హిమగిరి కైలాశ దర్శనం ( పదవ భాగం ) - కర్రా నాగలక్ష్మి

మా కైలాశమానససోవరయాత్రలో నేపాలులోని  ఖాట్మండు లోయ గురించి చాలా వివరాలు రాసేను . ఇంతకు ముందు మా యాత్రలో చూసిన ' పోఖరా లోయ ' వివరాలు కూడా మీతో పంచుకొని యాత్రా వివరాలను ముగిస్తాను .

పోఖరా లోయ నేపాలు రాజ్యంలో పశ్చిమభాగంలో వున్న ' కాస్కి ' జిల్లా ముఖ్యపట్టణం . ఖాట్మండు కి సుమారు 200 కిలో మీటర్ల దూరంలో సుమారు 226 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగి వున్నలోయ . ఖాట్మండు తో పోలిస్తే చాలా చిన్న లోయ అని పేర్కొనవచ్చు .సముద్ర మట్టానికి కొన్ని చోట్ల 780 మీటర్లు కొన్ని చోట్ల 1350 మీటర్ల యెత్తున వుంటుంది . అంటే యీ లోయ బాగా యెత్తుపల్లాలుగా వుంటుందన్నమాట . నేపాలులో ఖాట్మండు తరవాత యిదే పెద్ద పట్టణం .

 

పోఖరాని సరస్సుల పట్టణం అని కూడా నేపాలీలు వ్యవహరిస్తారు  , యిక్కడ చిన్నాపెద్దా సరస్సులు మొత్తం యెనిమిది వుండడం కూడా ఒక కారణం .

ప్రపంచం లో కెల్లా యెత్తైన శిఖరాలుగా గుర్తింబడ్డ పది శిఖరాలలో మూడు అన్నపూర్ణ , ధౌళగిరి , మనస్లు  శిఖరాలు యీ పట్టణానికి సుమారు 15 కిలోమీటర్ల దూరంలో వుండడం తో యీ ప్రదేశం అహ్లాదకరం గా వుండి విదేశీ పర్యటకులతో సందడి గా వుంటుంది . అన్నపూర్ణా పర్వాతరోహణ చేసేవారి కి , ముక్తినాథ్ యాత్రీకులకు యిది మొదటి విడిది . ముక్తినాథ్ యాత్రకు యిక్కడనుండే విమాన , రోడ్డు  సదుపాయం వుంది . మంచు పర్వతాలకు అతిసమీపంగా వుండడం తో యెప్పుడూ వాన లేక మంచు పడడంతో యెప్పుడూ రోడ్లమీద నీరు ప్రవహిస్తునే వుంటుంది .

పోఖరా ప్రాంతంలో కొండలు యెంత యెత్తున వుంటాయి అంటే 30 కిలోమీటర్ల దూరానికి 1000 మీటర్ల నుంచి 7500 మీటర్ల యెత్తుకి చేరుకుంటాం . అక్కడ వీధులలో తిరగడం కూడా కొండ యెక్కుతున్న అనుభూతిని కలిగిస్తుంది .

పోఖరా లోయ లో ముఖ్య నది సేతిగండకి తన వుపనదులతో ప్రవహిస్తోంది . వీటి ప్రవాహ వేగానికి యిక్కడ కొండలు దొల్చుకు పోయేయి . పోఖరా లోయ అతిదగ్గరగా అంటే సుమారు 5 కిలోమీటర్ల దూరంలో మఛేపుచ్రే ( fish tail ) పర్వతం వుంది .

పోఖరా లోయ సహజ గుహలకు ప్రసిద్ధి . మంచు కరిగి యెల్లప్పుడూ నీరు ప్రవహిస్తూ వుండడం , కొండలు చాలా యెత్తుగా వుండడం తో నీరు  విపరీత మైన వేగంతో ప్రవహించడం తో కొండలు , నేల కోతకు గురై గుహలు యేర్పడ్డట్టుగా స్థానిక గైడు వివరించేడు .

 విదేశీ పర్యటకులకు యెంతో యిష్టమైన వేసవి విడిది పోఖరా . అంత చిన్న పట్టణంలో అన్ని పర్యాటక  ప్రదేశాలు వుండడం అబ్బుర పరుస్తుంది . విదేశీ పర్యాటకులను ఆకర్షించడానికి  నేపాలీల సాంతస్వభావం కూడా ఒక కారణం అయితే హిందూ , బౌద్ద , క్రైస్థవుల మందిరాలు , ప్రార్థనాస్థలాలు వుండడం వేరొక కారణం కావొచ్చు .

