హిమగిరి కైలాశ దర్శనం ( తొమ్మిదవ భాగం ) - కర్రానాగలక్ష్మి

విష్ణు పురాణం ప్రకారం విశ్వానికి మూలమైన యీ పర్వతం ఆరు కొండల నడుమ తామర పుష్పాన్ని పోలి వుంటుంది . ఈ పర్వతం నాలుగు ముఖాలుగా యేర్పడి , నాలుగు వైపులా స్పటికం , కెంపు , బంగారం , లేపిస్ లాజులి ( lapis lazuli ) ని కలిగి వుంటుందిట

కైలాశం '  అనే పదం ' కెలాశ ' అనే పదం నుంచి వచ్చి వుండవచ్చునని ఒక వాదన . ' కెలాశ ' అంటే స్పటిక శిఖరం అని అర్ధం . కైలాశపర్వతాన్ని టిబెటియన్లు కాంగ్స రిన్ - పో - ఛి అని  కాంగ్స రిన్ - పో - ఛి పిలుస్తారు . కాంగ్స రిన్ - పో - ఛి అంటే హిమాలయపు మణి అని అర్ధం .

హిందువులు శివుడుపార్వతి ధ్యానం చేసుకొనే ప్రదేశం గాను , శివుడు తాంత్రిక శక్తుల అధిపతి గాను , బౌద్దులు విశ్వానికి నాభి ప్రాంతం గానూ , జైనులు వృషభదేవుడు జ్ఞానోదయం పొందిన ప్రదేశం గానూ పూజించుకొనే కైలాశపర్వతాన్ని " ఝుంగ్ ఝూంగు " భాషలో ' టిసే ( TISE) ' అని పిలుస్తారు . ' టిసే ' అంటే నీటి శిఖరం అని అర్ధం . ఈ నీటి శిఖరం నుంచే వారి పవిత్ర నదులైన సింహం , నెమలి , గుర్రం , ఏనుగు నదులు పుట్టేయని నమ్ముతారు .

" బౌద్దచక్ర సంహార " కు నివాస స్థలమని తాంత్రిక బౌద్దులు భావిస్తారు . గురు పద్మసంభవుడు ( రింపోఛే ) తాంత్రిక శక్తులని పొందిన పవిత్ర స్థలాలు కైలాసపరిక్రమ దారిలో అనేకం వున్నాయి . పద్మసంభవుడు వలనే యేడు యెనిమిదవ శతాబ్దం లో బౌద్ధమతం ప్రాముఖ్యత సంతరించుకొందని అంటారు .

బోన్ బౌద్దుల ప్రకారం ' మిలరేపా ' అనే తాంత్రిక బౌద్దునకు ' నారోబోన్ -ఛుంగ్ ' కు జరిగిన పోటీలో ' నారోబోన్ - ఛుంగ్ ' యీ ప్రదేశం లో గెలుపొందటం తో తాంత్రిక శక్తిపై భగవంతుడి శక్తి గెలుపొందిన ప్రదేశంగా నమ్ముతారు .

హిందువులు బౌద్దులు యీ పర్వతానికి యెడమవైపునుండి ప్రదక్షిణ చేస్తారు కాని జైనులు కుడి వైపునుంచి ప్రదక్షిణ చేస్తారు .
మరునాడు మేము సుమారు పన్నెండు కిలో మీటర్లు నడవాలి . కష్టతరమైన నడక అయిపోయింది , ఇక మిగిలింది మామూలు కొండల మీద నడక కాబట్టి అది యెలాగైనా పూర్తి చేసేస్తామనే ధైర్యం , ముందు రోజు దబుక్కులుకు ఒళ్లు నొప్పి చేయకుండా వుండేందుకు  రాత్రి పెయిన్ కిల్లర్స వేసుకొని పడుక్కున్నాం .

మేము వెలుపలి పరిక్రమ చేస్తున్నప్పుడు ఓ నలుగురైదుగురు లోపలి పరిక్రమ చేస్తూ కనిపించేరు .

