అవీ - ఇవీ - భమిడిపాటి ఫణీబాబు

 

ఒకానొకప్పటి రోజుల్లో, ఓ   పత్రికలో కథ చదివినా, ఓ సినిమా చూసినా, ఏదో ఒక నీతి ఉండేది. అలాగని ఆరోజుల్లో, చెడనేదే లేదనికాదు. ఉన్నా కానీ,  చివరకి చెడుమీద, మంచే విజయం సాధించినట్టు తేల్చేవారు. దానితో, ఓ సినిమా చూసినా, ఓ కథ చదివినా, మనసుకి హత్తుకుపోయేది, ఆ ముగింపేకదా.. దానితో సమాజంలో వాతావరణం కూడా ప్రశాంతంగా ఉండేది. అలాగని అసలు గొడవలే లేవనీ కాదు, ఉండేవి.. కానీ ఎక్కువగా వాటిని  highlight  చేసేవారు కాదు. దానికి సాయం, సమాచార వ్యవస్థ కూడా అంతంతమాత్రమే.. రేడియో ఉందంటే, అది ప్రభుత్వం చేతిలోనే ఉండేది. ఊరికే కూర్చుని లేనిపోని గొడవలు తీసికునిరారుగా. ఇంక సినిమాలంటారా, ఆనాటి రచయితలు , దేశం బాగుపడాలనే ధ్యేయంతోనే కథలు వ్రాసేవారు. సినిమా మూడుగంటల్లోనూ, పాత్రలు ఎవరెలా కొట్టుకున్నా, చివరకి, “ “శుభం” తోనే ముగిసేది. చివరకి గుర్తుండెది ముగింపే కదా.. ప్రజల మాట ఎలా ఉన్నా, రాజకీయనాయకులు కూడా  , బాధ్యతతో ప్రవర్తించేవారు. కనీసం  60 య్యో దశకానికి ముందుపుట్టినవారు అలాటి వాతావరణంలోనే  పెరిగిపెద్దయారు.. వారికి ఈనాటి వాతావరణం మింగుడుపడ్డంలేదు. పోనీ ధైర్యం చేసి ఏదైనా అందామా అంటే.. “ మీకెందుకు మాస్టారూ.. మీరుండేది ఎంతకాలం? ఏదో ఇలా వెళ్ళిపోనీయండి.. యథారాజా తథా ప్రజా అంటారు కదా… “  అని నోరుమూసేస్తున్నారు.

రాజకీయవాతావరణాన్ని గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత ఆరోగ్యకరం. ఎలాగూ బాగుపడే అవకాశం లేదు. యువత నడుంకట్టి ఏదో బాగుచేసేస్తారని అనుకున్నాం.  కొత్తవారికి అవకాశం రాదని ఎప్పుడో తేలిపోయింది. ఇప్పుడున్న నేతల కొడుకులో, కూతుళ్ళో, కోడళ్ళో, మేనళ్ళుల్లో   మాత్రమే ఉంటారు.

టీవీ సీరియళ్ళ ధర్మమా అని  కుటుంబ వ్యవస్థలో లేనిపోని పోకడలు వస్తున్నాయి. వినోదం పేరుతో మన మీద రుద్దుతున్న కార్యక్రమాలైతే సరే సరి. భాష భ్రస్టు పడిపోయింది. తీయని తేనె లాటి తెలుగు భాష ఎలా ఉండెదో, ఉంటుందో మర్చిపోయే స్థితికి చేరుకుంది. అసలు వాళ్ళ ఉద్దేశమేమిటో ఎవరికీ అర్ధం కాదు. అదృష్టం కొద్దీ  అప్పుడప్పుడు కొన్ని మంచి కార్యక్రమాలు వస్తూంటాయి, కానీ ఆ కార్యక్రమాలను, పోనీ పూర్తిగా చూపిస్తారా అంటే అదీ లేదూ, ఎవడో తలమాసిన రాజకీయనాయకుడి కార్యక్రమం ఉంటే, వాడిది ప్రత్యక్షప్రసారం చేయడానికి, మంచి కార్యక్రమాలు బలైపోతూంటాయి.  టీవీల్లో వచ్చే తెలుగు కార్యక్రమాలు చూస్తే నవ్వాలో ఏడవాలో తెలియదు. తెల్లారేసరికి కొన్ని “ చర్చా” కార్యక్రమాలుంటాయి. అందులో ఒకళ్ళనొకళ్ళు తిట్టుకోడం తప్ప ఇంకోటేదీ కనిపించదు. ఆస్థాన విద్వాంసుల్లా ప్రతీ చానెల్ కీ ఓ నలుగురైదుగురు ఉంటారు. వాళ్ళేమో తమకుతామే మేధావులనుకుని, ప్రతీ విషయాన్నీ విశ్లేషిస్తూంటారు. ఆదివారాలు  అవేవో  నారీ భేరి యో, సింగినాదమో ఒకటుంటుంది. దేశంలో ఉన్న సమస్యలన్నిటిగురించీ వాగుతారే కానీ, పరిష్కారాలు మాత్రం ఉండవు. అలాగే ఇంకో  రెండు చానెళ్ళలో అనుకుంటా, కుటుంబ సమస్యలు చర్చించుకుంటారు. అక్కడికి మనందరికీ సమస్యలు లేనట్టు, ఊళ్ళోవాళ్ళ సమస్యలన్నీ మన నెత్తిన ఎందుకు రుద్దుతారో వాళ్ళకే తెలియాలి.

