వాస్తు - వాస్తవాలు - సూర్యదేవర వేణుగోపాల్ M.A (జ్యోతిష్యం)

 

స్థల ఎంపికలో వాస్తు నియమాలు- ఆంతర్యం   

నిర్మాణానికి స్థలం ముఖ్యం. సేకరించిన స్థలం నిర్మాణానికి అనువుగా ఉండాలి. స్థలం వాస్తు ప్రకారం ఉంటే నిర్మాణం కూడా దాదాపుగా వాస్తుకు అనుగుణంగానే ఉంటుంది. కనుక స్థలం తప్పనిసరిగా వాస్తుకు ఉండాలి. స్థలం తీసుకొనేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అన్ని స్థలాలు నిర్మాణానికి పనికి రావు. నిర్మాణానికి పనికివచ్చే స్థలం లోనే మనం గృహాన్ని నిర్మించాలి. స్థల ఎంపికలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలని వాస్తు చెపుతుంది. చాలా నియమాలను వాస్తు నిర్దేశించింది. మనిషికి మెరుగైన, ఆరోగ్య ప్రదమైన జీవితం ఇవ్వడమే ఈ వాస్తు నియమాల వెనుక గల ఆంతర్యం. వీటిని మూఢ నమ్మకంగా కొట్టిపారవేయకూడదు. అన్నింటిని పాటించడం నేటి కాలంలో కష్టం. కనుక కొన్ని ముఖ్యమైన, ప్రాధమికమైన నియమాలను తప్పనిసరిగా పాటించాలి. లేని పక్షంలో నష్టాలు కలుగుతాయి. స్థల సేకరణలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు పరిశీలిద్దాం.

స్థలం లో లోపాలు ఉన్నప్పటికి వాటిని వాస్తు ప్రకారం సవరించడానికి వీలుంటే వాటిని తీసుకోవచ్చు. సవరించడానికి వీలులేని వాస్తు దోషం ఉన్న స్థలం నిర్మాణానికి పనికిరాదు. దక్షిణం, పడమర, మరియు నైరుతి ప్రాంతంలందు సవరించుటకు వీలు లేనంతగా పల్లం ఉంటే అటువంటి స్థలాన్ని తీసుకోకూడదు. ఈ దిక్కులందు నదులు, నీటి ప్రవాహం, లేదా బావులు ఇంకా పూడ్చలేనంత గోతులు ఉంటే ఇటువంటి స్థలం నిర్మాణానికి పనికి రాదు. ఇటువంటి స్థలాలలో గృహాలను నిర్మిస్తే అనేక ఉపద్రవాలు ఏర్పడతాయి. తీవ్ర నష్టాలు వస్తాయి. ఈ దిక్కులందు గుంటలు లేదా బావులు ఉంటే సమస్యల తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఈ దిక్కులు పల్లం అయితే మానవ మనుగడ కష్టతరం అవుతుంది. చెడును కలిగించే దిశల బలం పెరుగుతుంది. దీనివల్ల మనిషి జీవితం ప్రశాంతంగా ఉండదు. కనుకనే  ఈ వాస్తు నియమాన్ని మహర్షులు చెప్పడం జరిగింది. ఈ క్రింది శ్లోకం గమనించండి.....



నశ్యన్తి పురుషాస్తత్ర దేవతాచ ప్రణశ్యతి

ధన హానింకరో నిత్యం రోగకృత్ దక్షిణ ప్లవ:    

ప్రవర్తయే గృహే పుంసాం రోగాశ్చ మృత్యుదాయకాన్

ధనహానిమ్ తధా నిత్యం కురుతే నైరుతి ప్లవా.                                                 

పశ్చ్హిమే చ ప్లవా భూమి ధనధాన్య వినాశిని

శోకదాహ్యామ్ కులం తత్ర యత్ర భూ:పశ్చ్హిమే ప్లవా.