రాత్రి తెల్లవార్లూ టెంటు యెగిరిపోయేంత పిచ్చి గాలులు , వాన . హిమవత్పర్వతాలలో వాన అంటే ' ద్రోల్మాలా ' లో హిమపాతం జరిగే అవకాశం యెక్కువగా వుంటుంది .

పొద్దున్నే మా రామబహద్దూర్ యిచ్చిన టీ టిఫిను కానిచ్చి , యెనిమిదింటికి తయారయాం . అంతవరకు మేం తెచ్చుకున్న సన్స్రీన్ లోషను వాడడంమరచిపోయిన మాకు ఢిల్లీ ఆవిడ జాగ్రత్తగా రాసుకోడం చూసి మేము కూడా రాసుకొని మా యాత్ర మొదలు పెట్టేం .
అల్లక్కడ వరకు నడవండి గుర్రం తెస్తాను అని నడిపించసాగేడు మా గుర్రం యజమాని . మొత్తం 42 కిలో మీటర్లలో ఓ పది కిలోమీటర్లు గుర్రాల మీద వెళ్లామేమో మిగతాది అంతా నడకే . అంత శక్తి మాకెక్కడ నుంచి వచ్చిందో మేం దర్శించుకున్న ఆ దేవునికే తెలియాలి . యేదో ఒకటి రెండు చోట్ల తప్ప అంతా నడిపించేడు . మరో కాస్త దూరం వుందనగా గుర్రం యెక్కమన్నాడు . నాకు గుర్రం కన్నా నడక సులువుగా అనిపించి మరి గుర్రం యెక్కనని చెప్పి నడక సాగించేను .

ఈ పది కిలో మీటర్ల నడక దుమ్ము ధూళితో వున్న కొండలమీదుగా సాగింది . కళ్లకి నల్లకళ్లజోడు , ముక్కుకి నోటికి మాస్కు , ఒంటినిండా నాలుగైదు పొరలుగా బట్టలు తలకి మంకీకేపు , దాని మీద మఫ్లరు బిగించి , మెడలో చిన్న సంచిలో ముద్ద కర్పూరం పావు పిడికిలి ప్రమాణంలో వున్నది వ్రేలాడుతూ , దళసరి మేజోళ్ళు , బూట్లు యిదీ స్థూలంగా మా ఆకారాలు .

ఆయాసం అనిపించినప్పుడల్లా కర్పూరం పీలుస్తూ  నడవసాగేం . మొత్తం దారంతా నడవడానికి వీలుగా చదును చెయ్యబడ్డ కొండదారి . ఎక్కడా పచ్చని గడ్డి పరక కూడా లేదు . కొండలు యెక్కడం దిగడం వున్నా మరీ వొక్కసారి యెక్కువ యెత్తు యెక్కవలసి రాలేదు కాబట్టి మా నడక చకచకా సాగింది . పదకొండు గంటలు కాక ముందే మా కారులున్న చోటికి చేరిపోయేం . మా కారులయితే వున్నాయి గాని లాక్ చేసి వున్నాయి . మొత్తం మా పరిక్రమ అంతా కూడా యెక్కడా కూర్చోడానికి వీలుగా లేదు . గమ్యం దగ్గర కూడా యేమీలేవు . కాళ్లు పీక్కుపోతూ ఆ చలిలో గంటన్నర వేచి వున్నాక డ్రైవరు వచ్చేడు . కారులోపల కూర్చున్నాక కాస్త ప్రాణం తెరిపిన పడింది . అప్పుడు మా సామాను తగ్గించుకొనే పనిలో పడ్డాం . స్వెట్టర్లు , పేంటూ చొక్కాలు , ఫ్లాస్కులు , మేజోళ్లు , షూస్ గుర్రాల వాళ్లకి , సామానులు మోసినవాళ్లకి యిచ్చేసేం . ఆఖరి సారిగా కైలాశశిఖరానికి మోకరిల్లి తిరుగు ప్రయాణం అయేం .

