హిమగిరి కైలాశ దర్శనం - కర్రా నాగలక్ష్మి

హిమగిరుల మధ్య నున్న కైలాశ మానస సరోవరం యాత్ర చేసి వచ్చేక బొంది తో కైలాశం వెళ్లడం అంటే యిదేనేమో అని అనిపించక మానదు . అదేమిటో మీరూ తెలుసు కోవాలనుకుంటున్నారా ? అయితే మా యాత్రా నుభవాలు చదవాల్సిందే ఆలస్యమెందుకు చదివెయ్యండి . భవిష్యత్తు లో యీ యాత్ర చెయ్యాలనుకొనే వారు కూడా చదివితే యాత్రను సునాయాసంగా చేసుకోడానికి ఉపయుక్తంగా వింటుందని హామీ యిస్తున్నాను .

ఎన్నాళ్ళుగానో కలలు కంటున్న  కైలాశ యాత్ర 2012 వ సం.. లో శివుని ఆజ్ఞ లభించడం తో మా దంపతులం మాకు తెలిసిన వారు యెవరెవరు యాత్ర చేసి వచ్చారో వారిని అడిగి వివరాలు  సేకరించి కొంత , నెట్ ద్వారా కొంత సమాచారం సేకరించి మా ట్రావలర్ ఏజంట్ ని యెంచుకున్నాము . వాళ్ళ దగ్గర వున్న వివరాల ప్రసారం మాకు నచ్చిన టూరుని యెంచుకున్నాం . మా స్నేహితులకు , బంధువుల కు యాత్ర వివరాలు చెప్పి రాగలరేమో అడుగుగా వారు రాకపోవడమే కాక మా మనోబలాన్ని కూడా దిగ జార్చేటట్టు మాట్లాడసాగేరు . ఎవరొచ్చినా మానినా మేమిద్దరం వెళుదామనే నిర్ణయించు కున్నాం . యాత్రల విషయం లో తోడు లేరని మనం వెళ్లడం మానేస్తే ఆ యాత్ర అతి కష్టం మీద పూర్తి చెయ్యడం మాకు అనుభవమే . అందుకే మేమిద్దరమే వెళ్ళేందుకు నిర్ణయించు కున్నాం .

అప్పుడు మావారు ఏజంటు తో బేరసారాలు మొదలుపెట్టేరు . ఆంధ్ర ప్రాంతానికి వారి ద్వారా నియమింప బడ్డ ఏజంటు ఫోను నంబరు వగైరాలు వారు అందజేసేరు . ఈ లోగా ఓరోజు పొద్దున్నె మా చిన్నాన్న గారి అమ్మాయి అల్లుడు ఫోను చేసి వారు కూడా వస్తున్నట్లు , వారితోపాటు మామరిదిగారి అన్న కూతురు పాతికేళ్ళ శోభ కూడా వస్తున్నట్లు తెలియజేసేరు . మేము స్వయం గా ఆంధ్ర ప్రాంతపు ఏజంటు ని కలిసి మా సందేహాలు తీర్చుకొని , మా పాసుపోర్టులు అతనికి అందజేసి మాప్రయాణపు తేదీలు ఖరారు చేసుకున్నాము .


సాధారణంగా నెలలో రెండు మార్లు యాత్ర బయలు దేరుతుంది . మొదటిది పున్నమికి మానస సరోవరం దగ్గర వుండడం , రెండవది అమావాస్య కు మానస సరోవరం దగ్గర వుండడం . మొదటి యాత్రకి వారు వసూలు చేసే ఛార్జలు యెక్కువగా వుంటాయి . పున్నమి వెన్నెల వెలుగులో మానస సరోవరం అందాలు చూడాలనే తపన వొకటి , పున్నమి నాడు అర్దరాత్రి మానస సరోవరం లో స్నానం చేసేందుకు దేవలోకం నుంచి దేవతలు జ్యోతుల రూపంలో వచ్చి ఆసమయానికి అక్కడ వుండే మానవులకు దర్శనం యిస్తారుట , ఆ దేవతల సత్యమేమిటో తెలుసుకోవాలనే కుతూహలం వొకటి ఈ రెండు కారణాల వల్ల మేము బుద్దపూర్ణిమకి మానస సరోవరం వద్ద వుండేటట్టు తారీఖు ఖరారు చేసుకున్నాము .

