సాహితీవనం - వనం వెంకట వరప్రసాద రావు

sahiteevanam

ఆముక్తమాల్యద

(గతసంచిక తరువాయి)

ఆముక్తమాల్యదలో, తెలుగుసాహిత్య నందనవనంలో, వసంతఋతువు  రాయల కవనవిరులతో మధుర కవిత్వ మకరందాన్ని వరదలెత్తి పారిస్తున్నది. రాయలవారి ఉపమానాలు, ఊహలు వినూత్నమైనవి.విశాల సామ్రాజ్య స్థాపన, సువిశాల సాహిత్య రససామ్రాజ్య స్థాపన,భారతీయ ఆధ్యాత్మిక, వేదాంత, లలితకళా సీమల పర్యవేక్షణ, పరిరక్షణ,ప్రజారంజకంగా పరిపాలన యిన్నిటిని ఒంటిచేత్తో అవలీలగా చేసిన కారణజన్ముడు శ్రీకృష్ణదేవరాయలు. భారతమాత సిగలో మేలిమి రత్నం  రాయలు.

వసంతఋతువు వర్ణనలో ప్రతి పద్యమూ నవనవోన్మేషమైన వర్ణనా చమత్కృతితో విలసిల్లేదే,  అయినా మరీ సుందరఘట్టాలను మాత్రమే మనం పరామర్శించుకుంటున్నాము. ఈ క్రింది పద్యం అతి విచిత్రమైన భావజాల సౌందర్యమయం.

ఉరుశక్తిన్మధుమాసదోగ్ధ పిదుకన్ జ్యోత్స్నీగవీ చంద్రమన్
స్ఫురదూధఃప్రవిముక్తమైన నిబిడ జ్యోత్స్నాపయః పూరమున్ 
విరియంబారినగొజ్జెఁగ ల్గురియ మున్నీరైన యక్కమ్మనీ
రు రహిం గూడిన నేర్పరించు గములై రోలంబకాదంబముల్

దోగ్ధ అంటే పాలను పిదికేవాడు. జ్యోత్స్న అంటే వెన్నెల, జ్యోత్స్ని అంటే వెన్నెలను కలిగినది, వెన్నెల రాత్రి. గవి అంటే గోవు. ఊధ అంటే పొదుగు. మధుమాసము, వసంతమాసము అనే గొల్లడు, పాలను పిదికేవాడు బలంగా వెన్నెలరాత్రి అనే గోవుకున్న చంద్రుడు అనే పొదుగును పిదుకగా దట్టంగా వెన్నెల అనే పాలు కురిశాయి. గొజ్జంగి పూలు సముద్రమంత మకరందాన్ని కురిశాయి. వీటికి తుమ్మెదలు (రోలంబములు) కలహంసలు(కాదంబములు) ముసిరాయి. తుమ్మెదలు తేనెకోసం ముసరడం,హంసలు పాలను నీళ్ళను వేరు చేయగలవనే ఐతిహ్యం తెలిసిందే కదా. వసంతమాసంలో కురిసే నిండువెన్నెలను ఇలాంటి ప్రతీకలతో ఎవరైనా వర్ణించగలరా? అయితే యిందులోకూడా ఒక విశేషమైన చమత్కారం ఉంది. నిజానికి పాలవంటి వెన్నెల, సముద్రమంత తేనె అని చెప్పిన క్రమంలోనే  హంసలు,తుమ్మెదలు అని చెప్పాలి కదా, అలా చెప్పలేదు రాయలు, అంటే దోషం ఉన్నదా? అంటే, పాలవంటి వెన్నెలా కురిసింది, సముద్రమంత తేనె కూడా కురిసింది,  ముందుగా భూమిమీదికి పూల తేనె కురిసింది, తర్వాత ఎక్కడో పైన ఉన్న చంద్రుడి వెన్నెల కురిసింది, ముందు కురిసిన వెన్నెలకు మురిసిన తుమ్మెదలు ముందు ముసిరాయి, ఆ తర్వాత కురిసిన పాలవెన్నెలకు  హంసలు ముసిరాయి, అదీ రాయల చమత్కృతి!        

తరుణులు దోహదాన మధుధార నన ల్వకుళాళి నింపఁగాఁ 
దరుణుల మేము గామె యని తద్గతలౌ వనదేవత ల్సురన్
ధర వకుళౌఘ మెల్లను నన ల్గనఁ గ్రాయఁగ నించుబుగ్గలన్
దొరసె మధుప్రపూర్ణత మధూకములం బృథుపాండుపుష్పముల్ 

సరే, వసంతంలో చెట్లూ చేమలూ చిగిర్చడం తెలిసిందే. అయితే చిగిర్చిన చెట్ల ఫలముల, పుష్పముల దిగుబడి బాగా రావాలంటే, అకాలంలో నైనా, సకాలంలోనైనా, ఆధునిక కాలంలో అయితే రకరకాల మందులు వాడుతున్నారు, కానీ, ప్రబంధ రసబంధురమైన కాలంలో హదక్రియలు అని చేసేవారు సుందరీమణులు. అంటే ఆ చెట్ల, తీగెల జాతులనుబట్టి ఒకో దానికి ఒకో రకంగా, దిగుబడికి, సమృద్ధికి దోహదంచేసే క్రియలన్నమాట.  

