ఆముక్తమాల్యద
(గతసంచిక తరువాయి)
ఆరాశ్వాసాల ఆముక్తమాల్యదా ప్రబంధంలో ఐదవ ఆశ్వాసంలో వసంతఋతు వర్ణన చేస్తున్నాడు రాయలవారు. సరస, శృంగార, ప్రకృతిదర్శనా సమన్వితమైన రాయలవారి పాండితీప్రతిభకు ఈ ఘట్టం అద్భుతమైన ఉదాహరణ.
మృగమదాలేపమును మాని రగరుకలనఁ
జన్నుఁగవ మీఁది కొప్పిరి బన్నసరము
లొంటి కురువేరు పోఁచకుఁ గంటగింప
రైరి తురిమెడు సరపువ్వులం దతివలు
ఆ వసంతఋతువులో వనితలు మృగమదా లేపమును మానేశారు. కస్తూరి లేపనము మానేశారు. అగరు పొగలకు మరిగారు. అగరు పొగలు సమశీతోష్ణ ఉపచారము. కస్తూరీ లేపనము శీతలోపచారము. కనుక ఒకటి మొదలుపెట్టారు, ఒకటి మానేశారు. కుచముల మీదకు ఒరుసుకునేట్లు ముత్యాలహారాలకు అనుమతిచ్చేశారు. గడచిన హేమంతంలో హారాలు అందునా రాళ్ళహారాలు ఇంకా చల్లగా అయిపోతాయి, అసలే చలి. ఒరుసుకుని కొద్దిపాటి గాయాలైనా పెద్దవవుతాయి, కనుక అప్పుడు వేసుకోలేదు బహుశా, యిప్పుడు వేసుకుంటున్నారు. కురులలో దండలుగట్టిన పూలమాలికలలో లామజ్జకము అంటే ఒకటీ అరా వట్టివేళ్ళ పోచలు ఉన్నా పట్టించుకోవడంలేదు. యివన్నీ సమశీతోష్ణ ఉపచారాలు,
పరిమళాన్ని, మత్తును, కోరికలను పెంచే ఉపచారాలు, వసంతంలో చేసే ఉపచారాలు. వీటికి సిద్ధమయ్యారు అతివలు.
అవని నపుడు నవోదితుం డైన యట్టి
మరునకుం గుసుమర్తు వన్మంత్రసాని
బొడ్డుగోసిన కొడవలిఁ బోలె విరహి
దారకం బయ్యెఁ గింశుకకోరకంబు
కింశుకము అంటే మోదుగు. మోదుగు పూలు ఎర్రనెర్రని రంగులో ఉంటాయి. అందునా మొగ్గలు ఇంకా లేతగా ఎర్రగా ఉంటాయి. మొగ్గలు కనుక కొనలు తేలి ఉంటాయి. అది వసంతఋతువు. కనుక అప్పుడే యేతెంచిన మన్మథుడు శిశువు. మరునికి స్వాగతము పలికే వసంతఋతువు మంత్రసాని అయ్యింది. పురిటికందుకు బోడ్డుకోయడం సహజము, అవసరముకూడా. మన్మథుడు అనే పురిటికందుకు బొడ్డుకోయడానికి ఉపయోగించిన కొడవలిలా మోదుగు మొగ్గ ఉన్నది, వాడిగా, ఎర్రగా ఉన్నది, బొడ్డుగోసినపుడు లేత నెత్తురు అంటినట్లు, ఏమి ఊహ, ఏమి వర్ణన!
అసలైన మెరుపు చివరి పాదం. ఆ కింశుకములనే కొడవళ్ళు మన్మథునికి బొడ్డు మాత్రమే కోశాయి బహుశా, దానివల్ల ఆతనికి జన్మ కలిగింది. అది వసంతము కనుక, మన్మథుడు పుట్టాడు కనుక, విరహులకు మాత్రం దారకం అయ్యింది, అంటే వీళ్ళ గుండెలను కోసే కొడవలి లాగా ఉన్నది ఆ కింశుక కోరకము, మోదుగు మొగ్గ. బొడ్డుకొస్తే జననం, జనించినవాడు మన్మథుడు, విరహుల గుండె కోస్తే మరణం, విరహముతో! కనుక గుండెలు కోసినప్పుడు అంటిన రక్తం వలన కూడా ఎర్రగా ఉన్నది 'మోదుగుమొగ్గకొడవలి'! రాయల సంగీతంలో వినిపించే ధ్వనులెన్నో, వినిపించీ వినిపించకుండా మురిపించే రసధ్వనులు అన్ని! కనిపించే అందాలెన్నో, కనిపించీ కనిపించకుండా కవ్వించేవి అన్ని! ఈ క్రింది పద్యంలో రాయల రసికత యింకా రాజిల్లింది.
కుసుమము లెల్లఁ గామినుల కొప్పుల నుండ నటుండలేమి సి
గ్గెసఁగఁగ వంగినట్లు జనియించె నన ల్మరి వంగి జీవితే
శసమితి కొమ్ములం గరఁచి చల్లఁ గుచక్షణి కాంగ రాగ మౌ
టసదె యటంచు రాగిలిన యట్టులు రాగిలి విచ్చె గింశుకిన్
కుసుమములు అన్నీ కామినుల కొప్పుల్లోకి చేరిపోయాయి. పూవులన్నీ పూబోడుల తలల్లో దూరిపోయాయి. తాము అలా యింతుల కొప్పుల్లోకి చేరలేముకదా అని సిగ్గుపడిపోయాయి మోదుగుచెట్టుకు పూసిన పూలు. సిగ్గుపడడం ఎందుకంటే మోదుగుపూలకు సౌరభము ఉండదు, అదిలేని పూలు ఎవరిక్కావాలి? కనుక అలా సిగ్గుపడి వంగి పోయాయి జనించిన మోదుగుపూలు. ఐతేమాత్రం ఏం పోయింది, వాటికి అంతకన్నా, కొప్పులలో చేరడంకన్నా గొప్ప అదృష్టం మరొకటి పట్టనున్నది. వచ్చింది వసంతం కదా, వసంతాలు ఆడతారు కదా, ప్రాణేశులు, జీవితేశులు, ప్రియులు. ఆ పురుషులు మోదుగుపూలను రసంతీసి, వసంతమాడే గొట్టాలలో కొమ్ముల్లో ఆ రసాన్ని నింపి, తమ ప్రియురాళ్ళ మీద చల్లేప్పుడు, మరీ కొంటెగా వక్షస్థలం మీద చల్లేప్పుడు ఆ సుందర వక్షస్సీమపై పూతగా క్షణకాలమైనా ఉండడం అంటే తక్కువ అదృష్టమా? సిగలలో విరులై వడలి వాడి, వాలి రాలిపోవడంకంటే వక్షస్థలం మీద పూతయై యిగిరిపోవడం అదృష్టం కాదూ? అలా భావించి, ఆ రక్తి కలిగి, ఆశగా, కుప్పలు కుప్పలుగా మొగ్గలుతొడిగి విచ్చుకున్నాయేమో అన్నట్లు విరబూసిన పూలతో కింశుకావృక్షాలు, మోదుగుచెట్లు కోరికతో పూశాయి.
(కొనసాగింపు వచ్చేవారం)
**వనం వేంకట వరప్రసాదరావు