హిమగిరి కైలాశ దర్శనం ( ఎవిమిదో భాగం ) - కర్రా నాగలక్ష్మి

దిరాపుక్ లో బౌద్ద ఆరామం వుంది  . దీనిని ' దిరాపుక్ గొంప ' అని అంటారు . అక్కడ బౌద్దులకు నివాసానికి వీలుగా గదులు వున్నాయి .
ఆ రోజు కైలాశనాధుడి వడిలో హాయిగా నిద్రపోయేం . మాతో పాటుగా వచ్చిన యిందోర్ గ్రూపులో ఆ రాత్రి చాలా గొడవలే జరిగాయట . మరునాడు సాయంత్రం మాకు తెలిసింది .

మరునాడు మేము ' దిరాపుక్ ' నుంచి 22 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసి జుటూల్ పుక్ చేరాలి .

పొద్దున్నే యధావిధిగా టీ టిఫిన్స చేసుకొని మా మా గుర్రాలు యెక్కి ప్రయాణం మొదలు పెట్టేం . మా యాత్రలలో మేం యెప్పుడూ ఒకే రూలుని అనుసరిస్తాం అదేంటంటే యెవరి శక్తానుసారంగా వాళ్లు నడుచుకొని గమ్యం చేరడమే , ఒకరికోసం ఒకరు ఆగిపోకూడదు , గమ్యం దగ్గర మాత్రం అందరూ వచ్చేంత వరకు ఆగాలి . ఈ యాత్రలో కూడా అదే రూలు ని అమలు చేసేం . బయలుదేరడం మాత్రం అందరం ఒకేమారు బయలుదేరేం . నేను , మా రమ్య వెనుకబడ్డాం . అప్పుడు నాకు అర్ధమైంది , గుర్రాలను లాటరీ పద్దతిలో యెందుకు కేటాయించేరో . అన్ని గుర్రాల శక్తి ఒకలా లేదు , రెండు గుర్రపు యజమానులు కొందరికి సహనం తక్కువగా వుండి ప్రయాణికులను యిబ్బంది పెట్తున్నారు . అలాగే యాత్రీకులు కూడా తక్కువ తినలేదండోయ్ , వీళ్లు గుర్రాలను , వాటి యజమానులను యిబ్బంది పెట్టిన సందర్భాలు వున్నాయి . అంత డబ్బూ యిచ్చినాకు యిలాంటి గుర్రం యిస్తావా ? అని యాత్రీకులు , మాకు యిలాంటి యాత్రీకులని యిస్తావా ? అని గుర్రపు యజమానులు అనకుండా టిబెట్టు గైడులు కనిపెట్టిన చిట్కా అన్న మాట యిది .

ముక్కుతూ ములుగుతూ నా గుర్రం , నా ముందు మా రమ్య గుర్రం నడుస్తున్నాయి . ఈ రోజు మేము సుమారు 22 కిలో మీటర్లు ప్రయాణం చెయ్యాలి . సుమారు 11 కిలోమీటర్లు కొండలమీదకి యెక్కడమే , అదీ చాలా స్టీప్ గా వుండే దారిలో . మిగతా 11 కిలోమీటర్లు దిగడమే . అంతా మంచు మయం . 11 కిలోమీటర్లు యెక్కిన తరువాత ' ద్రోల్మ లా ' చేరుతాం . ' ద్రోల్మ లా ' అంటే  ' కరుణామయి దేవి ' అని టిబెట్టు భాష లో అర్ధం . ఈ '  ద్రోల్మ లా ' దాటితే మనిషి అంతవరకు చేసుకున్న పాపాలను క్షమించి వాటిని పుణ్యాలుగా మార్చి కొత్త జీవితాన్ని యిస్తుందిట ' కరుణామయి దేవి ' . అక్కడ వున్న ప్రతీ రాయి బుద్దుని యొక్క శరీరము , తెలివి , మాట అనే మూడు తత్వాలతో కూడి వుంటాయని , బౌద్ద ధర్మం లో మూడు మణులు గా చెప్పబడ్డ బుద్దం , ధర్మం, సంగం అనే వాటిని కలిగి వుంటాయని బౌద్దుల విశ్వాసం .