ఇంక సినిమాల విషయమంటారా,   రియలిస్టిక్ గా   గా ఉండే ఒక్క సినిమాకూడా కనిపించదు. ఇదివరకటిరోజుల్లో, కొద్దిగా కథలాటిదీ, ఓ అయిదారు పాటలు   ( ఈనాటికీ గుర్తుంటాయి )  ఉండేవి. కుటుంబం అంతా కలిసి చూసేటట్టుగా ఉండేవి. కానీ ఇప్పుడో, ఓ సినిమాకి వెళ్ళాలంటే ఓ నలుగురున్న కుటుంబానికి ఓ వెయ్యి నోటు అవుతుంది. పోనీ అంత ఖర్చూపెట్టి వెళ్ళినా అందులో గ్రాఫిక్స్ తప్ప ఇంకేమీ ఉండదు. పోనీ అవైనా నమ్మదగ్గవిగా ఉంటాయా అంటే అదీ లేదు. ఉదాహరణకి హీరో మీద తుపాకీతో ఎన్ని గుళ్ళు పేల్చినా వాడికేమీ అవదు. అసలు ఓ సారి ఆ నిర్మాతా దర్శకులని తుపాకీతో కాలిస్తే తెలుస్తుంది ఏమౌతుందో… పిడిగుద్దులు తింటాడు హీరో, రక్తం బొటబొటా కారుతుంది… అయినా సరే రెండో సీనులో హీరోయిన్ తో డ్యూఎట్టు పాడుతాడు. మామూలుగా నడుస్తూంటే కాలు మడత పడితే, కాలు బెణుకుతుందే, అలాటిది సినిమాల్లో ఎక్కడెక్కడినుండో దూకుతూనే ఉంటారు. అలాగే  తల్లితండ్రులతో , స్కూలు, కాలేజీ ఉపాధ్యాయులతో చేసే వేళాకోళాలు చూసి పిల్లలు కూడా, నిజజీవితంలో అలాగే ప్రవర్తించాలనుకుంటున్నారు. అసలు ఈ రోజుల్లో ఎక్కడచూసినా ర్యాగింగూ, వాటి దుష్పరిణామాలూ ఎక్కడనుంచి నేర్చుకున్నారంటారూ--- ఖచ్చితంగా సినిమాలనుంచే. పోనీ మన పరిపాలకులు ఏమైనా ఉధ్ధరిస్తున్నారా అంటే అదీ లేదు. శాసనసభ, పార్లమెంటు ప్రత్యక్షప్రసారాలు చూస్తేనే తెలుస్తుంది, వాళ్ళకే లేని క్రమశిక్షణ, వాళ్ళ పిల్లలకి రమ్మంటే ఎక్కడనుంచి వస్తుందీ?

ఆతావేతా జరుగుతున్నదేమిటయ్యా అంటే, మధ్యతరగతి పిల్లలు దేనికీ పనికిరాకుండా పోతున్నారు, అక్కడక్కడ తప్పించి…

సర్వేజనా సుఖినోభవంతూ…...

మరిన్ని వ్యాసాలు

పాలెగాళ్ళు.
పాలెగాళ్ళు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
సినిమా గీతాలలో  షెహనాయ్ వాద్యం.
సినిమా గీతాలలో షెహనాయ్ వాద్యం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు పలువురికి -3
పురాణాలలో ఒకే పేరు పలువురికి-3
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
108
108
- శ్రీరామ్ లక్ష్మీనారాయణ మూర్తి