హిమగిరి కైలాశ దర్శనం ( మూడవ భాగం ) - కర్రా నాగలక్ష్మి

 (గుహ్యేశ్వరీ దేవి మందిరం , బూఢా నీలకంఠ విష్ణు  మందిరం )


పసుపతినాథుని దర్శించుకొని బయటికి వచ్చేక మళ్ళా చుట్టుముట్టిన బేరగాళ్ళనుంచి తప్పించుకుంటూ మందిరానికి పక్కనున్న గుట్టమీంచి తూర్పు వైపుకు నడుచు కుంటూ మందిరానికి వెనుక వైపుకి ఓ కిలోమీటరు దూరం నడిచేక భాగమతీ నదీతీరం చేరేం . కాస్త దూరం వెడితే నదికి యెదురుగా గుహ్యేశ్వరీ దేవి మందిరం . యెదురుగా పెద్ద పెద్ద రావి చెట్లు వాటికింద కూర్చున్న జడలు కట్టిన తలలతో బైరాగులు , సన్యాసులు కనిపించేరు . కొత్తగా కట్టిన సిమెంటు ద్వారం , అందులోంచి లోపలకి వెడితే పెద్ద ప్రాంగణం , కుడి చేతి వైపున సాధువులు , ఉపాసకుల నివాసానికి వీలుగా గదులు కట్టబడి వున్నాయి .  మేము ఆ కోవెల చేరే సరికి మధ్యాహ్నం పన్నెండు దాటింది . యెవరో దేవీ ఉపాసకుడు 45 రోజుల దీక్ష లో వుండి హోమాలు చేస్తూ వుండడం వలన మాకు ఆ రోజు దర్శనం లేదని చెప్పేరు , మేము యెంతో బ్రతిమాలాక మాలాగే మనదేశపు యాత్రీకులు కూడా రావటంతో ఆ వుపాసకులు మాకు యెవరో కనపడకుండా లోని వెళ్ళేక మాకు ప్రవేశం కలుగజేసేరు . చుట్టూరా సిమెంటు గట్టు కట్టి లోపల రాతి పైన నిండా పువ్వులు అలంకరించి , ధూప దీపాలతో పూజలు నర్వహిస్తున్నట్లు వుంది . అక్కడ పూజాది కార్యక్రమాలు ఆడవారే చేస్తారు . అక్కడ వున్న ఆమె  ' బాబాజీ గుస్సా కరేంగే ' అని తొందరపెట్టి మమ్మల్ని బయటకు పంపేసింది . అంతకు ముందు కూడా మేము నేపాలు వెళ్ళేం కాబట్టి అమ్మ వారి నిజరూప దర్శనం యెప్పుడు వస్తే ఈ బాబాజీ బాధ లేకుండా జరుగుతుందో కనుక్కున్నాం . సాయంత్రం నాలుగు తరవాత వస్తే బాబాజీ పూజ ముగంచుకొని గది లోకి వెళ్ళిపోతారు కాబట్టి మేము అమ్మేవారి నిజరూప దర్శనం చేసుకోవచ్చని చెప్పింది .

