సాహితీవనం - వనం వెంకట వరప్రసాద రావు

sahiteevanam

ఆముక్తమాల్యద 

ఆడిన మాటను నిలబెట్టుకోవడంకోసం వెనుకకు  తిరిగి వచ్చిన మాలదాసరిని భక్తిగా, ప్రేమగా  గౌరవించాడు బ్రహ్మరాక్షసుడు. లోకంలో 'యిచ్చిన  మాటకోసం నీలా శరీరాన్ని ఆహారంగా యివ్వడం  కోసం తిరిగివచ్చేవాడు' ఎవడైనా ఉంటాడా, నీకు  సాటి ఎవరూ లేరు అన్నాడు మాలదాసరి పాదాల మీద పడిపోయి. నాదేముందయ్యా గొప్ప, నీలా నోటికి దొరికిన కూటిని వదులుకునేవాడు ఎవడైనా ఉన్నాడా ఈ ప్రపంచంలో, నేను కాదు, నిజానికి నువ్వే గొప్ప. తిరిగి రావచ్చు, రాకపోనూవచ్చు అని తెలిసి కూడా నామీద జాలితో, నమ్మకంతో త్యాగం  చేసిన నువ్వే గొప్పవాడివి, నేను కాదు. నీవలన నీజాతి మొత్తమూ పవిత్రం అయ్యింది పో అన్నాడు మాలదాసరి. 'ఆవు-పులి' కథ ఉన్నది తెలుగు వారి కథలలో. పులినోట చిక్కిన ఆవు ఒకటి, ఆ పులిని బ్రతిమిలాడి, ' నిన్ననే పుట్టిన బిడ్డ ఉన్నది నాకు, నాకోసం ఎంత ఆర్తిగా ఎదురు చూస్తుందో, నేను వెళ్లి నా బిడ్డకు పాలు యిచ్చి, విషయము చెప్పి, ఈ పాడులోకంలో బ్రతకడానికి కావలసిన తెలివి, వివేకము, ధైర్యము అన్నీ చెప్పి, చివరిసారిగా తనివితీరా నా బిడ్డను ముద్దుగా లాలించి వెంటనే వచ్చి నీకు ఆహారాన్ని అవుతాను' అని ఎలానో ఆ పులిని ఒప్పించి వెళ్తుంది. అలానే వెనక్కు వస్తుంది. ఆశ్చర్యముతో, మనసు మారి, కరుణతో కరిగి  ఆ పులి ఆవును వదిలిపెడుతుంది. మూడు దశాబ్దాల క్రితం వరకూ ఇలాంటి కథలుండేవి పిల్లల పాఠ్య పుస్తకాలలో. యిప్పుడు అరువుతెచ్చుకున్న సిద్ధాంతాల రాద్ధాంతాలు, కుల, మత, ప్రాంత విభేదాల ప్రాతిపదికల ప్రతిపాదనల కథలు ఉంటున్నాయి. ఆ 'ఆవు-పులి' కథకు బీజం ఈ మాలదాసరి-బ్రహ్మరాక్షసుల కథయే అనడంలో అతిశయోక్తి ఏమీ లేదు.మాలదాసరి గొప్పదనాన్ని, త్యాగ ధనాన్ని గుర్తించిన మహనీయుడు బ్రహ్మరాక్షసుడు, ఆతనికి యిచ్చిన మాటను నిలబెట్టుకోవడం కోసం వెనుకకు తిరిగివచ్చి ఆహారంగా మారడానికి సిద్ధపడిన మహానుభావుడు మాలదాసరి.

