సాహితీవనం - ***వనం వేంకట వరప్రసాదరావు.

sahiteevanam
ఆముక్తమాల్యద

ఆముక్తమాల్యదలోని చివరి, ఆరవ ఆశ్వాసంలో 
 
శ్రీ మహావిష్ణువు  చేత ఒక భక్తుడి కథను చెప్పిస్తున్నాడు శ్రీకృష్ణదేవరాయలు. నవరసాల కలబోతగా ఆ భక్తుడైన మాలదాసరి పాత్రను తీర్చి దిద్దాడు రాయలవారు. యింతవరకూ ఆతడి భక్తిని, బ్రహ్మరాక్షసుని భయానక బీబత్స సన్నివేశాన్ని, అతడినుండి తప్పించుకోవడానికి 
మాలదాసరి చేసిన పోరాటంలో శౌర్యాన్ని, పరాక్రమాన్ని,ధైర్యాన్ని, మాలదాసరి బ్రహ్మరాక్షసుల సంభాషణలలో హాస్యాన్ని చూపించాడు. యిప్పుడు మాలదాసరిలో లౌక్యాన్ని చూపిస్తున్నాడు. బ్రహ్మరాక్షసుడికి చిక్కి,కాళ్ళూ చేతులూ బంధింపబడి, మఱ్ఱి చెట్టుకు చేరగిలబడి 
మాలదాసరి యిలా అంటున్నాడు.

విను మొకమాట రాత్రిచర వేగిర మేటికి నిన్ జయింతురే 
యనిమిషు లైన? భాజనగతాన్నమ నే నిఁక నెందుఁ బోయెదన్
బెనఁగక ప్రాణరక్షణ ముపేక్ష యొనర్చుట పాప మిందుకై
కనలకు నాకు మేనియెడఁ గాన్క్షయు లే దిది పోవుటే యురున్

ఓ రాత్రి చరుడా! ఎందుకు అలా తొందరపడుతున్నావు, ప్రయాసపడుతున్నావు? తినబడడానికి సిద్ధంగా ఉన్న అన్నాన్ని నేను, కంచంలో సిద్ధంగా ఉన్న ఆహారాన్ని తినడానికి అంత కంగారెందుకు? నేనెక్కడికి పోతాను? యింతవరకూ నీతో ఎందుకు  పోరాడానో తెలుసా? ప్రాణములు భగవంతుడు యిచ్చిన వరం, అందునా మానవజన్మ,  (అందునా శ్రీహరిదాసుని జన్మ!) అలాంటి జన్మను నిష్కారణంగా పోగుట్టుకోవడం, ప్రాణాలను నిలబెట్టుకోవడం కోసం కనీస ప్రయత్నం కూడా చేయకపోవడం మహా పాపం! అందుకోసం పోరాడాను, నా వంతు ప్రయత్నం చేశాను తప్ప, ఏదో నీలాంటి మహావీరుడిని జయించాలనే దురాశతో కాదు! దీనికి కోపం తెచ్చుకోకు సుమా! అసలు  నాకు ఈ శరీరము మీద కాంక్ష కూడా లేదు, యిది పోవడమే మంచిది! అన్నాడు.నెమ్మదిగా అనునయంగా మాటల్లో పెట్టి ఏదో ప్రయత్నం చేయడానికి లౌక్యంగా మాట్లాడుతున్నాడు. కానీ అందులోనూ ధర్మ సూక్ష్మాన్ని చెబుతున్నాడు. తన దగ్గరికి కార్యార్ధియై వచ్చిన శత్రువును చంపడం, అవకాశం వుండీ ప్రాణాలను కాపాడుకునే ప్రయత్నం చేయడం, ఈ రెండూ ఆత్మహత్యతో సమానం, అందుకు ఫలితం 'రౌరవ' నరకానికి పోవడం! యేవో కారణాల పేరుతో ఆత్మహత్యలు చేసుకుందామనుకునేవారు ఈ పలుకులను గమనించాలి.

హీనజన్మ మఱుట యెవ్వఁడే నొక ప్రాణి 
సంతసిలుట ముక్తి పొంత గనుట
మేలెకాదె శిబియ మేల్బంతిగాఁడె న
శ్వరపుదేహ మమ్మి పరము గొనుట

ఈ హీన జన్మను, ఎవరికీ ఉపయోగపడని జన్మను పోగొట్టుకోవడం, తద్వారా వేరే  ఎవరికై నా సంతోషాన్ని కలిగించడం, ఆ కారణంగా ముక్తిని పొందడం మేలు కాదూ?  అశాశ్వతమైన శరీరాన్ని యిచ్చి, ముక్తిని తీసుకోవడంలో శిబిచక్రవర్తి అందరికీ  మార్గదర్శకుడు కాడూ? నీ ఆకలి తీర్చడంకోసం నీకు ఆహారాన్ని కావడం, అలా  నీకు సంతోషాన్ని కలిగించడం అంటే ముక్తిని పొందడం కదూ! తెవు లయినం, గ్రహం బయినఁ, దే లయినం, గర మైన, నాత్మ పెం దెవు లయిన, న్జలం బయినఁ, దెక్కలియైన, మృగాగ్నులైన, మే ల్తవు లయిన, న్వ్రణం బయినఁ, ద్రా చయినన్బిడుఁ గైనఁ, దీర్చువే లవ తను వూరకే చెడ కిల న్గృశు నొక్కనిఁ బ్రోచు టొప్పదే?