మొత్తం మాటూరులో మేము చెల్లించిన సొమ్ముకు మాకు వారిచ్చే సదుపాయాలను ఒకటి పదిమార్లు అడిగి తెలుసుకున్నాము అలాగే మా సౌకర్యం కోసం ఒక టూరు గైడు గా అతనిచ్చే సలహాలను కూడా అడిగి తెలుసుకున్నాం .

మేము చెల్లించిన సొమ్ముకు ఖాట్మండులో స్టారు హొటలు సదుపాయం , మిగిలిన ప్రదేశాలలో దొరికే మంచి సదుపాయాలు కలిగిన గదులు యివ్వబడతాయని  , మానస సరోవరం దగ్గర , కైలాశపర్వతం దగ్గర , పరిక్రమ సమయంలోను టెంటులుగాని , రేకుల షెడ్లు గాని కేటాయిస్తాము అని , మేము యెంచుకున్న టూరు రోడ్డు మీదుగా వెళ్ళేది కాబట్టి చైనా ఆక్రమిత టిబెట్టు లో నలుగురు లేక యెక్కువ మంది పట్టే జీపులు లేక వేనులలో ప్రయాణించ వలసి వుంటుందని , ప్రతీరోజు మూడు పూటలా భోజనాల యేర్పాట్లు వాళ్ళవేనని , రైన్ కోట్లు , చలికి తట్టుకొనే మందమైన కోటు , మనిషికి ఒక పెద్ద బేగు ఒక చిన్న బేగు చొప్పున యిస్తామని చెప్పి , మేము బుక్ చేసుకోగానే చలికోటు తప్ప మిగతావి మాకు యిచ్చేరు . చలికోటు ఖాట్మండులో యిస్తారు దానిని తిరిగి ఖాట్మండులో వాపసు చెయ్యాలని చెప్పేరు .

వారు మనకు యివ్వనివి , మనం తప్పనిసరిగా తీసుకొని వెళ్ళవలసినవి యేమిటంటే 1) పేపర్ రోలు , 2) ఫ్లాస్క్ , 3) చలి బట్టలు నాలుగు జతలు  , 3) నాలుగు జతలు మేజోళ్ళు , 4) గ్లౌస్ ,  5) ధూళి ముక్కులోకి పోకుండా వాడే మాస్క్ , 6) మంచు లోనడవడానికి పనికి వచ్చే షూష్ , 7) తల కప్పు కోడానికి వూలు టోపి , మఫ్లరు , 8) ఆవనూనె  , 9) మోయిశ్చరైజింగు క్రీము , 10) చాక్లట్స , స్నేక్స , ఊరగాయలు , 11) ధర్మల్ వేర్ యిన్నర్స్ రెండు జతలు  కాకినాడ నుంచి మా చెల్లి వాళ్ళు , పూనా నుంచి మేము అన్నీ సర్దుకొని ఢిల్లీ చేరేం . ఢిల్లీ నుంచి యింక అంతా ' శ్రేష్ఠ ' వారి దే బాధ్యత . ఎందు కంటే వారే మా టూరు ఆర్గనైజర్లు .  ఢిల్లీ విమానాశ్రయం లో ఒకతను మా టికెట్లు  , పాసుపోర్ట్స్ యిచ్చి హేపీజర్నీ చెప్పి వెళ్ళి పోయేడు . సుమారు రెండున్నర గంటల తరువాత ఖాట్మండు విమానాశ్రయం లో దిగేం . ఖాట్మండు విమానాశ్రయం యేమాత్రం ఆంతర్జాతీయ ప్రమాణాలకు తగ్గట్టు  గా వుండదు . మనదేశంలోని ఓ పాటి రైలు స్టేషను అంతకంటె పెద్దదిగా శుభ్రంగా వుంటుంది అని అనిపించింది . విమానాశ్రయం బయట మమ్మలని హొటలుకి తీసుకు వెళ్ళేందుకు వచ్చిన  అతను మమ్మల్ని హోటలుకి తీసుకు వెళ్లి , సాయంత్రం మా గైడు మమ్మల్ని కలుస్తారని తెలియ జేసేరు .