కడుపు మహాక్షుధ న్నకనకంబడ నన్గృతకృత్యుఁ జేయఁ బో 
విడిచితి వేము జాత్యముగ వేధవిధించినకూడు మీకు నీ 
యెడ నొకకీడు కల్గ దిఁక నే మనిన న్మఱి నీకు నానసూ 
బడలిక దీఱ నిత్తనువు బారణసేయుము మైత్త్రి కల్గినన్ 

'ఆకలి కడుపుమంటకు నకనక లాడకుండా, నన్ను కృత కృత్యుడిని చేయడానికి, నా వ్రతం పూర్తిచేసుకున్న సార్ధకత కలగడానికి సహాయపడి, నన్ను వెళ్ళిపొమ్మని విడిచిపెట్టావు. మేము(మానవులు) మీకు బ్రహ్మదేవుడు చేసిన ఆహారపు జాతికి  చెందిన వాళ్ళమే. నీకేమీ కీడు, అపవాదు రాదు నన్ను తినడం వలన. నేను బ్రతికానా నీ మీద ఒట్టే! నన్ను పట్టుకోడానికి, నేను తిరిగివచ్చేదాకా ఆకలి తోటీ  నువ్వెంతో ప్రయాస పడ్డావు మిత్రమా! నీకు కూడా ఆ మైత్రీ భావం ఏమాత్రం ఉన్నా, ఆ ప్రయాస తీరేట్లుగా నా శరీరాన్ని హాయిగా, తృప్తిగా ఆరగించు' అన్నాడు  మాలదాసరి! 

తనను వదిలిపెట్టడంకోసం బ్రతిమిలాడేప్పుడు 'సఖ్యం సాప్తపదీనం', 
ఏడడుగులు కలిసి నడిస్తే ఎవరైనా స్నేహితులే, కనుక నీ స్నేహితుడి కోరిక 
తీర్చడం నీ ధర్మం' అని తను అన్న మాటలను గుర్తు చేస్తున్నాడు, ఆ మాటలకు
తను కట్టుబడి ఉండడం, స్నేహితుని ఆకలిని తీర్చడం స్నేహితునిగా తన 

ధర్మం అంటున్నాడు. తన మీది స్నేహభావంతో, తాను యిచ్చిన మాటను నిజం చేయడం కోసమైనా తనను తినడం బ్రహ్మరాక్షసుడికి, జాతి రీత్యా, స్నేహంరీత్యా కూడా ధర్మం అంటున్నాడు. స్నేహధర్మాన్ని పాటించి ఒక వ్రతాన్ని పూర్తిచేసుకునే అవకాశాన్ని యిచ్చావు. రెండో వ్రతం, నేను యిచ్చిన మాటను నిజం చేసుకోవడం అనే వ్రతాన్ని కూడా పూర్తి చేసుకోడానికి సహకరించడం స్నేహితునిగా నీ ధర్మం, కనుక నన్ను తినేసేయ్ అన్నాడు.

తాను కాదు, తన తండ్రి యిచ్చిన మాటకోసం, అది కూడా తన తల్లికి కాదు, పినతల్లికి కూడా కాదు, సవతి తల్లికి యిచ్చిన మాట కోసం నిండు యవ్వనంలో చేతికి అందివచ్చిన చక్రవర్తి పదవిని వదులుకుని, అడవి దారిని పట్టిన త్యాగశీలి శ్రీరాముడు! సరే ఆయన యింతా కన్నతండ్రికోసం చేశాడు. 

తండ్రికోసం కాదు, అన్నకోసం నిద్రాహారాలు మాని, సేవక వృత్తిని ఆనందంగా జీవితాంతమూ ఎంచుకుని, అడవుల వెంట అరణపు సేవకునిగా వెళ్ళిన త్యాగశీలి లక్ష్మణుడు! ఈ కథంతా జరిగినప్పుడు అక్కడ లేనే లేడు భరతుడు, మేనమామ యింట్లో  వున్నాడు. తండ్రి మరణించిన వార్త తెలిసి అయోధ్య వచ్చాడు. తండ్రి ఎలాగూ లేడు, అన్న రాజ్యాన్ని వదులుకుని అడవులకు వెళ్ళిపోయాడు. ఏ పోటీ లేదు. రాజ్య రమణి తనను వరించడానికి సిద్ధంగా ఉన్నది. తను నిర్దోషి అని అందరికీ తెలుసు, తనకు ఏ అపవాదూ రాదనీ తెలుసు, అయినా అడవులకు పరుగెత్తి రాజ్యం నీది, నీ రాజ్యాన్ని నువ్వు తీసుకో అన్న త్యాగశీలి భరతుడు! 

