సాహితీవనం - వనం వెంకట వరప్రసాద రావు

sahiteevanam

ఆముక్తమాల్యద

మాలదాసరి ఔన్నత్యాన్ని గుర్తించి, ఆతడిని చంపి తినడానికి బదులుగా తనను కరుణించి తన బ్రహ్మరాక్షస రూపాన్ని విడిచే ఉపాయం సం తడిని బ్రతిమిలాడుతున్నాడు  బ్రహ్మరాక్షసుడు.

 
స్వధితియైనను ద్విజుఁ దిన్న శస్త్రమైన 
సరియకాఁ గాంచనమా చేయుఁ బరుసవేది 
యీయసాధారణన్యాయ మెన్నవలదె 
మాదృశుల చోటఁ గదియు భవాదృశులకు

బ్రాహ్మణుడిని సంహరించిన గొడ్డలిని(స్వధితి) కూడా పరుసవేది బంగారముగానే మారుస్తుంది కదా, మిగిలిన వాటితో సమానముగానే చూస్తుంది కదా! ఈ అసాధారణ న్యాయమును గుర్తించి, నాలాంటి వారిని చేరినప్పుడు మీలాంటి మహానుభావులు కూడా అలాగే మమ్ములను లెక్కించాలి, న్యాయము చేయాలి కదా అన్నాడు బ్రహ్మరాక్షసుడు. 

అనిన దేహార్పణము నొల్ల కార్తిఁ ఒలుకు 
కృపణత కతఁ డభిప్రాయ మెద్ది యనిన 
నిత్తుఁ దను వంట యనుకంప యే మదాత్మ 
కసటుఁ బాపుటయే యనుకంప గాక 

బ్రహ్మరాక్షసుడు అలా అనగానే తన శరీరాన్ని ఆహారముగా సమర్పించడాన్ని ఒప్పుకోక, ఆర్తిగా, దైన్యాన్ని ఒలికిస్తూ పలుకుతున్న బ్రహ్మరాక్షసుని అభిప్రాయము ఏమిటో, అతడు ఏమి కోరుకుంటున్నాడో తెలుపుమని కోరాడు మాలదాసరి. 'నా శరీరాన్ని నీకు ఆహారంగా యిస్తాను అనడం దయజూపడం అవుతుందా? ఈ క్షుద్రమైన, భయంకరమైన, మలినమైన బ్రహ్మరాక్షస రూపాన్ని పోగొట్టడం 
దయజూపడం అవుతుంది కానీ' అన్నాడు బ్రహ్మరాక్షసుడు. 

ఘంటాకర్ణుని మించు కర్మమొకొ నాకర్మంబు మౌనీంద్రులం 
దుంటల్సేయఁడె మాన్పి యీఁడె భగవంతుం డట్టి శ్రీ యట్టి శ్రీ 
కంటె న్భాగవతుండు మించ నొసఁగం గా లేఁడె యా మేలు నా 
కంటింప న్మఱి రాదె పూజనము గాదా ప్రాణిమే ల్చక్రికిన్ 

ఘంటాకర్ణుడు కుబేరుని అనుచరుడు, పిశాచి మూకలకు నాయకుడు. బదరీ వనములో శ్రీకృష్ణుడి దయచేత వాడి పిశాచ రూపాన్ని వదిలించుకున్నాడు. ఆ ఘంటాకర్ణుని కంటే ఎక్కువ పాపకర్మలు చేశానా నేను? మునులను ఋషులను నిర్దయగా సంహరించి మహా భయంకరుడైన వాడిని కూడా కనికరించి విముక్తిని ప్రసాదించాడు కదా భగవానుడు. భగవంతుడికన్నా మిన్నగా భాగవతుడు కనికరించగలడు కదా! అలాంటి మేలును నాకు చేసి,ఈ ఘోర రూపాన్ని వదిలించి నన్ను కనికరించలేవా? ప్రాణులకు మేలు 
చేయడం కన్నా పుణ్యము వేరే ఉంటుందా? శ్రీహరికి కూడా ఆ మేలు చేయడం వలన కీర్తి వచ్చిందే, నీకు అపకీర్తి వస్తుందా? మేలు చేయడం అంటే అలా ఉండాలి కానీ, నిన్ను తినడానికి నన్ను పురికొల్పి యింకా ఘోరమైన పాపాలు చేయడానికి ప్రోత్సహించి, హాని చేయడమే అవుతుంది కదా అన్నాడు. దానికి 'సరే! నీకు మేలు చేయడం ఎలానో చెప్పవయ్యా' అన్నాడు మాలదాసరి. 'నేను కుంభ జానువు అనే బ్రహ్మరాక్షసుడను. ఈ మఱ్ఱిచెట్టుని ఆశ్రయించుకుని  చేయరాని ఘోరాలన్నీ చేస్తూ, దారిన వెళ్ళే వాళ్ళను భోజనం చేస్తూ వచ్చాను 
యిన్నాళ్ళు. పూర్వజన్మలో నేను సోమశర్మ అనే బ్రాహ్మణుడిని. ఒక అకృత్యము  వలన యిలా బ్రహ్మరాక్షస జన్మను పొందాను. నీవు కైటభాంతకుడైన శ్రీహరిని  స్తుతిస్తూ ఈ నాడు పాడిన పాటయొక్క ఫలితాన్ని ఉదకపూర్వకంగా నాకు ధార పోశావా, నా ఈ జుగుప్సాకరమైన పాపిష్టి రూపం తొలిగిపోతుంది. నీకు  అనంతమైన పుణ్యమూ లభిస్తుంది, నాకు మేలు చేసిన కారణంగా. నీకూ ఈ శరీరము తీరిపోతుంది. విముక్తి లభిస్తుంది' అన్నాడు బ్రహ్మరాక్షసుడు.ఆ మాటలకు కిలకిలా నవ్వి యిలా అన్నాడు మాలదాసరి. ఇటువంటివి యిట కెక్కుడు 

నిట దిగుడని యొంద నెన్ని యే నిదియును నొ 
క్కటి యొకనాఁటిద కా దొక 
త్రుటి గీతఫలంబు నొసఁగుదునె యిమ్మెయికిన్ 

యిటువంటి జన్మలు ఎన్ని ఎత్తి ఉంటాను నేను? ఒకటి ఉత్తమ జన్మ, ఒకటి  తక్కువ జన్మ, అలా ఎన్ని చూశానని? అలాంటి జన్మలలో యిదొకటి మాత్రమే.యిటువంటి జన్మకోసం, ఒక రోజు పాడిన కీర్తన ఫలం కాదు కదా, ఒక త్రుటి  కాలపు కీర్తనాఫలితాన్ని కూడా యివ్వనంటే యివ్వను అన్నాడు మాలదాసరి!  

(కొనసాగింపు వచ్చేవారం)
***వనం వేంకట వరప్రసాదరావు.      

మరిన్ని వ్యాసాలు

వివేకానంద రాక్ మెమోరియల్ స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
- కుందుర్తి నాగబ్రహ్మచార్యులు
Kanyakumarilo vunna tiruvalluvar vigraham nirmana charitra
తిరువళ్లువర్ విగ్రహం నిర్మాణ చరిత్ర
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
శ్రీసాయి లీలామృతం
శ్రీసాయి లీలామృతం
- సి.హెచ్.ప్రతాప్
మా చార్ధామ్ యాత్ర-2
మా చార్ధామ్ యాత్ర-2
- కర్రా నాగలక్ష్మి