అవీ - ఇవీ - భమిడిపాటి ఫణిబాబు

సాధారణంగా ఏదైనా ఒక వస్తువు కానీ, లేదా ఓ ప్రక్రియ కానీ, Novelty  ఉన్నంతకాలమే , దాని వెనక్కాల పడతాము. కొంతకాలం అయేసరికి దానిమీద ఓ విరక్తో, మొహం మొత్తడం లాటిదో ప్రారంభం అయి, మొత్తం దానిని పక్కకు పెట్టేస్తాం కదూ…

ఉదాహరణకి, కొన్ని సంవత్సరాల క్రితం, పాటలు క్యాసెట్లరూపంలో వచ్చేవి.  మార్కెట్ లో కనిపించిన పాటల క్యాసెట్లు, వేలం వెర్రిగా కొనేసేవారు. అంతే కాకుండా, రేడియోల్లో వచ్చే అరుదైన పాటలు రికార్డు చేసికోడానికి  ఖాళీ క్యాసెట్లు కూడా అదే వేగంతో కొనేయడం. వాటికి లేబుళ్ళు అంటించి, పేర్లు , వివరాలు రాసి, వీటిని దాచుకోడానికి ఓ పెద్ద ప్లాస్టిక్ పెట్టోటి.  ఆ క్యాసెట్టు, వాడి ,వాడి ఆ టేప్ ఏదైనా ముడతలు పడిపోతే, బాగుచేయడానికి ఓ పెన్సిలూ.. ఈ సరంజామా లేని ఇల్లు ఉండేది కాదు. అంతకుముందు గ్రామఫోను రికార్డుల విషయమూ అంతే.  ఆ రికార్డర్లూ, గ్రామఫోన్లూ  పాడైపోతే బాగుచేసే నాధుడు లేడు ఈ రోజుల్లో. పోనీ, ఆ క్యాసెట్లు అన్ని పోగేసి, ఏమైనా ప్రతీరోజూ వినేవారా అంటే అదీ లేదూ. ఓ నెలరోజులు వినడం,  ఇంటికొచ్చినవాళ్ళందరికీ , నచ్చినా నచ్చకపోయినా వినిపించడం. కొంతమందైతే, వాళ్ళింట్లోలేని క్యాసెట్లు  “ ఎరువు” పట్టికెళ్ళేవారు. తిరిగొచ్చినవి రాగా, మిగిలినవాటి అజా పజా ఉండేది కాదు. ఓ నాలుగురోజులు బాధపడి, ఆ విషయం మర్చిపోయేవారు.

అలాగే పుస్తకాలూ, పత్రికలూ… ఫలానా రచయిత నవల వచ్చిందంటే చాలు, పొరుగూరినుండైనా  సంపాదించవల్సిందే. పత్రికలవిషయం అడక్కండి.. వారం తిరిగేసరికి కొత్త పత్రిక వచ్చిందంటే చాలు, ఇంట్లోవారు, ఎవరికి వారే ముందు చదివేయాలనుకోవడం. కొట్టుకి ఆరోజు పెందరాళే వెళ్ళి, కొత్త పత్రిక కొనేసి, ఎవరికీ కనిపించకుండా, సంచీలో దాచేసి, తను చదివిన తరువాతే బయట పెట్టడం. అంతే కాకుండా,  ఇంట్లోవాళ్ళందరూ తప్పనిసరిగా చదివే అభిమాన రచయిత ( త్రి) , రాసిన సీరియల్ కాగితాలన్నీ, పుస్తకంలోంచి జాగ్రత్తగా విడతీసి, వాటిని జాగ్రత్త చేసి, వీలైతే బైండు చేయించడం.ఇప్పుడు ఆ పత్రికలూ లేవు, ఆరోజుల్లో చేసిన బైండులూ లేవు.

కాలక్రమేణా, టేప్పులూ, సీడీలు పోయి, అవేవో కొత్తకొత్తగా, అరచేతిలో పట్టే సాధనాలు వచ్చాయి. అలాగే , పుస్తకాలు కూడా అంతర్జాలంలోకి వచ్చేశాయి. అసలు ఈ రోజుల్లో పుస్తకాలు చదివే సహనమూ, ఓపికా ఎక్కడున్నాయి లెండి. ఏమైనా అంటే…  I am very busy…  అండీ అనేవాడే, అక్కడికేదో పాతకాలం వారికి పనీ పాటా లేనట్టు.

