ఇప్పుడంటే సినిమాలు ఎప్పుడు కావాల్సొస్తే అప్పుడే, టీవీల్లో చూడకలుగుతున్నాము. చివరకి స్మార్ట్ ఫోన్లలోనూ, కంప్యూటర్లలోనూ, మనం ఉండే ప్రదేశంతో నిమిత్తం లేకుండా, చూడాలనిపించడం తరవాయి, మన కళ్ళ ముందర ప్రత్యక్షం అయిపోతోంది. కానీ, డెభ్హైయ్యో దశకం, అంతకు ముందు రోజుల్లోనూ, ఓ సినిమాకి వెళ్ళాలంటే అదో పెద్ద కార్యక్రమం గా ఉండేది..
మా చిన్నప్పుడు, ఊళ్ళో ఓ నాలుగు సినిమా హాళ్ళుండేవి. ఓ సినిమా వచ్చిందంటే కనీసం అర్ధశతదినోత్సవమో, మరీ మంచి సినిమా అయితే శతదినోత్సవం కూడా చేసికునేది. ఈరోజుల్లో సినిమాలు మహ అయితే ఓ వారంరోజులో, పక్షం రోజులో ఆడుతున్నాయి. దానికి సరిపడ్డట్టే వాల్ పోస్టర్లు కూడా ఫలానా వారం అని కాకుండా, పదో రోజూ, పన్నెండో రోజూ అని ఎవరైనా స్వర్గస్థులైనప్పుడు లెక్కపెట్టే రోజుల్లోకి దిగిపోయాయి. మహ అయితే ఇరవైఒక్కో రోజు ( బారసాల) దాకా లాగిస్తారు, అదికూడా , ఆ సినిమా హాలు ఆ చిత్రంలో నటించిన హీరోది అయితే. మొదటి రోజు ఎలాగోలాగ తమ అభిమాన హీరో సినిమా చూసేయాలని, ఉన్న ఒక్క కిటికీ దగ్గరా తోపులాటలు, బనీన్లు చింపుకోడాలూ, ఒకటేమిటి , ఎంతో హడావిడి. ఉదయపు ఆటతో మొదలయి, అర్ధరాత్రిదాకా ఆటలే. ఏ శివరాత్రో వచ్చిందంటే, తెల్లవార్లూ ఆటలే, జాగరణకోసం. పుణ్యానికి పుణ్యం. ఆ ప్రాంతానికి పెద్ద పట్టణాలలోనే కొత్త సినిమాలు వచ్చేవి. గ్రామాల్లో అయితే , టూరింగు టాకీసులే. అక్కడ తమాషాగా ఉండేది, ఒక్కటే ప్రొజెక్టరు.. దానితో సినిమాకి రెండో మూడో ఇంటర్వెల్లులుండేవి, రీళ్ళు మార్చుకోవాలిగా.
సినిమాకి వెళ్తే, తప్పకుండా చేసే పని, ఆ సినిమా పాటలపుస్తకం కొనుక్కోవడం. ఏ రేడియోలోనో ఆ పాట వస్తూన్నప్పుడు, మనంకూడా పాడుకోడానికి. లేదా, ఏ పెళ్ళిచూపుల్లోనైనా , అమ్మాయిచేత ఓ పాట పాడించడానికి. సినిమాహాల్లో స్త్రీలకీ, పురుషులకీ ప్రత్యేక స్థలాలు. సాధారణ ప్రజానీకానికి, నేల టిక్కెట్టు, కొద్దిగా పైస్థాయి వారికి బెంచీ. ఇంకొద్ది పైవారికి కుర్చీ ( కుషన్ లేనిది). ఇంకా పైస్థాయివారికైతే బాల్కనీ. మొదటి వారమైతే , బాల్కనీ పక్కనుండే వరండాలోకూడా సోఫాలు వేసేసేవారు. టిక్కెట్టు కొనేవారికంటే, ఫుకట్ గా వచ్చే ఊరిపెద్దలతో నిండిపోయేది బాల్కనీ. పోలీసధికార్లూ, ఎలెట్రీ వాళ్ళూ మొదలైనవారన్నమాట. వీళ్ళతో గొడవెట్టుకుంటే మళ్ళీ అదో తంటా.
అమ్మా నాన్నలతో సినిమాకి వెళ్తే హాయిగా బాల్కనీకి వెళ్ళేవాళ్లం. లేకపోతే కుర్చీయే దిక్కు. మధ్యాన్నం హిందీ సినిమాలు మ్యాట్నీ షో వేసేవారు. ఆరోజుల్లో హిందీ ఎక్కడర్ధమయిందీ? తెలుగులో అనువదించడానికి హిందీ వచ్చిన ఏ మాస్టారో, చెప్పేవారు. ప్రతీ సినిమా.. “ అది బొంబాయి మహానగరం..” అనే మొదలెట్టేవారాయన. సత్యనారాయణ వ్రత కథ లాగ ఆయనేం చెప్తే అదే వేదం…. ఇదంతా చిన్నప్పటి కథా కమామీషూనూ..
పెళ్ళైన కొత్తలోఅయితే వారానికో సినిమా కొత్త పెళ్ళాంతో కలిసి. అసలు గొడవంతా పిల్లలు పుట్టిన తరువాత వచ్చేది. పరాయి రాష్ట్రాల్లో ఉండే చాలా మందికి, తెలుగు సినిమాలు, ఏ ఆదివారాలో ఒకేఒక్క థియేటర్లో వేసేవారు. ఆ సినిమాలైనా, ఓ ఏడాది క్రితంవే. కొత్త సినిమాలెక్కడొచ్చేవీ? మన ప్రాంతాలకి వెళ్ళినప్పుడే , తెలుగు సినిమాలు చూడాల్సొచ్చేది.
ఈ రోజుల్లోలాగ ఆటోలూ, టాక్సీలూ ఎక్కడా? రెండు బస్సులు మారి, ఆట తొమ్మిదింటికి ప్రారంభం అయితే, ప్రొద్దుటే ఏడున్నరకల్లా హాలుకి వెళ్ళి క్యూలో నుంచోడం. అదృష్టం బాగుంటే టిక్కెట్టు దొరికేది, లేకపోతే, మొహం వేళ్ళాడెసికుని ఇంటికి తిరిగి రావడం. చేతిలో పసిబిడ్డ, పక్కన పెళ్ళాం. ఓ బుట్టలోనో, సంచీలోనో పసిబిడ్డకి సంబంధించిన పాలసీసా, నీళ్ళ సీసా, పాత గుడ్డలూ. ఈరోజుల్లోలాగ డయపర్లూ అవీ ఉండేవికావుగా మరి. మొత్తానికి టిక్కెట్టు సంపాదించి, హాల్లోకి వెళ్ళి సెటిలయామనుకుంటాం… ట్రయల్ పార్టు అయి, సినిమా మొదలెడతారో లేదో, అప్పటిదాకా గుమ్ముగా ఉన్న ఆ పసిబిడ్డ కాస్తా, కెవ్వుమంటుంది. చీకటికి భయపడ్డట్టుంది. ఆ పసిబిడ్డ ఏడుపైనా భరించొచ్చు కానీ, పక్కనున్నవారి హుష్.. హష్.. లతో కూడిన చూపులు మాత్రం భరించలేము. వారి ఏకాగ్రతను పాడుచేసిన, ఈ పసిబిడ్డ మీదే అందరి చూపులూనూ. ఈ హింస భరించలేక, తండ్రి అనబడే ఆ ప్రాణి, ఈ పిల్లని భుజం మీదేసికుని, ఆ చీకట్లోనే అవతలివారి కాళ్ళు తొక్కుకుంటూ, వారి విసుగులు భరిస్తూ, బయటకి రావడం. అప్పటిదాకా ఏడుస్తూన్న బేబీ కాస్తా,, కిలకిలా నవ్వడం మొదలెడుతుంది. పోనీ ఊరుకుందికదా అని లోపలకి వెళ్ళి కూర్చుందామని వెళ్తే, మనం కూర్చున్న సీటూ, లైనూ ఛస్తే గుర్తుండదు. పైగా ఆ చీకట్లో అందరూ ఒకలాగే ఉంటారు. పోనీ, లోపలకి వచ్చినట్టు, ఇతని భార్యకి తెలియదా అంటే అదీ కాదూ… కనిపిస్తూనే ఉంటుంది, తన భర్తా, బిడ్డా లోపలకి వచ్చినట్టు. పిలవొచ్చుగా, అబ్బే … తొమ్మిది నెలలు మోశానూ, ఈ మాత్రం ఓ రెండు గంటలు మోస్తే ఏమీ అరిగిపోరులే అనుకుని, పిలవడం కానీ, చెయ్యెత్తి చూపించడం కానీ చేయదు. మొత్తానికి సినిమా లేదూ, సింగినాదమూ లేదూ ఈ భర్త గారికి..
అవన్నీ పాతరోజులనుకోండి… అయినా ఆ ఆనందమే వేరు…
సర్వేజనా సుఖినోభవంతూ…