అశోకవృక్షానికి అందమైన స్త్రీల కాలి తన్నుడు, పొగడచెట్టుకు అందగత్తెల ఉమ్మివేయడం, గోరంటకు కౌగిలించుకోవడం, బొట్టుగు చెట్టుకైతే కడగంటి చూపు, మామిడికైతే కరస్పర్శ, సంపెంగకు అందగత్తెల ముద్దు ముఖ కాంతులను ప్రసరింపజేయడం, ముఖాన్ని తగిలించడం, కొండగోగు చెట్టుకైతే ముద్దు ముద్దుగా ముచ్చట్లు చెప్పడం, వావిలి చెట్టుకు అందగత్తెల నిట్టూర్పు, మోరటి చెట్టుకు పాట పాడడం, సురపొన్నకు సుందరీమణుల నవ్వు దోహదక్రియలు అని సంప్రదాయం. ఇందులో కూడా అక్కడక్కడ కొన్ని అభిప్రాయభేదాలు ఉన్నాయి.

తరుణుల ఉమ్మి, లాలాజలం అనే మధుదారతో పొగడ(వకుళ)చెట్లు సమృద్ధిగా పుష్పించడం చూసిన  వనదేవతలు మేమూ తరుణులమే కదా అని, పొగడ చెట్లను దోహదక్రియతో పుష్పించేలా చేయడంకోసం, తామూ తెల్లని మద్యాన్ని పుక్కిళ్ళలో పట్టి బుగ్గలు పూరించినప్పుడు ఆ మిలమిలలాడుతున్న  బుగ్గల్లాగా ఆ వసంతఋతువులో యిప్ప పూలు ప్రకాశిస్తున్నాయి.

స్థాణు వొక్కండు మగవాఁడు తలఁక కుమియ
ఫల మొసఁగె నట్టె కినియక పద్మవదన
వదనసురఁ గూర్మి నొసఁగ నీవలదె పుష్ప
మైన ననుమాడ్కి నుమిసిన నలరెఁ బొగడ 

స్థాణువు అంటే పొగడ అని, శివుడు అనీ అర్థాలు. గతంలో ఎప్పుడో ఒక మగవాడు (తిన్నడు) అనాగరిక ఆటవికుడు ఉమ్మేసినంతమాత్రాన ఒక స్థాణువు (శివుడు)'ఫలమును'(మోక్షఫలమును) యిచ్చాడే, అటువంటిది, ఈ పద్మముఖులు ఉమ్మివేసి, వారి ముఖ లాలాజల సుధలను  యిచ్చినందుకు, అంతటి త్యాగానికి, ఉపకారానికి ఫలితంగా 'పుష్పములనైనా' ఇవ్వకుంటే ఎలా 
అని ఆ దోహదక్రియకు పొగడచెట్లు మురిసి విరిశాయి!

 
సాంద్రమకరందవృష్టి రసాతలంబు 
దొరఁగు పువ్వుల భువియుఁ బూధూళి నభము 
నీక్రమత్రయి మాధవుఁ డాక్రమించె
నురువిరోచనజనిత మహోష్మ మడఁగ 

మాధవుడు అంటే వసంతుడు అని, విష్ణుమూర్తి అనీ అర్థాలు. అలనాడు ఆ మాధవుడు త్రివిక్రముడై ముల్లోకాలనూ ఆక్రమించి విరోచనుడి కుమారుడైన బలిచక్రవర్తియొక్క మహా తేజస్సును, వేడిమిని,పోడిమిని అణచివేశాడు. యిల నేడు, ఈ మాధవుడు(వసంతుడు) మకరంద వృష్టితో రసాతలాన్ని, పూలతో భూమిని, పూల పుప్పొడి రేణువులతో ఆకాశాన్ని ఆక్రమించాడు, యిలా ఈ మాధవుడూ త్రివిక్రముడై, సూర్యుని మహా వేడిమిని అణగదొక్కాడు(ఉరు విరోచనజనిత మహోష్మ మడఁగ) అప్పటికే విరహ దావానలంలో వడలిపోతున్న గోదాదేవి ఈ వసంతుడి ప్రతాపానికి తట్టుకోలేక యాతనపడుతున్నది.          

నెలఁతఁ గుచకుంభయుగళ ముండియు వియోగ 
జలధి నీఁదింప లేదయ్యె సఖులు వంచు
చున్న పన్నీటివెల్లి లోఁ గొన్నకతన
ముంప కది లాఘవమున దేలింపఁగలదె

ప్రవాహాలను, సముద్రాన్ని కూడా కుండలను కట్టుకుని తట్టుకోవడం, మునగకుండా కాపాడుకోవడం తెలిసిందే. ఈ అతివకు, గోదాదేవికి కూడా కడవలవంటి కుచములున్నాయి, ఆమె కుచకుంభ.అయినా ఆమె వక్షోజకుంభములు తేల్చడానికి బదులుగా, మరింతగా ముంచేస్తున్నాయి ఆమెను.ఆమె తాపాన్ని చల్లార్చడంకోసం చెలికత్తెలు పన్నీటి కడవలను గుమ్మరించడం వలన, బహుశా,కడవలలో ఖాళీ ఐన పన్నీరు ఆమె కడవలవంటి కుచములలో నిండిపోయిందేమో, నిండు కుండలు కట్టుకుంటే తేలేవాడు కూడా మునగడం ఖాయం కనుక, ఆమె వియోగ జలధిలో మునిగిపోయింది.      

