అద్భుత సౌందర్య రాశి నయాగరా జలపాతాలు – 2
రాత్రి చీకట్లో ఆ నీటి ప్రవాహం తెలియలేదుగానీ, పగలు చూస్తే రెండు కళ్ళూ చాలవనిపించింది. నది ఒడ్డునే నడుచుకుంటూ అబ్జర్వేషన్ టవర్ దగ్గరకి వెళ్ళాము. దోవ అంతా నీళ్ళు సరస్సుగానో, నదిగానో, జలపాతాలగానో ఏదో ఒక విధంగా కనువిందు చేస్తూనే వున్నాయి.
అబ్జర్వేషన్ టవర్ కీ మైడ్ ఆఫ్ మిస్ట్ ఫెర్రీకీ కలిపి మనిషికి 12-50 $ టికెట్. టవర్స్ దగ్గరనుంచీ కొంతసేపు ఫాల్స్ అందాలు చూసి మైడ్ ఆఫ్ ది మిస్ట్ టూర్ కి బయల్దేరాము. ఫెర్రీదాకా వెళ్ళటానికి అబ్జర్వేషన్ టవర్ లో లిఫ్ట్ సదుపాయం వున్నది.
ఇక్కడో విషయం చెబుతాను. మళ్ళీ వాళ్ళని పొగుడుతున్నానని అనకండి. మనం కూడా ఇలా వుంటే బాగుంటుందికదా అని నా ఆశ. ఇండియాలో లిఫ్ట్ ఎక్కటమంటే నాకు కొంచెం భయం. అందులో ఎక్కాల్సిన మనుష్యులకన్నా ఎక్కువ ఎక్కుతూ వుంటారు. పైగా లిఫ్టులు చిన్నవిగా వుంటాయి. ఏ కారణంవల్లనైనా అది ఎక్కడన్నా ఆగిపోతే లోపలి వాళ్ళకి ఊపిరికూడా ఆడదు. కానీ అమెరికాలో అలా కాదు. 10మంది ఎక్కచ్చంటే 7,8 మందికే ఆగిపోతారు అక్కడి వాళ్ళు, క్రౌడెడ్ గా వుందని తర్వాత వాళ్ళు ఎక్కకుండా. లిఫ్టులు కూడా పెద్దగా వుంటాయి. అక్కడ అందరికన్నా ముందు లిఫ్టు ఎక్కటానికి నేను తయారయితే మావాళ్ళు ఆశ్చర్యపోయారు.
లిఫ్టులో కిందకి దిగి ఫెర్రీ దగ్గరకు వెళ్ళేలోపే అందరికీ రైన్ కోట్స్ ఇచ్చారు. బోటు, షిప్ వగైరా వాటిల్లో వెళ్ళేటప్పుడు లైఫ్ జాకెట్స్ ఇవ్వటం చూశానుగానీ, రైన్ కోట్స్ ఇవ్వటం ఇక్కడే చూశాను అనుకున్నా. మా అబ్బాయి చెప్పటంవల్ల కెమేరా ప్లాస్టిక్ కవర్ లో పెట్టి రబ్బరు బేండ్ పెట్టాను, నీళ్ళకి పాడవకుండా. రైన్ కోట్ వేసుకోమన్నారు. వేసుకున్నా.
అన్నట్లు అమెరికాలో క్యూ పధ్ధతి కూడా చాలా చక్కగా పాటిస్తారండి. మనకి మల్లే వెనకనుంచి తొయ్యరు. అసలు టచ్ కారు. మనిషికీ మనిషికీ మధ్య కొంచెం దూరం పాటిస్తారు. ఎంత ఎక్కువ జనాభావున్న దేశంలోనైనా అలాంటి క్యూ పధ్ధతి పాటిస్తే అన్నిచోట్లా పనులు తొందరగా అవటమేకాదు, ట్రాఫిక్ రద్దీలు కూడా వుండవని నా అభిప్రాయం.