- “ అపరాజితపృచ్చ

“అపరాజితపృచ్చ” అనే ప్రాచీన వాస్తు గ్రంధం నుండి పై శ్లోకం తీసుకోబడింది. ఈ శ్లోకం ప్రకారం దక్షిణం పల్లం అయితే ధననష్టం, రోగభయం  ఉంటుంది  ఇటువంటి స్థలంలో దేవుడు కూడా రాణించలేడని తెలుపుతుంది. ఇంకా పశ్చిమం పల్లం అయితే ధన ధాన్య నష్టం, నిత్యం శోకం కలుగుతుందని, నైరుతి పల్లం అయితే మృత్యుభయం, ధననష్టం  మరియు ప్రవర్తనా దోషాలు కలుగుతాయని తెలుపుతుంది. బావులు, నీటిప్రవాహాలు గుంటలు మొ| వాటి వలన భూమి  పల్లం  అవుతుంది. కనుక స్థలానికి దక్షిణం,పశ్చిమం మరియు నైరుతి పల్లం గా ఉన్న స్థలాలను కొనరాదు. ఈ పల్లాన్ని సవరించుకొనే వీలు ఉంటే స్థలాన్ని తీసుకొని వెంటనే మెరక చేయాలి. గృహ నిర్మాణానికి పూర్వమే సవరించాల్సి ఉంటుంది.

ఈశాన్య, తూర్పు మరియు ఉత్తర దిశలందు సవరించడానికి వీలు లేనంత ఎత్తైన కట్టడాలు గాని, పర్వతాలు గాని లేదా రాళ్ళు గాని ఉంటే ఈ స్థలం అంతగా కలసిరాదు.  ఈ స్థలం ధననష్టాన్ని కలిగిస్తుంది. మగవారికి కలసిరాదు.ఈ వాస్తు అమరిక వలన శుభాలను ప్రసాదించే దిక్కులైన తూర్పు,ఉత్తరం, మరియు ఈశాన్యాలు  తమ బలాన్ని కోల్పోతాయి. దీని వలన సుఖప్రదమైన జీవితం లోపిస్తుంది. అందుకొనే ఇటువంటి స్థలాలను కొనేటప్పుడు అధిక జాగ్రత్తను పాటించాలి. అయితే స్థలాన్ని సవరించి శుభ దిక్కులకు బలాన్ని చేకూర్చే వీలుంటే  తీసుకోవచ్చు. వీధి శూలలు ఉన్న స్థలం పనికిరాదు. నైరుతి, ఉత్తర వాయవ్యం, తూర్పు ఆగ్నేయం నుండి వీధి శూలలు ఉన్న స్థలం పనికిరాదు. ఈ వీధి శూలలు వలన మృత్యు భయం, ఆర్ధిక నష్టం, ఆరోగ్య నష్టం సంతానం తో సమస్యలు మున్నగు ఫలితాలు కలుగుతాయి. అయితే ఈ వీధి శూలలు పడే మేరకు స్థలం వదలి గృహాన్ని నిర్మించే వీలు ఉన్నప్పుడు తీసుకోవచ్చు. వాణిజ్య ప్రాంతం,మెయిన్ రోడ్ లో ఉన్న స్థలానికి ఈ వీధి శూలలు ఉంటే వాస్తు లో చెప్పబడిన పరిహారాలు పాటించి ఇందులో నిర్మాణం చేయవచ్చును. ఏదిఏమైనా వీధి శూలలు ఉన్న స్థలం నిర్మాణానికి మంచిది కాదు. వీధిచూపులున్న స్థలాలు లాభాన్ని కలిగిస్తాయి. తూర్పు,ఉత్తర ఈశాన్యం, దక్షిణ ఆగ్నేయం, మరియు పశ్చిమ వాయవ్యం నుండి వీధి చూపులుంటే ఇటువంటి స్థలాలను తీసుకోవచ్చు. ప్రవాహ శూల ఉన్న స్థలం కూడా మంచిది కాదు. ప్రవాహ శూల ఏ దిశలోనూ స్థలానికి తగులకూడదు.  ఈ జాగ్రత్త లన్ని గృహస్థుకు సుఖాన్ని కలిగించడానికి చెప్పబడినాయి.

ఆలయ శిఖరం మరియు ధ్వజ స్తంభం నీడ పడే స్థలాలు మంచివికావు. వీటి నీడ వలన జీవితాలు అభివృద్దికి నోచుకోవు. కనుక ఇటువంటి స్థలాలను తీసుకో రాదు. తప్పనిసరి పరిస్థితులలో తీసుకోవలసి వచ్చినప్పుడు వీటి నీడ పడే మేరకు స్థలం వదలి గృహాన్ని నిర్మించాలి. 

మరిన్ని వ్యాసాలు

పాలెగాళ్ళు.
పాలెగాళ్ళు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
సినిమా గీతాలలో  షెహనాయ్ వాద్యం.
సినిమా గీతాలలో షెహనాయ్ వాద్యం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు పలువురికి -3
పురాణాలలో ఒకే పేరు పలువురికి-3
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
108
108
- శ్రీరామ్ లక్ష్మీనారాయణ మూర్తి