'అలా కుదరదు నా తండ్రివి రెండు రాజ్యాలు, ఒకటి అరణ్య సామ్రాజ్యం, మరొకటి అయోధ్యా సామ్రాజ్యం. అరణ్యరాజ్యం నాకు, అయోధ్యా రాజ్యం నీకు అని మళ్ళీ రాజ్యాన్ని వదులుకున్న వాడు శ్రీరాముడు. ఏ అపకీర్తి, దోషము లేకుండా చక్రవర్తి అయ్యే అవకాశం మళ్ళీ వచ్చింది. అయినా అన్నపాదుకలను సింహాసనం మీద కూర్చోబెట్టి, తాను కేవలం ప్రతినిధిగా, అన్నకోసం ఎదురుచూస్తూ, అన్నవెంట తప్ప అయోధ్యలో కాలుబెట్టను అని నందిగ్రామంలో సన్యాసిగా బ్రతికిన మహాత్యాగశీలి భరతుడు! శ్రీరాముడు, లక్ష్మణుడు, భరతుడు ముగ్గురికీ  సాటి ఐన త్యాగపురుషుడు మాలదాసరి! సాటి కాదు, త్యాగ గుణంలో వారికన్నా  ఒకపిసరు ఎక్కువే అన్నా తప్పేమీ కాదు! 

మాలదాసరి పూనుకున్నది రాజ్యాన్ని త్యాగం చేయడానికి కాదు, ప్రాణాలను త్యాగం చేయడానికి! రాజులకు రాజ్యాలు పోవడమూ, రావడమూ వింత ఏమీ కాదు. అదృష్టం కలిసివస్తే సామాన్యుడికీ రాజరికం రావడం అరుదేమో కానీ అసాధ్యంకాదు. కానీ ఎవరికైనా ప్రాణము పోతే తిరిగివచ్చేది కాదు. మొదట బ్రహ్మరాక్షసుడు వదిలిపెట్టినపుడు బ్రతికే అవకాశం వచ్చింది మాలదాసరికి. అన్న మాటకోసం ఆ అవకాశాన్ని వదులుకున్నాడు. యిప్పుడు రెండోసారి అవకాశం వచ్చింది, బ్రహ్మరాక్షసుడిలో మేలుకుంటున్న మానవత్వం  కారణంగా, దీన్నీ వదులుకోవడం మాత్రమే కాదు, కోరి కోరీ, బలవంతంగా, రాక్షసుడికి ఆహారంగా చనిపోవడానికి తయారై, 'నన్ను తిను' 'నన్ను తిను' అని వాడిని బ్రతిమిలాడుతున్నాడు!    

ఈమాట న్బొరపొచ్చెము
లేమికి నీశ్వరుఁడ కరి నిలింపవిరోధీ 
నామెయి మేదోమయ దృ 
ప్తామిషములు మెసవు మన్న నతఁ డను నార్తిన్ 

'ఓ సురవిరోధీ! ఓ రాక్షసుడా! నా ఈ మాటలో, నన్ను చంపి తినుమనే మాటలో ఏ పొరపొచ్చాలు, ఏ కల్లలు కపటాలు లేవు అనడానికి ఆ ఈశ్వరుడే సాక్షి(కరి) నా శరీరంలోని, నా మెదడులోని కొవ్వుపట్టిన మాంసములను తినెయ్' అన్నాడు  మాలదాసరి! నివ్వెరపడి, బాధగా యిలా అన్నాడు బ్రహ్మరాక్షసుడు.

