ఆముక్తమాల్యద
(గత సంచిక తరువాయి)
ఆముక్తమాల్యద ఐదవ ఆశ్వాసములో వసంతఋతువర్ణన చేస్తున్నాడు రాయలవారు.
వీరుద్ద్రుమిథున మేళన
కై రతిపతి యేయ దుస్సి హరితద్యుతిఁ బై
నారెగయఁ బొటమరించిన
నారసముల మొనలనంగ నన లవి మించెన్
వసంతఋతువులో చెట్లు లతలు చిగిర్చి వనాలు కళకళలాడుతుంటాయి. లతలు చెట్లకు మెలివేసుకుని చివుళ్ళు తొడగడాన్ని వర్ణిస్తున్నాడు రాయలవారు. లతలకు, వృక్షాలకు సంపర్కాన్ని, రతిని కలిగించడంకోసం మన్మథుడు వేసిన బాణాలు ఆ లతల వృక్షాల శరీరాల్లోనుండి దూసుకుకుపోయి వాటి మొనలు పైకి తేలి కనిపిస్తున్నాయేమో అన్నట్లు లేత పచ్చని ఎర్రనెర్రని చివుళ్ళు లతలపై, వృక్షాలపై కనిపిస్తున్నాయి. మన్మథుని బాణాలు ఒక్కటిగా చేస్తూ దూసుకుపోవడం చేత దగ్గరైనాయి లతలు, వృక్షాలు. చివుళ్ళు కనుక పచ్చ పచ్చగా, లేత ఎర్రదనం కూడా కలిగిఉన్నాయి. వాటి శరీరాలలో నుండి దూసుకుపోయి పైకి మొనలు దేలిన కారణంగా అంటిన రక్త భ్రాంతి వలన ఎర్రదనం కనిపిస్తున్నది.
తనయుదరంబునం బొడమి తామ్రరుచిచ్ఛట లుల్లసిల్లఁ గో
ల్కొను ధరణీజ సంతతికిఁ గోరకదంతము లించుకంత ని
క్కినయది యాదిగాఁగఁ జెలగెన్ వనలక్ష్మి గడుం జెలంగఁగాఁ
జనుఁ బ్రియుఁడైన మాధవుని సంగతి మీఁదటఁ జాలఁ గల్గుటన్
వనలక్ష్మికి సంతోషం కలిగింది. తన కడుపున పుట్టిన వృక్షములనే సంతానానికి ఎర్రనెర్రని కాంతులు విరజిమ్ముతూ ఎదుగుతుంటే, వాటికి మొగ్గలు అనే పాలపండ్లు వస్తుంటే అప్పటినుండీ ఆమెకు సంతోషం పెరిగిపోతున్నది. ఇక ఆమెకు తన నాధుడైన మాధవునితో సంపర్కం కలుగబోతున్నది.కనుక ఆమెకు సంతోషం కలగడం సమంజసమే.
ఋతుపరంగా వసంతరుతువులో చెట్లూ చేమలూ చిగిర్చి, దిన దినాభివృద్ది చెందుతూ మొగ్గలు తొడిగి, ఫలించి పుష్పించి వసంతం పులకించి పోతున్నట్లుగా ఉంటుంది ప్రకృతి. ఆ తరువాత మాధవునితో, అంటే వైశాఖ మాసంతో కలయిక జరుగుతుంది, చిత్రం తరువాత వైశాఖం వస్తుంది. వసంతఋతువు వసంతలక్ష్మి అనే స్త్రీ ఐంది, ఆమె సంతానం ఐన లతలకు, వృక్షాలకు తొడిగిన చివుళ్ళు పిల్లలకు వచ్చే పాలపండ్లు అయినాయి.
స్త్రీపరంగా, స్త్రీ ప్రసవించి, ఆ శిశువు దినదినాభివృద్ది చెందడం ఒక సంతోష కారణం, ఆ తరువాత పాలపండ్లురావడం యింకా సంతోషదాయకం అంటున్నాడు రసిక రాయలు. ఎందుకంటే నెలలు ముదిరినదగ్గరినుండీ శిశువుకు పాలపండ్లు వచ్చేంతవరకూ దంపతులు మైథునంలో పాల్గొనకూడదు అని భారతీయ స్మృతిశాస్త్ర నిర్దేశం. యిక ఆ హద్దు చెరిగిపోయింది కనుక, విరహము తీరిపోతుంది,
తన నాధుడు ఐన 'మాధవుని'తో కలయికకు తరుణం వచ్చింది అని వసంత'లక్ష్మి' అనే తల్లి, తరుణి సంతోషపడుతున్నది అని చమత్కారం.
