వీక్షణం - పి.యస్.యమ్. లక్ష్మి



అద్భుత సౌందర్య రాశి నయాగరా జలపాతాలు - 1 

2008 జూన్ 5వ తారీకు మధ్యాహ్నం 1-30 కి మిచిగాన్ రాష్ట్రంలోని లేన్సింగ్ లో బయల్దేరి కారులో నయాగరా వెళ్ళేసరికి రాత్రి 7-30 అయింది.  అంత దూరం వెళ్ళాక ఊహల ఉయ్యాలలో ఊగుతున్న జలపాతాలను చూడటానికి ఆలస్యం చేస్తే ఎలాగు!?  అందుకే ఫ్రెష్ అయి వెంటనే జలపాతాలని చూడటానికి బయల్దేరాము.  రాత్రిపూట..చీకటి..అయినా ఆ అద్భుత సౌందర్యాన్ని చూడాలనే ఆతృత ముందుకు నడిపించింది.

రంగు రంగుల లైట్లు కెనడా వైపునుంచి ఫోకస్ చేస్తున్నారు.  ఎక్కువగా ఎఱుపు, ఆకుపచ్చ, నీలం లైట్లు.  జలపాతంనుంచి నీళ్ళ తుంపరలు పైకి లేచి పొగ మంచులాగా కనబడుతోంది.  ఏదయినా ఆ లైట్లల్లో మాకు కనిపించిన దృశ్యాలు అంత ఆకర్షణీయంగా అనిపించలేదు.  10-30కల్లా తిరిగొచ్చి పడుకున్నాము.

మర్నాడు పొద్దున్న 9గం.లకల్లాబ్రేక్ ఫాస్ట్ చేసి (ఇక్కడ అన్ని హోటళ్ళల్లో కాంప్లిమెంటరీ బ్రేక్ ఫాస్ట్ ఇస్తారు) తర్వాత లేక్ ఒడ్డునే నడుచుకుంటూ అబ్జర్వేషన్ టవర్ దాకా వెళ్ళాము.  నయాగరాలో మా అనుభవాలు చెప్పేముందు ఆ జలపాతాల గురించి కొంచెం తెలుసుకోవద్దూ??

నయాగరా జలపాతం  అమెరికాలో న్యూయార్కు, కెనడాల   మధ్య నయాగరా నదిపై ఉన్న అతి పెద్ద జలపాతం.  నయాగరా జలపాతంలో మూడు జలపాతాలు కలిసి వున్నాయి. ఒకటి హార్స్ షూ ఫాల్స్, రెండవది బ్రైడల్ వీల్ ఫాల్స్, మూడవది అమెరికన్ ఫాల్స్.  ఇందులో మొదటిది కెనడా వైపు వుంటే, మిగతా రెండూ అమెరికా వైపున్నాయి. అమెరికా లో   న్యూయార్క్ రాష్ట్రం మరియు కెనడాలోని ఒంటారియో రాష్ట్రం సరిహద్దులను కలుపుతూ ఉన్న జలపాతాలివి.  అమెరికాలో  5 పెద్ద సరస్సులున్నాయి.   అవి  .. ఎరీ, హ్యూరన్, మిచిగాన్, సుపీరియర్, అంటారియో ..  నయాగరా జలపాతాలలోకి నీరు వీటిలో మొదటి నాలుగు సరస్సులలోనుంచి వస్తుంది.   ఈ నీరు నయాగరా రివర్ గా ప్రవహించి,  ఇక్కడి ఐదవ పెద్ద లేక్ అయిన ఆంటోరియాలో కలిసి,  ఆ పైన పసిఫిక్ సముద్రంలో కలుస్తుంది.  నయాగరా ఫాల్స్ కింద నీటి లోతు 52 మీటర్లు వుంటుంది.  ఈ జలపాతాలు చూడగానే అబ్బ...ఎన్ని నీళ్ళో, ఎంత పెద్ద జలపాతమో అనుకుంటాముగానీ, అమెరికా వైపు ప్రవహించే జలపాతాలలోని నీరు మొత్తం నీటిలో పది శాతం కన్నా తక్కువేనట!!  మిగతా నీరు కెనడావైపున్న హార్స్ షూ ఫాల్స్ లో పడుతుందిట!!!  

