మనసు తడి ఆరనీకు - పుస్తక సమీక్ష - సిరాశ్రీ

manasu tadi aaraneeku

రచన: ఓంప్రకాశ్ నారాయణ వడ్డి

వెల: 90/-

ప్రతులకు: సాహిత్య నికేతన్, 3-4-852, కేసవ నిలయం, బర్కత్ పురా, హైదరాబాద్-27
దూరవాణి: 040-27563236

రచయితను సంప్రదించాలంటే :
దూరవాణి-  9985474888
ఈ మెయిల్- [email protected]

చాలా కాలం తర్వాత నిజంగానే మనసు తడిని తడిమిన కథాగుఛ్ఛం ఈ 'మనసు తడి ఆరనీకు’.

నగరవాసి, పట్టణ వాసి, పల్లె వాసి అన్న తేడా లేకుండా మాధ్యమాల నడుమ నలిగిపోతూ మూలాల్ని, మనిషి తనాన్ని మరిచిపోయిన సగటు మానవుడికి మట్టి వాసనని,ఆర్తిని, ఆర్ద్రతని గుర్తుచేసే పుస్తకం ఇది. ఏ కథ మొదలుపెట్టినా ఒక దృశ్యకావ్యంలా సాగుతూంటుంది. కథ కంచికి చేరేసరికి మనసుని తడి చేసి కళ్ళల్లో చెమ్మ చేరుస్తుంది. కథన శైలి, పదాల అల్లిక ఎక్కడా ఇబ్బంది పెట్టవు.

మొదటి కథ 'నాణాకి రెండొ వైపు’ సరదాగా నడిచి చక్కటి ముక్తాయింపు పలుకుతుంది. జీవిత భాగస్వామిని అర్థం చేసుకోవడానికి ఏడుకొండలవాడు ఇచ్చిన వరం ఒక భర్త జీవితాన్ని ఏలా ప్రభావితం చేసిందనేదే ఈ కథ. కొంత సోషియో ఫాంటసీ ఛాయ కనిపించినా స్వప్న వృత్తాంతంగా మలిచి వాస్తవానికి దగ్గరగా తీసుకొచ్చారు రచయిత.

‘దిల్ హై తో బస్’ లో రచయిత ఒక స్త్రీ పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసి కథావిష్కరణ చేసిన తీరు ప్రశంసించాల్సిందే. పల్లెటూరి స్త్రీ మనసులోని సున్నితత్వం, అమాయకత్వం ఆవిష్కరిస్తూ భారతీయతను చాటే కథ.

ఇక ‘దారి తప్పిన కోయిల’ కూడా రచయిత స్త్రీ మనసులోంచి రాసిందే. ఒక ఉత్తరంగా కనిపించే ఈ కథ ముగింపులో మనసుని తడి చేయడం ఖాయం.

‘ఆత్మావలోకనం’ మరో చక్కటి కథ. జీవితాన్ని మెదడుతో కాకుండా మనసుతో జీవిస్తే ఏలా ఉంటుందో ఆలొచింప చేస్తుంది.

‘జాలి కోల్పోయిన మనిషి’ ఆసక్తిగా మొదలై సాగుతుంది. కర్మ సిధ్ధాంతాన్ని, మానవత్వాన్ని మెత్తగా తాకుతుంది ఆ కథ.

ఇక ఈ పుస్తకంలోని 19 వ కథ రచయితకి నచ్చిన కథ అని వేరే చెప్పక్కర్లేదు. ఎందుకంటే ఆ కథ టైటిల్ నే ఈ పుస్తకానికి టైటిల్ గా పెట్టుకున్నారు—‘మనసు తడి ఆరనీకు’. సినిమా వాసన అంటిన మనిషి ఎలా మరతాడు అనేది ఈ కథలో ఇతివృత్తం అయినా నిజానికి డబ్బు, పరపతి పెరిగేసరికి మనిషి మనసు ఎలా రూపాంతరం చెందుతుందో కనిపిస్తుంది ఇందులో. ముగింపుని ఒక శెష ప్రశ్న లా వదిలివేయడం రచయిత చేసిన మంచి పని. ఈ కథకి ముగింపు పాఠకుల ఊహదే.

ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి కథా ఒక అనుభూతిని ఇచ్చేదే. ప్రతి పాత్ర మన మధ్యలో కదలాడాదే. ఎక్కడా మితి మీరిన భావుకతలు, అనవసర ఉపోద్ఘాతాలు, దృశ్య వివరణలు లేకుండా నేరుగా విషయంలోకి వచ్చేస్తుంటాయి కథలన్నీ.. అదే రచయితను ఈ కాలం పాఠకుల మెప్పు పొందేలా చేస్తుంది.

ఇక్కడ చెప్పుకోవాల్సిన మరో విషయం ఏమిటంటే రచయిత వడ్డి ఓంప్రకాశ్ నారయణ వృత్తి రిత్యా ఒక మీడియా చానల్ లో పని చేస్తుంటారు. సాధారణంగా మీడియా లొ పని చేసేవారికి వృత్తి లక్షణంగా ఏ విషయం మీదా అయినా అదే పనిగా ఆలొచించే పరిస్థితి ఉండదు. ఒక విషయం గురించి మనసు పొరల్లోంచి ఆలొచించే లోగా ఇంకో అంశం ఎదురుపడుతుంది. పాతది వదిలేసి కొత్తది పట్టుకోవాలి. అలా తాత్కాలిక భావోద్వెగాలు పొందీ, పొందీ క్రమంగా మనసు తడి ఆరిపోతూ ఉంటుంది.  కానీ వడ్డి వారు ఆ తడి ఆరనీయకుండా నిలుపుకుని ఇంత చక్కటి కథలు రాయగలిగారంటే వారిని మనసు తడితో ప్రశంసించాల్సిందే.

ఆచార్య కొలకలూరి ఇనాక్ ఈ పుస్తకం ముందుమాటలో చెప్పింది నిజం.."పుస్తకం చదివాక మీరు ఓంప్రకాశ్ తో ప్రత్యక్షంగానో, పరోక్షంగానో స్నేహం చేస్తారు".

మరిన్ని వ్యాసాలు

కల్పవృక్ష వినాయక స్వరూపం శిల్పి
కల్పవృక్ష వినాయక స్వరూపం శిల్పి
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
సంత్ నరహరి సోనార్
సంత్ నరహరి సోనార్
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
మా చార్ధామ్ యాత్ర
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
Viswakarma
విశ్వకర్మ
- శ్రీ కుందుర్తి నాగబ్రహ్మచార్యులు అద్దంకి
తొలి వలపు తొందరలు...
తొలి వలపు తొందరలు...
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు