అవీ - ఇవీ - భమిడిపాటి ఫణిబాబు



చిన్నప్పటి సంక్రాంతి సంబరాలు గుర్తుచేసికుంటే చాలా బావుంటుంది కదూ. ఈరోజుల్లోనూ ఉన్నాయి కానీ, ఆనాటి సంబరాలే వేరూ. ఏదో మొక్కుబడిగా తప్పించి, అసలు “ జీవం “ కనిపించడంలేదు. కారణం ప్రతీదాంట్లోనూ కల్తీయే. గొబ్బిళ్ళు తయారు చేసికోడానికి, ఆవు పేడే శ్రేష్టం అనుకుంటే, అసలు ఈరోజుల్లో ఆవే కనిపించడంలేదాయె. పైగా ప్రతీవారూ, అదేదో “ బీఫ్ ఫెస్టివల్ “ చేసికోడంలో బిజీ అయిపోయారు. వులెక్కడ దొరుకుతాయీ మరి? ఇంకో చిత్రం ఏమిటంటే. ఈ ఆవుపేడ చివరకి ఎమెజాన్ లో కూడా దొరకడం. అంటే, చివరకి అదికూడా ఓ వ్యాపారమయిపోయింది.

కొత్త సంవత్సరంలో వచ్చే మొదటి పండగ సంక్రాంతే అవడంతో, నగరాల్లో ఉండే జనాలు, ఎక్కడెక్కడివారూ, తమ తమ స్వంత ఊళ్ళకి బయలుదేరడంతో, వాళ్ళమాటెలా ఉన్నా, రైళ్ళలో వెళ్ళేవారితో ప్రభుత్వాలకీ, బస్సుల్లో వెళ్ళేవారివలన , వాటి యాజమాన్యాలకీ గిరాయికీ ఎక్కువయిపోతుంది. రేట్లు ఇష్టం వచ్చినట్టు పెంచేసి, వాళ్ళు పండగ చేసికుంటున్నారు. ఇదివరకటి రోజుల్లో భోగి పండగొచ్చిందంటే, ఇళ్ళల్లో ఉండే చిన్న పిల్లలకి భోగి పళ్ళు పోయడం, బొమ్మలు  కొలువు పెట్టడం తప్పకుండా ఉండేవి.రకరకాల బొమ్మలు అందంగా పెట్టేవారు. ఈరోజుల్లో, ఆ బొమ్మలూ లేవు, కొలువులూలేవు, ఎక్కడో అక్కడక్కడ తప్ప. ఇంక పిండివంటలంటారా, ప్రతీదీ మార్కెట్ లోనే దొరకడంతో, వాటితోనే కానిచ్చేస్తున్నారు. కానీ, ఇంట్లో తయారుచేసికున్న రుచీ, ఆనందం వీటిలో ఉంటాయంటారా?  ఆనాటి కాలమానపరిస్థితులని బట్టి, కనుమనాడు  “ కాకైనా బయలుదేరదని”, ఆరోజున ప్రయాణాలు పెట్టుకోనిచ్చేవారు కాదు. కానీ, ఈరోజుల్లో, మనకి ఏ రోజు రిజర్వేషను దొరికితే, ఆరోజే బయలుదేరాలి, కనుమైనా ఇంకోటేదైనా సరే.

ఇప్పటికీ కోనసీమప్రాంతంలో  కొనసాగుతున్నవి, ప్రభల తీర్థాలూ, కోడి పందాలూనూ. ప్రభలతీర్థం చూడడానికి దేశవిదేశాల్లోని తెలుగువారందరూ,  సాధ్యమైనంతవరకూ రావడానికి ప్రయత్నిస్తారు. అసలు ఆ ప్రభల తీర్థం ఒక్కసారైనా చూడాల్సిందే. 