కారు ముందుకు పరుగెడుతుంటే మేము వెనుకకు తిరిగి కూర్చున్నాం . యెందుకంటే వెనుకాల కైలాశపర్వతం వుంది . ఆరోజు వాతావరణం బాగుండడంతో కైలాశగిరి బ్రహ్మాండంగా దర్శనమిస్తోంది .

ముందుగా దర్చెన్ చేరేం . అప్పటికే అక్కడకు చేరుకున్న మా హెల్పర్లు భోజనాల యేర్పాటులలో వున్నారు . రంగు రంగు పూసలూ అవీ అమ్ముతూ టిబెటియన్లు వచ్చేరు . పగడాలదండలు , స్పటిక దండలు బాగా బేరం చేసి కొన్నాం . యాత్రాస్థలంలో కొన్నవాటిని మనవాళ్లందరికి యివ్వడం ఆచారంకదా ! భోజనాలు అయేక పరిక్రమ చెయ్యకుండా వుండిపోయిన మా తోటి వారిని కలుపుకొని మా తిరుగు ప్రయాణం మొదలయ్యింది . డబ్బైయెనబై కిలోమీటర్లు వెళ్లేంత వరకు కైలాసగిరి కనిపిస్తూనే వుంది .

రాత్రికి దోంగ్బా చేరేం . దోంగ్బాలో కిందటి సారి మాకు యింటికి ఫోను చేసుకొనే సౌకర్యం లభించింది , యీ సారి మాకు అలాంటిదే కనిపించలేదు . యాత్ర సక్రమంగా పూర్తి చేసుకున్నాం అనే ఆనందం కుటుంబ సభ్యులతో పంచుకోవాలనే మా తపన తీరలేదు . మరునాడు సాగా కి ప్రయాణమయేం . సాగాలో మాకు అయిదుగురికి బాత్రూము వున్న గది కేటాయించేరు . ఎంతో సంతోషం వేసింది . వెంటనే ఒకరితరువాత వొకరుగా శుభ్రంగా షాంపూ చేసుకొన్నాం . రాత్రిపూట తలస్నానం వద్దని , రేపు పొద్దున్నే చేసుకోండి మావారు వారిస్తున్నా వినకుండా తనివితీరా స్నానం చేసుకున్నాం . మా తోటి యాత్రీకులం అందరం కలిసి దోర్జీ తో మరునాడు ఖాట్మండు వరుకు వెళ్లేటట్టుగా వొప్పించేము . ఒకరోజు ముందుగా చేరుతున్నాం కాబట్టి ఆరోజుకి అయే ఖర్చు మేం పెట్టుకోవాలి , అందుకు మేం వొప్పుకున్నాం .  మా రమ్య ఇంటర్నెట్ సెంటరుకి ఇ- మైల్ చెయ్యడానికి వెళ్లి తెచ్చిన వార్త యేవిటంటే ఆ ప్రదేశం అంతా మిలిటరీ మోహరించి వుందని బయటదేశాలకి చేసే ఫోనులు కూడా మిలటరీ వాళ్లు బందు చేసేరని . రాత్రి భోజనాలు మాకు రూము బయటనున్న నడవా లో యేర్పాటు చేసేరు . రాత్రి అందరం సరదాగా కబుర్లు చెప్పుకున్నాం . అతి కష్టమైన యాత్రను అతి సునాయాసంగా పూర్తి చేసుకున్నందుకు ఒకరికొకరం అభినందించుకున్నాం . మరునాడు తాపీగా లేద్దామని నిర్ణయించుకొని పడుక్కున్నాం .

