కార్టూన్ ఎగ్జిబిషన్ - సరసి

తెలుగు వాళ్ళ హాస్య రసజ్ఞత, చమత్కారం ' మూడు పువ్వులూ ఆరు కాయాల్లా వృద్ధి చెందాలన్నాట్టు మూడు రోజుల పాటు ఆరుగురు కార్టూనిస్టులు హైద్రాబాద్ మాదాపూర్ స్టేట్ ఆర్ట్ గేలరీ లో కార్టూన్ ఎగ్జిబిషన్ ను దిగ్విజయం గా నిర్వహించారు. 

మొదటి రోజైన డిసెంబరు 19 ఉదయం ప్రభుత్వ కార్యదర్శి శ్రీ బి. వెంకటేశం , ఐ.ఎ.ఎస్ చేతుల మీదుగా ప్రదర్శన ప్రారంభమైంది.

'ఆరు ఋతువులు ఆమని పాడెను మన తోటలో' అని కృష్ణ శాస్త్రిగారన్నట్లు ఆరుగురు కార్టూనిస్టులూ కలిసి ఆ నవ్వు పూలతోటలో హాస్యరసామృతాన్ని చిలికించారు.

ఒక్కొక్కరిదీ ఒక్కొక్క శైలి. చూసే వారిది కూడా ఒక్కొక్కరిదీ ఒక్కొక్క టేస్టు.

అత్తగారు జోక్ వేస్తే కోడలు నవ్వి తీరాలని రూలేం  లేదు. ఆమెకీ కొన్ని రిజర్వేషన్సు వుంటాయి. అలాగే దుకాణం లో భర్తకి నచ్చిన చీర భార్యకి నచ్చాలనేం లేదు. అతడికి నచ్చడానికి రేటు కావచ్చు. అదే రేటు ఆమె నచ్చకపోవడానికీ కారణం కావచ్చు. 

కార్టూన్లని చూసి నవ్విన వారు, నవ్వుకున్న వారు, నవ్వునాపుకున్న వారు చాలామంది వున్నారు. ఫోటోలు తీసుకున్నవారు, తీయించుకున్న వారూ వున్నారు.

కార్టూన్స్ ప్రదర్శించే చోటు పక్కనే శిల్పాల ప్రదర్శన కూడా జరుగుతోంది. అక్కడ శిల్పాలు రెండు లక్షల నుంచి పదిలక్షల వరకూ ధర పలికేవి వున్నాయి. వాటిని చూశాక 'మనం కూడా మన కార్టూన్లకి రేటు ఫిక్స్  చేసి, సేల్ కి పెట్టాల్సింది గురూ' అన్నాడు కార్టూనిస్టులలో ఒకరు. అతనికేసి జాలిగా చూసి ' ఆ రోజు కోసం ఎదురుచూద్దాం బ్రదరు అనేసి గంభీరం గా ముందుకు జరిగిపోయాడు జవాబు చెప్పిన కార్టూనిస్ట్.

సమకాలీన సామాజిక సమస్యలు, అన్యాయాలు, అపోహలూ, అరోగ్య సమస్యల వంటి వాటితో బాటు పర్యావరణం, పచ్చదనం వంటి ఎన్నో అంశాలు ఆ కార్టూన్లలో చోటు చేసుకున్నాయి. తమ తమ ధోరణుల్లో ఆ సమస్యల్ని ఎత్తి చూపిన వైనం పలువురు సందర్శకుల్ని ఆకట్టుకున్నదనడంలో సందేహం లేదు.

వృద్ధాశ్రమం నుంచి కొందరు వృద్ధుల్ని తీసుకువచ్చి వారికి కార్టూన్లు చూపించి వారెంతో ఆనందపడేలా చేశారొక పెద్దాయన. ఆ సమయం లో ఆ వృద్ధులు నవ్వుతూ వుంటే కార్టూనిస్టులు తమ ప్రయత్నం సఫలం అయ్యిందని మురిసిపోయారు.

వేడెక్కుతున్న వత్తిళ్ళపై చల్లని చినుకులు కురిపించి మురిపించిన ఇటువంటి కార్టూన్ ప్రసర్శనలు మరిన్ని జరగాలని సందర్శకులెందరో అభిలషించడం విశేషం.   

 

 

 

 

 

 

 

 

 

 

మరిన్ని వ్యాసాలు

మా చార్ధామ్ యాత్ర-4
మా చార్ధామ్ యాత్ర-4
- కర్రా నాగలక్ష్మి
Maa chardham yatra
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
సినీ అప్సరస గీతాలు .
సినీ అప్సరస గీతాలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
వివేకానంద రాక్ మెమోరియల్ స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
- కుందుర్తి నాగబ్రహ్మచార్యులు