అవీ - ఇవీ - భమిడిపాటి ఫణిబాబు

 

పరీక్షాఫలితాలు వచ్చాయంటే చాలు, వార్తాపత్రికల్లో పూర్తి పేజీల ప్రకటనలు ఇచ్చేస్తూంటారు, ప్రేవేటు స్లూళ్ళ యాజమాన్యాలు.. మా స్కూలుకి ఫలనా ర్యాంకు వచ్చిందీ, ఒకటినుండి వందదాకా , ఏదో మొహమ్మాటానికి  ఓ అయిదారు నెంబర్లు వదిలిపెట్టి, మిగిలిన అన్ని ర్యాంకులూ వారి స్కూల్లో చదివిన విద్యార్ధులకే వచ్చాయని, ఇక్కడ పేపర్లలో సరిపోదన్నట్టు, టీవీల్లో కూడా ప్రకటనలు వస్తూంటాయి. చిత్రమేమిటంటే, ఇలాటి ప్రకటనలే, మక్కికి మక్కీ, మిగిలిన వారు కూడా ఇస్తూంటారు. సాధారణ ప్రాణికి ఇదంతా గందరగోళంగా ఉంటుంది, ఏ స్కూల్లో చేర్పించాలా అని..  ప్రభుత్వం నడిపే స్కూళ్ళకీ, కాలేజీలకీ  ఈ గొడవ లేదు, వస్తే వచ్చారు, లేకపోతే లేదు అన్నట్టే ఉంటారు.. ఈ ప్రెవేటు స్కూళ్ళలో చదివిన పిల్లలే, మేధావులూ,  ప్రభుత్వ స్కూళ్ళలో చదివినవారివి ఏదో వానాకాలపు చదువులూ అనే భావనలోనే తల్లితండ్రులు కూడా ఉండడం చాలా బాధాకరం. ఈ తల్లితండ్రులంతా తమ చిన్నప్పుడు, ఏ జిల్లా పరిషత్ స్కూల్లోనో, మునిసిపల్ స్కూల్లోనో చదివినవారేగా., వాళ్ళూ చదువుకున్నారు, ఉద్యోగాలూ చేస్తున్నారు… అయినా సరే ఈ ప్రెవేట్ స్కూళ్ళ వ్యామోహం ఏమిటో ఛస్తే అర్ధం అవదు.

 

