వీక్షణం - పి.యస్.యమ్. లక్ష్మి

 

              న్యూయార్క్ 



న్యూయార్క్ చేరి, హోటల్ చూసుకుని, రూమ్ కి చేరేసరికి రాత్రి 2గం. లయింది.  ఆ రాత్రి కి విశ్రాంతి తీసుకుని ఉదయం బయల్దేరి బ్రాడ్ వే (బిజినెస్ సెంటర్) వగైరాలు చూశాము.

అమెరికాలోని ప్రముఖ పర్యాటక కేంద్రాలలో న్యూయార్క్ ఒకటి.  ఈ నగర సందర్శనకు ప్రతి సంవత్సరం 4 కోట్ల మంది పైగా సందర్శకులు వస్తారుట.  2001 సెప్టెంబర్ 11 దాకా న్యూయార్క్ అంటే అందరికీ గుర్తొచ్చేది స్టేట్యూ ఆఫ్ లిబర్టీ.  కానీ ఆ దురదృష్టకరమైన రోజునుంచీ అందరికీ ముందు గుర్తొచ్చేది కూలిపోయిన వరల్డ్ ట్రేడ్ సెంటర్, చనిపోయిన 3000మంది జనాభా.  ఆ ప్రదేశం చూసినప్పుడు ఇంత చిన్న స్ధలంలో అన్ని అంతస్తుల భవనం వుండేదా అని ఆశ్చర్యం వేసింది.  ఆ భవనం మంటల్లో చిక్కుకున్నప్పుడు భవనంలోవారు, చుట్టుపక్కలవారు ఎంత భయాందోళనలకు లోనయి వుంటారోనని తలుచుకుంటే బాధా అనిపించింది, భయమూ వేసింది.

స్టేట్యూ ఆఫ్ లిబర్టీ

న్యూయార్కు లో చూడదగిన ప్రదేశాల్లో స్టేట్యూ ఆఫ్ లిబర్టీ ఒకటి.  ఇది న్యూయార్క్ హార్బర్ లోని లిబర్టీ ఐలెండ్ లో వున్నది.  స్వాతంత్య్రాన్ని సూచించే ఈ విగ్రహం ఫ్రాన్స్ ప్రజలచే అమెరికాకి బహుమతిగా ఇవ్వబడింది. అక్టోబర్ 28, 1886న ఆవిష్కరింపబడిన ఈ విగ్రహం పీఠం ఎత్తు 27 మీటర్లు.  విగ్రహం ఎత్తు 46 మీటర్లు.  బరువు 204 టన్నులు.  డిజైనర్ బర్తోల్డి.  నిర్మించినది గేగెట్ అనే పేరిస్ కంపెనీ.  ఈ విగ్రహం దగ్గరకి వెళ్ళాలంటే ఫెర్రీలో వెళ్ళాలి.  ఈ నేషనల్ మాన్యుమెంట్ దగ్గరకి వెళ్ళటానికి ఎంట్రన్స్ ఫీ లేదు కానీ ఫెర్రీకి టికెట్ తీసుకోవాలి.  ఫెర్రీ ఎక్కే ముందు సందర్శకులందరికీ తప్పనిసరిగా సెక్యూరిటీ చెక్ వుంటుంది.  ఇక్కడ సందర్శకులు ఎక్కువగనుక క్యూలు కూడా పొడుగ్గా వుండి సమయం ఎక్కువ పడుతుంది.  వీలయితే టికెట్లు ఆన్ లైన్ లో తీసుకుంటే కొంత సమయం కలసి వస్తుంది.  

ఈ విగ్రహం లోపలనుంచి వున్న మెట్ల ద్వారా కిరీటందాకా వెళ్ళవచ్చు.  అయితే ఇలా వెళ్ళటానికి రోజుకి 240మందిని మాత్రమే అనుమతిస్తారు.  అదీ 10 మందిని ఒక బేచ్ గా.  వీటికి స్పెషల్ టికెట్లుంటాయి.  రోజుకి కొద్దిమందిని మాత్రమే అనుమతిస్తారు కనుక దీనిలోకి వెళ్ళాలంటే చాలాకాలం ముందే స్పెషల్ టికెట్లు తీసుకోవాల్సి వుంటుంది.  ఇవి ఆన్ లైన్ లో రిజర్వు చేసుకోవచ్చు.  ఈ సందర్శకులు తమతో కేవలం మందులు, కెమేరా మాత్రమే తీసుకు వెళ్ళవచ్చు.  మిగతా వస్తువులన్నింటినీ అక్కడవున్న లాకర్లల్లో భద్రపరచుకోవచ్చు.

వాల్ స్ట్రీట్ బుల్

స్టాట్యూ ఆఫ్ లిబర్టీకి కొంచెం దూరంలోనే  వున్న వాల్ స్ట్రీట్ బుల్ దగ్గరకి నడిచే వెళ్ళాము.  అక్కడ అతి బలిష్టమైన, పెద్ద ఎద్దు బొమ్మ రోడ్డుకి ఒక పక్కన వున్నది.  దీనిని చూడటానికి కూడా జనం విపరీతంగా వస్తున్నారు, అక్కడ ఫోటోలు తీసుకుంటున్నారు. 