మా రమ్య గుర్రం , నా గుర్రం  ఒక అడుగు ముందుకేస్తే నాలుగడుగులు వెనక్కి జారుతున్నాయి . గుర్రం వెనుకకి జారినప్పుడల్లా గుర్రం మీద కూచున్న వాళ్లకి చుక్కలు కనిపిస్తాయి . ఆరేడు కిలోమీటర్లు వెళ్లిన తరువాత యిక ముందుకు వెళ్లనని మొండికేసింది రమ్య గుర్రం . గుర్రపు యజమాని కొట్టం మొదలుపెట్టేడు . అది భరించలేక మేం నడవడానికి సిద్దపడ్డాం . గుర్రాల వాళ్లు వాళ్ల భాషలో యేదో చెప్పేరు . మేం మన భాషలో గుర్రాలు వద్దని నడుస్తామని , కష్టమైన చోట మాకు సహాయం చెయ్యమని చెప్పి నడవడం మొదలు పెట్టేం . మేము దిగిన వెంటనే మా గుర్రాలు చకచకా కొండ దిగువకు పరుగెత్తి సెలయేటి పక్కనుంచి నడుస్తూ మేం వెళ్తున్న వైపుగా పరుగెత్త సాగేయి . గుర్రాల మీద వుండగానే మాకు ఆయాసం మొదలయింది , యింక నడుస్తూ వుంటే అడగక్కర లేదు . మాలాగే గుర్రాలు దిగినడుస్తున్న వారు , నడకతోనే పరిక్రమ చేస్తున్న వాళ్లూ చాలా ముందే వున్నారు . గుర్రం అతను నా చెయ్యి పట్టుకు నడిపించసాగేడు . అతను వేస్తున్నట్టుగా అడుగులు వేస్తున్నాను గాని నా కళ్లకి దారిగాని యేమీ కనిపించడం లేదు . కళ్ల యెదురుగా అంతా చీకటి , నోట్లోంచి  ' ఓం నమః శివాయః ' తప్ప మరోటిలేదు . యెంతసేకపు ఆ స్థితి లో నడిచేనో తెలీదు . గుర్రం అతను ఓ రాయి మీద కూర్చో పెట్టి తాను యీ దారిలో రానని గుర్రాన్ని తీసుకొని దిగువున వేచి వుంటానని అన్నట్టుగా చెప్పి వెళ్లిపోయేడు . కాస్త తేరుకున్నాక పరిసరాలని చూస్తే చుట్టూరా తెల్లగా సూర్య కాంతికి వెండి మెరుపులు విసురుతున్న మంచు తో కప్పబడ్డ కొండ శిఖరాల మధ్య వున్న చదునైన ప్రదేశంలో నాలాగే సేద తీరుతున్న యాత్రీకుల మధ్యనున్నాను . మావాళ్లే కాదు మా గ్రూపు వాళ్లుకూడా లేరు అన్నీ కొత్త మొహాలే . దిరాపుక్ నుంచి మరో వెయ్యి మీటర్ల యెత్తుకి చేరుకున్నాం . మా యాత్రలో యిదే అతి యెత్తైన ప్రదేశం .

మా గుర్రం అతను వెళ్తూ వెళ్తూ సాస్టంగ నమస్కారం పెట్టిన వైపు చూసేను అక్కడ త్రికోణంగా వున్న కొండ శిఖరం కనబడింది , దానిపై ఓ రాతి లింగాకారం ఆకృతి ,  దానికి రంగురంగుల జెండాలు , టిబెట్టు లో రాసివున్న రంగు రంగుల గుడ్డలు , ఆహారపదార్థాలు , జంతువులకు సంబంధమైన వస్తువులు  యిలా యేవేవో అక్కడ పెట్టి వున్నాయి .

' ద్రోల్మ లా ' దేవి కి టిబెటియన్లు సమర్పించుకున్న బహుమతులట అవి .