ఎట్టూ యి ట్టగునయ్య పలక దయలే కిన్నాళ్ళు నీకూడె యీ 
పొట్టం బెట్టి మహాఘలబ్ధిఁదనువుం బోషించి ఎన్నాళ్ళ కే 
నెట్టే నొక్కతపస్వి యొక్క వ్రతి రాడే చూడఁడే తత్కృపన్ 
బుట్టు న్నీఁగెద దీని నా యొదవి యో పుణ్యాత్మ యె ట్లంటివే

అయ్యా! దయలేకుండా యిలా పలికితే ఎలా చెప్పు? దయలేకుండా యిన్నాళ్ళూ ఈ పాడు కూడే పొట్టకు పెట్టి, మహాపాపాన్ని మూటగట్టుకుని పోషించి పోషించి,ఎన్నాళ్ళకైనా, ఎలాగైనా ఒక తపస్వి, ఒక వ్రతి రాకపోతాడా? నన్ను చూడకపోతాడా? దయజూడక పోతాడా? ఆ దయవలన ఈ రాక్షసుని పుట్టుకను పోగొట్టుకోకపోతానా అనుకుంటుంటే లభించావు నీవు. ఓ పుణ్యాతుడా! ఎలా 
ట్లాడావు! అన్నాడు బ్రహ్మరాక్షసుడు. పరివర్తన పరిణామ క్రమాన్ని తెలుపుతుంది, పథనిర్దేశం చేస్తుంది, పస తెలుపుతుంది. మంచిని గ్రహించడం ఒక దివ్య లక్షణం. దాన్ని గౌరవించడం, అనుసరించడం, ఆచరించడం దైవత్వానికి దారితీస్తుంది. తప్పులు చేయనివారు ఎవరు లోకంలో? తప్పులు చేయనివాడు దేవుడే. చేసిన తప్పును తెలుసుకుని సరిదిద్దుకునేవాడు మానవ దశనుండి దైవత్వానికి ప్రయాణం చేస్తాడు. తప్పని తెలిసినా సమర్ధించుకునేవాడు, మరల మరలా ఆ తప్పులనే చేసేవాడు రాక్షసుడు! హిరణ్యకశిపుడు అదే చేశాడు. రావణుడు అదే చేశాడు. కంసుడూ, దుర్యోధనుడూ అదే చేశారు. కనుక వారు రాక్షసులుగానే మిగిలిపోయారు. వారికన్నా ఉత్తముడు ఈ బ్రహ్మరాక్షసుడు. తన తప్పును గ్రహించి, పశ్చాత్తాపముతో, సరిదిద్దుకునే మార్గం కోసం ఎదురుజూస్తున్నాడు యిన్నాళ్ళు. మాలదాసరి గొప్పదనాన్ని గుర్తించాడు. అతని సహాయంతో తన తప్పులకు పరిష్కారాన్ని, మంచి మార్గాన్ని వెదుక్కుంటున్నాడు.మీవంటి

భాగవతులుం 
బావనులుగ జేయరేని
మఱిగతి యేదీ 
మావంటివారి కిఁక మా 
యేవము వెనుకటిది చూడ కీక్షింపు కృపన్ 
మీలాంటి భాగవతులుకూడా కనికరించి పావనులుగా పాపరహితులుగా  చేయకపోతే మాలాంటివారికి యిక ఎవరు గతి? ఇంతకుముందు నేను చేసిన హేయమైన పనికి అసహ్యపడకుండా నన్ను దయగా చూడవయ్యా అని దీనంగా బ్రతిమిలాడడం మొదలుబెట్టాడు బ్రహ్మరాక్షసుడు. 

(కొనసాగింపు వచ్చేవారం)

***వనం వేంకట వరప్రసాదరావు.

మరిన్ని వ్యాసాలు

మా చార్ధామ్ యాత్ర-4
మా చార్ధామ్ యాత్ర-4
- కర్రా నాగలక్ష్మి
Maa chardham yatra
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
సినీ అప్సరస గీతాలు .
సినీ అప్సరస గీతాలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
వివేకానంద రాక్ మెమోరియల్ స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
- కుందుర్తి నాగబ్రహ్మచార్యులు