బాత్రూములో నీళ్ల శబ్దానికి లేచిన మేము టైము చూస్తే అయిదయింది . మా వారు స్నానం చేస్తున్నారు . మళ్లా అటుతిరిగి పడుక్కున్నాం  ఓ అయిదు నిమిషాలు అయ్యాయో లేదో మా వారు దంతధావనం చేసుకోదలచుకుంటే తొందరగా కానిచ్చుకోండి లేకపోతే మరి నీళ్లు వుండవుట అని చల్లగా చెప్పేరు . మేం తొందరగా కాలకృత్యాలు తీర్చుకుని తయారయేం . తిరిగి మా ప్రయాణం కొడారి వైపుగా సాగింది . కష్టమ్స్ దగ్గర మళ్లా అంతా వరుసలో నిలుచున్నాం . మేము కారు దిగిన చోటు నుంచి కష్టమ్స్ ఆఫీసు వరకు వున్న ఫర్లాంగు లోను యెన్నో చైనా వస్తువులు అమ్మే షాపులు వున్నాయి . అక్కడ యేవో చైనా వస్తువులు కొన్నాం . ఫార్మాలిటీస్ పూర్తయేక టిబెట్టు నేలకి బై చెప్పి ఫ్రెండ్షిప్ బ్రిడ్జ్ దాటి నేపాలులోకి ప్రవేశించేము . అవేళ మా  లంచ్ నేపాలులోని ఓ రిసార్ట్ లో యేర్పాటు చేసేరు . నేపాలు కొండలలో చితచిత మని వాన  పడుతూనే వుంది . భోజనాలు అయేక మెల్లగా అంటే 10 , 15 కిలోమీటర్ల వేగానికి మించి నడవటం లేదు నేపాలు బస్సులు , సాయంత్రం ఖాట్మండు చేరేం . మధ్యలో సాగాలో మిలటరీ మోహరింపును గురించి అడుగుతే దోర్జీ యిచ్చిన సమాచారం యేమిటంటే చైనా లో ఎలక్షన్లుట అందుకని విదేశీయులకు ప్రవేశానుమతి రద్దు చేసేరని . ఫోనులు , నెట్ టిబెట్టునుంచి పనిచెయ్యవని కాబట్టి కైలాశమానససరోవర యాత్ర కూడా రద్దు చెయ్యబడిందని చెప్పేడు . మా హొటలులో శ్రీశంకరా ఛానల్ సభ్యులు ఓ ముప్పై మంది యాత్ర చేసుకోడానికి వచ్చి విడిది చేసివున్నారు . మేం యాత్ర చేసి వచ్చామని విని మా అనుభవాలు తెలుసుకున్నారు . సలహాలు అడిగేరు . మాస్కులు అవీ లేవంటే మా దగ్గర మిగిలిన మాస్కులు , కర్పూరం వాళ్లకి యిచ్చేము . కాని వాళ్ల యాత్రవుండక పోచ్చని మాత్రం చెప్పలేదు .

మరునాడు మా గ్రూపు వాళ్లు ' మనాకామనా దేవిని ' దర్శంచుకోడానికి బస్సు మాట్లాడేరు . సరే మేము కూడా వాళ్లతో బయలు దేరేం . హొటలు వాళ్లు లంచ్ పేక్ చేసి యిచ్చేరు . ఈ సారి అవదేమో అనుకున్న ' మనాకామనా ' చూసే అవకాశం నచ్చినందుకు మేము చాలా సరదా పడ్డాం .

కొడారి వెళ్లినప్పటి బస్సులు పాత డొక్కులు గాని యీ సారి మేము యెక్కిన బస్సు అన్ని హంగులతో బాగా కొత్తగా వున్నాయి . ఊరుదాటి కొండదారిలో ప్రవేశించగానే ఒక్క కుదుపుతో బస్సు ఆగింది . పంక్చరు పడింది , స్పేరు టైరు తేలేదు అన్నారు . బాగా దూరం వెళ్లలేదు కాబట్టి ఫరవాలేదు , అని ఓనరుకి ఫోనుచేసి టైరు తెప్పించి మార్చేసరికి పన్నెండయింది .