సెకండ్ కి 6060 క్యూబిక్ మీటర్లు, లేక గంటకి 5.5 బిలియన్ గేలన్ల నీరు ఈ ఫాల్స్ లో ప్రవహిస్తుంది.  అయితే ఇప్పుడు దీనిలో సగం నీటిని అమెరికా, కెనడా రాష్ట్రాలు విద్యుదుత్పాదన కోసం  మళ్ళించాయి.

నయాగరా జలపాతం రెండు భాగాలుగా విభజించబడింది. ఒకటి హార్స్‌షూ ఫాల్స్ (కెనడా), రెండవది అమెరికన్ ఫాల్స్ (అమెరికా వైపు). హార్స్ షూఫాల్స్ ఎత్తు 173 అడుగులయితే అమెరికన్ ఫాల్స్ ఎత్తు 70-100 అడుగులు వుంటుంది.  హార్స్ షూ ఫాల్స్ వెడల్పు 2,600 అడుగులు, అమెరికన్ షూ ఫాల్స్ వెడల్పు 1,060 అడుగులు.  ఈ ప్రదేశంలో అమెరికా, కెనడా  మధ్య దూరం 3,409 అడుగులు.

నయాగరా జలపాతం విస్‌కాన్‌సిన్ గ్లాసియర్స్ కరగటం కారణంగా 10,000 సంవత్సరాల పూర్వం ఏర్పడిందనీ,   అమెరికాలోని గ్రేట్ లేక్స్ ఈ కారణంగా ఏర్పడ్డాయని అభిప్రాయ పడుతున్నారు.  అతి పెద్ద హిమ ఖండం  కరిగినప్పుడు ఏర్పడే నీటిని క్రమ పరచడానికి నదీజలాల కాలువలను వెడల్పు చేసి సరసులు ఏర్పరచి ఆనకట్టలు నిర్మించారని శాస్త్రజ్ఞులు విశ్వసిస్తున్నారు.

నయాగరా జలపాతం రచయితలకు, కళాకారులకు, పరిశోధకులకు, చలన చిత్రతయారీ దారులకు విద్యుత్‌చ్చక్తి ఉత్పత్తిదారులకు ప్రేరణ కలిగిస్తూ తనవైపు ఆకర్షిస్తూ ఉంటుంది.  ఇక్కడి జలపాత సౌందర్యం అంతర్జాతీయ పర్యాటకులను సహితం ఆకర్షిస్తుంది.

జోస్ మరియా కెనడా వైపు

పర్యాటకులకు ఆకర్షణ మరియు హనీమూన్ దంపతులకు అభిమాన ప్రదేశం అయిన నయాగరా జలపాతం పర్యాటకుల సంఖ్య 1953లో మార్లిన్ మన్రో మరియు జోసెఫ్ కాట్టన్ నటించిన నయాగరా చలనచిత్రం విడుదల అయినప్పటి నుండి మరింత పెరిగింది. తరువాత 20వ శతాబ్దంలో 1980 చిత్రమైన సూపర్మాన్ II లో నయాగరా దృశ్యాలు చోటుచేసుకున్నాయి.    1990లో భ్రమనిపుణుడు (ఇల్యూషనిస్ట్) డేవిడ్ కాపర్ ఫీల్డ్ తాను హార్స్ షూ జలపాతం మీద ప్రయాణం చేస్తున్నట్లు భ్రమకలిగించేలా ఒక యుక్తిని ప్రదర్శించాడు. వేసవి సమయంలో పర్యాటకుల సంఖ్య చాలా ఎక్కువగా వుంటుంది. అప్పుడు నయాగరా జలపాతం వద్ద పగటి వేళ అలాగే రాత్రివేళ కూడా ఆకర్షణలు ఉంటాయి. చీకటి పడిన తరువాత కెనడా వైపు నుండి ఫ్లడ్ లైట్లను రెండు వైపులా జలపాతనికి ఫోకస్ చేసి కొన్ని గంటల సమయం ప్రసారం చేస్తారు.

