వీక్షణం - పి.యస్.యమ్. లక్ష్మి

అమెరికాలో జర్మన్ విలేజ్ 



మిచిగాన్ కేపిటల్ లేన్సింగ్ నుంచి 76 మైళ్ళ దూరంలో వున్నది ఫ్రేంకెన్ ముత్.  ఇది అమెరికాలోని జర్మన్ విలేజ్.  అంటే జర్మన్ దేశస్తులు ఇక్కడికి వచ్చి స్ధిరపడి, తామీ దేశంలో భాగస్తులైనా, తమ సంస్కృతీ సంప్రదాయాలని నిలుపుకోవటంవల్ల జర్మన్ విలేజ్ గా పేరుపొందింది.    1845లో   జర్మనీ నుంచి 15మంది జర్మన్ లూధరెన్ మిషనరీస్ ఇక్కడికి వచ్చి  స్ధిర పడ్డారు.  వారి రాకలో ఉద్దేశ్యం చిప్పెవా ఇండియన్స్ కి క్రిస్టియానిటీ బోధించటం.  వారు వచ్చిన ప్రదేశం పేరు, వారి ధైర్యంతో కలిసి వారు స్ధిర పడిన ప్రదేశం పేరయింది..  ఫ్రేంకెన్ ముత్ అనేది రెండు పదాల పేరు.  ఫ్రేంకెన్ అనే పదం వారు వచ్చిన ప్రదేశాన్ని సూచిస్తే ముత్ అనేది జర్మన్లలోని ధైర్యాన్ని సూచిస్తుంది.  వెరసి ఫ్రేంకెన్ ముత్ అంటే ఫ్రేన్కోనియన్స్ (ఫ్రేన్కోనియా వారి స్వస్ధలం)  ధైర్యం.

దేశంకాని దేశంలో కొత్త ప్రదేశానికి మొదట్లో వచ్చింది 15 మందయినా ప్రస్తుతం వారి జనాభా సంఖ్య 4,900 పైబడింది.  వారంతా తమ జర్మన్ సాంప్రదాయాలను పాటిస్తారు.  వారి నివాసాలు, వ్యాపార స్ధలాలు, పొలాలు, తోటలు అన్నీ జర్మన్ కల్చర్ ని స్ఫురింపజేస్తూ శుభ్రంగా వుంటాయి.  అక్కడివారు, ఇంకా ఇతర సందర్శకుల దృష్టిలో, యునైటెడ్ స్టేట్స్ లో ఇక్కడ మాత్రమే నిజమైన బవెరియన్ ఆర్కిటెక్చర్ చూడవచ్చు.

జర్మన్ విలేజ్ ని చూసే ఉత్సాహంతో సందర్శకులు ఇక్కడికి వస్తూ వుంటారు. అంతేకాదు, కుటుంబాలు కలిసి ప్రశాంతంగా గడపటానికి, వారాంతపు విహారాలకి, కంపెనీల మీటింగులకి, ఇలా అనేక విధాల గడపటానికి ఈ విలేజ్లో సదుపాయాలు వుండటంతో సందర్శకుల సంఖ్యా ఎక్కువే.   ఈ ప్రదేశం మంచి ఆహారానికి ప్రసిధ్ధి చెందింది.  ఇక్కడ 1856, 1888నుంచీ వున్న రెండు పెద్ద ఫామిలీ రెస్టారెంట్లల్లో ఏడాదికి రెండు మిలియన్లమంది భోజనం చేస్తారంటే వీటి ప్రఖ్యాతి వూహించండి.

బ్రానర్స్ క్రిస్టమస్ వండర్ లేండ్ ..  ప్రపంచంలోనే పెద్దదయిన  క్రిస్టమస్ స్టోర్ ఇక్కడ వున్నది.  సందర్శకులకు కాలక్షేపానికి గుఱ్ఱాల బగ్గీలు,  కేస్ రివర్ లో పడవ ప్రయాణం, శతాబ్దం క్రితం కట్టబడిన చెక్క వంతెన మీద నడక, మ్యూజిక్, ఆర్ట్, ఫోక్ ఫెస్టివల్స్, అనేక షాపింగ్ సెంటర్లు  ..  వగైరా అనేక సాధనాలు వున్నాయి. 

ప్రశాంతంగా ఇక్కడ కొన్నాళ్ళ గడపాలనుకునేవాళ్ళకి ఫ్రేంకెన్ ముత్ డౌన్ టౌన్ కి దగ్గరలో అనేక వసతులున్నాయి.  సందర్శకులకోసం ఇక్కడ వున్న సౌకర్యాలు, షాపింగ్ సెంటర్లు, వందకి పైబడిన విలేజ్ గిఫ్ట్ షాప్స్, ఇవ్వన్నీ ప్రతి సంవత్సరం మూడు మిలియన్లకన్నా ఎక్కువ టూరిస్టులని ఇక్కడికి ఆకర్షిస్తున్నాయి.

పరిశుభ్రానికి, వాతావరణ పరి రక్షణకి ప్రజలు తీసుకునే శ్రధ్ధ, సంస్కృతీ సంప్రదాయాలను కాపాడుకోవటంలో చూపించే శ్రధ్ధ, పార్కులు, పుష్పాలంకరణ వగైరా అనేక విషయాలలో 2007లో ఈ ఊరు అమెరికా ఇన్ బ్లూమ్ ఛాంపియన్ గా గుర్తింపబడింది.   

ఇక్కడవున్న ఇంకొక ఆకర్షణ కవర్డ్ బ్రిడ్జ్.  వాహనాలు తిరిగేందుకుక రెండు వైపులా వున్న దోవేకాక, పాదచారులు నడవటానికి రెండువైపులా ఫుట్ పాత్ లు వున్న ఈ బ్రిడ్జ్ పొడుగు 239 అడుగులు.  ఇది పూర్తిగా ఓక్, సెడర్, పైన్ మొదలయిన చెట్ల కలపతో తయారు చేయబడింది.

ఎన్ని హంగులు ఆర్భాటాలు వున్నా, మాకంత నచ్చలేదు.  కారణం జర్మన్ విలేజ్ చూసొద్దామని వెళ్ళి కొంచెం సేపు మాత్రమే కారులో తిరిగి వచ్చాము.    విశ్రాంతిగా అక్కడ కొంత సమయం గడిపేవారికి బాగుండవచ్చు.

మరిన్ని వ్యాసాలు

అశ్వతి
అశ్వతి
- డాక్టర్ వై వి కె రవికుమార్
పియానో పాటలు .
పియానో పాటలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పాలెగాళ్ళు.
పాలెగాళ్ళు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
సినిమా గీతాలలో  షెహనాయ్ వాద్యం.
సినిమా గీతాలలో షెహనాయ్ వాద్యం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు పలువురికి -3
పురాణాలలో ఒకే పేరు పలువురికి-3
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
108
108
- శ్రీరామ్ లక్ష్మీనారాయణ మూర్తి