 అక్కడ కొంచం సేద తీరేక తిరిగి నా నడక సాగించేను . ఇంక అక్కడ నుంచి అంతా దిగడమే . కొన్ని చోట్ల దారి ఒకరి వెనుక ఒకరు దిగవలసినంత సన్నగా వుంటే మరో చోట ముగ్గురు పక్క పక్కగా నడవొచ్చు అలా వుంది . ఆ ప్రదేశం నుంచి అందరూ నడవవలసందే . గుర్రాలు మనుషులని మోస్తూ దిగితే జారే ప్రమాదం యెక్కువగా వుండడం తో ఆ దారిలో గుర్రాలని అనుమతించరు . ప్రతీ అడుగు కి ఆయాసం పెరుగుతోంది . నాలుగడులు వెయ్యడం గట్టిగా వూపిరి పీల్చుకోడం మళ్లా నడవడం చేస్తున్నాం . మెత్తని మంచులో నడక సునాయాసంగా వుంటుంది కాని గట్టిపడ్డ మంచుమీద కాలు జారుతూ వుంటుంది . ముందు నడుస్తున్న వారు జారడంమిగిలిన వాళ్లునవ్వడం చేస్తున్నారు . కిందపడ్డవాళ్లు బుద్దిపూర్వకంగా కొంతదూరం వరకు జారుకుంటూ వెళ్లడం చేస్తున్నారు . పడకుండా జాగ్రత్తగా అడుగులు వేస్తూ నేను కూడా పడ్డా పకపకమని నేనే నవ్వేను . అంతా ఒకసారి ఆశ్చర్యపోయి మీరు పడి మీరే నవ్వుతున్నారేమిటి అని అడిగేరు . మరొకళ్లు పడితే వాళ్లని హేళన చేస్తూ నవ్వేబదులు నామీద నేనే నవ్వుకుంటున్నాను , మీ కన్నా నయమే కదా ? ఇక్కడ యింతవరకు పడని వాళ్లెవరో చెప్పగలరా ? అని సమాధానం చెప్పి ముందుకి నడక సాగించేను . ఎక్కడం యెంత కష్టంగా వుందో దిగడం అంతే కష్టంగా వుంది . నాలుగడుగులు సమంగా పడేసరికి అయిదో అడుగు జర్ మని జారుతోంది . కొంతమంది జారుకుంటూ ముందుకి పోతునారు , వాళ్లని చూసి నేను కూడా అలాగే జారడం మొదలెట్టేను .

ముందు జారుతున్న అతను సూటు , పోయింటెడ్ షూసు వేసుకున్నాడు పాపం అతనికి మంచు మీద నిలబడడానికి కూడా అతని షూలు సహకరించక అతను జారడమే చేస్తున్నాడు . అతనివెనుకగా నేను మాలాగే కొందరు చేస్తున్నాం . నాముందున్న అతను అతికష్టం మీద నిలుచున్నాడు . అతని కోటు , పేంటూ రెండూ చిరిగి పీలికలై వున్నాయి . మంచు మీద జారితే జరిగే నష్టం యేంటో తెలిసింది . తరవాత మరి జారడం చెయ్యలేదు . శరీరం బరువయ్యింది . వూపిరి ఆగిపోతుందేమో అనిపించసాగింది . ఒకటి రెండు చోట్ల ప్రాణం పోయింది యిదే నా ఆఖరు వూపిరి అని అనిపించింది . అలా పడుతూ లేస్తూ ప్రయాణం సాగిస్తునాం . అప్పటికి కైలాశ పర్వతానికి యెదురుగా వున్న పర్వత శిఖరాల మీదుగా మా ప్రయాణం సాగింది . కాని కైలాస పర్వత శిఖరానికి అడ్డుగా పర్వతాలు కావడంతో మాకు కైలాసగిరి దర్శనం కాలేదు .