 అప్పటికే సాయంత్రం అయిదు అవడంతో టీ తాగి హొటల్ తోటలో ఫొటోలు తీసుకొనే సరికి సాయంత్రం అయింది . మొత్తం మా గ్రూపు లో 48 మందిమి వున్నాము . అప్పటి వరకు 30 మంది చేరేము . మిగతా 18 మంది " ఇండోరు " నుంచి రావలసిన వారు మరునాడు వస్తారు కాబట్టి మా యాత్ర ముడో రోజు మొదలవు తుంది  అని చెప్పేరు . ఆ రెండు రోజులలో ఒక రోజు టూరు వాళ్ళు ఏర్పాటు చేసిన స్థానికంగా చూడ దగ్గ ప్రదేశాలు చూపించడానికి కారు యిస్తామని  , రెండో రోజు ఎక్కడకైనా వెళ్ళదలచు కొంటే మా ఖర్చులతో హెలీకాఫ్టర్  లో అన్న పూర్ణా పర్వత శ్రేణులు చూడడం వొకటి  , రెండు మనోకామనా దేవిని దర్శించు కోవడం వొకటి చేసుకోవచ్చని సలహా యిచ్చేరు . మనోకామనా దేవి దర్శనం అంటే అలసట అవుతుందని , ముందు కష్ఠ తరమైన యాత్ర వుంది కాబట్టి ఎక్కువగా అలసట లేని హెలీకాఫ్టర్ యాత్ర యెంచుకున్నాం . మనిషికి 5000 రూ.. ముందుగా మాదగ్గర తీసుకొని హెలీకాఫ్టర్ బుక్ చేసి మమ్మల్ని విమానాశ్రయానికి వారి కార్లలోనే మాకు కేటా యించిన సమయానికి అరగంట ముందు దిగబెట్టేరు .

 

నిజానికి అవి హెలీకాఫ్టర్ లు కావని చిన్న విమానాలని అక్కడికి వెళ్ళేక తెలిసింది . పది పన్నెండు మంది కూర్చోగలిగేంత విమానం , ముందుగా ఖాట్మండు పట్టణం పైన ఓరౌండు తిప్పి , రాజప్రాసాదం మొదలయిన వాటిని చూపించి తరువాత అడవులు , కొండలు దాటుకొని మంచు పర్వతాల పైకి తీసుకు వెళ్ళేరు .  ఈ లోపున ప్రయాణీకులకు బోరు కొట్ట కుండా ఒక్కొక్కరిని కాక్ పిట్ లోపలకి తీసుకు వెళ్ళి అంతా చూపించేరు .

ఆ మంచు కొండలని అలా పైనించి చూడడం మాటలలో వర్ణింప లేని అనుభూతి , నోటంట మాట రాలేదు . మొత్తం టూరుకి ఖర్చు చేసిన రెండు లక్షల పై మరొక్క పది వేలే కదా మళ్ళా యిలాంటి అవకాశం రాదు అనే నా నస భరంచలేక ముఖం ముడుచుకొని వచ్చిన మా వారు కూడా " అద్భుతం పది వేలకి వెనక తీసి వుంటే మనం ఒక అద్భుతమైన అనుభవాన్ని పోగొట్టు కొనేవాళ్ళం , నేపాల్ వెళ్ళే వాళ్ళకి ఈ టూర్ కి తప్పకండా వెళ్లమని చెప్పాలి " అనే మాటలు వచ్చేయి .