రెండతస్తులుగా వున్న ఫెర్రీలో పై అంతస్తులోకెళ్ళాము. ఫాల్స్ మొదటిదాకా తీసుకెళ్ళి తీసుకొచ్చారు. కొంత దూరం వెళ్ళేసరికి సన్నగా మొదలైన ఫాల్స్ నుంచి వచ్చే తుపర దగ్గరకెళ్ళేకొద్దీ ఎక్కువైంది. ఫోటోల్లో చూడండి..నీళ్ళ మధ్య ఫెర్రీ కనబడుతుంది. దానిలోనే వెళ్ళాము. రైన్ కోట్ ఎందుకు ఇచ్చారో అప్పుడు అర్ధమయింది. ఆ తుపరకి మనం తడవకుండా. అసలు తుపర పడుతోందనిగానీ, పక్కన మొగుడూ, పిల్లలూ వున్నారనిగానీ, ఏమైనా ధ్యాస వుంటేనా!! ఆ అద్భుత అనుభవాన్ని మనసులో నింపుకోవటానికి ప్రయత్నిస్తూ, ఆ దృశ్యం ఎక్కడ కనుమరుగవుతుందోనని కళ్ళు విప్పార్చుకుని చూడటం తప్పితే!!! పైగా కొన్ని నిముషాలు పూర్తిగా మిస్ట్ లోనే వున్నాము.
తిరిగి వచ్చేటప్పుడు ఆ రైన్ కోట్ ఏం చెయ్యాలి అక్కడ పెడితే వేరే వాళ్ళకి ఇస్తారనుకున్నాను. ఇండియాలో అంతే కదండీ..హోటల్స్ లో, రైళ్ళల్లో, చివరికి హాస్పటల్స్ లో కూడా గౌన్ లు, బెడ్ షీట్స్ వగైరాలు ఒకరు వాడినవి ఇంకొకరికి ఇచ్చేస్తారు మనం చూసుకోకపోతే. కానీ తిరిగొచ్చేటప్పుడు వాళ్ళు ఆ రైన్ కోట్స్ అక్కడ ప్రత్యేకంగా వాటికోసం వున్న డస్ట్ బిన్ లో వేయించారు. వాటిని మళ్ళీ రీ సైకిల్ చేస్తారుట.
బయటకి రాంగానే ముందు మా పిల్లలకి ధాంక్స్ చెప్పాను. వాళ్ళు చదువులకని రావటంవల్లకదా, మాకు అవన్నీ చూసే అవకాశం దొరికింది. లేకపోతే కలలో కూడా వీటి గురించి ఆలోచించే వాళ్ళం కాదు.
ట్రాలీ
ఇక్కడున్న బస్ ని ట్రాలీ అంటారు. దీనికి టికెట్ 2 $ . ఆ టికెట్ తీసుకుంటే ఎన్ని సార్లయినా ఆ ట్రాలీ వెళ్ళే దోవలో దానిలో ప్రయాణించవచ్చు.. ఎక్కడ కావాలంటే అక్కడ (అంటే మధ్యలో చెయ్యెత్తి కాదు, వాళ్ళకున్న స్టాపుల్లో) ఎక్కవచ్చు, దిగవచ్చు. ఎక్కీ, దిగకుండాకూడా దానిలోనే కూర్చుని ఆ ప్రదేశమంతా చూడవచ్చు. ఈ పధ్ధతీ చాలా బాగుందనిపించింది. పైగా వాటి ఫ్రీక్వెన్సీ కూడా బాగుంది.
ఇంకో సంగతి తెలుసా!? ఇక్కడ వికలాంగులుగానీ, వృధ్ధులుగానీ బయటకి వెళ్ళాలంటే తప్పకుండా ఇంకొకరి సహాయం వుండాలి. అక్కడ ఆ అవసరం లేదు!! ఇంచక్కా వీల్ ఛైర్ లో (దానికి బేటరీ సిస్టమ్ వుంటుంది, చేతులతో తొయ్యక్కర లేదు) వెళ్తారు. బస్ ఎక్కాల్సి వచ్చినప్పుడు బస్ డ్రైవర్ దిగి ఆ వీల్ ఛైర్ బస్లో ఎక్కించటానికి వుండే ప్రత్యేకమైన రేకు షీట్ ని నేలకి సమానంగా తీసుకొస్తాడు. వాళ్ళని ఆ ఛైర్ తో సహా ఎక్కించి, బస్ లో అది కదలకుండా వుండటానికి వుండే బోల్టులవ్వీ పెట్టి, అప్పుడు బస్ నడుపుతాడు. షాపింగ్ లవీకూడా వాళ్ళు ఒంటరిగా చేసుకుంటారు. వాష్ రూమ్ లు కూడా వాళ్ళకి ప్రత్యేకం వుంటాయి. ఇంతకీ చెప్పొచ్చేదేమిటంటే వీల్ ఛైర్ ని బస్ డ్రైవర్ అంత శ్రధ్ధగా బస్లో ఎక్కించటం అక్కడే మొదటిసారి చూశాను.