' ద్రోల్మ లా ' నుంచి ఆరు కిలో మీటర్లు ప్రయాణించేక మేమున్న పర్వత శిఖరానికి కింద పెద్ద లోయ యెదురుగా కైలాశపర్వతం  వున్నాయి అక్కడ కూచోడానికి అనువుగా వున్న రాయి మీద కూర్చొని లోయలో సగం గడ్డకట్టిన ' గౌరి కుండ్ ' ని దర్శించు కున్నాను .నా బేగు మోస్తున్న రామ బహద్దూరు నా పేక్డ లంచ్ తీసి నాకిచ్చి తినమన్నాడు . సమోసా సగం తిని కాస్త నీళ్లు తాగేను . మిగతా సగం పేక్ చేస్తున్న అతనితో పారేయమని చెప్పేను అతను గుర్రాలవారికి యిక్కడ అసలు తిండి దొరకదని వారికి యివ్వమని తిండి వస్తువులు పారేయొద్దని చెప్పేడు .

నన్ను మెల్లగా నడుస్తూ వుండమని తాను గౌరీ కుండ్ లో నీరు తీసుకు వస్తానని చెప్పేడు . ఆ గౌరి కుండ్ లోని నీటికి చాలా దివ్య శక్తులు వున్నాయని యాత్రీకులకి 200 ml సీసాలలో ఆనీళ్లు పంచుతామని చెప్పేడు . అతనికి అదనంగా వందరూపాయలు యిస్తానని మాటయిచ్చి నేను ఒక లీటరు నీళ్లు తెప్పించుకున్నాను . అతను పదినిముషాలలో గౌరీకుండ్ కి వెళ్లి నీళ్లు తీసుకొని వచ్చేడు . నా నడక మళ్లీ ప్రారంభమైంది . రామ బహద్దూర్ నా చెయ్యి పట్టుకొని నడిపించ సాగేడు . అతను చెయ్య విడిచి పెట్టగానే దబుక్కు .... , చెయ్యి పట్టుకుంటే నడక వదిలితే దబుక్కు యిదే తంతు . మెల్లగా రామ బహద్దూరుని మాటలలో పెట్టేను . నా చెయ్యి పట్టుకు నడిపిస్తునావు కదా నీకు యెంత బక్షీస్ యిమ్మంటావు అనిఅడిగేను . నిజంగా యిస్తారా ? అని అడిగేడు . ఎంత యిమ్మన్నావు అని అడిగితే మీరెంత యివ్వదలుచుకుంటే అంత యివ్వండి అన్నాడు .

నేను యెన్నిమార్లు పడ్డానో అన్ని పదుల చైనీస్ మనీ యిస్తాను , నేనెన్ని సార్లు పడ్డాను అని అడిగేను . పది సార్లు మాతాజీ అన్నాడు . మా హెల్పర్లు మమ్మల్ని మాతాజీ అనే పిలిచేవారు . కాని నేను పడ్డది పదహారు సార్లు కదా ? సరిగ్గా లెక్కవెయ్యలేదా అంటే చైనా మనీ యిస్తారా ? రూపాయలు యిస్తారా ? అని అడిగేడు . చైనా మనీ యే యిస్తాను . నీ కెంత యివ్వాలి అని అడిగేను . వంద చైనామనీ అంటే ఆరువందల రూపాయలు నిజంగా యిస్తారా ? అపనమ్మకంగా చూస్తున్నాడు . మనం యిస్తామన్న దానికి బేరమాడి అంతకంటే యెక్కువ లాగుదాం అని చూసేవాళ్లని చూసిన నాకు నేను యిస్తాన్నదానికి తక్కువకు ఆశపడడం చూస్తే విడ్డూరమనిపించింది . నేను నీకు వెయ్యి రూపాయలు యిస్తాను సరేనా ?పదిమార్లు వెయ్యి అంటే రెండు అయిదు వందలేనా ? అని రకరకాలుగా నిర్ధారణ చేసుకొని , నా కాళ్లకు దండం పెట్టేడు . నువ్వుకాదురా బాబూ నేను నీ కాళ్లకి పెట్టాలి అన్నాను . మాతాజీ మొత్తం నాకు 1100రూపాయలు వస్తాయి కదా
న్నాడు . నిజంగా యిస్తారా ? అని పదేపదే అడగడం తో ' జుటూల్ పుక్ ' బస చేరగానే యిస్తాను అన్నాను . అలా యివ్వొద్దని ఖాట్మండు చేరేక తాను అడిగే వరకు యివ్వొద్దని , ఈ విషయం యెవ్వరికీ పొరపాటున కూడా చెప్పొద్దని , మీ రెంత యివ్వ దలుచుకున్నారో అంతే యివ్వండి కాని యిస్తానని చెప్పి యివ్వడం మానీకండి అని అన్నాడు . మానును యిస్తాను అంటే కళ్ల నీళ్లతో ఆ వెయ్యి రూపాయలు వాళ్ల కి రెండు నెలలు తిండిగింజలు వెతుక్కోకుండా సరిపోతాయని చెప్పేడు . నేపాలు ప్రజలలో సగం మంది అలాంటి స్థితి లోనే వున్నారు .
అల్లంత దూరాన దిగువున పాకలు కనిపించేంత వరకు దిగేక అతను నన్ను మెల్లగా రమ్మని తను గబగబా వెళ్లిపోయేడు . ఆ పాకల దగ్గర గుర్రాలు కనిపించ సాగేయి . కాని అక్కడకి చేరడానికి మూడు కిలోమీటర్లు నడవవలసి వచ్చింది .

