అవీ - ఇవీ - భమిడిపాటి ఫణిబాబు

 

 ఇదివరకటి రోజుల్లో, ఏదైనా వస్తువు కొనాలన్నప్పుడు, ఒక ప్రత్యేక “ బ్రాండ్” కే అలవాటు పడేవారు. ఉదాహరణకి  సబ్బుల విషయానికొస్తే  “లక్స్  (LUX )“, పాదరక్షల విషయానికొస్తే  “ బాటా ( BATA )”, పిల్లలకి పట్టే పాల విషయానికొస్తే  “ గ్లాక్సో ( GLAXO )”, లేదా “ గొల్లభామ ( MILK MAID )”, పళ్ళుతోముకోడానికి  “ కోల్గేట్ ( COLGATE)” , “ బినాకా ( BINACA) “ఇంక పిల్లలకి పట్టడానికి “  వుడ్ వర్డ్స్ గ్రైప్ వాటర్ ( WOODWORDS GRIPE WATER) “, చివరాఖరికి ఓ  ఇంగువ కొనాలన్నా  “ ఎల్ జి  ( LG ) “ మార్కు ఇంగువే కొనేవారు. పైగా ఆరోజుల్లో విదేశాలనుండి వచ్చేవి. అదొక మోజు కూడా కావొచ్చు. “ ఓవల్టీన్  ( OVALTINE) “  అని ఒకటుండేది..

కాలక్రమేణా, దేశంలోని చాలా కంపెనీలు కూడా, ఉత్పత్తి రంగంలోకి దిగిపోయి, విదేశీ సరుకులకు దీటుగా తయారుచేయడం ప్రారంభిచారు. అదే కాకుండా, విదేశీ కంపెనీలు, భారత కంపెనీలతో భాగస్వామ్యం  పెట్టుకుని, తమ తమ బ్రాండ్ లని అమ్మడం మొదలెట్టారు. ప్రసారమాధ్యమాలలో ప్రకటనలద్వారా  కూడా తమ అమ్మకాలు పెంచుకుంటున్నారు. ఒక్కొక్కప్పుడు, ఒక్కో ప్రకటన చూస్తే నవ్వొస్తూంటుంది.   ఒకానొకప్పుడు, దంతధావనానికి, కచికో, నంజన్ గూడ్ వారి పళ్ళపొడో , ఉప్పో వాడేవారు. ఒక్కోప్పుడు  బొగ్గు పొడికూడా. ఆరోజుల్లో, అంటే  కాల్గేట్  వారు, పేస్టు కొత్తగా తెచ్చినరోజుల్లో, మనం అప్పటిదాకా వాడేవన్నీ, ఏదో ఇక్ష్వాకుల రోజుల్లోవనీ, వాటిని మానేసి తాము తయారుచేస్తూన్న పేస్టునే వాడమనీ ప్రకటనలు చేసేవారు. చిత్రం ఏమిటంటే, అదే  కాల్గేట్ వారు, ఈరోజుల్లో… “మీపేస్టులో ఉప్పుందా”,  “ మీ పేస్టులో బొగ్గుపొడి ఉందా “ అంటూ హోరెత్తించేయడం.

 

