాత్రం బాల్కనీ లో కుషన్ సీట్లలో కూర్చునే భాగ్యం ఉండేది. ఏ వేసవి శలవలకో, పొరుగూరిలో ఉండే ఏ చుట్టాలింటికో వెళ్ళడం, లేదా వాళ్ళు మనింటికి రావడం.. వైద్యాలకైతే, దగ్గరలో ఉండే ఏ పట్టణానికో, మరీ అస్వస్థత ఎక్కువగా ఉంటే, ఏ మెడ్రాసో, హైదరాబాదో, విశాఖపట్టణమో వెళ్ళడం. అంతదూరం వెళ్ళాల్సిన అగత్యం వస్తే, తిరిగి రావడం కూడా దైవాధీనంగానే ఉండేది.
ప్రతీ ఇంట్లోనూ తప్పకుండా ఉండేవి—చాకలికి వేసే బట్టలు పెట్టడానికి ఓ గాలివెళ్ళే,బట్టల పెట్టీ, ఉత్తరాలు గుచ్చుకోడానికి ఓ స్టీలు తీగా. చాకలి వారానికోసారి బట్టలు తీసికెళ్ళేవాడు. వాటికో పద్దుపుస్తకం, అందులో ఇస్త్రీ బట్టలు వేరూ, ఉత్తినే ఉతికే దుప్పట్లలాటివి వేరు గా పద్దు రాసేవారు. వాటికి లెఖ్ఖ విడిగా ఉండేది. అప్పుడప్పుడు, ఆ చాకలీ, తన ఇంట్లోవాళ్ళూ, మన బట్టలు వేసేసికుని అప్పుడప్పుడు కనిపించేవారు.. అది వేరేవిషయం. సేవమానవ సౌభ్రాతృత్వం అంటే అదే కాబోలు… కొత్త బట్టలు కుట్టించుకోడానికి, ఏ ఇంటి అరుగుమీదో, కుట్టు మిషను పెట్టుకుని ఉండే టైలరే దిక్కు. పండక్కి పదిహేనురోజుల ముందు ఇచ్చినా సరే, పండగ ముందురోజు వరకూ కుట్టి ఇవ్వకపోవడం, అలాగే ఏ ప్రయాణమో ఉంటే, ముందురాత్రిదాకా ఇస్త్రీచేసి బట్టలు ఇవ్వకపోవడమూ, వారి జన్మహక్కనుకునేవారు, చాకలీ, టైలరూనూ… ఇంతలా ఉన్నా సరే, ప్రతీ కుటుంబమూ కొత్తబట్టల తో పండగా చేసికునేవారూ, అలాగే ఇస్త్రీ బట్టలతో ప్రయాణాలూనూ. ఆ ఆనందాలు మళ్ళీ రమ్మంటే వస్తాయా మరి?
ఏ వస్తువు విలువైనా, అది లేనప్పుడే కదా తెలిసేదీ? అది ఓ వస్తువవొచ్చు, ఓ మనిషవొచ్చు,వ్యవస్థ అవొచ్చు ఉన్నంతకాలం, విలువలు తెలియవు. తీరా కనుమరుగైపోయిన తరువాత మాత్రం, గుర్తుచేసికుంటూ ఇదిగో ఇలా వ్యాసాలు రాయడం..
సర్వేజనా సుఖినోభవంతూ…