మా వాళ్లు యేమయ్యారో అనే బెంగ మొదలయ్యింది . ఆ పాకలలో టీ బిస్కెట్స్ అమ్ముతున్నారు . అక్కడ యెక్కడా మా వాళ్లు కనిపించలేదు . అక్కడ కాస్త సేపు సేదతీరేక తిరిగి గుర్రం మీద ప్రయాణం సాగించేను . నా లంచ్ లో మిగిలిన సమోసా ( యెంగిలిది నేను పూర్తిగా తిన్నాను ) ఆపిల్ బ్రెడ్డు మా గుర్రం యజమానికి యిచ్చి నేను ఫ్రూటీ తాగేను . దాంతో గుర్రం యజమాని నా ఫ్రెండు అయేడు తర్వాత గుర్రాన్ని జాగ్రత్తగా నడప సాగేడు . మిగతా ఆరు కిలోమీటర్ల దారి పూర్తిగా ధూళి దుమ్ము తో కూడిన కొండదారి . ముక్కుకు మాస్కులు లేకపోతే ఆ దుమ్ముకి వూపిరి తీసుకోలేక చచ్చేదాననే .

జుటూల్ పుక్ కి కిలోమీటరు వుండగానే మా హెల్పరు ఒకతను యెదురొచ్చడు .  " మాతాజీ ఆగయే సాబ్ బహుత్ ఫికర్ కర్ రహేథే , మై జల్దీ జాకే ఆప్ ఆగయే కర్కే బతావుంగా " అంటూ రివ్వున వెనక్కి పరుగెత్తేడు . అంటే మా ఆయన చేరిపోయేరన్న మాట , మరిమిగతావారి సంగతేమిటి ? మా బసకి యింకాస్త దగ్గరగా చేరేసరికి మా వారు , మా మరిది , మా చెల్లి రోడ్డు వైపు చూస్తూ కనిపించేరు .

నన్ను గుర్రం మీంచి దించి రేపు యెనిమిదికి తయారుగా వుండమని చెప్పి గుర్రం యజమాని వెళ్లిపోయేడు . రమ్య యింకా రాలే , మీకు కనిపించిందా ? మా మరిది గారు ఆందోళనగా అడిగేరు . నాకు కనిపించిందని , మరో అరగంటలో వస్తుందని చెప్పేను . మా టెంటులోకి వెళ్లి కాస్త కాళ్లు జాపుకొని కూర్చుని మా మా అనుభవాలు చెప్పుకో సాగేం . నావి రికార్డ్ దబుక్కులు మొత్తం పదహారు అని చెప్పేను . వాళ్లు చెప్పిన నంబరు విని నాదే తక్కువ దబుక్కులు అని తెలుసుకున్నాను . ఈ లోపల మావారు ఒకటి రెండు చోట్ల నీ పుస్తెలు యెగురుతూ కనిపించేయే అన్నారు . నాకు మీ యజ్ఞోపవీతం కనిపించింది అన్నాను . మామరిది , చెల్లాయిల తెల్లమొహాలు చూసి మరేం లేదు ప్రాణం పోయిన ఫీలింగు కలిగింది అని చెప్పడానికి యిలా చెప్పేం  అన్నాను . నిజం అలా అనిపించింది అని వొప్పుకున్నారు . మా హెల్పర్లు  వేడి టీ టిఫిను అందజేసేరు . తరవాత మేము చూసిన కైలాసపర్వతం లోయ గౌరీ కుండ్ గురించి చెప్పుకున్నాం . రామ బహద్దూర్ నా గౌరీ కుండ్  నీళ్లు నాకందజేసేడు .

