సాహితీవనం - వనం వెంకట వరప్రసాద రావు

sahiteevanam

ఆముక్తమాల్యద 

బ్రహ్మరాక్షసుని చేతికి చిక్కి, కాళ్ళూ చేతులూ  విరిచి కట్టబడి, వాడికి ఆహారంగా చావడానికి  సిద్ధంగా ఉన్న మహా భక్తుడైన మాలదాసరి  లౌక్యంగా వాడిని అనుకూలుడిగా చేసుకోడానికి వాడితో సంభాషిస్తున్నాడు.మాలదాసరి బిగ్గరగా నవ్వి, బ్రహ్మరాక్షసుడు యిలా అన్నాడు.

చంపకు చదువుల మేము ప
ఠింపని శాస్త్రములె? మా పఠింపని శ్రుతులే?
యింప వవి నమ్మవే 'బ్రథ 
మాం పిపతే వహ్ని'యను మాటవుఁ గాదే    

నీ చదువులతో, నీ పాండిత్యముతో నన్ను చంపకురా! నేను చదువని శాస్త్రాలా?శ్రుతులా? అవేవీ నాకు రుచించవు. ముందు జఠరాగ్నిని ల్లార్చుకోవాలి, ఆకలి తీర్చుకోవడమే జీవుల ప్రథమ కర్తవ్యము అని చెప్పలేదూ?
 
నిలు మోహో మము వారి భ్రాతలనుచున్ నీవంటి వారల్సుధా
శు లపూతాశులుగా రటంటి ప్రతిప త్సోమాంశము న్గ్రోలు మున్ 
జ్వలనుం డం టిఁక నొండు ని న్నడిగెదన్ సర్వాశిగాఁడా యతం
డిలఁ దన్న్యాయము చాలు మాకు నఘ మే వృధ్ధానుచారంబిఁకన్?

ఆగాగు! మా బ్రహ్మరాక్షలు హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు, రావణుడు మొదలైన వారి భ్రాతలు అన్నావు, నావంటివారు అపవిత్రమైన హారం తీసుకోరు అన్నావు,అగ్నిదేవుడు పాడ్యమినాటి చంద్రకళను, వెన్నెలను ఆహారంగా తీసుకుంటాడు అన్నావు, హహహ, ఆ గ్నిదేవుడు యిదీ అదీ అని చూడకుండా అన్నిటినీ భక్షించేవాడు కాదూ? ఆ విషయం చాలు మాకు, పెద్దలు అనుసరించిన మార్గాన్నే మేమూ అనుసరిస్తున్నాము, అదీ యిదీ అని లేదు, అన్నీ తింటాము, అదేమైనా తప్పవుతుందా ఏమిటి?

హరికి సఖుఁడును రథమును నగు గరుడుడు 
దొరకినమృతంబు సురలకు మరలనిచ్చి 
యహులు కూడుగ వరమున నడిగి కొనఁడె?
యమృత మైనను జవుల జాత్యన్నసమమె?

సాక్షాత్తూ శ్రీహరికి చెలికాడు, వాహనము ఐన గరుడుడు తను దొరికించుకున్న అమృతాన్ని దేవతలకు తిరిగి యిచ్చి, క్షుద్ర జీవులైన సర్పములను ఆహారంగా యిమ్మని వారము అడిగి, ఆ పాములనే తిని బ్రతకడంలేదూ? ఏ జాతికి తగిన ఆహారం ముందు ఆ జాతికి అమృతమైనా సరే, రుచికరంగా ఉంటుందా? ఉండదు!

నిదురయుఁ గూడుఁ బోఁ జదివి నే నిటఁ గన్నది ఏమి ఎవ్వఁ డీ  
చదువుల యర్థవాదపుమృష ల్విని బేల్పడు నీవు మాయెడం
జడువుల మాటలాడి కనఁ జాల వొకానొక మెచ్చు నొక్కఁ డీ
చదివినకూర వింతచవి చాలఁగఁ దెమ్మను మెచ్చు తక్కఁగన్

నిద్ర, తిండి లేకుండా చదివీ, చదివీ ఎవడైనా బావుకున్నది యేమిటటా? చదువుల అర్థాలు, శాస్త్రవాదాలు అనే కల్ల మాటలు విని 'బేలుపోయేవాడు',మోసపోయేవాడు ఎవడుంటాడు? చదువులు, శాస్త్రాలు అని ప్రసంగం చేసి,నువ్వు మామూలు కూర కాకుండా, చదివిన కూరవు ఐనావు నాకు. యింకా రుచిగా ఉంటావు! చదివిన కూరను సరిపోయేంత పెట్టుమని అడిగి లొట్టలేస్తూ మరీ తింటాను, ఈ శస్త్ర ప్రసంగం వలన నీకు ఏ ప్రశంసలూ రావు, నువ్వు తప్పించుకుని పోనూ లేవు అన్నాడు బ్రహ్మరాక్షసుడు.

(కొనసాగింపు వచ్చేవారం)

***వనంవేంకట వరప్రసాదరావు.     

మరిన్ని వ్యాసాలు

అశ్వతి
అశ్వతి
- డాక్టర్ వై వి కె రవికుమార్
పియానో పాటలు .
పియానో పాటలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పాలెగాళ్ళు.
పాలెగాళ్ళు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
సినిమా గీతాలలో  షెహనాయ్ వాద్యం.
సినిమా గీతాలలో షెహనాయ్ వాద్యం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు పలువురికి -3
పురాణాలలో ఒకే పేరు పలువురికి-3
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
108
108
- శ్రీరామ్ లక్ష్మీనారాయణ మూర్తి