గుహ్యేశ్వరీ దేవి మందిర ప్రవేశద్వారం

సతీదేవి యొక్క శరీరభాగాలు పడ్డ పరమపవిత్రమైన 51 పుణ్య క్షేత్రాలలో యిది ఒకటి . ఈ ప్రదేశం లో సతీదేవి యొక్క యోని భాగం పడిందట . అందుకే యీ దేవిని గుహ్యేశ్వరి , గుహ్యకాళి , గుహ్యాదేవి అని పిలుస్తారు . లలితా దేవి యొక్క సహస్రనమాలలో 707 వ నామం లో గుహ్యరూపిణి అనే వర్ణన వుంది . గుహ్యరూపిణీ అంటే మానవులకు అంతుపట్టని యెన్నో శక్తులు దేవి లో గుప్తం గా వున్నాయని వివరణ యిస్తారు .        లలితాదేవి 137 వ  ' స్తోత్రమైన సరస్వతీ శాస్త్రమయీ గుహాంబా గుహ్యరూపిణీ ' ప్రకారం తంత్రవిద్యలు ఈ దేవి వుపాసకులకు పట్టుబడతాయని కూడా వివరణ యిస్తారు . గుహ్యాదేవి ఆలయం తాంత్రిక శక్తి పీఠంగా చెప్తారు . సతీదేవి శరీరభాగాలు పడ్డ ప్రదేశాలలో దేవి సదా వాసముంటుందని భక్తుల నమ్మకం . సతీదేవి యొక్క 51 శక్తి పీఠాలు సంస్కృత వర్ణమాల ననుసరించి వుండడం మరో విశేషం కాళీతంత్ర , ఛండీతంత్ర , శివతంత్ర రహస్యాలలో ఈ కోవెల మహత్మ్యం గురించి వివరించ బడింది .

 గుహ్యేశ్వరీ దేవి మందిర ప్రాంగణం


 గుహ్యాదేవి కొందరు భక్తులకు అనేకమైన తలలతో , లెక్కకు మించిన భుజాలతో వివిధ కాంతులు వెదజల్లుతూ తన విశ్వరూప దర్శనం యిచ్చిందట . పశుపతినాథుని కి మూల శక్తి ఈ గుహ్యేశ్వరీ దేవేనని అంటారు . 17 వ శతాబ్దం లో లిచ్చవి వంశానికి చెందిన ప్రతాప మల్లుడు ఈ కోవెల నిర్మాణం చేసేడు .  మేము సాయంత్రం పశుపతినాథుని దర్శించుకొని గుహ్యేశ్వరీ దేవి దర్శనానికి వచ్చేం . కోవెల అంతా నశ్శబ్దం గా వుంది . అమ్మవారిగా పూజింప బడుతున్న ప్రదేశం లో పువ్వులు యేమీలేవు మధ్యభాగం వెండి పాత్రతో కప్పి వుంది . మొగవారు బయటకు వెళ్లిన తరువాత ఆ వెండి పాత్రని తొలగించి యోనిగా చెప్పిన ప్రదేశంలో యెప్పుడూ నీరు వుంటుందట , ఆ నీరు మా పై చల్లింది పూజారిణి . అమ్మవారి యోని భాగం కాబట్టి మొగవారు చూడకోడదని యెల్లప్పుడూ వెండి పాత్రను కప్పి వుంచుతారు . చుట్టూ చిన్న మండపంలా మాత్రమే సిమంటుతో ఈ మధ్యే నిర్మించేరు . ముందు మేము వెళ్ళి నప్పుడు యేవిధమైన కట్టడం లేదు . అమ్మవారు కి ఆరుబయటనే పూజలు జరుగుతూ వుండేవి.వివాహం సంబంధాలు మెరుగు పరచుకోదలచినవారు ఈ అమ్మవారికి మొక్కు కుంటారు . సంతానం కలగని వారు గుహ్యాదేవికి మొక్కుకుంటే సంతానం కలుగుతుందని భక్తుల నమ్మకం .ఈ కోవెల లోకి హిందువులకు తప్ప అన్యమతస్థులకు ప్రవేశం లేదు . ఈ మందిరం కూడా ఏప్రెల్ నెలలో సంభవించిన భూకంపం లో బాగా దెబ్బ తింది .

