హిమగిరి కైలాశ దర్శనం ( అయిదవ భాగం ) - కరా నాగలక్ష్మి

 అందరూ సర్దుకుని మా కార్లు బయలుదేరేసరికి సాయంత్రం అయిదు దాటింది . మరో గంటా గంటన్నర ప్రయాణించిన తరవాత ' ఝంగ్ము ' చేరేం . ఆ రోజుకు మరి ప్రయాణం లేదని ' చాంగ్మై ' చెప్పి రూములు అలాట్ చేసి భోజనానికి యెదురుగా వున్న హొటలులో  యేర్పాటు చేసినట్లు చెప్పేడు .


నలుగురేసికి ఒక్కొక్క గది యిచ్చేరు . మేం అయిదుగురం ఒకే గది లో సర్దుకుందాం అని నిర్ణయించుకున్నాం . దిండు , రజాయి యిస్తే చాలని దోర్జీ కి తెలియజేసేం . మొత్తం యెంతమంది యాత్రీకులో అన్ని దిండ్లు అన్ని రజాయిలు గెష్టు హౌసు వారు కేటాయించేరు అయినా సగం మందికి దిండ్లు రజాయిలు లేవు . మర్యాదగా అడిగితే యెవ్వరికీ తెలియదనే సమాధానం . గదులు ఖాళీ చేయించి వెతికితే ఒకదాని కిందన ఒకటి దాచి కనిపించేయి . మాకు మరో షాక్ . మనుషులు యింతస్వార్ధ పరులుగా వుంటారా ? అని . అది మొదలు యాత్ర అయేవరకు షాకులని కేకులులా తిన్నాం .

అప్పటి వరకు కైలాసపర్వతానికి పరిక్రమ చేసేటప్పుడు మాత్రమే మరుగుదొడ్లు  బాత్రూములు వుండవని అనుకుంటున్న మాకు ఇక్కడి నుంచే కామన్ బాత్రూములు మరుగుదొడ్లు యెదురవడం ఒక యెత్తు అయితే అందరికీ రెండు రోజులకు సరిపడా నీళ్ళు నింపి గెష్టు హౌసు వాళ్ళు వుంచితే ఓ పదిమంది మా తోటి యాత్రీకులు వాడేసి మిగతా వారికి చెంబుడు నీళ్ళు లేకుండా చేసేరు . రాత్రి అందరం వెళ్ళి వున్న నీళ్ళ ని తలా బకెట్టు నీళ్ళు చొప్పున వాడుకుందామని వాళ్ళని బ్రతిమలాడి వొప్పించేము . వాళ్ళే ఇండోరు నుంచి వచ్చిన పద్ధెనిమిది మందిలోని వారు . రాత్రి భక్తిగా భజనలు చేసి నైవేద్యాలు పెట్టి ప్రసాదాలు వాళ్ళే తిన్నారు .

ఝంగ్ము లో కూడా మళ్ళా ఇమిగ్రేషన్ , వీసా చెకింగులు జరిగేయి . పొదున్న టీ కావలసిన వారు సొంత డబ్బులతో తాగవలసి వుంటుందని , ఒక గంట ప్రయాణం తరవాత న్యాలం చేరుతామని అక్కడ మాకు పొద్దున్న ఫలహారాలు తయారుగా వుంటాయని చెప్పేరు .లైట్లు లేని గదులలో బాత్రూములలో మేము తీసుకు వెళ్ళిన టార్చ లైట్లు వుపయోగపడ్డాయి . పొద్దున్న దంతధావనాలు కానిచ్చేక న్యాలం కి మాప్రయాణం సాగింది .

మొదటి ఫొటో న్యాలం

 చైనా లోకి ప్రవేసించేక కూడా  ప్రయాణం సూర్యకోసి నది వొడ్డునే సాగుతుంది . న్యాలం సూర్యకోసి నది వొడ్డునే వున్న ఒక గ్రామం . సముద్ర మట్టానికి సుమారు 3750 మీటర్ల యెత్తుతో వుంటుంది . చిన్న చిన్న దుకాణాలు వున్నాయి .

యాత్రీకులలో చాలా మంది సెల్ ఫోను ఛార్జ్ చేసుకోబోతే మొత్తం ఫోను పనిచెయ్యకుండా పోయింది . పోస్ట్ ఆఫీసులో వున్న కంప్యూటర్ ద్వారా ఇ మైల్స చెయ్య గలిగేము .