ప్రభుత్వాలు కోడిపందాలని ఎంతగా నిషేధించినా, వాటి దారిన అవి జరుగుతూనే ఉంటాయి. కోట్లరూపాయలు చేతులుమారడం పేపర్లలో చదువుతూనే ఉంటాము. అప్పటికీ ఇప్పటికీ కొట్టొచ్చేటట్టు కనిపించే తేడా , వార పత్రికల విషయంలో. ఆరోజుల్లో సంక్రాంతి పండగొచ్చిందంటే చాలు, ఓ రోజుముందుగానే, “కునేగా “ సెంటు ఘుమఘుమలతో ప్రత్యేక సంచికలొచ్చేవి. ఈరోజుల్లో ఆ ఘుమఘుమలే లేవు. అసలు వస్తూన్న పత్రికలే కనుమరుగయిపోయాయి.  అలాగే సంక్రాంతి వచ్చిందంటే, గ్యారెంటీగా  ఆనాటి ప్రముఖ నటుల చలన చిత్రాలు విడుదలయేవి.  కానీ ఈరోజుల్లో జరుగుతున్న  సినిమా రాజకీయాల ధర్మమా అని, విడుదల విషయాల్లో చాలా గందరగోళాలు చూస్తున్నాము. అయినా ఈరోజుల్లోని సినిమాల్లో చూడ్డానికేముందనీ?  ఏ సినిమా అయినా భోగినాడు విడుదలయి ముక్కనుమనాటికి వెళ్ళిపోయేవేగా… ఆరోజుల్లో శతదినోత్సవాలు అనేవారు, ఈరోజుల్లో ఫలానా రోజూ, ఫలానారోజూ అంటూ, పదోరోజూ, పన్నెండో రోజుస్థాయికీ దిగజారిపోయాయి.

అయినా  ఈరోజుల్లో   వాలెంటైన్ డే కి ఉన్న ప్రాముఖ్యత, పాత తరం పండగలకి ఎవరిచ్చారు? మన దేశంలో కంటే, విదేశాల్లో ఉండే తెలుగువారే  కొద్దో గొప్పో ప్రాముఖ్యత ఇస్తున్నట్టు కనిపిస్తోంది. వేషభాషల్లో ఆ తేడా స్పష్టంగా తెలుస్తోంది.  విదేశాల్లో ఉండే తెలుగు వారికోసమేనేమో అమెజాన్. కాం వారు ఆవుపేడనుకూడా, వారి వస్తువుల జాబితాలో చేర్చారు. మనకి ఇక్కడ ఊరికే దొరుకుతోందిగా అందుకే దాని విలువ తెలియడం లేదు.


ఇది వరకటి రోజుల్లో భోగి మంటల్లో, పిడకల దండలతో పాటు, దొరికిన చెక్కా ముక్కా కూడా వేసేసేవారు. ఎవరి కాంపౌండుకేనా చక్క గేటు ఉండడం పాపం,  అది కాస్తా తెల్లారేటప్పటికి భోగిమంటలో ఆహుతయిపోయేది.  అసలు ఈరోజుల్లో చక్క గేట్లెక్కడ కనిపిస్తున్నాయీ, ఎక్కడ చూసినా  అల్యూమినం గేట్లూ, ఫైబరు గేట్లే కదా. పైగా నగరాల్లో భోగి మంటలు వేయడానికి ప్రతీవారికీ నామోషీ. అదే ఏ హోళీ పండగో అయితే మాత్రం, ఎంతో ఉత్సాహంగా చేస్తారు.

ఇది వరకటి రోజుల్లో సంక్రాంతి వచ్చిందంటే, ఖచ్చితంగా మెడ్రాసు ( ఇప్పటి చెన్నై ) లో క్రికెట్ టెస్టు ఉండెదే.  శనాదివారాలూ, పండగ మూడురోజులూ ఎంతో ఆసక్తిగా రేడియోలో కామెంట్రీ వినేవారు. అదో పండగా. కానీ సంవత్సరం పొడుగునా, పగలూ, రాత్రీ క్రికెట్టాడుతున్న ఈ రోజుల్లో వాటినెవడు గుర్తుపెట్టుకుంటాడూ?  అధవా గుర్తున్నా, రేడియోలు ఎక్కడున్నాయి? అసలు రేడియోలో కామెంట్రీ వినడమే ఒక మధురానుభూతి. జరుగుతున్న ఆటని, కళ్ళకు కట్టినట్టుగా వివరంగా చెప్పేవారు.  .

తీయనైన తెలుగు భాషకి దూరమవుతున్నట్టే, మన అచ్చ తెలుగు పండగలకి కూడా దూరం అయిపోతున్నాము. ఏదో టీవీల్లోనే చూసి ఆనందించే పరిస్థితికి దగ్గరవుతున్నాము.

సర్వే జనా సుఖినోభవంతూ….

మరిన్ని వ్యాసాలు

అశ్వతి
అశ్వతి
- డాక్టర్ వై వి కె రవికుమార్
పియానో పాటలు .
పియానో పాటలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పాలెగాళ్ళు.
పాలెగాళ్ళు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
సినిమా గీతాలలో  షెహనాయ్ వాద్యం.
సినిమా గీతాలలో షెహనాయ్ వాద్యం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు పలువురికి -3
పురాణాలలో ఒకే పేరు పలువురికి-3
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
108
108
- శ్రీరామ్ లక్ష్మీనారాయణ మూర్తి