బూఢా నీలకంఠ విష్ణు మందిరం

గుహ్యేశ్వరీ దేవి మందిర దర్శనానంతరం మేము శయన విష్ణుమూర్తిని దర్శించు కొనేందుకు బయలు దేరేం .  శయన విష్ణు మూర్తి కోవెల కి తీసుకు వెళ్ళ మనగానే మా రథచోదకుడు ( టేక్సీ డ్రైవరు ) బూఢా నీలకంఠ అలాగే అన్నాడు . కాదు విష్ణు  విష్ణు శయన అని హిందీ లోను హావభావాలతోను రకరకాలుగా యెన్ని మార్లు చెప్పినా అతడు ఆ ఆ బూఢా నీలకంఠ అంటాడు . సరే ముందు బూఢా నీలకంఠ నే చూసుకొని తరవాత టూరు గైడు ని శయన విష్ణుమూర్తిని గురించి కనుక్కుందాం అని నిర్ణయించుకున్నాం . 10,15 కిలోమీటర్ల కంటె ప్రయాణించి వుండం  కాని గంట సమయం పట్టింది . నేను మా వారు నేపాలు పూర్వపు వైభవం గురించి మాచెల్లికి మరిదికి చెప్పేం . తరవాత రాజకుటుంబం హత్య ను గురించి , దాని ప్రభావం వల్ల నేపాలు రాజకీయాలలో జరిగిన మార్పులను నేపాలు యిప్పటి పరిస్థతి చర్చించుకున్నాం .కారు ఆగడంతో గమ్యం చేరుకున్నామని తలచి మందిర ప్రవేశద్వారం చేరుకున్నాం . లోనికి పోయి చూస్తే మేము చెప్పిన కోవెల అతను చెప్పినదీ వొకటే .

బూఢా నీలకంఠ విష్ణు మందిరం

నీలకంఠుడు గరళకంఠుడు అని శివుడిని మాత్రమే అంటాం . మరి విష్ణు వుని అలా యెందుకు పిలుస్తున్నారు ? అన్నీ సందేహాలే . మా సందేహాలన్నీ పక్కన పెట్టి విష్ణుమూర్తిని మనసారా కనులారా దర్శించు కున్నాం .  మెలికలు తిరిగిన పదకొండు తలల శేషుడి పైన పవ్వళంచిన ఆ విష్ణుమూర్తి మోములో ఆ చిద్విలాసం యెందుకో ? ఆది శేషుడు , పవ్వళంచిన భగవానుడు శిల్పాలంటే నమ్మ సఖ్యం కాదు . పాలకడలిలో విష్ణుమూర్తి పవ్వళంచి వుండగా ఆ ముగ్ధమోహనరూపానికి దాసుడైన భక్తుడు భగవానుడిని దొంగిలించి తెచ్చాడేమో అని అనిపిస్తుంది తప్ప రాతి బొమ్మ అని అనిపించదు . జీవం వుట్టివడుతున్నట్లు చెక్కిన ఆశిల్పి సాక్షాత్తు విశ్వకర్మ అయివుంటాడు . అంత చక్కగా చెక్కిన శిల్పికి కూడా చేతులు జోడించ కుండా వుండలేక పోయేం . అయిదడుగుల పొడవున్న ఈ విగ్రహం పదమూడు అడుగుల పొడవున్న నీటి కొలనులో విగ్రహం సగం నీళ్ళల్లో మునిగి వుంది . ముఖ్య ద్వారం లోంచి లోపలకి వెళ్లిన తరువాత చిన్న చిన్న రాతి మందిరాలు యెడమ వైపున వుండగా కుడి వైపున ఆరు బయట కొలను లో శయన విష్ణు మూర్తి విగ్రహం వుంటుంది . ఇక్కడ విష్ణుమూర్తి కాళ్ళ కి దండం పెట్టుకొని తరువాత యెవరికి కావలసినట్లు వారు పూజలు చేసుకుంటారు . ఇతనిని జలాక్షాయన నారాయణుడు  అని కూడా అంటారు . యిక్కడ పూజారి యెవరూ లేరు  . స్థానికులు వండిన పదార్ధాలు తెచ్చి నివేదిక చేస్తున్నారు .  విష్ణు మూర్తి ఒక కాలు పై మరోకాలు వేసుకొని నాలుగు చేతులలో శంఖం , చక్రం , గద , పుష్పం ధరించి వుంటాడు . మేము కూడా తెచ్చిన పువ్వులతో దేవునికి పూజచేసుకొని మరో మారు తనివితీరా తీరా విష్ణు మూర్తిని దర్శించుకొని వెనుకకు మరలేము . కాని మా సందేహాలు తీరలేదు . మాకు ఆ మందిర పరిసరాలలో మా సందేహాలు తీర్చ కలిగే వారు కనిపించ లేదు .