ఒకానొకప్పుడు ఏమిటిలెండి, విద్యార్ధులు ఉండరు కానీ ,ఇప్పటికీ  ఆనాటి స్కూళ్ళు, పెద్ద పెద్ద భవనాలలోనూ, వాటికి చుట్టూరా ఆటలకి  ప్రత్యేక మైదానలతోనూ కళ కళ లాడుతూ ఉంటాయి,  ఆ స్కూళ్ళు దీనావస్థలో ఉండడానికి ముఖ్య కారణం ప్రభుత్వమే అనడంలో సందేహమేమీ లేదు. విద్యావ్యవస్థని వ్యాపారం గా మార్చినప్పటినుండీ పట్టింది ఈ దరిద్రం.   ప్రతీ రాజకీయనాయకుడూ, ఓ స్కూలు తెరిచేవాడే, వాడికి ఓ అంటే ఢాం రాకపోయినా సరే.. పైగా ఇంకో చిత్రం ఏమిటంటే, ఆ రాజకీయనాయకులే  ఎన్నికల్లో నెగ్గి, మన పాలకులవడం మన దౌర్భాగ్యం. పైగా వాడికి విద్యాశాఖ కూడా అప్పచెప్తారు. ప్రతీ రాష్ట్రంలోనూ జరుగుతున్నదిదే.. ఇదివరకటి రోజుల్లో, మొత్తం రాష్ట్రానికి ఎన్ని ఇంజనీరింగు, వైద్య కళాశాలలుండేవంటారు? ఓ డజను వైద్యకళాశాలలూ,  ఇంకో డజను ఇంజనీరింగు కాలేజీలూనూ.. కానీ ఇప్పుడో, సందుకో మెడికల్ కాలేజీ,  పుంతకో  ఇంజనీరింగు కాలేజీ. వాటిల్లో ఫీజులు ఆకాశాన్నంటుతున్నాయి..
 ఈ ప్రెవేటు స్కూళ్ళలో, ఒకటో తరగతిలో చేర్పిస్తే చాలు, పిల్లో పిల్లాడో మళ్ళీ ఏ ఐఐటీలోనో తేల్తాడని ఆ యాజమాన్యాలు చెప్తాయి.. మీరు చేతిలో ఓ కోటో, కోటిన్నరో పెట్టుకోండి చాలు, మిగతాదంతా మాకొదిలేయండంటారు. హాయిగా ఇదీ బాగానే ఉందీ, వాళ్ళే చూసుకుంటారులెద్దూ అనుకోవడం, అప్పో సొప్పో చేసి చేర్పించేయడం.. పోనీ ఆ స్కూలు వాతావరణంలో, పిల్లలు ఇమడగలిగారా, వాళ్ళ మనస్థితి ఎలా ఉందీ అని ఒక్కరంటే ఒక్కరు ఆలోచించరు. అప్పుడప్పుడు పేపర్లలో చదువుతూంటాం, ఫలానా స్కూలు విద్యార్ధి ఆత్మహత్య చేసికున్నాడనీ—ఇవన్నీ అలాటి కేసులేi
ఇదివరకటి రోజుల్లో మార్కులకి అంత ప్రాముఖ్యత ఉండేది కాదు.  ఓ ఎనభైమార్కులు వచ్చినా, మేధావిలోకే లెక్కకట్టేవారు. ఆరోజుల్లో ఉపాధ్యాయులు కూడా, ఏ ఒక్క సబ్జెక్టో కాకుండా, అన్ని సబ్జెక్టులూ చెప్పగలిగే స్థితిలో ఉండేవారు. అదేకాకుండా, పరీక్షల్లో ,  objective  ప్రశ్నలు ఏ ముఫై మార్కులకో ఉండేవి. కానీ, ఈరోజుల్లో, ప్రతీదీ, నాలుగు రకాల జవాబుల్లో ఏదో ఒకటి చెప్పడమే. కర్మకాలి సరైన జవాబు మర్చిపోయినా, అక్కడ కనిపించే నాలుగు  options  లోనూ, ఏదో ఒకటి గుర్తుకైనా వస్తుంది, లేదా దైవం మీద భారం వేసి, ఏదో ఒకటి టిక్కు పెట్టేస్తే, అదృష్టం బాగుందా రైటైనా అవుతుంది. పరీక్షల దగ్గరనుండి, టీవీ ల్లో ప్రసారం చేసే క్విజ్జుల దాకా లాటరీ పధ్ధతే. మెదడుని శ్రమ పెట్టాల్సిన అవసరమే లేదు. ఎంతైనా ఆధునిక పధ్ధతులు కదండీ…
 ఇదివరకటి రోజుల్లో , ట్యూషన్లకి వెళ్ళడం అంటే, ఏదో మరీ వెర్రితిరుగుళ్ళు తిరక్కుండా, ఏదో ఓ చోట  కుదురుగా కూర్చుంటాడనే  పంపించేవారు. కానీ ఈరోజుల్లోనో, కోచింగు క్లాసులకి వెళ్ళని విద్యార్ధి కనిపించడు. స్కూళ్ళలో కంటే, ఈ కోచింగు క్లాసులకే గిరాయికీ ఎక్కువ. మరి స్కూళ్ళలో ఆ ఉపాధ్యాయులు, ఏం ఒరగపెడుతున్నారో అర్ధం అవదు.
ఇదివరకటి రోజుల్లో, ఒకటో క్లాసునుండి, ఏ ఇంజనీరింగో, మెడిసినో చదివేదాకా అయే ఖర్చు, కేవలం పిల్లల్ని, కేజీ క్లాసు చదివించడానికి అవుతోంది. పైగా ఈ స్కూళ్ళలో ఇంగ్లీషే తప్ప, మాతృభాషకి స్థానం ఉండదు. అధవా ఉన్నా, ఏదో తూతూమంత్రంలాగే ఉంటుంది. బహుశా  ఈ పిల్లాడో, పిల్లదో పెద్దయిన తరువాత, ఏ పరాయి రాష్ట్ర పిల్లనో, పిల్లాడినో ఎలాగూ పెళ్ళిచేసికునేదే, ఈ మాత్రం దానికి , మళ్ళీ మాతృభాష ఎందుకూ, హాయిగా ఇంగ్లీషే నయమూ, అనే అభిప్రాయం లో ఉన్నట్టు కనిపిస్తున్నారు, తల్లి తండ్రులు.
సర్వే జనా సుఖినోభవంతూ…

..

మరిన్ని వ్యాసాలు

అశ్వతి
అశ్వతి
- డాక్టర్ వై వి కె రవికుమార్
పియానో పాటలు .
పియానో పాటలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పాలెగాళ్ళు.
పాలెగాళ్ళు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
సినిమా గీతాలలో  షెహనాయ్ వాద్యం.
సినిమా గీతాలలో షెహనాయ్ వాద్యం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు పలువురికి -3
పురాణాలలో ఒకే పేరు పలువురికి-3
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
108
108
- శ్రీరామ్ లక్ష్మీనారాయణ మూర్తి