పుత్త్రియుఁ దాఁ గామిని నొక 
పుత్త్రియు నట్లుండుటకు నబుద్ధేక్షుధనుః 
పత్త్రి యగు విష్ణుచిత్తుఁ డ
పత్త్రపలే కదియు నేతపంబో యనుచున్ 

ఆమె యాతనలను, ఆ దుర్భర విరహావస్థను చూసిన అమాయకుడు, ఆమె తండ్రియైన విష్ణుచిత్తులవారు కొడుకుల్లేనివాడు కనుక, ఉన్న ఒక్క పుత్రికా అలా పరితపిస్తూ ఉండడాన్ని అర్థం చేసుకోలేకపోయాడు. 'అబుద్ధ ఇక్షు ధనుః పత్త్రి ..' చెరుకువింటివాని పూలబాణాల గురించి తెలియనివాడు కనుక, అదికూడా, ఆ విరహావస్థ, ఆ తిండీ తిప్పలూ మానడం, అదంతా ఏ తపస్సో, ఏ ఉపవాసాలో, ఏ నియమాలో  అనుకున్నాడు పాపం. అనుకుని, ఏమిటీ తిప్పలు, ఏ దేవదేవుని గురించి, ఏమి తపస్సు అనేది తెలియడంలేదు స్వామీ! నీకు తెలియనిది ఏదీ లేదుకదా, యిదేమి తపస్సో చెప్పవయ్యా అని పరమాత్ముడిని అడిగాడు. ఆ మాధవుడు మందస్మితుడై చెప్పడం ప్రారంభించాడు అని ఆముక్తమాల్యదలో ఐదవ ఆశ్వాసాన్ని ఈ క్రింది పద్యంతో పూర్తిచేశాడు శ్రీకృష్ణదేవరాయలు. 

కంధరనీలవర్ణ! మధుకైటభనాగసువర్ణ! యోగిహృ
ద్గ్రంధిభిదోత్థభోగివనితాస్వనవఛ్చ్వసనస్రవచ్ఛిర 
స్సంధివసన్నిశాపతిరససృతిదగ్ధపయోధివీచికా 
మంధరకేళికాదర!సమాశ్రితపఙ్క్తిశిరోధిసోదరా! 

నీలిమేఘమువంటి శరీరకాంతిని కలిగినవాడా! మధుకైటభులు అనే నాగుల పాలిటి గరుత్మంతుడా! యోగుల హృదయగ్రంథులు భేదింపబడడం వలన లేచిన కుండలినీ శక్తి అనే నాగకన్య వెలువరిస్తున్న బుసలధ్వనితో కూడిన, నిట్టూర్పులతో కూడిన, కపాలం మధ్యలో, స్రవిస్తున్న అమృతం అనే పాలకడలిలో నిదానంగా, హాయిగా, తీరికగా, స్వేచ్ఛగా క్రీడించడాన్ని ఆదరించేవాడా, యిష్టపడేవాడా!  పదితలల రావణుని సోదరునిచేత ఆశ్రయింపబడినవాడా! వేంకటాచలపతీ! వినుమయ్యా! యిది  నాచే విరచితమైన హృద్యములైన పద్యముల ఆముక్తమాల్యదలో ఐదవ ఆశ్వాసము అని ఐదవ ఆశ్వాసాన్ని ముగించాడు శ్రీకృష్ణదేవరాయలు.  

రాయల ప్రౌఢ, సమాసబంధురమైన శైలికి, భాషా పటిమకు, క్లిష్టతకు ఈ పద్యం ఒక ఉదాహరణ. దాదాపు  మూడుపాదాలమేర దీర్ఘమైన, దివ్యమైన కుండలినీయోగరహస్యమయమైన సమాసాన్ని యిమిడ్చాడు. ఈ పద్యాన్ని వరుసగా మూడుసార్లు ఉచ్చారణా దోషాలు లేకుండా చదువగలిగినవాడు తెలుగుభాషను,  సాహిత్యాన్ని అలవోకగా కరతలామలకం చేసుకున్నట్లే!  

(కొనసాగింపు వచ్చేవారం)
***వనం వేంకట వరప్రసాదరావు.

మరిన్ని వ్యాసాలు

మా చార్ధామ్ యాత్ర-4
మా చార్ధామ్ యాత్ర-4
- కర్రా నాగలక్ష్మి
Maa chardham yatra
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
సినీ అప్సరస గీతాలు .
సినీ అప్సరస గీతాలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
వివేకానంద రాక్ మెమోరియల్ స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
- కుందుర్తి నాగబ్రహ్మచార్యులు