సాయంత్రం వరకు మాలో మేము విష్ణు మూర్తి మందిరానికి శివుని పేరు యెలా వచ్చివుంటుందా ? అని చర్చించుకుంటూ వున్నాం . సాయంత్రం మాతోపాటు కైలాశ మానససరోవరం యాత్రకు వచ్చే వాళ్ళు రావడంతో మాకు రాత్రి ఎనిమిదింటికి యాత్ర కు సంబంధించిన విషయాలు వివరించడానికి మీటింగు లాంటిది పెట్టి అందరినీ హాలు కి రమ్మని చెప్పేరు . మేము బుద్దిగా 7-30 కల్లా హాలు చేరుకున్నాం . కొంతసేపటికి టూరు రిప్రజెంట్స్ , మాతోపాటు గా వచ్చే గైడు , వంటవాళ్లు , సహాయకులు వచ్చేరు . మాకు అల్పాహారం , తేనీరు యిచ్చేరు . మాతోటి ప్రయాణీకులు యెవరూ రాలేదు . అప్పుడు బూఢానీలకంఠ విషయం అడుగగా మా టూరు గైడు యిలా వివరించేడు .

నీలకంఠ అని పిలవడానికి రెండు కథలు ప్రాచుర్యంలో వున్నాయి . సాగర మథనంలో హాలాహలాన్ని గరళంలో ధరించిన శివుడు ఆ మంటని శాంతింప చేయడానికై మంచినీరు లభించనందున శివుడు గోసాయికుండం సృష్టించుకొని అందులోని జలం సేవించి ఉపశమనం పొందెనట . విష్ణుమూర్తి వున్న యీ కొలను నీరు కూడా గోసాయి కుండం లోంచి వస్తున్నాయి కాబట్టి నీలకంఠ అని వ్యవహరిస్తారు . మరో కథ ప్రకారం నేపాలదేశం మొదటి నుండి వైష్ణవ మత ప్రాచుర్యం లో వుండి 12 , 13 శతాబ్దాలు శైవమత ప్రాచుర్యం పొందింది . ఆ సమయంలో యీ మందిరాన్ని శైవమందిరంగా గుర్తించేరు . శైవులు విష్ణుమూర్తి విగ్రహం కిందవైపున అదేరాతిపైన శివుని విగ్రహం వుందని అంటారు . శివుడు అభిషేక ప్రియుడు కాబట్టి నీళ్ళల్లో వున్నాడని , విష్ణుమూర్తి అలంకార ప్రియుడు కాబట్టి పై వైపున వుండి పూజలు అందుకుంటున్నాడని చెప్పేరు . ప్రతి సంవత్సరం శ్రావణ మాసం లో శైవులు యీ కోవెలలో పూజలు జరుపుకుంటూ వుంటారుట . అలాగే వైష్ణవులు హరిబోదిని ఏకాదశి విశేషమైన పూజలు , భజనలు , వుపవాసాలు చేస్తారు . హరిబోదిని యేకాదశి అంటే కార్తీక యేకాదశి విష్ణుమూర్తి యోగనిద్రలోంచి మేల్కొనే రోజు .

