వీక్షణం - పి.యస్.యమ్. లక్ష్మి

 

శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయం, అరోరా  

హిందువులు ఏ దేశంలో వున్నా ఆలయ దర్శనాభిలాషులు కదండీ.  వారి అభిలాష తీర్చుకోవటానికి ఆలయాలు లేని ప్రదేశాలలో వారే ఆలయాలను ఏర్పరచుకుంటున్నారు.  అలాంటి ఆలయమే అరోరా లోని శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయం.

ఈ ఆలయ నిర్మాణానికి ముందు ఇక్కడివారంతా శ్రీ వెంకటేశ్వరస్వామి దర్శనానికి పిట్స్ బర్గ్ కి వెళ్ళేవారు.  1985లో ఇక్కడ నివసించే తొమ్మిది కుటుంబాలవారు 20 ఎకరాల స్ధలం, ఫార్మ్ హౌస్ తో సహా ఆలయంకోసం ఇవ్వటంతో ఆలయ నిర్మాణానికి బృహత్ పధకం రూపు దిద్దుకుంది

భావితరాలవారినికూడా దృష్టిలో పెట్టుకుని, ఆధ్యాత్మిక చింతనకు పట్టుగొమ్మగా రూపొందిన ఆలయంగనుక నిర్మాణంలో అనేక విషయాల మీద దృష్టి నిలిపారు.  ఆగమ శాస్త్రాన్ని అనుసరిస్తూనే ఆ ప్రాంతపు భవన నిర్మాణ నియమాలను, నిర్మాణ సంరక్షణ వగైరా అన్ని విషయాలలో దృష్టి నిలిపి, అనేకమంది సహాయ సహకారాలతో నిర్మింపబడిన మందిరమిది.

ఆలయ నిర్మాణంలో భారత దేశంలో ఖ్యాతి గాంచిన శ్రీ యమ్. ముత్తయ్య స్ధపతి, చికాగోలోని ప్రఖ్యాత ఆర్కిటెక్ట్, బాలాజీ భక్తులు, శ్రీ సుభాష్ నడకర్ణి, మందిర డిజైన్ రూపొందించారు.  పురాతన శిల్ప శాస్త్రానికీ, ఆధునికి భవన నిర్మాణ నైపుణ్యానికీ ప్రతీక ఈ మందిరం.

ఆలయంలో వెంకటేశ్వరస్వామి, లక్ష్మి, ఆండాళ, గణేష్, వల్లీ దేవసేనలతో కుమార స్వామి, శివుడు, పార్వతి వగైరా దేవతలకి విడివిడిగా ఆలయాలున్నాయి.  ఈ ఆలయాలన్నింటికీ కలిపి, విడి విడిగా కూడా ప్రదక్షిణ చేసే అవకాశం వున్నది.

అన్నీ బాగానే వున్నాయి కానీండీ, ఇక్కడి ఆలయాల్లో, ముఖ్యంగాతెలుగువాళ్ళు ఎక్కువగా వచ్చే ఆలయాల్లో నాకు అస్సలు నచ్చని విషయం ఒకటుంది.  వాళ్ళకి నవ్వు ముఖాలే వుండవా!?  ఏదో కొంప మునిగి పోయినట్లో, ఎవరివైపైనా చూసి నవ్వితే వాళ్ళ ఆస్తంతా లాక్కుంటారేమోననో ఎందుకలా వుంటారు?   ఎదుటి మనిషిని చూసి నవ్వితే, తగు మాత్రం పరిచయం చేసుకుంటే ఇబ్బంది ఏమిటి??  ఇతరత్రా ఇబ్బందులేమైనా వుంటే మీ ఇంటి సమాచారాలూ, మీ పూర్తి సమాచారాలూ చెప్పద్దు.  అందరూ ఒకే దేశంనుంచీ వెళ్ళినవాళ్ళు కనుక, కనీసం అక్కడ వున్నంత సేపైనా చిరు నవ్వుతో ఒకరినొకరు పలకరించుకుని, కొంచెమన్నా మాట్లాడుకోవచ్చుకదా!!  మరీ ఇబ్బందులుంటే ఆ పరిచయాలు గుడికి మాత్రమే పరిమితం చేసుకోవచ్చు.  మళ్ళీ గమనించరా అంటే అన్నీ గమనిస్తారు.  ఎవరేం చీరె కట్టుకొచ్చారా, ఎవరు కొత్తగా వచ్చారో వగైరా అన్నీ.  నేను పిచ్చి మొద్దులా ఇండియన్స్ కదా అని నవ్వబోతే మూతి బిగించుకుని వెళ్ళారు.  స్వామి నారాయణ ఆలయంలో జనాలు మరీ ఇంత బిగుసుకు పోలేదు.

ఇక్కడ వున్న కేంటీన్ లో మాత్రం వంటకాలు బాగున్నాయండీ.  పొంగల్, వడ తిన్నాము.  వేడి వేడిగా చాలా బాగున్నాయి.  ఇక్కడివాళ్ళు బయటకెక్కడికెళ్ళినా మనలాగా తినేందుకు పులిహోర దగ్గరనుంచీ చేగోడీల దాకా మూట కట్టుకు వెళ్ళరు.  ఎక్కడ పడితే అక్కడ వివిధ రకాల ఆహార పదార్ధాలు దొరుకుతాయి.  గుళ్ళల్లో కూడా.

దివాన్ స్ట్రీట్

అక్కడనుంచి బయల్దేరి దివాన్ స్ట్రీట్ కి వెళ్ళాము.  ఆ రోడ్డంతా ఇండియన్, పాకిస్తాన్ వాళ్ళ దుకాణాలే.  ఇండియాలో దొరికే అన్ని వస్తువులూ అక్కడ దొరుకుతాయి.  కొబ్బరి బొండాలు పైన ఆకుపచ్చ పీచుకూడా కొంచెం తీసేసి బోండాం అంతా తెల్లగా వుండేటట్లు, దాన్ని ప్లాస్టిక్ రేపర్ లో చుట్టి మరీ అమ్ముతున్నారు.

పటేల్ బ్రదర్స్ గ్రోసరీ షాప్స్ (కిరాణా దుకాణాలనటానికి అదేమన్నా ఇండియానా) రెండున్నాయి.  ఒకటి బాగా పెద్దది.  అక్కడ దొరకని పదార్ధాలు లేవు.  మామిడి పళ్ళు కూడా వున్నాయి.

రెండు గంటల పైన ఆ బజారులో తిరిగితే ఎక్కువగా వినిపించిన భాషలు తెలుగు, హిందీ.

పిల్లలకి సెలవలు వగైరా అనేక కారణాలవల్ల ఇక్కడితో మా చికాగో ప్రయాణం అయిపోయింది.  మర్నాడు మధ్యాహ్నం 12 గం. లకి బయల్దేరి ఈస్ట్ లేన్సింగ్ వచ్చేసరికి లోకల్ టైమ్ సాయంత్రం 6 గం. లు.(చికాగో కన్నా ఒక గంట ముందు).

మరిన్ని వ్యాసాలు

మా చార్ధామ్ యాత్ర-4
మా చార్ధామ్ యాత్ర-4
- కర్రా నాగలక్ష్మి
Maa chardham yatra
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
సినీ అప్సరస గీతాలు .
సినీ అప్సరస గీతాలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
వివేకానంద రాక్ మెమోరియల్ స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
- కుందుర్తి నాగబ్రహ్మచార్యులు