వ్యాధిచేతనో, గ్రహ పిశాచాదులచేతనో, తేలు వల్లనో, విషము (తినడం) వల్లనో,  పెద్ద మనోవ్యాధిచేతనో, నీటిలో మునిగిపోవడం వల్లనో, దోపిడీగాళ్ళ చేతిలోనో, క్రూరమృగాల వల్లనో, అగ్నిలో కాలిపోవడం వల్లనో, ఆడదానికోసమో, డబ్బుకోసమో, పుండువల్లనో, త్రాచుపాము కరవడంవల్లనో, పిడుగు పడడంవల్లనో, పోయేకాలం  యిలా యెలానో వచ్చి ఈ శరీరం నశించిపోవడం కంటే, పాపం! నీలా ఆకలి బాధచే 
కృశించిపోతున్నవారిని కరుణించి, వారికి ఆహారమై చనిపోవడం మంచిది కాదూ?  అన్నాడు.

'చండాలా దుదకాత్ సర్పాత్ వైద్యుతాత్ బ్రాహ్మణాదపి దంష్ట్రిభ్యశ్చ పశుభ్యశ్చ మరణం పాప కారణాత్' అని ఆర్యోక్తి. వికృతమైన మనసుతో చండాలుడు అని దూరంగా పెట్టినవాడిచేత, నీటిచేత, సర్పంచేత, విద్యుత్తు(పిడుగు)చేత, బ్రాహ్మణుడి కారణంగా, కోరలున్న మృగాలు, మొసళ్ళు మొదలైన వాటిచేత,పశువులచేత మరణించడం పాపం వలన జరుగుతుంది అని. యెందుకంటే వీరు అందరూ, యివన్నీ కూడా తమ మానాన తాము ఉండేవి, అనవసరంగా ముందుజాగ్రత్తలు తీసుకోకుండా నిర్లక్ష్యంగా ఉండడం వల్లనో, ద్రోహము, హాని  తలపెట్టడం వల్లనో తప్ప వీటి వలన, వీరి వలన మరణం రాదు అని తాత్పర్యం.
అలా పాపకారణంగా చనిపోవడంకంటే నీకు ఆహారాన్నై పుణ్యం చేసి, ఆ పుణ్య 
కారణంగా మరణించడం మంచిది కదా అని పలికిస్తున్నాడు మాలదాసరితో.  
 
అది సరే, యింకొక హితవు చెబుతాను, అది కూడా నేనేదో ప్రాణభయంతో చెబుతున్న 
మాటగా భావించకుండా విను. ఒకవేళ నువ్వు వినకున్నా, యితర ప్రాణుల హితం 
కోరి చెప్పే మాటలకు భగవంతుడు మెచ్చుకుంటాడు కనుక పర్లేదు, నాకేమీ నష్టం 
లేదు. నువ్వు మామూలు మృగానివో, క్రూరమృగానివో, విష కీటకానివో, లేదూ,
నాలాంటి మామూలు మనిషివో కాదు. మామూలు రాక్షసుడివి కూడా కావు, 'బ్రహ్మ 
రాక్షసుడివి'! అలాంటి నీకు మలమూత్రాదులకు నిలయమైన నా మానవశరీరం 
తిండి ఏమిటి? అదీ కాక, నీ పూర్వీకులైన హిరణ్యకశిపుడు, రావణాసురుడు మొదలైన 
వారు దేవతలను జయించి కూడా చివరికి యముడి చేతిలో చిక్కి చనిపోలేదూ? 
యిక్కడ నువ్వు బలవంతుడివి అయితే, అక్కడ, వాడు, యముడు బలవంతుడు కదా!
యింత జుగుప్సకు నిలయమైన మనవశరీరాన్ని జయించి, తిని, నువ్వు శాశ్వతంగా 
బ్రతికేవాడివి కావు కదా? ఎందుకు ఈ అసహ్యకరమైన తిండి చెప్పు? అన్నాడు.
వాడి మేలుకోరి చెబుతున్నట్లు చెబుతున్నాడు, నన్ను కరుణించి విడిచిపెట్టవయ్యా 
అనడం లేదు, అదీ మాలదాసరి గడుసుదనం. ఆ మాటలకు పెద్దగా నవ్వి 
ఆ బ్రహ్మరాక్షసుడు యిలా అన్నాడు.
 
(కొనసాగింపు వచ్చేవారం)
***వనం వేంకట వరప్రసాదరావు.  

మరిన్ని వ్యాసాలు

అశ్వతి
అశ్వతి
- డాక్టర్ వై వి కె రవికుమార్
పియానో పాటలు .
పియానో పాటలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పాలెగాళ్ళు.
పాలెగాళ్ళు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
సినిమా గీతాలలో  షెహనాయ్ వాద్యం.
సినిమా గీతాలలో షెహనాయ్ వాద్యం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు పలువురికి -3
పురాణాలలో ఒకే పేరు పలువురికి-3
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
108
108
- శ్రీరామ్ లక్ష్మీనారాయణ మూర్తి