ఏడవ శతాబ్దం లో చక్రవర్తి విష్ణు గుప్తుడు భరతఖండాన్ని పరిపాలించేటప్పుడు నయపాల రాజ్యానికి తన సామంతునిగా లిచ్చవి వంశానికి చెందిన భీమార్జున దేవుడుని నియమించేడుట . భీమార్జున దేవుడు పరమ విష్ణు భక్తుడు , అతను అప్పటి గొప్ప శిల్పులను పిలిపించి ఈ విగ్రహం చెక్కించేడు . ఆకాలపు చక్రవర్తి , సామంత రాజుల పేర్లను చరిత్ర గుర్తు పెట్టుకుంది . శిలను తన శిల్పకళ తో జీవం వుట్టి పడేలా తీర్చి దిద్దిన శిల్పిని మాత్రం గుర్తుపెట్టుకోలేదు . ఎంత విచారకరం కదా ?12 , 13 శతాబ్దాలు శైవమతం ప్రాచుర్యం లో వుండగా 14వ శతాబ్దంలో జయథిథి మహారాజు వైష్ణవాన్ని ప్రాచుర్యం లోకి తేవడంలో కృతకృత్యుడయ్యేడు . జయథిథి మహారాజు పట్టాభిషేక్తుడైన ప్రతి రాజు విష్ణుమూర్తి అవతారంగా భావించాలనే పరంపరకు శ్రీకారం చుట్టేడు . జయథిథి అనంతరం ప్రముఖరాజులలో ఒకటైన 17 వ శతాబ్దానికి చెందిన ప్రతాప మల్లునికి దివ్యదృష్టి వున్నట్లు గా చెప్పతారు . అతను నేపాలు రాజ్యాభిషేకం జరిగిన రాజు యెప్పుడైనా యేవిధంగానైనా ఈ విష్ణుమూర్తి విగ్రహాన్ని దర్శించు కుంటే ఆ రాజుకి వెంటనే మరణం సంభవిస్తుందని భవిష్యవాణి చెప్పెనట , అప్పటి నుండి పట్టాభిషేక్తుడైన రాజులు  ఈ విగ్రహాన్ని దర్శించుకోలేదుట .

ఈ విగ్రహాన్ని చెక్కిన శిల్పి చేత శయనవిష్ణుమూర్తి విగ్రహాలను రెండింటిని చెక్కించి ప్రజల దర్శనార్థం ఒకటి , మరొకటి రాజ దర్శనార్థం రాజప్రాసాదంలో వుంచేరు అని కొందరి అభిప్రాయం . మందిరం లోనికి అన్యమతస్థులకు ప్రవేశం లేదు . కాని విగ్రహం ముఖ్యద్వారం దగ్గర నుంచి కనిపిస్తుంది కాబట్టి విదేశీయులు బయటినుంచే విగ్రహాన్ని దర్శంచుకొని శిల్పకళకు అబ్బుర పడడం చూసి సంతోషంచేము . 

రాత్రి మామీటింగులో మొత్తం యాత్రకోసం వచ్చిన వాళ్ళని యెవరి పరిచయం వారిని చేసుకొమ్మని చెప్పి అందరి పరిచయం అయిన తరువాత మాగైడు తనను తాను పరిచయం చేసుకొని వంటవాళ్లను , సహాయకులను పరిచయం చేసేరు. టూరు డబ్బులు యివ్వగానే మాకిచ్చిన బేగులలోనే మాసామాను సర్దుకోవాలని , కొన్ని చోట్ల మా బేగులు మాకు యివ్వబడవు కాబట్టి మాకు ముందుగానే యిచ్చిన బేక్ పేక్ లలో నిత్యావసర వస్తువుల , నీళ్ళ బాటిల్ , ఫ్లాస్క్ , మందులు , చాక్లెట్స , చిరుతిళ్ళు సర్దు కోమని చెప్పేరు . హిమాలయాలలో వాతావరణం యెప్పుడు యెలా మారుతుందో తెలీదని , విపరీత పరిస్తితులలో యాత్ర రద్దు కూడా చెయ్య బడుతుందని , ఆక్సిజన్ సిలిండర్లు దగ్గర వుంచుకొని ప్రయాణించ వలసిందని చెప్పేరు . ప్రతీ రోజు అల్పాహారం తరవాత ప్రయాణం మొదలవు తుందని , దారిలో లంచ్ యిస్తామని , రాత్రి భోజనం విడిది చేసిన చోట వండి పెడతామని చెప్పేరు . ఒకటి కన్న యెక్కువ సార్లు టీ , కాఫీ సేవించేవారు తమకు కావలసిన టీ , కాఫీలు ఫ్లాస్క్ లలో నింపు కోవాలని , దారిలో మాత్రం యేమీ దొరకవని చెప్పేరు . టిబెట్టులో నీటి కొరత యెక్కువ కాబట్టి నీళ్ళు చాలా జాగ్రత్తగా వాడుకోవాలని , చాలా చోట్ల బసలు నలుగురేసి చొప్పున సర్దుకోవాలని కొన్ని చోట్ల పదిమంది సర్దుకోవలసి వస్తుందని వివరించేరు . కైలాశ పర్వతం దగ్గర , మానససరోవరం దగ్గర మాత్రం రూములు వుండవని అందరూ టెంటులలోనే వుండాలని యెక్కడ అవుసరమైన రజ్జాయిలు అక్కడ యివ్వబడతాయని చెప్పేరు .