ఇంకో వెరైటీ  “ వైరాగ్యం” చూద్దాం. ఈరోజుల్లో, టీవీ ల్లో ఏ భాషదైనా సరే, ఒక్కసారి చూసినా, ఒక్కసారి విన్నా, మళ్ళీ వినక్కర్లేదు. అవే మొహాలు, అవే పాటలు, అవే వెకిలివేషాలు,, అవే ప్రకటనలు వాటిని చూసి చూసి, విని విని , అసలు టీవీయే చూడ్డం మానేసినవారు కోకొల్లలు. అయినా సరే ప్రఈ చానెల్ వాడూ, మా  TRP  ఇంతా, అంతా అని చెప్పుకుంటూనే ఉంటారు. ఈ టీవీ సీరియళ్ళ వెనకాల వినిపించే ట్యూన్లు కూడా ఒకేలా ఉంటాయి. ఇదివరకటి రోజుల్లో, ఓ రేడియో అనండి, లేదా ఓ సినిమా అనండి, నటీనటులు తమ స్వంత గొంతుకతోనే మాట్టాడేవారు. గొంతుకని బట్టి చెప్పకలిగేవారు—ఫలానా నటి అని. ఈరోజుల్లో భాషతో నిమిత్తం లేకుండా, ఎవరిని పడితే వారినే ఎరువు తెచ్చికోడంతో, ప్రతీవారికీ డబ్బింగే. సరే ఒప్పుకుందాము, కానీ సినిమాలో ఉండే ఆడాళ్ళందరికీ, మగాళ్ళందరికీ ఒకే గొంతుకైతే భరించడం ఎలాగండి బాబూ? అలాగే యాంకర్ల విషయమూనూ, ఒకళ్ళిద్దరు బాగా వృధ్ధిలోకి వచ్చి, పేరు తెచ్చుకుంటారు. ఇంక చూడండి, ఆడియో ఫంక్షన్లనుండి, అంత్యక్రియల దాకా వాళ్ళే..

అంతదాకా ఎందుకూ, ఆధ్యాత్మిక కార్యక్రమాల విషయం తీసికోండి. నాలుగైదేళ్ళ క్రితం, ఈ ప్రవచనాలు మొదలెట్టినప్పుడు, అందరూ ఆసక్తికరంగా వినేవారు. ఫలానా టైముకి, ఫలానావారి ప్రవచనం వస్తోందంటే, బయటకి వెళ్ళే కార్యక్రమాలు మానుకుని మరీ వినేవారు. ప్రవచనకారులు చెప్పేవారు, మహానుభావులు అందులో సందేహం లేదు. మనకి తెలియని ఎన్నో విషయాలు ఎంతో ఆసక్తికరంగా, మనకి అర్ధం అయే భాషలో చెప్తారు. కానీ, చెప్పిందే చెప్పడంతో అందులోని   Novelty  కూడా తగ్గు ముఖం పడుతోంది. పైగా ఓ చానెల్ వాడు ఫలానావారి ప్రవచనం ప్రారంభిస్తే, ఇంకో చానెల్ వాడు మొదలెట్టాల్సిందే. పైగా వీరందరూ  Freelance  ప్రవచనకర్తలు కూడానూ.
 అలాగని ప్రతీదీ మొహం మొత్తుతుందని కాదు. ఏ విధమైన తేడాలేకుండా, జీవితాంతం మొహం మొత్తనిది ఏదైనా ఉందా అంటే , అది అమ్మ తన కన్నబిడ్ద మీద చూపించే ప్రేమ. అలాగే ఇంకోటుందండోయ్…  భార్యాభర్తలు… ఎంత కొట్టుకుంటూ, తిట్టుకుంటూ ఉన్నా, ఒకరంటే ఇంకోరికి మొహం మొత్తదు. అదేకదా మన భారతీయ వివాహ వ్యవస్థలోని మజా….

సర్వేజనా సుఖినోభవంతూ…

మరిన్ని వ్యాసాలు

వివేకానంద రాక్ మెమోరియల్ స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
- కుందుర్తి నాగబ్రహ్మచార్యులు
Kanyakumarilo vunna tiruvalluvar vigraham nirmana charitra
తిరువళ్లువర్ విగ్రహం నిర్మాణ చరిత్ర
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
శ్రీసాయి లీలామృతం
శ్రీసాయి లీలామృతం
- సి.హెచ్.ప్రతాప్
మా చార్ధామ్ యాత్ర-2
మా చార్ధామ్ యాత్ర-2
- కర్రా నాగలక్ష్మి