నయాగరా జలపాతం దగ్గర అద్భుతమైన పర్యాటక ఆకర్షణ మైడ్ ఆఫ్ మిస్ట్ బోట్ క్రూయిజ్.  ఈ బోట్లు 1846 నుంచి నడపబడుతున్నాయట.  ఈ బోట్ లో వెళ్తే పెద్ద జలపాతానికి అతి సమీపంగా వెళ్ళవచ్చు.  జలపాతం మీదనుంచి వచ్చే నీటి తుంపరలు మనల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తుంటే .. ఓహ్..అది మాటలలో చెప్పలేని సంతోషం.  అనుభవించాల్సిన ఆనందం.  ఈ బోట్లు కెనడా, అమెరికా, రెండు వైపులనుంచీ వున్నాయి.  మొదట్లో ఈ బోట్ ప్రయాణం గురించి విని, అమ్మో నేను వెళ్ళగలనా అనుకున్నాను.  ఇప్పుడు అక్కడికి వెళ్ళే అవకాశం వచ్చిన ప్రతి ఒక్కరికీ చెబుతున్నాను.  మైడ్ ఆఫ్ ది మిస్ట్ బోటు ప్రయాణాన్ని ఏ కారణంవల్లా మిస్ కావద్దు.  అది ఒక అద్భుతం. 

అమెరికా వైపు

యు.ఎస్ వైపు అమెరికన్ జలపాతాలు ప్రాస్పెక్ట్ పాయింట్ పార్క్ కాలిబాట వెంట నడుస్తూ వీక్షించవచ్చు. ఈ పార్కులో ప్రాస్పెక్ట్ పాయింట్ పార్క్, అబ్జర్వేషన్ టవర్ మరియు మెయిడ్ ఆఫ్ ది మిస్ట్ కొరకు పడవ రేవు కూడా ఉంది. గోట్ ఐలాండ్ లో త్రీసిస్టర్ ఐలాండ్ , పవర్ పోర్టల్ నుండి వెళ్ళి పెద్ద నికోలస్ టెల్సా శిల్పం చూడ వచ్చు. అలాగే కాలిబాట వెంట నడుస్తూ దూసుకుంటూ ప్రవహిస్తున్న నయాగరా నది, హార్స్ షూ జలపాతం అలాగే మిగిలిన అన్ని జలపాతాలను దర్శించవచ్చు.

ఇక్కడ ఫైట్ ఆఫ్ ఏంజిల్స్ హీలియం బెలూన్ లేక హెలికాఫ్టర్ఎక్కి జలపాతాల మనోహరమైన గగన వీక్షణం కూడా చేయవచ్చుట.  ఇంకా నయాగరా గోర్జ్ పరిశోధనా కేంద్రం నయాగరా గోర్జ్ మరియు నయాగరా జలపాతా సంబంధిత ప్రకృతి సహజమైన మరియు ప్రాంతీయమైన చరిత్రకు సంబంధించిన వివరాలను ప్రదర్శిస్తున్నది. మాకు సమయంలేక ఇవి చూడలేదు.

వచ్చే వారం ఇంకా కొన్ని విశేషాలు.

మరిన్ని వ్యాసాలు

మా చార్ధామ్ యాత్ర-4
మా చార్ధామ్ యాత్ర-4
- కర్రా నాగలక్ష్మి
Maa chardham yatra
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
సినీ అప్సరస గీతాలు .
సినీ అప్సరస గీతాలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
వివేకానంద రాక్ మెమోరియల్ స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
- కుందుర్తి నాగబ్రహ్మచార్యులు