జుటూల్ పుక్ లో కూడా  కూడా బౌద్ద ఆరామం వుంది .

మా రమ్య నేను చేరిన అరగంటకి బస చేరింది . అందరి  యాత్ర సవ్యంగా జరిగినందుకు దేవుడికి కృతజ్ఞతలు తెలుపుకున్నాం . సమయానికి వేడివేడి భోజనసదుపాయాలు కలుగజేసినందుకు మా సహాయకులకు కూడా ధన్యవాదాలు తెలియజెయ్యాలని అనుకున్నాం మా దోర్జీని రమ్మని కబురు పంపేం . మిగతా సహాయకులు వచ్చి యేమి జరిగిందని అడగసాగేరు కాని దోర్జీ రాలేదు . దోర్జీని , టిబెట్టు గైడుని తీసుకురమ్మన్నాం . యెంతకీ రారు , మేం వాళ్లతో మాట్లాడాలి వెంటనే రమ్మని వూదరగొడితే అప్పుడొచ్చేరు .

యేమైనా పొరపాటుజరిగితే క్షమించండి అన్నాడు దోర్జీ వస్తూనే , ఛాంగ్మై అసహనంగా చూస్తున్నాడు . క్షమించడం లేదు యెందుకంటే మీ వల్ల యేపొరపాటూ జరగలేదు కాబట్టి ,  మా యాత్ర యింత బాగా జరగడానికి సహాయపడ్డ మీ అందరికీ మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము , వంటలు వండిన వాళ్లు , వడ్డించిన వాళ్ళు , మీ యిద్దరికీ , మాకు తెలుసు యిలాంటి యాత్ర నిర్వహించే టప్పుడు జరిగే లోటుపాట్లు , మా తోటి యాత్రీకులు చేసిన గొడవలు మాకు తెలుసు , యిలాంటి ప్రతికూల పరిస్థితులలో మీరు సహనం కోల్పోకుండా అందరిని సమర్ధించుకు రావడం చాలా గొప్ప విషయం " అన్నాము . మీ దగ్గర డబ్బులు తీసుకున్నాం కదా ? అన్నాడు దోర్జీ . మీరు చేసిన సేవలు డ్యూటిఫుల్ గా లేవు అభిమానంగా వున్నాయి . అందుకే కృతజ్ఞతలు తెలియజేసు కుంటున్నాము . టెంటు బయట నిలబడి మా సంభాషణ వింటున్న హెల్పర్లు అందరూ లోపలకొచ్చేరు . అందరూ మాకు చేతులు జోడించి కృతజ్ఞతలు చెప్పేరు అలాగే మేం కూడా చెప్పేం . మా ఛాంగ్మై జరుగుతున్న దేమిటో అర్ధం కాక దోర్జీ  మేం అన్నమాటలకి అర్ధం వివరించగా ఛాంగమై కూడా చాలా సంతోషించేడు . ఇన్నాళ్లుగా యెన్నో గ్రూపులని తీసుకు వెళ్లేం కాని యెవ్వరూ యిలా అనలేదు సర్ అని మాకు పదే పదే దండాలు పెట్టేరు . వెళ్తూ వెళ్తూ మా దోర్జీ మరో విషయం చెప్పేడు . అదేంటంటే యెవరైతే వారి సేవలకు టిప్పు యివ్వ దల్చుకుంటే ఖాట్మండు లో గ్రూపు వాళ్లు కలక్ట్ చేస్తారు మీరు మీ పేరు యిచ్చిన మొత్తం రాసి సంతకం పెట్టండి , లేకపోతే మీరిచ్చిన డబ్బు వారి జేబులో వేసుకునే యాత్రీకులు కూడా వుంటారు అని .