న్యాలం లో కూడా నీళ్ళు మరెవరికి యివ్వక వారే వాడెయ్యడం లేకపోతే కింద వంపెయ్యడం చెయ్యడంతో మాకు ఆ రోజు మాకు నీళ్ళు పోసుకొనే యోగం లేకపోయింది .  రాత్రి భోజనాల సమయంలో వాళ్ళు చేసిన కంగాళీ యింతాఅంతా కాదు . ఆహార పదార్ధాలు యెంగిలి చేసి డస్ట్ బిన్స్ లో పారేయడం చూసి యెంత కోపం వచ్చందో , అప్పటికీ హెల్పర్స్ యెంత కావాలంటే అంతే పెట్టుకోండి , ప్లేట్లలో మిగిలిన పదార్ధాలు బిన్స్ లో పడెయ్యొద్దు తిండిగింజలు లేక చాలా మంది వున్నారు వాళ్ళకి యిచ్చెస్తాము అని యెంత చెప్పినా యిదే తంతు . తిన్నంత తిని పారేసింది చాలక రూములలో మంచాల కిందన పడేసి చాలా గలీజు చేసేరు .

మరునాడు ' సాగా ' కి ప్రయాణం . తొందరగా లేచి స్నానాలు చేద్దామనుకున్న మాకు పొద్దున్న లేచి మా రూము తలుపు తీసిన మాకు ఆ పదిమంది విశ్వరూప దర్శనం జరిగింది . అంటే ఒంటి మీద నూలుపోగు లేకుండా అక్షరాలా మూడు గంటల సేపు యెవ్వరినీ బాత్రూములలోకి వెళ్ళ నివ్వకుండా చేసేరు . మా సౌకర్యం కోసం తెల్లవార్లూ  మోసి తెచ్చిన నీళ్ళు పారబోసేరు . తరవాత పూజలు భజనలు యెంత పుణ్యం సంపాదించేరో వారికే తెలియాలి . దోర్జీ కి మా బాధ చెప్పు కుంటే మమ్మల్ని వేరేచోట కాస్త శుభ్రమైన మరుగుదొడ్లు చూపిస్తే కాలకృత్యాలు అయేయని పించు కున్నాం . మా కూడా తెచ్చుకున్న వెట్ట్ వైప్స్ తో ఒళ్ళంతా శుభ్ర పరుచుకున్నాం . అవేళటి నుంచి అదే మా స్నానం .

టిఫిను టీ ల తరువాత మా ప్రయాణం ' సాగా ' వేపు సాగింది . విశాలమైన రోడ్లు చాలా బాగున్నాయి . కను చూపు మేరలో మంచు గాని మంచు పర్వతం గాని కనిపించలేదు . ఎండ తగిలితే విపరీతమైన వేడి , ఎండ తగలకపోయేసరికి పిచ్చి చలి . మా డ్రైవరునితో మాటకలిపి అక్కడి రాజకీయ పరిస్తితుల గురించి తెలుసుకుందామని మేము చేసిన ప్రయత్నాలు ఫలించలేదు . మనం యేమి చెప్పినా అతనికి యేమీ అర్ధం అయేదికాదు . మా అయిదుగురం కాస్త సేపు మాటలు , సహస్రనామ పారాయణాలు , కునుకుల తో మధ్యాహ్నం వరకు గడిపేము న్యాలం నుంచి రెండుమూడు గంటల ప్రయాణం తరవాత ' తోంగ్లా పాస్ ' గుండా ప్రయాణం చేసి యెడమ వైపుకి తిరిగి ' శిసపంగ్మ ' బేస్ కేంపు చేసుకుంటుంది . అక్కడ చెక్ పోష్టులో మళ్ళా వెరిఫికేషన్ పూర్తయేక 'పైకు-త్సొ ' సరస్సు వైపుకి సాగింది మా ప్రయాణం . అల్లంత దూరం లో సరస్సు కనిపించగానే మా మొదటి ఆలోచన ' మానస సరోవరం అదేనేమో' అని బుద్దిని వుపయోగిస్తే యిది అయివుండదు , యింకా రెండు రోజులు ప్రయాణం వుందిగా ' అని తట్టింది .

రెండవ ఫొటో పైకు-త్సొ సరస్సు

ఎండపడి మెరుస్తున్న స్వఛ్చమైన నీరు . చుట్టూరా 5000 మీటర్లు అంతకు మించిన యెత్తైన కొండలు , కాని యెక్కడా గడ్డి పోచకూడా మొలిచి లేదు చెట్ల మాట దేముడెరుగు . అక్కడ మమ్మల్ని దింపి కార్లు వెళ్ళి పోయేయి . దోర్జీ దగ్గరకు వెళ్ళి సరస్సు వివరాలు తెలుసు కున్నాం . చుట్టు పక్కల వున్న హిమనీనదములనుంచి వచ్చిన నీటి వల్ల యేర్పడి బ్రహ్మపుత్ర నదికి దక్షిణాన 18 కిలో మీటర్ల దూరంలో వుంది . ఈ సరస్సును ' పైకు- త్సొ ' అని అంటారు . సముద్ర మట్టానికి 4600 మీటర్ల యెత్తులో సుమారు 27 కిలో మీటర్ల పొడవు 6 కిలో మీటర్ల వెడల్పు కలిగిన మంచినీటి సరస్సు .