నేపాలు బోర్డరుదాటి చైనా ఆక్రమిత టిబెట్టు లో ప్రవేశించగానే చైనా గైడు మాతోకూడా వస్తాడని అక్కడ నుంచి తిరిగి నేపాలు వచ్చే వరకు అతను నిర్దేశంచినట్లుగా నడుచుకోవాలని , ఆక్రమిత టిబెట్టు  చైనా సైన్యం అధీనం లో వుంటుంది కాబట్టి మిలటరీ రూల్స్ అమలులో వుంటాయి . వాటి ప్రకారం నడచుకోక పోతే మిలిటరీ చర్యలు కఠినంగా వుంటాయని చెప్పేరు . యే విధమైన ఆనారోగ్య సమస్యలొచ్చినా వెంటనే తెలియజెయ్యమని , తీవ్రమైన సమస్యలొస్తే అక్కడ నుంచి వారిని వెనుకకు పంపించడానికి అయే ఖర్చు సుమారుగా మొత్తం టూరుకి తీసుకున్నంత డబ్బు అవుతుందని , లేదా వారి ఆరోగ్యం అనుమతిస్తే అదే ప్రదేశంలో వారి ఖర్చుతో వారి రిస్క్ తో వుంటే తిరుగు ప్రయాణంలో వారిని తిరిగి తీసుకొని వెళతామని చెప్పేరు .

మా ప్రయాణం లో నేపాలు టిబెట్టు సరిహద్దు వరకు బస్సు లోను , సరిహద్దు దాటాకా నలుగురేసికి ఒక కారు చొప్పున కేటాయిస్తామని , మా బేక్ పేక్ లు తప్ప మిగతా బేగులు అన్నీ సామానులు వేరే ట్రక్క్ లో వస్తాయని మా బేగులపై వున్న నెంబర్లను గుర్తు పెట్టుకోవలసింది గా చెప్పేరు . ఎందుకైనా మంచిదని మేం ఆనంబర్లను డైరీలో నోట్ చేసుకున్నాము .

నా ఆలోచనలు నీటి యెద్దడి అన్న మాట దగ్గరే ఆగిపోయేయి . తాగడనికి నిత్యకృత్యాలకు , స్నానానికి యెలా ? అన్న ప్రశ్న నాలో తిరుగుతోంది . అన్ని ప్రశ్నలను మాగైడు మీద సంధించేను . తాగేనీళ్ళు బిసలరీ 20 లీటర్ల కేన్స్ ఇక్కడ నుంచే తెస్తారుట , బసలదగ్గర నీళ్ళు పొదుపుగా వాడుకోవాలని చెప్పేరు . నీటి యెద్దడి అంటే యెలా వుంటుందో ప్రత్యక్షంగా చూసేకా బోధపడింది .