మళ్లా బస్సు బయలుదేరింది , మూడుగంటలలో చేరిపోతాం ఫరవాలేదు అనుకొని చిన్న కునుకు తీసి కళ్లువిప్పి చూస్తే బస్సు ఆగివుంది . సగం దూరం ప్రయాణించి వుంటాం అనుకొని మా చెల్లి వైపు చూస్తే అదీ నిద్రపోతోంది . అందరూ కిందకి దిగి వున్నారు . మా చెల్లి ని లేపి యిద్దరం కిందకి దిగేం . తెలిసిన విషయం యేమిటంటే మా బస్సు మరో నాలుగడుగులు వేసేక ఆగిపోయింది . ఇంజన్లలో యేదో ప్రాబ్లం గంటనుంచి డ్రైవరు మరొకతను కుస్తీ పడుతున్నారు . మేం అందరం చెట్ల కింద కూర్చున్నాం . మెల్లగా ఒక్కొక్కరం భోజనాలు కానిచ్చేం . మెకానిక్ ఖాట్మండు నుండి వచ్చి అరగంట కుస్తీ పట్టేక మెల్లగా కదిలింది ' మనాకామనా దేవికి జై ' జయజయ నాదాలు చేసేం , వెంటనే కుదుపు బస్సు ఆగిపోవడం జరిగేయి . ఇలా ఆగుతూ నడుస్తూ మొత్తానికి గుడి మూసే సమయానికి అక్కడకి చేరేం . ఇవతల కొండమీంచి అవతలకొండ చేరడానికి రోపువే లో వెళ్లాలి . ఆరోజుకి రోపువే కి ఆఖరు ట్రిప్పు , మేం రోపువే లో వెళ్లడానికి సిధ్దపడ్డాం . కనీసం దేవి వున్న పర్వతానికి వెళ్లామన్న తృప్తి కోసం అయిదు నిముషాలు ఆ కొండమీద కూర్చొని తిరిగి వచ్చేసేం . తిరిగి వచ్చేటప్పుడు మా బస్సు యెటువంటి ట్రబులు యివ్వలే . రాత్రి పదింటికి హొటలు చేరేం . రాత్రి తొమ్మిదింటికి హొటలు మూసేసినా మా కోసం రాత్రి పదింటికి భోజనాలువేడివేడిగా వడ్డించేరు .

అంతకు ముందు కూడా మనాకామనా దర్శించుకుందాం అనుకున్న మాకు రోపువే రిపేర్లలో వుండండంతో మా కోరిక తీరలేదు . మాకు అమ్మవారి దర్శన భాగ్యం దొరకలేదు  .

మీకు ఈ దేవిని గురించి నాకు తెలిసిన విషయాలు వివరిస్తాను . అలాగని అమ్మకి నా మీద దయకలిగి పిలిపించుకుంటుందేమో .
నేపాలు రాజధాని ఖాట్మండు కి సుమారు 105 కిలోమీటర్ల దూరంలో ' ఘుర్ఖా ' జిల్లాలోని ' ఘుర్ఖా ' పట్టణానికి సుమారు పన్నెండు కిలోమీటర్ల దూరంలో సముద్రమట్టానికి సుమారు 1302 మీటర్ల యెత్తులో కర్రతో నిర్మించిన అయిదు అంతస్తుల మందిరం . ఈ మందిరానికి దక్షిణాన త్రిశూలి నది , పడమట మర్స్యాంగ్డి నది , ఉత్తరాన మనస్లు - హిమాచ్లి పర్వతశ్రేణులు , అన్నపూర్ణ పర్వతశ్రేణులు వున్నాయి .
భగవతీ దేవి అవతారమైన పార్వతీ దేవి మందిరం యిది . పదహారు వందల సంవత్సరం లో యీ ప్రాంతాన్ని పరిపాలించే ఘుర్ఖా రాజు ' రామ షా ' భార్య భగవతీ దేవి అవతారమట , ఆ విషయం సేవకుడైన లఖన్ థాపా కి మాత్రమే తెలుసు . ఒకరోజు సేవకుడైన లఖన్ థాపా రాణిగారి సేవలో వుండగా రాజు రాణీవాసానికి వస్తాడు . తన భార్య ను భగవతీదేవి రూపంలోనూ , లఖన్ థాపా ను అమ్మవారి వాహనమైన సింహం గానూ చూస్తాడు . అమ్మవారిని దర్శించిన వెంటనే అతనికి మరణం సంభవిస్తుంది . ఆ రోజులలో సతీసహగమనం వుండడంతో రాణీ కూడా సహగమనం చెయ్యడానికి వెళ్తూ లఖన్థాపాతో తాను తిరిగి అవతరిస్తానని , తన పూజాది కార్యక్రమాలు అతనిచేతే అందుకుంటానని మాటయిచ్చి భర్త చితిలో సతి అయిపోతుంది .