ఆ సరస్సు ఒడ్డున మాకు లంచ్ యివ్వబడింది . రెండురకాల కూరలు , పులావు , పప్పు , రొట్లు , తియ్యని మామిడిపండు ముక్కలు యిచ్చేరు . అక్కడ కూచోడానికి యేమీ లేవు . అంతా ఎర్ర మన్ను గాలికి యెగిరి , గాలితోపాటు మా బట్టలకి అంటుకుంటూ , మాట్లాడితే నోట్లో పడుతూ వుంది . గాలి పెరిగే సరికి చలి కూడా  పెరగసాగింది . యెంత గాలి అంటే మేము తింటున్న ప్లేట్లు తిండిపోతో సహా యెగిరిపోయేంత . రెండుగంటలు పోయేక వచ్చేయి మా వాహనాలు . తిరిగి మా ప్రయాణం ముందుకి సాగింది . యెక్కడా చెట్టూ చేమ లేని దారిలో ప్రయాణం చాలా విసుగు పుట్టించింది . మా డ్రైవరు అప్పటి వరకు వేలాడదీసిన ' దలై లామా ' బొమ్మను మిగతా చిహ్నాలను దాచేసి వేరే లామా చిహ్నాలు కారు డేష్ బోర్డు మీద పెట్టు కొన్నాడు .  సాగా ' వూరు మూడు ప్రధాన రాజ మార్గాలు కలిసి కూడలి . ' సాగా ' మొత్తం అంతా చైనా ఆర్మీ తో నిండి వుంది . ఆ వూరి ప్రజలు బయటికి వెళ్ళేవారు యెంట్రీ చేయించుకొని వెళ్ళి సాయంత్రానికి తిరిగి వచ్చెయ్యాలిట . యెంట్రీ పాయింటు దగ్గర వీసా చెకింగు జరిగేక వూరిలోకి ప్రవేశించేము . న్యాలం నుంచి సాగా కి సుమారు 260 కిలో మీటర్ల దూరం ప్రయాణం చేసేము . ' సాగా ' బహ్మపుత్రా నదీ తీరంలో సముద్ర మట్టానికి సుమారు 4460 మీటర్ల యెత్తులో వున్న పట్టణం .

3) సాగా పట్టణం

అక్కడ కూడా గదులు అందరూ ఆక్రమించగా అదే చోట కాస్త మా గ్రూపుకి దూరంగా వంట శాలకు దగ్గరగా వున్న గది మీకు ఫరవాలేదు కదా అని అడిగి మాకు కేటాయించేరు . మా గదికి దగ్గరగా వున్న మరుగు దొడ్లు వేరెవరూ వాడక పోవడం( అక్కడ వున్నాయని తెలియక పోవడం వల్ల ) మాకు కాస్త మంచిదయింది . వేడిగా వండగానే మాకు ముందుగా వడ్డించడం తాగడానికి వేడినీళ్ళు యివ్వడం లాంటి స్పషల్ సర్వీసులు పొందేము . ఇద్దరు హెల్పరులు మా బేగులు తాము మోస్తామని పరిక్రమ అప్పుడు టిబెట్టు వారికి యివ్వొద్దని ' చాంగ్మై ' అడిగితే మేము మోసుకుంటామని చెప్ప మన్నారు . వారి కిచ్చేంత డబ్బు వీరికిస్తే చాలని చాలా దీనంగా అడిగేరు . మేం సరే అన్నాం .

' సాగా ' వూరు దాటేక మాకు టెంటులలో గాని లేక టిన్నులతో గాని చేసిన రూములు తప్ప వేరే యేవీ వుండవు . మానససరోవరం వెళ్ళే దారిలో వున్న యేకైక వసతి సౌకర్యం గల పట్టణం అది .మేం రాత్రి భోజనం లో మా ఆవకాయ పేకెట్స విప్పేం . అడిగి కొందరు అడగకుండా కొందరు ఖాళీ చేసేరు .

' సాగా ' లో చైనా డాక్టరు చెక్ అప్ వుంటుంది అన్నారు గానీ  అలాంటి దేమీ జరగలేదు .

మాకు ప్రతీ రోజు వెట్ వైపుల స్నానమే . ఫలహారాలు ముగించు కొని  మరునాడు మాయాత్ర పొద్దున్న యెనిమిదికి ప్రారంభించేము  .

సుమారు మరో 75 కిలో మీటర్ల దూరం ప్రయాణం చేసేక ' దొంగ్బా ' మీదుగా మాప్రయాణం సాగింది .