 మా యాత్ర రానుపోను 2000కిమి... సుమారుగా వుంటుందని , ఆ రోజుకు ముడో రోజు ఉదయం 3 గం.. బస్సు బయలు దేరుతుందని , 125 కిలోమీటర్ల ప్రయాణం తరవాత  ' కొడారి ' అనే నేపాలు సరిహద్దు గ్రామం చేరుకుంటామని , అక్కడ చైనా వీసా తీసుకోవాలని , అక్కడ నుంచి నలుగురేసి చొప్పున కార్లలో 35 కిమి ... ప్రయాణించ వలసివుంటుందని , ఆ రాత్రికి  ' న్యాలాం ' లో బస , న్యాలాం లో ఒక రోజు రెస్ట్ . మూడో రోజు అక్కడ నుంచి ' సాగా ' కి సుమారుగా 250 కిమి... , మధ్యలో భోజనానికి ఓ గంట గంటన్నర సమయం ఆగి తిరిగి ప్రయాణం . సాగా లో ఆ రాత్రి బస . మానససరోవరం వరకు వున్న ప్రయాణంలో ' సాగా ' సముద్ర మట్టానికి సుమారు 4660 మీటర్ల యెత్తుతో అతి యెత్తైన ప్రదేశం కావడం తో శ్వాస సంబంధ మయిన యిబ్బందులు వున్నట్లైతే అక్కడ బయటపడతాయని , ప్రతీరోజు రాత్రి రెండేసి మాత్రలు హెల్పర్స యస్తారని వాటిని తప్పకుండా వేసుకోవాలని చెప్పేరు . ' సాగా ' నుంచి  ' ప్రయాంగ్ ' అంటే నాలుగో రోజు మేము సుమారు 260 కిమి .... ప్రయాణం చెయ్యాలి . ఐదో రోజు  ' ప్రయాంగ్ ' నుంచి ' ఛియు గొంపా ' అని స్తానికులు పిలుచుకొనే మానససరోవరం వరకు సుమారు 280 కిమి .. ప్రయాణం . ఆరో రోజు మానససరోవరం పరిక్రమ సుమారు 72 కిమి.. మా కారులోనే చేయించి తరువాత 55 కిమి.. ప్రయాణం చేసి దర్చెన్ చేరుతాం . యేడవ రోజు దర్చెన్ నుంచి సుమారు 10 లేక 15 కిమి.. ప్రయాణించి యమద్వారం చేరుతాం అక్కడ నుంచి కైలాస్ పర్వతానికి పరిక్రమ మొదలవుతుంది . పరిక్రమ అంటే ప్రదక్షిణ అని అర్ధం . మొత్తం 45 కిమి.. రెండు చోట్ల  ఆ మంచు కొండల మధ్య రెండు రాత్రులు బస చేసి మూడోరోజుకి పరిక్రమ పూర్తి చెయ్యాలి .

45 కిమి... నడక అదీ మంచుతో నిండిన కొండల మధ్య , అన్నీ తెలుసుకొని వచ్చినా మళ్ళా వినగానే మా గుండె గొంతులోకి వచ్చింది .
ఖాట్మండు లోయ లోని క్రీస్తుపూర్వానికి చెందిన స్వయంభు బౌద్దస్ధూపం గురించి , కైలాశ్ మానససరోవరం యాత్ర గురించిన వివరాలు రాబోయే సంచికలో తెలుసు కుందాం .

అంతవరకు శలవు .

మరిన్ని వ్యాసాలు

పాలెగాళ్ళు.
పాలెగాళ్ళు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
సినిమా గీతాలలో  షెహనాయ్ వాద్యం.
సినిమా గీతాలలో షెహనాయ్ వాద్యం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు పలువురికి -3
పురాణాలలో ఒకే పేరు పలువురికి-3
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
108
108
- శ్రీరామ్ లక్ష్మీనారాయణ మూర్తి