ఈ ఎద్దు ఎత్తు 11 అడుగులు, పొడుగు 16 అడుగులు, బరువు 3200 కిలోలు.  కంచుతో చెయ్యబడిన ఈ ఎద్దు పొడవటానికి సిధ్ధంగా వున్నట్లు వుంటుంది.  న్యూయార్క్ షేర్ మార్కెట్ లోని ఒడిదుడుకులని సూచిస్తుంది ఈ ఎద్దు అంటారు.

మేడమ్ టస్సాడ్ మ్యూజియమ్

ఈ మ్యూజియమ్ గురించి మీరు వినే వుంటారు.  200 సంవత్సరాల క్రితం లండన్ లో ప్రారంభింపబడిన మేడమ్ టస్సాడ్ మ్యూజియం, తర్వాత వేరే ప్రాంతాలలో కూడా  ఏర్పాటు చేయబడింది.  అమెరికాలో 1999లో మొదటి మ్యూజియమ్ లాస్ వెగాస్ లో ప్రారంభించగా, 2000లో రెండవ మ్యూజియమ్ న్యూయార్క్ లో స్ధానం ఏర్పరుచుకున్నది.  ఎందరో ప్రముఖుల మైనం బొమ్మలు తయారు చేసి ఇక్కడ ప్రదర్శనకు వుంచారు. అవి జీవకళ వుట్టి పడుతూ వుంటాయి.  కొన్నిటినయితే మనం తాకి చూస్తేనేగానీ అది నిజం మనిషో లేక బొమ్మో అర్ధం కాదు.  అంత బాగున్నాయి. అక్కడ మన గాంధీ తాతని చూసి ఉప్పొంగి పోయాను.

ఇదేగాక ఇంకో రెండు మ్యూజియమ్ లు కూడా చూశాము.  అక్కడ మ్యూజియమ్ లు కూడా ఎక్కువ.  పైగా మేము చూసినవి పక్క పక్కనే వున్నాయి.

ప్రపంచంలోని పెద్ద భూగర్భ రైల్వే,  న్యూయార్క్  సిటీ సబ్ వే ఇక్కడ వున్నది.  ఇక్కడి ప్రజలలో చాలామంది పబ్లిక్ ట్రాన్స్ పోర్టు వాడతారు.  అమెరికాలో ఇతర ప్రాంతాలలో ప్రతి ఒక్కరికి కారు లేకపోతే గడవదు.  కానీ ఇక్కడ మాత్రం చాలామందికి కార్లుండవు.  ఎక్కువ జనాభా కల ప్రదేశం కనుక స్వంత వాహనాలు వాడితే ట్రాఫిక్, పార్కింగ్ సమస్యలుంటాయి.  మేముకూడా అక్కడ ఒక చోట కారు పార్కు చేసి కాలి నడకన, బస్ లోనూ వెళ్ళాము మేము చూసిన ప్రదేశాలకు.

ఇక్కడ సందర్శకులకు కూడా బస్ లు అనుకూలంగా వుంటాయి.  హాప్ ఇన్ హాప్ అవుట్ బస్ లు వుంటాయి.  మనం ఒక సారి టికెట్ తీసుకుంటే  ఆ బస్ లు తిరిగే మార్గంలో ఎక్కడయినా దిగవచ్చు, ఎక్కవచ్చు.

వివిధ దేశాలనుంచి వచ్చి ఇక్కడ స్ధిర పడిన ప్రజలుండటం వలన ఇక్కడ విభిన్న రుచుల ఆహార పదార్ధాలు దొరుకుతాయి.  అమెరికాలో మనం విడ్డూరంగా చెప్పుకునే నియమం లేని వ్యక్తులను ఇక్కడ రోడ్లమీద చూశాము.  ఆకాశాన్నంటే భవనాలు, రద్దీగా వున్న రోడ్లు, రోడ్ల మీద మనుషుల ప్రవర్తన, ఇక్కడున్నంత సేపూ అమెరికాలో వున్నామని అనిపించింది.

రాత్రి దాకా తిరిగి, రాత్రికి ఇంటికి ప్రయాణమయ్యాము.  అమెరికా రోడ్ల మీద రాత్రుళ్ళు కూడా తేలికగా డ్రైవ్ చెయ్యవచ్చు, పిల్లలిద్దరూ డ్రైవ్ చేస్తారు గనుక ఇబ్బంది లేకుండా ఇంటికి చేరాము.

మరిన్ని వ్యాసాలు

అశ్వతి
అశ్వతి
- డాక్టర్ వై వి కె రవికుమార్
పియానో పాటలు .
పియానో పాటలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పాలెగాళ్ళు.
పాలెగాళ్ళు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
సినిమా గీతాలలో  షెహనాయ్ వాద్యం.
సినిమా గీతాలలో షెహనాయ్ వాద్యం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు పలువురికి -3
పురాణాలలో ఒకే పేరు పలువురికి-3
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
108
108
- శ్రీరామ్ లక్ష్మీనారాయణ మూర్తి