అన్నపూర్ణ పర్వత శ్రేణులు మొదలవ గానే విమానకన్య స్పష్ట మైన హిందీ లో మేము చూస్తున్న పర్వతాల వివరాలు చెప్పసాగింది .       అన్నపూర్ణ పర్వత శ్రేణులు మొత్తం 55కిలోమీటర్ల విస్తీర్ణంలో వ్యాపించి వున్నాయి . ఇందులో అతి ఎత్తైన శిఖరం సుమారు 8 వేల మీటర్లు  , ప్రపంచంలోని ఎత్తైన శిఖరాలలో పదవ స్థానం పొందింది . దీనిని అన్నపూర్ణ 1 అని హిందువులు ఈస్వరుడని అంటారు . అలాగే వరుసగా 7 వేలు , 6 వేలు మీటర్ల ఎత్తున్న శిఖరాలను అన్నపూర్ణ 2 , అన్నపూర్ణ 3 అని ( పార్వతి , గణేశుడు ) అంటారు . అన్నపూర్ణ 1 శిఖరాన్ని అధిరోహంచడం పర్వతా రోహకులు ఛాలెంజ్ గా భావిస్తారు . ఈ శిఖరాన్ని అధిరోహంచడం కష్ట సాధ్యమని భావిస్తారు . దీనికి యిక్కడి వాతావరణం కూడా ఒకకారణం గా చెప్పొచ్చు . ఈ పర్వత శ్రేణులకు పశ్చిమాన కాళీగండకీ గోర్జ్ , తూర్పున  , ఉత్తరాన మార్షాంగ్డి నది , దక్షిణాన పోకరా లోయ వున్నాయి . అన్నపూర్ణ పర్వత శ్రేణులు అంత మయ్యే దగ్గర నుంచి అన్నపూర్ణ శాంచురీ మొదలవుతుంది . 7,629 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగిన యీ ప్రదేశాన్ని నేపాలు ప్రభుత్వం ' అన్నపూర్ణ కన్జర్వేషన్ ఏరియ ' పేరు తో సంరక్షిత ప్రాంతం గా ప్రకటంచింది .

సూర్యోదయ సమయంలో మా ప్రయాణం సాగడం వలన మంచు పర్వతాలు పిసిడి పర్వతాలు గా కనిపించి మమ్మలని మరింత మురిపించేయి .

తరవాత బుల్లి విమానం ఎవెరెస్ట శిఖర దర్శనం చేయించింది . మంచుతో కప్పబడ్డ చిన్న పెద్ద పర్వతాల మధ్య గర్వంగా నా యెత్తు చూడండి నన్ను అందుకోగలరా ? అని సవాలు చేస్తున్నట్లు వున్న ఎవెరెస్ట శిఖరాన్ని చూడగానే అదోలాంటి ఉద్వేగానికి లోనయేం . ఆ వుద్వేగానికి కళ్ళంట నీళ్ళు రాసాగేయి . ఆ అనుభూతిని అనుభవించ వలసినదేగాని వర్ణించడానికి మాటలు చాలవు . టిబెట్టు ప్రజలచే ' ఛమోలాంగ్మా ( మంచు దేవి ) ' అని నేపాలు ప్రజలచే ' సాగరమాత ( సృష్టి మాత ) ' అని పిలువ బడుతూ ప్రపంచ వ్యాప్తంగా ఎవరెస్ట్ గా పిలువబడుతూ 8,850 మీటర్ల ఎత్తున్న ఆ శిఖర దర్శన భాగ్యం కలగడం నిజంగా పూర్వ జన్మ లో చేసుకున్న పుణ్యమేమో అని అనిపించింది .

రెండు గంటల బుల్లి విమానయాత్ర మాకు యెంతో సంతోషాన్ని యిచ్చింది . తిరిగి విమానాశ్రయం లో దిగే సరికి ఆకాశంలో మబ్బులు కమ్ము కోవడం , తరువాత బయలు దేరవలసిన టూరు రద్దు చేయబడడం తో వాతావరణం అనుకూలించక పోవడం అంటే యేమిటో అర్దం అవసాగింది . 

పసుపతినాథ్ మందిరం , గుహ్యా దేవి మందిరాల గురించి తరువాత సంచికలో తెలుసుకుందాం .

మరిన్ని వ్యాసాలు

మా చార్ధామ్ యాత్ర-4
మా చార్ధామ్ యాత్ర-4
- కర్రా నాగలక్ష్మి
Maa chardham yatra
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
సినీ అప్సరస గీతాలు .
సినీ అప్సరస గీతాలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
వివేకానంద రాక్ మెమోరియల్ స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
- కుందుర్తి నాగబ్రహ్మచార్యులు