' దొంగ్బా ' వూరు ప్రజలు సాంప్రదాయక టిబెట్టు దుస్తులు ధరించి వారి మత చిహ్నాలను ధరించి వున్నారు . వీరు ప్రకృతి ఆరాధకులు . మనిషి ప్రకృతి ఒకే తండ్రి ద్వారా వేరువేరు తల్లులకు పుట్టిన అన్నదమ్ములుగా భావిస్తారు . మనిషి ప్రకృతిని రక్షిస్తే ప్రకృతి మనిషిని రక్షిస్తుందని నమ్ముతారు . శాంత స్వభావులు . మా ప్రయాణం లో యెక్కడా రోడ్డు ఆనుకొని టీ దుకాణాలు కూడా లేవు . సుమారుగా 280 కిలో మీటర్లు  ప్రయాణించిన తరువాత ' ప్రయాంగ్ ' చేరేం .

' డాంగూ త్సాంగో ' నుంచి వలస వచ్చిన సంచార జాతులకు చెందిన వారు యేర్పరచుకున్న గ్రామం . గ్రామం అనే బదులు నాలుగయిదు కుటుంబాల వారు రేకుల షెడ్డులు నిర్మించి వాటిని యాత్రీకులకు అద్దెకిచ్చి బతుకులు వెళ్ళ దీస్తున్నారు అంటే సరిపోతుందేమో .

మాలాంటి గ్రూపులు మరో మూడు మానస సరోవరం వైపు వెళుతున్నవి , మూడు తిరిగి వస్తున్నవి అక్కడే రాత్రి బస చేసేరు . తిరిగి వస్తున్న వారి కథనం ప్రకారం హిమపాతం వల్ల వారి యాత్ర మానస సరోవరం దగ్గర నిలిపి వేయ బడింది . రెండు రోజుల తరవాత అంటే బుద్ద పూర్ణిమ బౌద్దుల పర్వదినం కాబట్టి ఆ రెండు రోజులు చైనా ప్రభుత్వం కైలాస్ యాత్రీకులను అనుమతించదు . కాబట్టి వారు మానససరోవరం నుంచి వెనుకకు వచ్చేరు .మాకు గుండెల్లో రాళ్ళు పడ్డాయి .

 గది సైజుని బట్టి 10 నుంచి 20 మందికి ఒక గదిని కేటాయించేరు .

పొద్దున్నే ఆరున్నరకి ప్రయాణం మొదలయింది . ముందు రోజు మేం సేకరించిన సమాచారం ప్రకారం మానససరోవరం లో వాతావరణం బాగుంటే మధ్యాహ్నం మూడు నాలుగు మధ్యలో స్నానం చేస్తే చలి కాస్త తక్కువగా వుంటుందని , ఆవనూనె శరీరానికి రాసుకుంటే ' న్యుమోనియా ' దగ్గరకురాదని చెప్పేరు మా సహాయకులు .

మధ్యాహ్నం ఒంటి గంటకు మానససరోవరం చేరేం . మా ఇండోరు నుంచి వచ్చిన గ్రూపు ముందుగా స్నానాలకి పరిగెట్టేరు . దోర్జీ భోజనాల తరవాత స్నానాలకి వెళ్ళ వలసిందిగా చెప్పినా వినలేదు . వారితోపాటు  కొంతమంది వెళ్ళేరు . మేం మాకు కేటాయించిన షెడ్డులోకి చేరుకున్నాం . పన్నెండు పడకలు వేసి వున్నాయి . మేము అయిదుగురం కాక భారతి, ఆమె భర్త వారి తో పాటు గుజరాత్ నుంచి వచ్చిన మరో అయిదుగురు వున్నాం . మా పుణ్యం బాగుండి అంతదూరంలో మానససరోవరం కనిపిస్తోంది . మానససరోవరానికి ఉత్తరంగా బంగారు రంగులో మెరుస్తూ కైలాస పర్వతం కన్నుల పండగ చేసింది .

మానససరోవరం గురించి వివరాలు పై సంచికలో చదువుదాం

 అంతవరకు     శలవు

మరిన్ని వ్యాసాలు

అశ్వతి
అశ్వతి
- డాక్టర్ వై వి కె రవికుమార్
పియానో పాటలు .
పియానో పాటలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పాలెగాళ్ళు.
పాలెగాళ్ళు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
సినిమా గీతాలలో  షెహనాయ్ వాద్యం.
సినిమా గీతాలలో షెహనాయ్ వాద్యం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు పలువురికి -3
పురాణాలలో ఒకే పేరు పలువురికి-3
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
108
108
- శ్రీరామ్ లక్ష్మీనారాయణ మూర్తి