సరే ఆ ట్రాలీ ఎక్కి కేవ్ ఆఫ్ ది విండ్స్ ఐలెండ్ దగ్గర దిగి దానికి వెళ్ళాం. దీనికీ టికెట్ మనిషికి 10 $ . ఇక్కడా రైన్ కోట్ తోబాటు బెల్ట్ బూట్లు కూడా (స్పాంజ్ /రబ్బరుతో చేశారు) ఇచ్చారు. (జలపాతంనుంచి గాలికి నీళ్ళు జల్లుగా వచ్చి ఆ ప్రదేశమంతా తడపేస్తాయి. అక్కడ మన చెప్పులు, షూస్ పనికిరావు.) దీనికి కూడా లిఫ్ట్ లో కిందకి దిగాలి. కొంచెం దూరం నడిచి మెట్లెక్కాలి. ఫాల్స్ కి చాలా దగ్గరగా వెళ్తాం. అక్కడ చెక్కతో చేసిన మెట్లెక్కి మంచెలాగా ఎత్తుగా కట్టిన ప్రదేశానికి వెళ్ళాము. గాలి వీచినప్పుడు పక్కనే వున్న ఫాల్స్ లోంచి నీళ్ళొక్కసారొచ్చి మీద పడితే! అబ్బో!! ఎంత సరదాగా వుందో!!! అక్కడనుంచీ కదల బుధ్ధి కాలేదు. కానీ ఎత్తుగా వున్న ప్రదేశానికి ఎక్కటానికి చాలామంది వైట్ చేస్తుండటంతో (అక్కడ ఎక్కువమంది పట్టరు) దిగి రాక తప్పలేదు. ఇక్కడ నా కెమేరా తో ఫోటోలు తియ్యటానికి వీలు లేకుండా గాలి, నీళ్ళు. అందుకే వాళ్ళు రైన్ కోట్స్, నీళ్ళల్లో వెళ్ళగలిగే బూట్లు ఇస్తారు.
వదలలేక వదలలేక ఆ ప్రదేశాన్ని వదిలి బయటకొచ్చి మళ్ళీ ట్రాలీ ఎక్కి హార్స్ షూ ఐలెండ్ దగ్గర దిగాము. ఇక్కడి ఫాల్స్ హార్స్ షూ ఆకారంలో వుంటాయి. అందుకే ఆ పేరు. ఇవికూదా చాలా బాగున్నాయి. ఎంతసేపయినా అలాగే చూస్తూ వుండి పోవచ్చు. ఇంకోపక్కన అమెరికన్ ఫాల్స్. అన్నింటిలో ఇవే కొంచెం సన్నగా వున్నాయి. నా డిజిటల్ కెమేరా ఫోటోలతో పూర్తిగా నిండిపోయింది. అందుకే ఈ ప్రాంతాల ఫోటోలు తియ్యలేక పోయాను.
సాయంకాలం 3 గం. లకి మళ్ళీ ట్రాలీ ఎక్కి ఇండియన్ రెస్టారెంట్ లో భోజనం చేశాం. బఫే. రజ్మా, పనీర్ పీస్, నవరతన్ కుర్మా, పాలక్ స్పేనిష్, చపాతీ (గట్టిగా వున్నది), బిర్యానీ (రుచి పర్వాలేదుకానీ అన్నం మేకుల్లా వున్నది), కేబేజ్, కేరెట్స్, ఆనియన్స్ సలాడ్, రైతా, గులాబ్ జాం. పర్వాలేదు. ఒక్కొక్కరికి 13 $.
సాయంత్రం 5 గం. లకి న్యూయార్క్ బయల్దేరాము. ఆ విశేషాలు వచ్చే వారం.