మును ననల్దమిఁ బట్టి ముంగాళ్ళ ముక్కుజో డనలఁ బీలిచి పసర్కొనిన విడిచి
పరువంపువిరిగొందు లరసి చాలై త్రోవఁ బెట్టి యీరము లీఁగు పిండుఁ దగిలి
క్రొవ్విరిఁ దొలుత నొక్కఁడు కని యది వ్రాలు తరి దాని నిలబడఁ దాఁచి క్రోలి
యాకురాలుపుగండ్ల నానెడు నాస నిం తడుగూది బం కంటి యంగలార్చి
యెట్టకేలకు నొకఁ డబ్బఁ బొట్టనిండఁ
గ్రోలి యది గాలిఁ గదలినఁ గూలు నగుచు
బ్రమదవనపాలికలు వేడ్కఁ బట్ట నగుచు
మధుదినాది క్షుధాభ్రమన్మధుపచయము
వసంతంలో ప్రకృతిని, తరువులను, లతలను, పుష్పములను, స్త్రీపురుషుల విలాసాన్ని, కోకిల పాటలను వర్ణించిన వారున్నారు. తుమ్మెదల ఝంకారాలను, మత్తకాముకగజ ఘీంకారాలను,మదవతుల మదనక్రీడాలంకారాలను, ప్రకృతిని స్త్రీపురుషులను గెలిచిన వసంతుని సేనల అహంకారాలను వర్ణించినవారు ఉన్నారు. కానీ, కేవలం తుమ్మెదల దినచర్యను వర్ణించిన పద్యం ఎవరన్నా చెప్పారా? రాయలవారు రసరమ్యంగా చెప్పారు!
ముందు మొగ్గలను మోహంతో పట్టుకుని, ముంగాళ్ళతో అదిమిపట్టి, నాసికా రంధ్రాలతో తేనెను పీల్చి, అవి మొగ్గలు కనుక, కొద్దిగా పసరు, వగరు తగిలి వదిలిపెడుతాయి. అక్కడినుండి పక్వములైన పూలు ఉన్న గొందులు, సందులు వెతుక్కుంటూ గుంపులుగట్టి జోరున పొదలలో దూరి వెళ్తాయి. అక్కడ అదివరకే మధుపానం చేస్తున్న ఒక తుమ్మెదను చూస్తాయి. మధుపానాసక్తతతో, అంతకుముందు కొద్దిగా చేసిన మధుపానోత్సాహంతో ఆ తుమ్మెదను నిలబడకుండా తన్నివేసి, నేలమీద పడేసి, అక్కడినుండి తరిమేస్తాయి. ఆ కొత్తగా పూర్తిగా విరిసిన పుష్పపు మధువును తాము త్రాగిపారేస్తాయి. యింకా కుతి తీరదు. తీగనుండి ఆకులు రాలిన చోట, పూలు రాలినచోట పడిన గండ్లు కనిపించి, అక్కడి తేనెను త్రాగుదామని వ్రాలి, ఆ ఆకులు, పూలు రాలినప్పుడు కొద్దిగా స్రవించే బంక కాళ్ళకు అంటుకుని కాళ్ళు లాక్కోలేక తంటాలు పడుతాయి. ఎలానో వదిలించుకుని బయటపడి, చివరికి యింకొక పుష్పం కంటబడి పొట్టనిండా దాని తేనెను త్రాగుతాయి. యిక శరీరాలు అదుపులో లేనంత మత్తు కలుగుతుంది. గాలికిఆ పూవు, ఆ తీగె కదిలినా సరే మత్తుగా నేలమీదకు పడిపోతాయి, ఆ తోటలకు కావలిగా ఉండే తరుణులకు తేలిగ్గా దొరికి పోతాయి. తుమ్మెదలను సరదాగా, ఆటకు పట్టుకునే పడతులకు చిక్కిపోతాయి. ఈ రకంగా వసంతఋతువు తొలి దినాన, ఆ రోజు మొదలుకొని 'తాగుబోతులైన' తుమ్మెదలు తిరుగుతుంటాయి. అప్పటి ఆ తుమ్మెదలే కాదు, యిప్పటి తుమ్మెదలూ మధుపానం కోసం యిలాగే తిరుగుతుంటాయి, గమనిస్తే తెలుస్తుంది!
(కొనసాగింపు వచ్చేవారం)
***వనం వెంకట వరప్రసాదరావు