ఈ యాత్ర లో మేము దైవదర్శనమే కాదు వివిధ మనస్తత్వాలను కూడా దర్శించుకున్నాం .

మా టెంటులోకి మా గ్రూపులో ఆవిడే , ఒక్కర్తీ ఢిల్లీ నుంచి వచ్చింది , యిందోరు గ్రూపులో ఈవిడ ఫ్రెండు వుండండంతో వాళ్లతోనే యెక్కువగా వుండేది . ఆవిడ ప్రెండు దర్చెన్ లో వుండిపోయిందట , ఆవిడ వచ్చి నేను మీ టెంటులో వుండొచ్చా ? అని అడిగింది . మా టెంటులో ఒకే పడక ఖాళీ వుంది , అదీ మగవాళ్ల మధ్యన వుంది  , మేం మగవాళ్లని సర్దుకోమని చెప్పి ఆవిడకి మా ఆడవాళ్ల దగ్గర చోటిచ్చేం . మా దోర్జీ వచ్చి ఆవిడ ఆరోగ్యం గురించి , ఈ టెంటు లో వుండడం యిష్టమేనా ? అని అడిగేడు . ఫరవాలేదు అని సమాధానం చెప్పింది .కొంతసేపయేక ఆమె యేడ్వడం చూసి ఆరోగ్యం బాగులేదా ? అని అడిగితే చెప్పింది . ముందురోజు యిందోరు గ్రూపు వాళ్లు ఈమెని జాగాలేదని వాళ్ల టెంటులోంచి పొమ్మన్నారుట , ఈవిడేమో ఒక్కరాత్రే కదా , మీరు తప్ప నాకెవ్వరూ తెలీరు అందట , మరో మంచం వెయ్యడానికి జాగాలేదు యెవ్వరైనా ఈమెకి మంచం మీద జాగా యివ్వమని దోర్జీ , ఈమె యెంతబ్రతిమిలాడినా వారు వినలేదుట , అందుకు ఈవిడకి కిందన పక్క పరిచేరుట , ఓ రాత్రివేళ ఈవిడ చలిపట్టిపోతే దోర్జీ ఆమెని వంటల టెంటుకి మార్చి హాట్ వాటరు బేగు యిస్తే కాస్త పరిస్థితి మెరుగుపడిందట . అప్పుడు కూడా ఆమెకి మంచం యివ్వటానికి యెవ్వరూ వొప్పుకోలేదుట . పక్కలు విశాలంగానే వున్నాయి , యిద్దరు ఒక పక్క మీద సర్దుకోవాలి వచ్చు . మా మరిది గౌరీకుండ్ నీళ్లు మాకు కూడా తెలియకుండా దాచీసేరు . యెందుకూ అంతలా దాయడం అంటే దొంగలండోయ్ తాగెస్తారు అన్నారు . ఆ రోజు గుర్రాల వాళ్లు అక్కడే సామానులు కర్రలు పెట్టుకో డానికి వేసిన టెంటులలోను , యాక్ ల పక్కలలోనూ పడుక్కొని రాత్రి గడపడం చూసేం .

మిగతా భాగం వచ్చేసంచికలో చదువుదాం మరి శలవు 

మరిన్ని వ్యాసాలు

పాలెగాళ్ళు.
పాలెగాళ్ళు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
సినిమా గీతాలలో  షెహనాయ్ వాద్యం.
సినిమా గీతాలలో షెహనాయ్ వాద్యం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు పలువురికి -3
పురాణాలలో ఒకే పేరు పలువురికి-3
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
108
108
- శ్రీరామ్ లక్ష్మీనారాయణ మూర్తి