పోఖరా లో  ' ఫేవా సరస్సు ' , ' బెగ్నస్ సరస్సు ' , ' రూప సరస్సు ' లను ముఖ్యమైనవి గా చెప్పుకోవచ్చు .ఇక్కడ ముఖ్యంగా వారాహీ దేవి మందిరం , నరక జలపాతం ( Hell's water falls ) , వింధ్యవాసిని దేవి మందిరం , మాతేపాని గుంఫ , మహేంద్రగుహలు చెప్పుకోదగ్గ పర్యాటక స్థలాలు .

1) వారాహి దేవి మందిరం --

 ఫేవా సరస్సు మధ్యలో వుంటుంది యీ మందిరం . చిన్న చిన్న పడవలలో మందిరం చేరుకోవాలి .
విష్ణు పురాణం ప్రకారం వారాహి అంటే వరహానికి ఆడ అవాతారమని నమ్ముతారు . శాక్తేయులు వారాహీ దేవి పార్వతీ దేవి మాతృక అని నమ్ముతారు . ఈ మాతృకలు దానవులపై యుధ్దానికి వెళ్లే టప్పుడు అవసరానుగుణంగా దేవతలయొక్క శక్తులను సమీకరించి సృష్టించి తమతమ ఆయుధాలను యిచ్చినవి . శక్తి స్వరూపిణి అయిన దుర్గాదేవి తనచే సృష్టించబడ్డ అన్ని మాతృకలను తనలో ఐక్యం చేసుకొని సంభుని సంహరించెనని శక్తి పురాణం లో వివరించేరు .

దేవీ భాగవతం ప్రకారం చండీమాత రక్తబీజుని సంహరించేటపుడు వారాహీ మాతృకను సృష్టించెనట . దేవీ పురాణం లో వారాహి దేవిని వరహాజనని , క్రితంత తనుసంభవ ( మృత్యుసమయములో వచ్చేశక్తి అంటే యమశక్తి) గా కూడా వర్ణించేరు  . వారాహి దేవి వాహనం యెనుము , పాశం ధరించి వుండడం కూడా పై వాదనను బలపరుస్తుంది . ఈమెను కైవల్యరూపిణి , వైవస్వతి అని కూడా అంటారు . ఈమెను వాగ్ధేవి రూపిణిగా కూడా వర్ణిస్తారు .

ఈ మందిరంలో వారాహి దేవి వరాహ ముఖం కలిగి , చక్రం , కత్తి ధరించి భక్తులకు దర్శనమిస్తోంది .లలితాసహశ్రనామాలలో ఈ వారాహి దేవి నామం వుండడం కనిపిస్తుంది .వారాహి దేవి మందిరాలలో ముఖ్యంగా క్షుద్రపూజలు , తాంత్రిక పూజలూ జరగపడం సర్వసాధారణం . మనదేశం లో కాడా ఐదు ముఖ్యమైన వారాహిమందిరాలు వున్నాయి . అందులో వొకటి ఒరిస్సా లోనూ , వొకటి జబల్పూర్ దగ్గర వున్నాయి . ఈ ప్రదేశాలలో యిప్పటికీ నిత్యం క్షుద్ర పూజలు జరుగుతూవుండడం విశేషం .పోఖరా వారాహీ దేవి మందిరం లో రాత్రి పూజలునిర్వహించడం యిప్పటికీ జరుగుతోంది . 1996 వరకు యిక్కడ జంతు బలి కూడా సాగేదట . మనదేశంలో అస్సాము లో వున్న ' కామాక్ష్య ' మందిరంలో జంతుబలి యిప్పటికీ సాగుతోంది .పరశురామ కల్పసూత్రం ప్రకారం  క్షుద్రోపాసకులు యీమందిరంలో అర్దరాత్రి దాటేక పూజలు నిర్వహిస్తారుట . అందుకే యీమెని రాత్రిదేవత , ద్రూమాదేవి అనికూడా పిలుస్తారు . పొద్దుట పూట మాత్రం అమ్మవారికి నిత్యపూజా నైవేద్యాలు జరుగుతూ వుంటాయి .ప్రతీ మనిషిలోనూ వారాహీశక్తి నాభి ప్రాంతంలో వుండి మణిపూర , స్వాధిష్ఠాన , మూలాధార చక్రాలను ప్రభావితం చేస్తుంది .చుట్టూరా మంచుతో కప్పబడ్డ పర్వతాల మధ్యన సరస్సు అందులో మందిరం , ఆ వాతారణం చాలా బాగుంటుంది . అందుకనే ఈ ప్రదేశం పర్యాటకులకు యిష్టమైన పర్యాటక ప్రదేశాలలో చేర్చబడింది .