ఎల్ జి  కంపెనీవారు దేశంలో కొత్తగా కలర్ టీవీలు మొదలెట్టినప్పుడు, చాలామంది, దాన్ని “ ఇంగువ” తయారుచేసిన కంపెనీయే అని భ్రమ పడ్డారు. ఈరోజుల్లో అయితే, ప్రతీ వస్తువునీ, అనేక కంపెనీలు తయారుచేసి, మార్కెట్ లోకి దించుతున్నాయి. ఒక్కోదానికీ ఒక్కో ప్రత్యేకత అంటారు. ధరలు కూడా అదేప్రకారం ఉంటాయి. ఈరోజుల్లో అంతా పోటీ ప్రపంచమే కదా. ఇంకో చిత్రం ఏమిటంటే, ఒకే వస్తువు/ పదార్ధం  లను ఉన్నపేరుకి, ఇంకోటేదో జోడించి, ధర పెంచేయడం. కొత్తగా ఏమి చేశారో, ఆ భగవంతుడికే తెలియాలి. చేతిలో డబ్బులు ఎక్కువగా ఉండడం మూలాన, కొంతమందికి   ఎంత ఎక్కువ ధర అయితే క్వాలిటీ అంత బావుంటుందనే  ఓ దురభిప్రాయం ఉంది. పైగా విదేశాల్లో ఉన్నట్టు  “  Use and Throw”  ప్రవృత్తి ఇక్కడ కూడా పాకింది. అందుకేనేమో, ఏదైనా బ్రాండెడ్ వస్తువుకి రిపేరీ వచ్చిందంటే, వేలకు వేలు వసూలు చేస్తారు.  దీనితో, ఊరికే ఖర్చుపెట్టడం దేనికీ, దీన్ని పారేసి, కొత్తది కొనడమే చవకేమో అనే అభిప్రాయానికి వచ్చేశారు. దీనితో, సెకండ్ హ్యాండ్ వస్తువుల అమ్మకానికి కూడా, కొన్ని వ్యాపార సంస్థలు పుట్టుకొచ్చాయి.

అర్ధం కానిదల్లా ఒక విషయం—ఇదివరకటి రోజుల్లో, ఓ వస్తువు, ఓ టీవీ అనండి, ఓ ఫ్రిజ్ అనండి, ఓ కెమేరా అనండి , ఓ మిక్సీ అనండి ఇలా ఎలాటి ఎలక్ట్రానికి వస్తువైనా, కొంటే, చాలా సంవత్సరాలు విశ్వాసంగా పనిచేసేవి కదా. ఏదో మరీ పాతవస్తువయిపోయిందని మార్చడం కానీ, పనిచేయడం లేదని మార్చిన సందర్భాలు బహు తక్కువ. మరి  ఈరోజుల్లో ఏ వస్తువూ, ఓ మొబైల్ అనండి,  రకరకాల వస్తువులు అన్నీ కూడా, గ్యారెంటీ పిరియడ్ పూర్తయిన కొన్నిరోజులకల్లా, పాడైపోయి, కొన్న ఖరీదుకంటే, రిపేరీ ఖరీదులే  ఎక్కువగా ఎందుకవుతున్నాయి? ఈ విషయం మీద ఎవరూ, దృష్టి పెట్టరు.తాముతయారు చేసిన వస్తువులు ఎంత త్వరగా అమ్ముడైపోతాయనే కానీ, క్వాలిటీ పెంచాలని మాత్రం, ఏ కంపెనీ ఆలోచించదు. ప్రతీ వస్తువుకీ, ఓ సర్వీసు సెంటరూ, ఓ హెల్ప్ లైన్ నెంబరూ. ఆ రిపేరు చేసేవాడి రాకపోకలకి ఛార్జీలూ. కొత్తవాటిలో క్వాలిటీ తగ్గినట్టా? లోగుట్టు పెరుమాళ్ళకే ఎరుక.

అన్నిటిలోకీ చిత్రం ఏమిటంటే, ప్రముఖ బ్రాండ్ల ఉత్పత్తుల్లా కనిపించే, డూప్లికేట్  వస్తువులు. రోడ్ల పక్కనే అమ్ముతూంటారు. దూరంనుండి చూస్తే, అసలుకీ, నకిలీకీ తేడా తెలియదుకూడా.ఈమాత్రం దానికి వేలకివేలు పోసి  బ్రాండెడ్ వస్తువులే ఎందుకూ కొనడం, ఎలాగూ ఏడాదెళ్ళేలోపల అమ్మేసేదే కదా. అయినా బ్రాండెడ్ వస్తువులు ఓ   Status Symbol  కదా మరి…

సర్వేజనాసుఖినోభవంతూ…

మరిన్ని వ్యాసాలు

మా చార్ధామ్ యాత్ర-4
మా చార్ధామ్ యాత్ర-4
- కర్రా నాగలక్ష్మి
Maa chardham yatra
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
సినీ అప్సరస గీతాలు .
సినీ అప్సరస గీతాలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
వివేకానంద రాక్ మెమోరియల్ స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
- కుందుర్తి నాగబ్రహ్మచార్యులు