కొన్ని సంవత్సరాల అనంతరం ఒక రైతు పొలం చదును చేస్తూ వుండగా నాగలి రాయికి తగులగా ఆ రాతినుండి రక్తం , పాలు ధారలుగా కారసాగేయట . ప్రజలు యేమిచేసినా ఆ ధారలను నియంత్రించలేక పోయేరుట . దేశానికి ముప్పురాబోతోందేమో అని ప్రజలు భయపడసాగేరు . ఈ విషయం విన్న లఖన్ థాపా అక్కడకు వెళ్లి భగవతీ మాతగా గుర్తించి పూజలు జరుపగా ఆ ధారలు కట్టేయట . అదే ప్రాంతంలో కోవెల నిర్మించేరు . లఖన్ థాపా జీవించి వున్నంతకాలం అమ్మవారిని సేవించుకొని అమ్మలో ఐక్యం అయేడుట . ఇప్పటికీ ఈ కోవెల పూజాది బాధ్యతలు లఖన్ థాపా  వంశస్థులు నిర్వహిస్తున్నారు .

పూర్వం ఈ కోవెల చేరుకోవాలంటే మూడు నాలుగు గంటలు కొండలలో నడిచి చేరుకో వలసి వచ్చేది . ప్రస్తుతం అయిదుకిలో మీటర్ల పొడవున్న రోపువే వెయ్యడంతో అక్కడకి చేరుకోడం సులువయ్యింది .

అమ్మవారిని దర్శనార్ధమై వచ్చిన భక్తుల మనసులలోని కోర్కెలు తీర్చే దేవి కాబట్టి ఈ అమ్మవారికి " మనాకామనా దేవి " అని పేరు వచ్చింది . అమ్మవారికి జంతుబలి యిచ్చే ఆనవాయితీని యీ మధ్యకాలంలో రద్దు చేసేరు .

ఈ శిఖరం పై నుంచి చూస్తే కనిపించే ప్రకృతి పచ్చదనాన్ని , వెనుకాల దూరంగా కనిపించే మంచు శిఖరాలు వర్ణించడం యే కవికో సాధ్యం కాని , నాలాంటి సామాన్యురాలు కి సాధ్యమా ?

మళ్లీ వారం " పోకరా " విశేషాలు చదువుదాం .

 అంతవరకు శలవు .

మరిన్ని వ్యాసాలు

Guru geetha prasasthyam
గురు గీత ప్రాశస్త్యం
- సి.హెచ్.ప్రతాప్
కల్పవృక్ష వినాయక స్వరూపం శిల్పి
కల్పవృక్ష వినాయక స్వరూపం శిల్పి
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
సంత్ నరహరి సోనార్
సంత్ నరహరి సోనార్
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
మా చార్ధామ్ యాత్ర
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
శివుడు నటరాజ మూర్తిగా మారడానికి ప్రేరకుడైన
మంకణ మహాముని కథ
- ambadipudi syamasundar rao
Viswakarma
విశ్వకర్మ
- శ్రీ కుందుర్తి నాగబ్రహ్మచార్యులు అద్దంకి