2)  నరకజలపాతం ( Hell's water falls )---

 సేతి గండకి నది యొక్క ఉపనది , ఫేవా సరస్సు తో కలసి ప్రవహించి పాతాళ ఛాంగమై దగ్గర అంతర్వాహిని అయి కొండలను దొల్చి ప్రవహిస్తుంది . కొండలలోపలనుంచి కొన్నిచోట్ల బహిర్గతమౌతూ ఆవేగానికి పెద్ద శబ్ధంతో ప్రవహిస్తూ చూపరులను ఆకట్టుకుంటూ వుంటాయి . వీటినే నరకపు జలపాతం అని అంటారు . సాధారణంగా జలపాతాలు కొండలమీంచి కిందకి నీరు జారడం చూస్తూవుంటాం కాని యిక్కడ కిందకి కొండ గుహలద్వారా ప్రవహిస్తున్న నీటి ప్రవాహాన్ని చూస్తాం . కొన్ని చోట్ల నీటిశబ్దం మాత్రం వినగలం , యెగిరే నీటి తుప్పరలను చూడగలం కాని నీరు యెక్కడ ప్రవహిస్తోందో కనిపించదు . ఈ జలపాతాలు ప్రకృతి లోని ఒక అద్భుతం అనిపించక మానదు . 1966 లో దేవిస్ అనే స్విస్ మహిళ పొరపాటున యిందులో పడిపోయిందిట , 500 మీటర్ల అవతల ఆమె శరీరం దొరికిందట అప్పటినుండి స్థానికులు వీటిని దేవిస్ ( Devi's ) జలపాతం అనికూడా అంటారు .

3) ఫేవా సరస్సు -----

 పోఖరా లోయలో వున్న యెనిమిది సరస్సులోనూ అతి పెద్ద సరస్సు ఫేవా సరస్సు . అన్నపూర్ణా పర్వతాలు , దౌళగిరి ,  మఛేపుచ్రే కొండల మధ్య నున్న మంచినీటి సరస్సు , కొండలపై నుండి వచ్చే నీటిని ఆనకట్ట ద్వరానియంత్రించుట వలన దీనిని సహజసిధ్దమైన సరస్సుగా పేర్కొనరు . ఈ సరస్సు సముద్రమట్టానికి సుమారు750 యెత్తునవుంది . దీని పొడవు 5.2 కలోమీటర్లు , వెడల్పు 2 కలోమీటర్లు , లోతు 28 అడుగులు . ఈ సరస్సు ఉపరితలంలో అన్నపూర్ణా పర్వతాలు , దౌళగిరి , మఛేపుచ్రే పర్వతాల ప్రతిబింబాలు కనిపిస్తాయి .1996 లో ప్రపంచపు శాంతి స్థూపం ( world peace pagoda ) యీసరస్సు దక్షిణ వొడ్డున కట్టబడిన అతి సుందరమైన స్థూపాన్ని చూడొచ్చు .

 4)  బెగ్నెస్ సరస్సు -----
పోఖరా లోయ లోని రెండవ పెద్ద మంచినీటి సరస్సు . ఈ సరస్సు వొడ్డున హోటల్స్ వుండడం తో చాలా రద్దీగా వుంటుంది . నేపాల్  యెక్కువ పర్యాటకులకు సందర్శించే ప్రదేశం కావడంతో యిక్కడ అయిదు నక్షత్రాల వసతులు వుండే హోటల్స్ వున్నాయి . 1988లో ఖిలకోల దగ్గర ఆనకట్ట నిర్మించి యీ సరస్సులోని ప్రవహించే నీటిని మళ్లించి పంటభూములకు అందిస్తున్నారు .2004 లోఇంటర్నేషనల్ మౌంటు మ్యూజియం స్థాపించి అందులో వివిధరకాలైన ఆటవిక సంపదను , కొన్ని వందల సీతాకోకచిలుకల రకాలను పొందుపరచేరు .
      మా యాత్రా విశేషాలు యింతటితో ముగిసేయి . దేవుడు అనుజ్ఞయిసస్తే గండకి నదీ దర్శనం , ముక్తినాథ్ యాత్ర చెయ్యాలనే సంకల్పం వుంది . అంత వరకు యీ యాత్రా అనుభవాలు నెమరువేసుకుంటూ వుంటాం .

మీ కోసం మళ్లావారం మరో యాత్రావివరాలతో వస్తానని మనవి చేస్తూ శలవు

మరిన్ని వ్యాసాలు

కల్పవృక్ష వినాయక స్వరూపం శిల్పి
కల్పవృక్ష వినాయక స్వరూపం శిల్పి
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
సంత్ నరహరి సోనార్
సంత్ నరహరి సోనార్
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
మా చార్ధామ్ యాత్ర
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
Viswakarma
విశ్వకర్మ
- శ్రీ కుందుర్తి నాగబ్రహ్మచార్యులు అద్దంకి
తొలి వలపు తొందరలు...
తొలి వలపు తొందరలు...
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు